
పెట్టుబడులకు.. ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్
జీవితానికి భరోసా, భవిష్యత్తుపై ధీమా కల్పించేవి.. పొదుపు, మదుపు. సంపాదించిన ప్రతి పైసాను జాగ్రత్తగా వాడుకొని, రేపటి అవసరాల కోసం అందులో కొంత మిగుల్చుకోవాలనే ఆరాటం అందరిలో ఉంటుంది. మిగిల్చిన సొమ్మును ఎక్కడ, ఎలా పొదుపు చేసుకోవాలో చాలామందికి అవగాహన ఉండదు. ఒక రూపాయితో మరో రూపాయిని సంపాదించడం ఎలాగో తెలియదు. బీమా పాలసీ తీసుకోవాలంటే .. మార్కెట్‌లో లెక్కలేనన్ని పథకాలు.
వాటిలో తమ అవసరాలకు సరిపోయే పథకంపై పరిజ్ఞానం శూన్యం. ఇలాంటి కీలకమైన ఆర్థిక అంశాలపై జనానికి అవగాహన కల్పించి, పొదుపు మదుపుల విషయంలో మార్గదర్శిగా వ్యవహరించే నిపుణులే.. ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్. నేటి సామాజిక అవసరాల రీత్యా వీరికి డిమాండ్ పెరుగుతోంది. ఆదాయాలు వృద్ధి చెందుతుండడంతో ఆర్థిక సలహాదారులను సంప్రదించేవారి సంఖ్య నానాటికీ అధికమవుతోంది. అంకెలు, గణాంకాలు, వడ్డీ లెక్కలపై ఆసక్తి ఉన్నవారు ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌గా కెరీర్‌లో సులభంగా రాణించొచ్చు. సలహాదారులకు ప్రస్తుతం పుష్కలమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి.
బ్యాంక్‌లు, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ సంస్థల్లో..
అర్హులైన ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ కార్పొరేట్ సంస్థల, క్లయింట్ల ఆర్థికపరమైన సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీ షేర్లు, డిబెంచర్లు, బీమా పాలసీలు, కమోడిటీలు, స్థిరాస్తి.. ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి సలహాలు ఇవ్వాలి. క్లయింట్ల తరఫున వారి డబ్బును పెట్టుబడి పథకాల్లో పొదుపు, మదుపు చేయాలి. లాభాలను వారికి అందిస్తూ ఆకర్షణీయమైన కమీషన్ పొందొచ్చు. ప్రతి పెట్టుబడిలో లాభనష్టాలను వివరించాలి. ఆయా రంగాల్లో భవిష్యత్తు పరిణామాలను ఊహించగలిగే నేర్పు ఉండాలి. క్లయింట్ల సొమ్ముకు భద్రత కల్పించే పథకాలను సూచించాలి. భారీ స్థాయిలో వ్యాపారలావాదేవీలను నిర్వహించే కార్పొరేట్ సంస్థలు ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లను నియమించుకుంటున్నాయి. బ్యాంకుల్లో, రియల్ ఎస్టేట్ సంస్థల్లో, స్టాక్‌మార్కెట్లలోనూ ఉద్యోగాలు దక్కుతున్నాయి. వృత్తి నైపుణ్యాలను పెంచుకొని సొంతంగా ఇన్వెస్ట్‌మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చు.
కావాల్సిన నైపుణ్యాలు:
ఆర్థిక సలహాదారులకు విశ్లేషణాత్మక దృక్పథం, తార్కిక ఆలోచనా విధానం ఉండాలి. కమ్యూనికేషన్, మార్కెటింగ్, రిలేషన్‌షిప్ బిల్డింగ్ స్కిల్స్ అవసరం. ఆర్థిక వ్యవహారాలు, సంబంధిత చట్టాలు, నియమ నిబంధనలపై ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలి. వృత్తిపరమైన నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాలి.
అర్హతలు: పర్సనల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌గా వృత్తిలోకి ప్రవేశించాలంటే.. ‘అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్ టెస్ట్’లో అర్హత సాధించాలి. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సర్టిఫికేషన్‌తో అర్హతలను, నైపుణ్యాలను పెంచుకోవచ్చు. కార్పొరేట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌గా మారాలంటే.. ఫైనాన్స్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్‌గా గ్రాడ్యుయేషన్/పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. ప్రారంభంలో సీనియర్ అడ్వైజర్ వద్ద పనిచేసి, వృత్తిలో మెళకువలను తెలుసుకొని అనుభవం సంపాదించిన తర్వాత సలహాదారుగా సొంతంగా పనిచేసుకోవచ్చు.
వేతనాలు: పొదుపు, మదుపు సలహాదారులు తమ నైపుణ్యాలు, మార్కెట్ స్థితిగతులను బట్టి ఆదాయం ఆర్జించుకోవచ్చు. కార్పొరేట్ సంస్థల సలహాదారులకు స్థిరమైన వేతనం అందుతుంది. ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పొందొచ్చు. సొంతంగా ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంటే ఇంకా అధికంగా సంపాదించుకోవచ్చు. ఖాతాదారుల సంఖ్య, వారి పెట్టుబడుల ఆధారంగా ఆదాయం లభిస్తుంది.
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
ఏ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - కోల్‌కతా
వెబ్‌సైట్: https://www.iimcal.ac.in/
ఏ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఢిల్లీ యూనివర్సిటీ
వెబ్‌సైట్: http://www.fms.edu/
ఏ నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్-ముంబై
వెబ్‌సైట్: http://www.nmims.edu/
ఏ ఇంటర్నేషనల్ కాలేజీ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్
వెబ్‌సైట్: http://www.icofp.org/
ఏ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: http://www.xlri.ac.in/
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
పోటీ పరీక్షల్లో ‘పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య’లపై ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా?
-ఎం.నరేష్, హఫీజ్‌పేట
2013లో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ఐసోబార్‌లపై ప్రశ్న అడిగారు. అణుభారం (ద్రవ్యరాశి సంఖ్య)ను సమానంగా ఇచ్చి, వాటి పరమాణు సంఖ్యలను వేరుగా ఇచ్చారు. నిర్వచనం ప్రకారం ఐసోబార్లలో పరమాణు ద్రవ్యరాశి సమానంగా ఉండి, పరమాణు సంఖ్యలు వేరుగా ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు గుర్తించడానికి పరమాణు సంఖ్యలు, ద్రవ్యరాశి సంఖ్యలను గుర్తుంచుకోవాల్సిన పని లేదు. ఇచ్చిన ఆప్షన్ల లోని మూలకాల పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య, ఇంకా లోతుగా.. న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని గుర్తిస్తే చాలు.
పరమాణు సంఖ్య అనేది ఆ మూలక క్రమ సంఖ్య లాంటిది. ప్రాథమిక కణాల్లో ప్రోటాన్ల సంఖ్య ఆధారంగా మూలకానికి పరమాణు సంఖ్య (ో) ఇచ్చారు. కేంద్రకంలోని ప్రోటాన్లు, న్యూట్రాన్ల భారాన్ని కలిపితే పరమాణు భారం వస్తుంది. దీని నుంచి ద్రవ్యరాశి సంఖ్య (అ) వస్తుంది. ప్రోటాన్లు, న్యూట్రాన్ల సంఖ్యలోని తేడాల వల్ల ఐసోటోపులు, ఐసోబార్‌లు, ఐసోటోన్‌లు, ఐసోడయఫర్లు వస్తాయి. పదో తరగతితోపాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రసాయన శాస్త్ర పాఠ్యపుస్తకాలను చదివితే ఈ పాఠ్యాంశంపై పట్టు సాధించవచ్చు.
నేను డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్‌కు ప్రిపేరవుతున్నాను. భూగోళ శాస్త్రంలోని ‘భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమరిక’ అధ్యాయాన్ని ఎలా చదవాలి?
-కె.ప్రసన్న, సంతోష్‌నగర్
గత డీఎస్సీ పరీక్షలో ఈ అధ్యాయం నుంచి రెండు ప్రశ్నలు అడిగారు. ఈసారి కూడా 2 నుంచి 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాలు, వివిధ దేశాల సరిహద్దులను మ్యాప్ పాయింటింగ్ ద్వారా సాధన చేస్తే ఈ పాఠ్యాంశంలోని అంశాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఉత్తర ప్రాంత హిమాలయాలను అధ్యయనం చేసేటప్పుడు, వాటి దిక్కులను ఆధారంగా చేసుకుని చదవాలి. భారతదేశ భూ స్వరూపాలు, నదీ ప్రాంతాలు, ఏర్పాటైన రాష్ట్రాలు, ప్రాంతాలను కలిపి చదవాలి. అట్లాస్‌ను దగ్గర పెట్టుకొని భారతదేశ భౌతిక అమరిక, పర్వతాల క్రమం, రాష్ట్రాల ఉనికిపై పట్టు సాధిస్తే ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలను సులువుగా గుర్తించవచ్చు.
జాబ్స్, అడ్మిషన్‌స అలర్‌ట్స
జేఎన్‌టీయూ-హైదరాబాద్
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకడమిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అకడమిక్ అసిస్టెంట్
విభాగాలు: సీఎస్, ఎస్‌ఈ, సీఎన్‌ఐఎస్, బీఐ
అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంటెక్/ పీహెచ్‌డీ ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 17
వెబ్‌సైట్: http://jntuh.ac.in/
హెచ్‌పీసీఎల్‌లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్
ముంబైలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), గ్రాడ్యుయేట్ ఇంజనీర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్
అర్హత: బీటెక్. వయసు: 25 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: గేట్-2015 స్కోర్ ఆధారంగా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: 18 డిసెంబర్ 2014 నుంచి 2 ఫిబ్రవరి 2015
వెబ్‌సైట్: www.hindustanpetroleum.com
ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు
ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
చీఫ్ మేనేజర్ (ఎకనామిస్ట్) మేనేజర్ (ఎకనామిస్ట్)
డిప్యూటీ మేనేజర్ (ఎకనామిస్ట్)
చీఫ్ మేనేజర్ (రిస్క్ ఎనలిస్ట్)
చీఫ్ మేనేజర్ (కంపెనీ సెక్రటరీ)
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 17
వెబ్‌సైట్: www.sbi.co.in
ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఎమ్మెస్సీ (నర్సింగ్)
అర్హతలు: 55 శాతం మార్కులతో బీఎస్సీ (నర్సింగ్)/ బీఎస్సీ హానర్స్ (నర్సింగ్)/ పోస్ట్ బేసిక్ (నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌తో పాటు ఏడాది అనుభవం అవసరం. ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా.
ఎంపీటీ. అర్హతలు: బీపీటీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 17
వెబ్‌సైట్: ntruhs.ap.nic.in
ఎడ్యూ న్యూస్: ఆస్ట్రేలియాలో విదేశీ విద్య ఖర్చు ఎక్కువ
ఫారిన్ ఎడ్యుకేషన్ విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియాలో ఖర్చు అత్యధికం. హెచ్‌ఎస్‌బీసీ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఒక విదేశీ విద్యార్థి భారత్‌లో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు చదవడానికి ప్రతిఏటా 5,642 అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే ఆస్ట్రేలియాలో అయితే 42,093 డాలర్లు వెచ్చించాల్సిందే. మొత్తం15 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. నాణ్యమైన విద్యనందించడంలో మనదేశం 8వ స్థానంలో ఉండడం గమనార్హం. విదేశీ విద్యకు ఎక్కువ డబ్బు ఖర్చయ్యే దేశాల జాబితాలో ఆస్ట్రేలియా, సింగపూర్, అమెరికా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. సింగపూర్‌లో ప్రతిఏటా 39,229 డాలర్లు, అమెరికాలో 36,564 డాలర్లు ఖర్చవుతాయి.
భారత్‌లో న్యూజిలాండ్ విద్యాసంస్థ కోర్సులు
భారత్‌లో అప్లయిడ్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనున్నట్లు న్యూజిలాండ్‌లో ప్రభుత్వ నిధులతో నడిచే ఈస్ట్రన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఈఐటీ) ప్రకటించింది. ఈ కోర్సుల ద్వారా భారత విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకొని, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాలు దక్కించుకోవచ్చని పేర్కొంది.
ఎడ్యూ ఈవెంట్: ‘ప్రాక్టికల్ నాలెడ్జ్‌తోనే కెరీర్‌లో రాణింపు’
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు అలవర్చుకోవాల్సిన నైపుణ్యాలపై నగరంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ) క్యాంపస్‌లో సదస్సు నిర్వహించారు. ఇండస్ట్రీ, క్లాస్‌రూంకు మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఐఎంటీ ప్రతిఏటా వ్యాపార ప్రముఖులతో సదస్సులను నిర్వహిస్తోంది. ఇలాంటి సదస్సులు నిర్వహించడం ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను ప్రాక్టికల్‌గా అన్వయించుకునే అవకాశం చిక్కుతుందంటున్నారు నిర్వాహకులు. విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్‌జతోనే కెరీర్‌లో బాగా రాణిస్తారని ఈ సదస్సుకు హాజరైన నిపుణులు చెప్పారు. ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌ను పెంపొందించుకోవాలని సూచించారు.