చెన్నై: బీమా సంస్థ శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ వాహనయేతర బీమా విభాగాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా మెరైన్, అగ్ని ప్రమాదాలు మొదలైన వాటికి సంబంధించిన బీమా పాలసీలను ప్రవేశపెడుతోంది. కంపెనీ చీఫ్ అండర్‌రైటింగ్ ఆఫీసర్ శశికాంత్ దహూజా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తమ వ్యాపారంలో మోటార్ ఇన్సూరెన్స్ వాటా సుమారు 92 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. డైవర్సిఫికేషన్ ప్రణాళికల్లో భాగంగా ఫైర్, మెరైన్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో కొత్త బీమా పాలసీలను ప్రవేశపెట్టనున్నట్లు శశికాంత్ చెప్పారు. వచ్చే రెండు మూడేళ్లలో వాహనయేతర వ్యాపారాన్ని 15 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఇది 7–8 శాతంగా ఉంది. కేవలం ఒక విభాగంపై ఎక్కువగా ఆధారపడకూడదనే వ్యాపార వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం 37% పెరిగి రూ.98 కోట్లకు చేరింది. ఈ ఏడాది వ్యాపారం 30% మేర వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నట్లు శశికాంత్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల బీమా పాలసీల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో రూ.82 కోట్ల విలువైన పాలసీలను విక్రయించామన్నారు. ఈ ఏడాది వీటి విక్రయాలు రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతం సంస్థలో 3,780 మంది ఉద్యోగులు ఉన్నారని, ఈ ఆర్థిక సంవత్సరం కొత్తగా 700 మందిని నియమించుకోనున్నామని శశికాంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment