వెంకటగిరిటౌన్ : తెలుగుగంగ కోసం వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాల రైతులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
వెంకటగిరిటౌన్ : తెలుగుగంగ కోసం వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాల రైతులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కరుణించి నీటిని విడుదల చేస్తే ఆయా మండలాల్లో కాలువ దిగువ ప్రాంతాల్లో ఉన్న సుమారు 4 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. తమిళనాడుకు తాగునీటిని విడుదల చేసే క్రమంలో అక్టోబర్ నుంచి మార్చి వరకు తెలుగుగంగ కాలువ లో నీరు ప్రవహిస్తుంటుంది.
ఆ సమయంలో డక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లి మండలాల్లో ఉన్న బ్రాంచి కాలువల ద్వారా పలు గ్రామాల చెరువులకు నీరు చేరుతుంది. బ్రాంచి కాలువల ద్వారా నీరు చేరని డక్కిలి మండలం మోపూరు, డక్కిలి, వెంకటగిరి మండలం కలపాడు, పెట్లూరు గ్రామాల్లో సైఫన్ విధానంలో చెరువులకు నీటిని మళ్లించి నిల్వ చేస్తారు.
గత నెలలో కాలువ మరమ్మతుల కోసం నీటిని నిలిపివేశారు. పనులను త్వరగా పూర్తి చేసి, నీటిని విడుదల చేయకపోతే రబీ సీజన్ ఆలస్యం అవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క హుదూద్ తుఫాన్ ప్రభావంతోనైనా వర్షాలు పడతాయోమోనని రైతులు ఎదురు చూస్తున్నారు.