SK Roy
-
ఎల్ఐసీ చైర్మన్ రాయ్ ముందస్తు రాజీనామా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజ సంస్థ ఎల్ఐసీ చైర్మన్ పదవికి ఎస్కే రాయ్ రాజీనామా చేశారు. రాయ్‌ని గత యూపీఏ ప్రభుత్వం నియమించింది. ఐదేళ్ల పదవీకాలంలో ఇంకా రెండేళ్ల బాధ్యతలు మిగిలి ఉండగానే రాయ్ రాజీనామా చేయడం గమనార్హం. 1981 నుంచి రాయ్ ఎల్ఐసీలో పనిచేస్తున్నారు. 2013 జూన్‌లో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అధికార వర్గాల కథకం ప్రకారం, రాయ్ ఇప్పటికే తన రాజీనామా పత్రాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపారు. దీనిని ఆమోదం నిమిత్తం నియామకాల కేబినెట్ కమిటీకి ఆర్థికమంత్రిత్వశాఖ పంపింది. రాజీనామాకు కారణం తెలియనప్పటికీ, వ్యక్తిగత అంశాలను తన నిర్ణయానికి సిన్హా కారణంగా చూపినట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే సిన్హా రాజీనామా వినతి చేశారని, అయితే అప్పట్లో పునరాలోచించుకోవాల్సిందిగా ఆర్థికశాఖ కోరిందని తెలుస్తోంది. -
‘బీమా’లో ఎఫ్‌డీఐ పరిమితి పెంపునకు ఎల్ఐసీ ఓకే!
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వ దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తన మద్దతును తెలియజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పరిమితి 26 శాతంగా ఉంది. ఇటీవల జరిగిన సెలక్ట్ కమిటీ సమావేశాల్లో ఎల్ఐసీ చైర్మన్ ఎస్కే రాయ్ పరిమితి పెంపునకు సానుకూలంగా తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే 15 మంది సభ్యుల సెలక్ట్ కమిటీలోని ఒక వర్గం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇంతక్రితం ఎఫ్‌డీఐ పరిమితి పెంపును వ్యతిరేకించిన ఎల్ఐసీ తాజాగా తన ధోరణిని ఎందుకు మార్చుకుందన్న అంశంపై సమావేశంలో వాడివేడి చర్చ జరిగినట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీనికి రాజకీయ పరమైన ఒత్తిడులూ కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాలుగు సంవత్సరాలుగా పెండింగులో ఉన్న బీమా బిల్లుపై నవంబర్ చివరి వారంలో తమ నివేదిక సమర్పించడానికి కమిటీ ప్రయత్నిస్తుందని సమావేశం అనంతరం చైర్మన్ చందన్ మిశ్రా అన్నారు.