విడుదల ఎన్నడు?!
విడుదల ఎన్నడు?!
Published Mon, Jan 16 2017 11:44 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
= వాతావరణ బీమా కోసం రైతుల ఎదురుచూపు
= మంజూరై నెలైనా విడుదలకు నోచుకోని వైనం
= బొమ్మనహాళ్‌కు అత్యధికం..సీకేపల్లికి అత్యల్పం !
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్–2016కు సంబంధించి వాతావరణ బీమా కోసం రైతులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. జిల్లాకు రూ.367 కోట్ల పరిహారం మంజూరు చేస్తున్నట్లు నెల రోజుల కిందటే ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. కనీసం మండలాల వారీగా హెక్టారుకు ఎంత మొత్తం వర్తింపజేశారు, ఎన్ని మండలాలకు.. ఎంత మంది రైతులకు ఇచ్చారు, బ్యాంక్ ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారనే విషయాలను అధికారులు కూడా చెప్పడం లేదు. ఈ సారి ‘బజాజ్ అలయెంజ్’ అనే ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో వాతావరణ బీమా పథకాన్ని అమలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 5.22 లక్షల మంది రైతులు రూ.48 కోట్ల వరకు ప్రీమియం చెల్లించినట్లు లీడ్‌బ్యాంకు వర్గాలు తెలిపాయి. గడిచిన ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశనగ పంట సర్వనాశనమైంది. పంట కోత ప్రయోగాల్లో వచ్చిన దిగుబడులే ఇందుకు నిదర్శనం. ఎకరాకు సరాసరి 86 కిలోల దిగుబడి మాత్రమే లభించింది. కొ న్ని గ్రామాలు, మండలాల్లో అయితే ఎకరాకు పది కిలోలు కూడా పండలేదు. ఈ పరిస్థితుల్లో వాతావరణ బీమా కింద భారీ ఎత్తున పరిహారం వస్తుందని రైతులు ఆశించారు.అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. 2011 నుంచి ఈ పథకం అమలు చేస్తుండగా ఒక్క ఏడాది కూడా అన్ని మండలాలకూ పరిహారం వచ్చిన దాఖలాలు లేవు. ఈసారి మాత్రం అన్ని మండలాలకూ అంతో ఇంతో మంజూరు చేసినట్లు తెలుస్తోంది.
బొమ్మనహాళ్‌కు అత్యధికం .. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 14 నుంచి 17 మండలాలకు మాత్రమే ఎకరాకు ఐదు వేలకు పైగా పరిహారం వర్తింపజేశారు. మరో 15 నుంచి 18 మండలాలకు ఎకరాకు రూ.వెయ్యిలోపు, మిగతా మండలాలకు రూ.1,200 నుంచి రూ.4,500 వరకు పరిహారం వర్తింపజేసినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద చూస్తే బొమ్మనహాళ్ మండలానికి అత్యధికంగా అంటే ఎకరాకు రూ.6,700 ప్రకారం, చెన్నేకొత్తపల్లి మండలానికి అత్యల్పంగా రూ.670 చొప్పున వర్తింపజేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద చూస్తే వాతావరణ బీమా ద్వారా 25 నుంచి 30 మండలాలకు మాత్రమే కొంత వరకు న్యాయం జరిగే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. అది కూడా ఇన్పుట్ సబ్సిడీ లెక్కలు తేలితే కానీ మండలాల వారీగా వాతావరణ బీమా వివరాలు ప్రకటించే పరిస్థితి కనిపించడం లేదు.
Advertisement