ఎన్నారైలు ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా? | Invest in NRI Funds? | Sakshi
Sakshi News home page

ఎన్నారైలు ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా?

Published Mon, Oct 2 2017 2:47 AM | Last Updated on Mon, Oct 2 2017 2:47 AM

Invest in NRI Funds?

మా భార్యాభర్తలకు కలిపి టర్మ్‌ బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. పెద్ద మొత్తంలో టర్మ్‌ బీమా పాలసీ తీసుకునేటప్పుడు రెండు వేర్వేరు కంపెనీల నుంచి తీసుకోవాలని గతంలో మీరు సూచించారు కదా ! దీనిని దృష్టిలో పెట్టుకొని ఎల్‌ఐసీ నుంచి రూ.50 లక్షలకు, మరో సంస్థ నుంచి రూ.కోటికి టర్మ్‌ పాలసీలు తీసుకోవాలనుకుంటున్నాను. యాక్సిడెంటల్‌ డిజేబిలిటీ ఫీచర్‌ ఉన్న పాలసీను సూచించండి. శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే, నెలవారీ ఆదాయం వచ్చేలా ఉండే పాలసీ వివరాలు తెలపండి
– కార్తీక్, విశాఖపట్టణం  

మీరు పెద్ద మొత్తంలో టర్మ్‌ బీమా పాలసీ తీసుకోవాలనుకున్నప్పుడు.. రెండు వేర్వేరు కంపెనీల నుంచి పాలసీలు తీసుకోవడం సరైన నిర్ణయం. ఇలా తీసుకుంటే, రిస్క్‌ను డైవర్సిఫై చేసినట్లు అవుతుంది. శాశ్వత, పాక్షిక అంగవైకల్యం(పర్మనెంట్, పార్షియల్‌ డిజేబిలిటీ) రైడర్లు ఉన్న పాలసీలు తీసుకుంటే మంచిదే. ఈ తరహా పాలసీలు తీసుకుంటే, తర్వాతి 5–10 ఏళ్ల కాలానికి మీరు తీసుకున్న బీమాలో కొంత శాతంగా బీమా సంస్థ నుంచి చెల్లింపులు వస్తాయి. యాక్సిడెంట్లు కారణంగా అంగవైకల్యం ఏర్పడితేనే ఇది వర్తిస్తుందని గుర్తుంచుకోండి. ఈ రైడర్లకు సంబంధించి సదరు బీమా సంస్థ అందించే సూచనలను క్షుణ్నంగా చదివి అర్థం చేసుకోండి.  వివిధ బీమా సంస్థల క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ రికార్డ్‌ను, ప్రీమియమ్‌లను పోల్చి చూసుకొని ఏ సంస్థ టర్మ్‌ పాలసీలు తీసుకోవాలో నిర్ణయం తీసుకోండి. ఇతర సంస్థలతో పోల్చితే ఎల్‌ఐసీ ప్రీమియమ్‌ ఒకింత ఎక్కువగానే ఉంటుంది. ఇక మీరు.. ఏగాన్‌ రెలిగేర్‌ ఐటెర్మ్‌ ప్లాన్, మ్యాక్స్‌ లైఫ్‌ ఆన్‌లైన్‌ టర్మ్‌ ప్లాన్, హెచ్‌డీఎఫ్‌సీ లైప్‌ క్లిక్‌2ప్రొటెక్ట్‌.. టర్మ్‌ పాలసీలను పరిశీలించవచ్చు. వీటిని ఆన్‌లైన్‌ ద్వారా కూడా తీసుకోవచ్చు. మీ వయస్సు పరంగా ఈ పాలసీలు వసూలు చేసే ప్రీమియమ్‌లను పరిశీలించి మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా ఉండే, పాలసీని ఎంచుకోండి. ప్రపోజల్‌ ఫార్మ్‌ నింపేటప్పుడు అన్ని వివరాలు ఇవ్వండి. ఇలా చేస్తే,  పాలసీ క్లెయిమ్‌ చేసుకోవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి గందరగోళం తలెత్తదు.

నేను కొంత కాలం క్రితం విదేశాలకు వెళ్లాను. నేను ఇప్పుడు ప్రవాస భారతీయుడిని కాబట్టి, మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయలేనని నా మిత్రులంటున్నారు. ఇది కరెక్టేనా ? కానీ నేను మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. నేను నా పేరు మీద ఇన్వెస్ట్‌ చేయలేకపోతే, దీనికి ప్రత్యామ్నాయంగా కొంత సొమ్మును నా తల్లిదండ్రుల ఖాతాకు బదిలీ చేసి, వారి ట్రేడింగ్‌ ఖాతా ద్వారా మ్యూచువల్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?
–ప్రభాకర్, విజయవాడ

మీ మిత్రులు చెప్పింది తప్పు. మీరు విదేశాల్లో ఉన్నా కూడా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. మీకు ప్రవాస భారతీయుడి(ఎన్‌ఆర్‌ఐ–నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌) హోదా ఉన్నా కూడా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అయితే కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ అమెరికా, కెనడాల్లో ఉండే ఎన్నారైల ఇన్వెస్ట్‌మెంట్స్‌ స్వీకరించడం లేదు. మీరు విదేశాల్లో ఉండి, ఇక్కడి మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నప్పుడు. ముందుగా మీ కేవైసీ(నో యువర్‌ క్లయింట్‌) వివరాలను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. మీ నివాస హోదాను ఎన్నారైగా మార్చాల్సి ఉంటుంది. ఒక ఎన్నారైగా మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌లో రీపాట్రియబుల్‌ ప్రాతిపదికన గానీ, నాన్‌–రీపాట్రియబుల్‌ ప్రాతిపదికన గానీ ఇన్వెస్ట్‌ చేయవచ్చు. రీపాట్రియబుల్‌ప్రాతిపదికన ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే.. భారత్‌లో ఏదైనా బ్యాంక్‌లో మీకు ఎన్‌ఆర్‌ఈ(నాన్‌ రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌) ఖాతా తప్పకుండా ఉండాలి. మీ ఎన్‌ఆర్‌ఈ ఖాతా నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రెమిట్‌ చేయబడుతాయి. మీరు నాన్‌ రీపాట్రియబుల్‌ ప్రాతిపదికన ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, మీరు ఎన్‌ఆర్‌ఓ(నాన్‌ రెసిడెంట్‌ ఆర్డినరీ) ఖాతాను ఉపయోగించాల్సి ఉంటుంది.  

ఫ్రీ–లుక్‌ పీరియడ్‌ అంటే ఏమిటి? ఈ పీరియడ్‌లో మనం తీసుకున్న పాలసీలను రద్దు చేసుకోవచ్చా?         
–సంతోష్, హైదరాబాద్‌  
మీరు ఒక షాపుకు వెళ్లి ఒక వస్తువు కొనుగోలు చేశారు. ఆ వస్తువు మీకు నచ్చకపోతే కొన్ని రోజుల తర్వాతైనా దానిని తిరగి ఇచ్చేయ్యమని దుకాణదారు ఆఫర్‌ చేశారనుకోండి. మీకు ఆ వస్తువు నచ్చితే దానిని వాడుకుంటారు. ఒక వేళ నచ్చకపోతే మూడు, లేదా నాలుగు రోజుల తర్వాత దానిని దుకాణదారుడికి వాపస్‌ చేస్తారు. ఫ్రీ–లుక్‌ పీరియడ్‌ కూడా అలాంటిదే. మీరు ఒక బీమా పాలసీ తీసుకున్నారనుకోండి. పాలసీ డాక్యుమెంట్‌ మీకు అందిన తర్వాత, ఆ పాలసీ మీ అవసరాలకు అనుగుణంగా లేకపోతేనో, లేదా మీకు నచ్చని అంశాలు దాంట్లో ఉంటేనో, మీరు ఆ పాలసీ నుంచి వైదొలగవచ్చు. వస్తువులు రిటర్న్‌ తీసుకోవడం దుకాణదారుడిని బట్టి ఉంటుంది. కానీ పాలసీలకు ఈ ఫ్రీ–లుక్‌ పీరియడ్‌ తప్పనిసరి.  సాధారణంగా ఈ ఫ్రీ–లుక్‌ పీరియడ్‌ 15 రోజులు ఉంటుంది. ఈ ఫ్రీ–లుక్‌ పీరియడ్‌లో మీరు తీసుకునే పాలసీని మరోసారి సమీక్షించుకునే అవకాశం మీకు ఉంటుంది. పాలసీ బాండ్‌ జారీ చేయడానికి అయిన వ్యయాలు, ఆ ఫ్రీ–లుక్‌ పీరియడ్‌కు సంబంధించిన బీమా కవర్‌కు అయిన వ్యయాలు మినహాయించుకొని మీరు చెల్లించిన ప్రీమియమ్‌ను సదరు బీమా సంస్థ మీకు వెనక్కి ఇస్తుంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు వార్షిక కాంట్రాక్టులు అయినప్పటికీ, ఫ్రీ–లుక్‌ పీరియడ్‌ మొదటి ఏడాదికే వర్తిస్తుంది. రెన్యూవల్స్‌కు వర్తించదు. ఇక ఏడాది కంటే తక్కువ కాల వ్యవధి ఉండే పాలసీలకు  ఫ్రీ–లుక్‌ రూల్‌ వర్తించదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement