న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరంలో జీవిత, సాధారణ బీమా సంస్థలు మెరుగైన వృద్ధిని చూపించాయి. జీవిత బీమా ప్రీమియం 2022–23 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం పెరిగి రూ.7.83 లక్షల కోట్లకు చేరుకుంది. సాధారణ బీమా సంస్థల ప్రీమియం ఆదాయం సైతం 16.4 శాతం వృద్ధితో రూ.2.57 లక్షల కోట్లుగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి (ఐఆర్‌డీఏఐ) సంస్థ విడుదల చేసింది.
ప్రైవేటు జీవిత బీమా సంస్థల ఆదాయం 16.34 శాతం పెరగ్గా, ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల (ఎల్‌ఐసీ) ఆదాయం 10.90 శాతం వృద్ధి చెందింది. మొత్తం ప్రీమియంలో రెన్యువల్ (పాత పాలసీల పునరుద్ధరణ) ప్రీమియం 52.56 శాతం వాటాను ఆక్రమించింది. మిగిలిన 47.44 శాతం ప్రీమియం నూతన పాలసీల రూపంలో సమకూరింది. రెన్యువల్ ప్రీమియం 8.88 శాతమే పెరగ్గా.. నూతన పాలసీ ప్రీమియం ఆదాయం 17.90 శాతం వృద్ధి చెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
285 లక్షల పాలసీలు
2022–23లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు 284.70 లక్షల నూతన పాలసీలను జారీ చేశాయి. ఇందులో ప్రభుత్వరంగ బీమా సంస్థలు జారీ చేసినవి 204.29 లక్షలుగా (71.75 శాతం) ఉన్నాయి. ప్రైవేటు జీవిత బీమా సంస్థలు 80.42 లక్షల పాలసీలను (28.25 శాతం) జారీ చేశాయి. జీవిత బీమా సంస్థల పన్ను అనంతరం లాభం ఐదు రెట్లు పెరిగి రూ.42,788 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.7,751 కోట్లుగా ఉంది.
ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల లాభం 800 శాతం పెరిగితే, ప్రైవేటు జీవిత బీమా సంస్థల లాభం 72.36 శాతం వృద్ధిని చూసింది. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ (సాధారణ బీమా) రంగం మొత్తం రూ.257 లక్షల కోట్ల స్థూల ప్రీమియాన్ని అండర్ రైటింగ్ చేసింది. 27 ప్రైవేటు రంగ బీమా సంస్థలు (స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు సహా) రూ.1.58 లక్షల కోట్ల ప్రీమియాన్ని అండర్‌రైట్ చేశాయి.
ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 38.42 శాతం వాటా కలిగి ఉంటే, ప్రైవేటు సాధారణ బీమా సంస్థల వాటా 61.58 శాతంగా ఉంది. మొత్తం వ్యయాల్లో కమీషన్ (మధ్యవర్తులకు), నిర్వహణ వ్యయాలు ఎక్కువగా ఉంటున్నాయి. నాన్ లైఫ్ బీమా సంస్థల అండర్‌రైటింగ్ నష్టాలు రూ.32,797 కోట్లకు పెరిగిపోయాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.31,810 కోట్లుగా ఉన్నాయి. వార్షికంగా నష్టాలు 3 శాతం పెరిగాయి. స్విస్ ఆర్‌ఈ సిగ్నా నివేదిక ప్రకారం మన దేశంలో జీవిత బీమా విస్తరణ 2022–23లో 3 శాతానికి తగ్గింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 3.2 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment