హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారితో జీవిత బీమాపై అభిప్రాయం మారిందని, ఏదో పెట్టుబడి సాధనంగా కాకుండా కీలకమైన రిస్క్ కవరేజీ సాధనంగా చూసే ధోరణి పెరిగిందని బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ (బీఏఎల్‌ఐసీ) చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్ (సీఏవో) సమీర్ జోషి తెలిపారు.
ప్రజలు టర్మ్ ప్లాన్ల వైపు మొగ్గు చూపడం పెరిగిందని చెప్పారు. అలాగే, చెల్లింపుల్లో వెసులుబాటు, ఆన్‌లైన్ లావాదేవీలు, అదనపు కవరేజీ, వినూత్న ఉత్పత్తులు మొదలైన అత్యంత కస్టమైజ్డ్ ఆప్షన్లను కోరుకుంటున్నారని ఆయన వివరించారు. కంపెనీలు కూడా దానికి అనుగుణంగా సత్వరం తమ సర్వీసులు, ఉత్పత్తుల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నాయని జోషి చెప్పారు. తాము ప్రవేశపెట్టిన ఏస్, డయాబెటిక్ టర్మ్ ప్లాన్ మొదలైనవి ఈ కోవకి చెందినవేనని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
దక్షిణాదిపై మరింత దృష్టి ..
ఇతరత్రా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మొదలైనవి .. అలాగే గోవా, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో బీమా విస్తృతి ఎక్కువగా ఉందని ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడైంది. ఈ ప్రాంతాల్లో బీమా విస్తృతిని మరింత పెంచడంపై దృష్టి పెడుతున్నాం. కీలక ఆర్థిక సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నాం. ప్రవాస భారతీయ కస్టమర్లలో చాలా మంది ఈ ప్రాంతాలకు చెందినవారే కావడంతో వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్లు, సర్వీసులను తీర్చిదిద్దుతున్నాం.
లక్ష కోట్లు దాటిన ఏయూఎం..
బజాజ్ అలయంజ్ లైఫ్ అతి తక్కువ కాలంలోనే దిగ్గజ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 56,085 కోట్లుగా ఉన్న మా ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్) ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటింది. మాపై కస్టమర్ల నమ్మకానికి ఇది నిదర్శనం. సరళమైన, వినూత్నమైన, కస్టమర్ ఆధారిత సాధనాలు, సమర్ధమంతమైన పంపిణీ వ్యవస్థ మొదలైనవి ఇందుకు తోడ్పడ్డాయి. పాలసీల వృద్ధిపరంగా పరిశ్రమ కన్నా అధికంగా 23 శాతం వృద్ధి సాధిస్తున్నాం. మాకు 1.40 లక్షల మంది ఏజెంట్లు, 60 పైచిలుకు ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం, 505 శాఖల పటిష్టమైన నెట్‌వర్క్ ఉంది. మొత్తం మీద సహాయకరమైన నియంత్రణ వ్యవస్థ, ప్రభావవంతమైన మార్పులతో 2023 మా సంస్థతో పాటు ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగానికి సానుకూలంగా గడిచింది.
వృద్ధి లక్ష్యాలు..
వినూత్న ఉత్పత్తులు, సమగ్ర సేవలతో కొత్త ఏడాదిలో మరింత మంది కస్టమర్లకు చేరువై జీవిత బీమా రంగంలో మా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్దేశించుకున్నాం. కొత్త పాలసీల విషయంలో పరిశ్రమకు రెట్టింపు స్థాయి వృద్ధి సాధించడం, వేగంగా ఎదుగుతున్న టాప్ సంస్థల్లో ఒకటిగా కొనసాగడాన్ని లక్ష్యాలుగా పెట్టుకున్నాం. మా నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడతాం.
పరిశ్రమపరంగా చూస్తే 2032 నాటికి భారత ఇన్సూరెన్స్ మార్కెట్ ప్రపంచంలోనే ఆరో పెద్ద మార్కెట్‌గా ఎదుగుతుందని స్విస్ రీ సంస్థ ఒక నివేదికలో అంచనా వేసింది. పరిశ్రమ వృద్ధి గతిని తీర్చిదిద్దడంలో నియంత్రణ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది. బీమా సుగమ్, బీమా వాహక్, బీమా విస్తార్ వంటివి దేశవ్యాప్తంగా కోట్ల మందికి బీమాను అందుబాటులోకి తేవడం ద్వారా ‘2047 నాటికి అందరికీ బీమా కల్పించడం’ అనే ఐఆర్‌డీఏఐ లక్ష్య సాధనలో తోడ్పడగలవు. అలాగే పాలసీలను క్రమబద్ధీకరించడం, ప్రక్రియలను .. సర్వీసులను మెరుగుపర్చడం వంటి చర్యల ద్వారా బీమాను సరళతరం చేయడంపై పరిశ్రమ మరింతగా దృష్టి పెట్టనుంది.
అత్యంత కస్టమైజ్డ్ పాలసీలకు ఆదరణ
Published Sat, Dec 30 2023 7:58 AM | Last Updated on Sat, Dec 30 2023 8:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment