bajaj alianz
-
అత్యంత కస్టమైజ్డ్ పాలసీలకు ఆదరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారితో జీవిత బీమాపై అభిప్రాయం మారిందని, ఏదో పెట్టుబడి సాధనంగా కాకుండా కీలకమైన రిస్క్ కవరేజీ సాధనంగా చూసే ధోరణి పెరిగిందని బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ (బీఏఎల్‌ఐసీ) చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్ (సీఏవో) సమీర్ జోషి తెలిపారు. ప్రజలు టర్మ్ ప్లాన్ల వైపు మొగ్గు చూపడం పెరిగిందని చెప్పారు. అలాగే, చెల్లింపుల్లో వెసులుబాటు, ఆన్లైన్ లావాదేవీలు, అదనపు కవరేజీ, వినూత్న ఉత్పత్తులు మొదలైన అత్యంత కస్టమైజ్డ్ ఆప్షన్లను కోరుకుంటున్నారని ఆయన వివరించారు. కంపెనీలు కూడా దానికి అనుగుణంగా సత్వరం తమ సర్వీసులు, ఉత్పత్తుల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నాయని జోషి చెప్పారు. తాము ప్రవేశపెట్టిన ఏస్, డయాబెటిక్ టర్మ్ ప్లాన్ మొదలైనవి ఈ కోవకి చెందినవేనని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. దక్షిణాదిపై మరింత దృష్టి .. ఇతరత్రా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మొదలైనవి .. అలాగే గోవా, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో బీమా విస్తృతి ఎక్కువగా ఉందని ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడైంది. ఈ ప్రాంతాల్లో బీమా విస్తృతిని మరింత పెంచడంపై దృష్టి పెడుతున్నాం. కీలక ఆర్థిక సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నాం. ప్రవాస భారతీయ కస్టమర్లలో చాలా మంది ఈ ప్రాంతాలకు చెందినవారే కావడంతో వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్లు, సర్వీసులను తీర్చిదిద్దుతున్నాం. లక్ష కోట్లు దాటిన ఏయూఎం.. బజాజ్ అలయంజ్ లైఫ్ అతి తక్కువ కాలంలోనే దిగ్గజ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 56,085 కోట్లుగా ఉన్న మా ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్) ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటింది. మాపై కస్టమర్ల నమ్మకానికి ఇది నిదర్శనం. సరళమైన, వినూత్నమైన, కస్టమర్ ఆధారిత సాధనాలు, సమర్ధమంతమైన పంపిణీ వ్యవస్థ మొదలైనవి ఇందుకు తోడ్పడ్డాయి. పాలసీల వృద్ధిపరంగా పరిశ్రమ కన్నా అధికంగా 23 శాతం వృద్ధి సాధిస్తున్నాం. మాకు 1.40 లక్షల మంది ఏజెంట్లు, 60 పైచిలుకు ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం, 505 శాఖల పటిష్టమైన నెట్వర్క్ ఉంది. మొత్తం మీద సహాయకరమైన నియంత్రణ వ్యవస్థ, ప్రభావవంతమైన మార్పులతో 2023 మా సంస్థతో పాటు ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగానికి సానుకూలంగా గడిచింది. వృద్ధి లక్ష్యాలు.. వినూత్న ఉత్పత్తులు, సమగ్ర సేవలతో కొత్త ఏడాదిలో మరింత మంది కస్టమర్లకు చేరువై జీవిత బీమా రంగంలో మా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్దేశించుకున్నాం. కొత్త పాలసీల విషయంలో పరిశ్రమకు రెట్టింపు స్థాయి వృద్ధి సాధించడం, వేగంగా ఎదుగుతున్న టాప్ సంస్థల్లో ఒకటిగా కొనసాగడాన్ని లక్ష్యాలుగా పెట్టుకున్నాం. మా నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడతాం. పరిశ్రమపరంగా చూస్తే 2032 నాటికి భారత ఇన్సూరెన్స్ మార్కెట్ ప్రపంచంలోనే ఆరో పెద్ద మార్కెట్‌గా ఎదుగుతుందని స్విస్ రీ సంస్థ ఒక నివేదికలో అంచనా వేసింది. పరిశ్రమ వృద్ధి గతిని తీర్చిదిద్దడంలో నియంత్రణ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది. బీమా సుగమ్, బీమా వాహక్, బీమా విస్తార్ వంటివి దేశవ్యాప్తంగా కోట్ల మందికి బీమాను అందుబాటులోకి తేవడం ద్వారా ‘2047 నాటికి అందరికీ బీమా కల్పించడం’ అనే ఐఆర్డీఏఐ లక్ష్య సాధనలో తోడ్పడగలవు. అలాగే పాలసీలను క్రమబద్ధీకరించడం, ప్రక్రియలను .. సర్వీసులను మెరుగుపర్చడం వంటి చర్యల ద్వారా బీమాను సరళతరం చేయడంపై పరిశ్రమ మరింతగా దృష్టి పెట్టనుంది. -
విద్యుత్ వాహనాల బీమాకు జాగ్రత్తలు
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతోంది. 2022 ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం మన రహదారులపై 13 లక్షల పైచిలుకు ఈవీలు ఉన్నాయి. మూడేళ్లుగా వీటి అమ్మకా ల వృద్ధి వార్షికంగా 130 శాతంగా ఉంటోంది. వీటిల్లో అత్యధికంగా త్రిచక్ర రవాణా వాహనాలు, తర్వాత స్థానంలో ద్విచక్ర వాహనాలు, కార్లు ఉన్నా యి. అయితే మిగతా వాటి తరహాలోనే విద్యుత్ వాహనాలకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. అవి.. ► ఒక్క సారి చార్జి చేస్తే వాహనం ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందనేది ఒక సవాలు. ► ఈవీలు విజయవంతం కావాలంటే చార్జింగ్‌పరమైన మౌలిక సదుపాయాలు భారీగా అవసరం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇంకా పురోగమన దశలోనే ఉన్నాయి. ► ఈవీ బ్యాటరీ ఖరీదు.. వాహనం రేటులో దాదాపు సగం దాకా ఉంటోంది. కాబట్టి, బ్యాటరీ దీర్ఘాయుష్షు, వారంటీ, రీసేల్ విలువ గురించి చాలా సందేహాలే ఉన్నాయి. ► ఓవర్ చార్జింగ్ వల్ల వాహనంలో మంటలు చెలరే గితే పరిస్థితి ఏమిటనే భయాలూ ఉన్నాయి. అగ్నిప్రమాదాలకు దారి తీస్తే థర్డ్ పార్టీకి వాటిల్లే ఆస్తి, ప్రాణ నష్టానికి లయబిలిటీపైనా సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రామాణిక మోటరు బీమా పాలసీ దశాబ్దాల కిందట రూపొందింది. అప్పుడు ఈవీలు, హైబ్రీడ్ వాహనాల ఉనికి లేదు. అయితే, మారే మార్కెట్ అవసరాలు, సమయానికి తగినట్లు కొత్త పథకాలను ప్రవేశపెట్టేలా ఇన్సూరెన్స్ కంపెనీలకు బీమా రంగ నియంత్రణ సంస్థ స్వేచ్ఛనిస్తోంది. తదనుగుణంగానే బీమా సంస్థలు కూడా పైన పేర్కొన్న పలు సవాళ్లను పరిష్కరించగల యాడ్–ఆన్‌లను అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీల కోసం బీమా తీసుకునేటప్పుడు కొనుగోలుదారు ప్రధానంగా పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ► బ్యాటరీకి విడిగా కవరేజి ఉందా? ఒకవేళ చార్జింగ్ చేసేటప్పుడు వరద లేదా అగ్ని ప్రమాదాల్లాంటివి సంభవించినట్లయితే బ్యాటరీ పూర్తి నష్టానికి పాలసీలో కవరేజీ ఉండాలి. ► ప్లాస్టిక్, లోహాలు, గాజు లేదా ఫైబర్ ఏవైనా భాగాలు అన్నింటికీ జీరో డిప్రిసియేషన్ కవరేజీ ఉందా అన్నది చూసుకోవాలి. ► ఈవీ వల్ల థర్డ్ పార్టీ ప్రాపర్టీ ధ్వంసమైనా, వారికి గాయాలైనా ఈవీ యజమానిపై దావా వేస్తే పరిహారంపరమైన సమస్యలు ఎదురవకుండా విడి గా లయబిలిటీ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ► గోడలో బిగించిన చార్జర్‌కు, చార్జింగ్ చేసే కేబుల్‌కు విడిగా కవరేజి ఉందా లేదా. ఈ భాగాలన్నీ వాహనంలో బిగించి ఉండవు కాబట్టి, వాటి గురించి నిర్దిష్టంగా తెలియపరుస్తూ కవరేజీ కల్పించడం ముఖ్యం. ► ఓఈఎం (వాహనం తయారీ సంస్థ) చేసే ప్రామాణికమైన ఫిట్టింగ్స్కు అదనంగా కారులో బిగించిన ఇన్ఫోటెయిన్మెంట్ గ్యాడ్జెట్లు, మ్యూ జిక్ సిస్టమ్‌లు, ఇతరత్రా ఏవైనా గ్యాడ్జెట్లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నింటికీ కవరేజీ ఉందో లేదో చూసుకోవాలి. -
బజాజ్ ఫిన్సర్వ్ సేల్స్ ఢమాల్
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫిన్సర్వ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 31 శాతం క్షీణించి రూ. 833 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,215 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 14,192 కోట్ల నుంచి రూ. 13,949 కోట్లకు బలహీనపడింది. సొంత అనుబంధ సంస్థలు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ అలయెంజ్ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలయెంజ్ లైఫ్ ల ఉమ్మడి పనితీరుతో వెల్లడించిన ఫలితాలివి. ఫైనాన్స్ ఓకే: అనుబంధ సంస్థలలో బజాజ్ ఫైనాన్స్ నికర లాభం 4 శాతంపైగా ఎగసి రూ. 1,002 కోట్లను తాకగా.. జనరల్ ఇన్సూరెన్స్ లాభం 8.4 శాతం క్షీణించి రూ. 362 కోట్లకు పరిమితమైంది. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం లాభం 35 శాతం పైగా వెనకడుగుతో రూ. 84 కోట్లకు చేరింది. -
విడుదల ఎన్నడు?!
= వాతావరణ బీమా కోసం రైతుల ఎదురుచూపు = మంజూరై నెలైనా విడుదలకు నోచుకోని వైనం = బొమ్మనహాళ్‌కు అత్యధికం..సీకేపల్లికి అత్యల్పం ! అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్–2016కు సంబంధించి వాతావరణ బీమా కోసం రైతులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. జిల్లాకు రూ.367 కోట్ల పరిహారం మంజూరు చేస్తున్నట్లు నెల రోజుల కిందటే ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. కనీసం మండలాల వారీగా హెక్టారుకు ఎంత మొత్తం వర్తింపజేశారు, ఎన్ని మండలాలకు.. ఎంత మంది రైతులకు ఇచ్చారు, బ్యాంక్ ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారనే విషయాలను అధికారులు కూడా చెప్పడం లేదు. ఈ సారి ‘బజాజ్ అలయెంజ్’ అనే ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో వాతావరణ బీమా పథకాన్ని అమలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 5.22 లక్షల మంది రైతులు రూ.48 కోట్ల వరకు ప్రీమియం చెల్లించినట్లు లీడ్‌బ్యాంకు వర్గాలు తెలిపాయి. గడిచిన ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశనగ పంట సర్వనాశనమైంది. పంట కోత ప్రయోగాల్లో వచ్చిన దిగుబడులే ఇందుకు నిదర్శనం. ఎకరాకు సరాసరి 86 కిలోల దిగుబడి మాత్రమే లభించింది. కొ న్ని గ్రామాలు, మండలాల్లో అయితే ఎకరాకు పది కిలోలు కూడా పండలేదు. ఈ పరిస్థితుల్లో వాతావరణ బీమా కింద భారీ ఎత్తున పరిహారం వస్తుందని రైతులు ఆశించారు.అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. 2011 నుంచి ఈ పథకం అమలు చేస్తుండగా ఒక్క ఏడాది కూడా అన్ని మండలాలకూ పరిహారం వచ్చిన దాఖలాలు లేవు. ఈసారి మాత్రం అన్ని మండలాలకూ అంతో ఇంతో మంజూరు చేసినట్లు తెలుస్తోంది. బొమ్మనహాళ్‌కు అత్యధికం .. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 14 నుంచి 17 మండలాలకు మాత్రమే ఎకరాకు ఐదు వేలకు పైగా పరిహారం వర్తింపజేశారు. మరో 15 నుంచి 18 మండలాలకు ఎకరాకు రూ.వెయ్యిలోపు, మిగతా మండలాలకు రూ.1,200 నుంచి రూ.4,500 వరకు పరిహారం వర్తింపజేసినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద చూస్తే బొమ్మనహాళ్ మండలానికి అత్యధికంగా అంటే ఎకరాకు రూ.6,700 ప్రకారం, చెన్నేకొత్తపల్లి మండలానికి అత్యల్పంగా రూ.670 చొప్పున వర్తింపజేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద చూస్తే వాతావరణ బీమా ద్వారా 25 నుంచి 30 మండలాలకు మాత్రమే కొంత వరకు న్యాయం జరిగే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. అది కూడా ఇన్పుట్ సబ్సిడీ లెక్కలు తేలితే కానీ మండలాల వారీగా వాతావరణ బీమా వివరాలు ప్రకటించే పరిస్థితి కనిపించడం లేదు.