న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీ తాజాగా అనుబంధ సంస్థ ఐడీబీఐ బ్యాంకులో పూర్తి వాటాను విక్రయించబోమంటూ స్పష్టం చేసింది. బ్యాంక్‌ఎస్యూరెన్స్ చానల్ ద్వారా లబ్ది పొందేందుకు వీలుగా కొంతమేర వాటాతో కొనసాగనున్నట్లు తెలియజేసింది. అదనపు వాటాను కొనుగోలు చేయడంతో ఎల్‌ఐసీకి 2019 జనవరి 21 నుంచి ఐడీబీఐ బ్యాంకు అనుబంధ సంస్థగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. క్విప్ ద్వారా ఎల్‌ఐసీ 49.24 శాతం వాటాను సొంతం చేసుకోవడంతో 2020 డిసెంబర్ 19న బ్యాంకు సహచర సంస్థగా వ్యవహరిస్తోంది.
కాగా.. బ్యాంక్‌ఎస్యూరెన్స్‌లో భాగంగా ఎల్‌ఐసీ బ్యాంకు కస్టమర్లకు సంస్థ బ్రాంచీల ద్వారా బీమా ప్రొడక్టులను విక్రయించగలుగుతోంది. ఇది కంపెనీకి దన్నునిస్తుండటంతో ఐపీవో తదుపరి కూడా బ్యాంకులో కొంతమేర వాటాను కొనసాగించే యోచనలో ఉన్నట్లు ఎల్‌ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడించారు. నిజానికి వ్యూహాత్మకంగానే బ్యాంకులో వాటాను చేజిక్కించుకున్నట్లు పేర్కొన్నారు. ఇది రెండు సంస్థలకూ ప్రయోజనకరమేనని వ్యాఖ్యానించారు. బ్యాంక్‌ఎస్యూరెన్స్‌లో భాగంగా కంపెనీ విభిన్న బ్యాంకులకు చెందిన 58,000 బ్రాంచీలతో పంపిణీ ఒప్పందాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ఈ దారిలో మరింత భారీ వృద్ధికి అవకాశమున్నట్లు వివరించారు.
ఎన్‌ఎస్‌ఈలో ఐడీబీఐ బ్యాంకు షేరు దాదాపు 3 శాతం క్షీణించి రూ. 46 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment