బీమాకూ ఆన్‌లైన్ ఖాతా | Demat your insurance policy | Sakshi
Sakshi News home page

బీమాకూ ఆన్‌లైన్ ఖాతా

Published Sun, Sep 22 2013 12:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM

బీమాకూ ఆన్‌లైన్ ఖాతా

బీమాకూ ఆన్‌లైన్ ఖాతా

హైదరాబాద్‌లోనే పుట్టిపెరిగిన రాఘవకి ఇప్పుడు ఉద్యోగరీత్యా వైజాగ్‌కి బదిలీ అయ్యింది. అక్కడికి వెళ్ళి
 స్థిరపడిన తర్వాత తీసుకున్న వివిధ బీమా కంపెనీ పథకాల్లో చిరునామా మార్పించుకునే సరికి తలప్రాణం తోకకొచ్చింది. ఇక నుంచి ఇటువంటి ఇబ్బందులు అక్కర్లేదు అంటోంది నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ. ఒక్కసారి ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ ప్రారంభించి అందులో చిరునామా మార్పించుకుంటే మీ దగ్గర పది బీమా కంపెనీల పాలసీలున్నా వాటన్నింటిలోనూ చిరునామా మారిపోతుంది. ఇలా బహుళ ప్రయోజనాలను అందించే ఈ-పాలసీల గురించి సమగ్ర సమాచారమే ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం..
 
 షేర్లను కాగితరహిత రూపంలో ఎలక్ట్రానిక్ విధానంలో భద్రపర్చుకోవడానికి డీమ్యాట్ అకౌంట్ ఎలా ఉందో ఇప్పుడు బీమా పథకాలను దాచుకోవడానికి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. అదే రిపాజిటరీ సర్వీస్ లేదా ఈ-పాలసీలు. ఇప్పటికే తీసుకున్న పాలసీల దగ్గర నుంచి కొత్తగా తీసుకోబోయే పాలసీల వరకు అన్నీ ఎలక్ట్రానిక్ రూపంలో అంటే డీమ్యాట్ తరహాలో భద్రపర్చుకోవచ్చు. ప్రస్తుతానికి కేవలం జీవిత బీమా కంపెనీలకు అది కూడా మీకు ఎలక్ట్రానిక్ రూపంలో లేక ఫిజికల్ (కాగితం) రూపంలో తీసుకునే అవకాశాన్ని ఐఆర్‌డీఏ కల్పించింది. ఎలక్ట్రానిక్ రూపంలో పాలసీలను తీసుకుంటే ప్రయోజనాలు ఏంటి? ఈ-పాలసీలు ఏవిధంగా తీసుకోవాలి? పాత పాలసీలను ఈ-పాలసీలుగా ఎలా మార్చుకోవాలన్న అన్న అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం...
 
 ప్రయోజనాలు
 ఒకటి కంటే ఎక్కువ కంపెనీల పాల సీలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ ఒకే అకౌంట్‌లో భద్రపర్చుకునే అవకాశం ఈ-పాలసీ ద్వారా కలుగుతుంది. ఎలక్ట్రానిక్ అకౌంట్ ద్వారానే పాలసీల ప్రీమియంలు చెల్లించవచ్చు. అలాగే చిరునామా మారినా లేక ఏ ఇతర వివరాల్లో మార్పులు చేయాలన్నా ప్రతీ బీమా కంపెనీకి తిరగనవసరం లేకుండా కేవలం ఈ-అకౌంట్‌లో ఆ వివరాలను అందిస్తే ఆటోమేటిక్‌గా మిగిలిన పాలసీల్లో కూడా మారిపోతాయి. ఒక్కసారి ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ నంబర్‌ను కలిగి ఉంటే పాలసీ తీసుకున్న ప్రతీ సందర్భంలోనూ ‘నో యువర్ క్లయింట్’ (కేవైసీ) నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉండదు. అంటే ఒకసారి ఆన్‌లైన్ అకౌంట్ తెరిస్తే పాలసీ తీసుకునేటప్పుడు అడిగే నివాస ధ్రువీకరణ, ఆదాయధ్రువీకరణ, వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిన తలనొప్పులు పోతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒకేచోట బీమాకు సంబంధించిన అన్ని సేవలనూ పొందొచ్చన్నమాట. వీటన్నింటికంటే ముఖ్యమైనది డాక్యుమెంట్లు పోతాయన్న భయం ఉండదు. మొన్న ఉత్తరాఖండ్ వరదల్లో ఇళ్లకుఇళ్లే కొట్టుకుపోవడంతో బీమా క్లెయిమ్ చేసుకుందామంటే కాగితాలు కూడా లేకుండా పోయాయి. అదే ఈ-అకౌంట్ ఉంటే ఇలాంటి ఇబ్బందులకు ఆస్కారం ఉండదు. అందుకు ఈ-అకౌంట్ ప్రారంభించేటప్పుడే తదనంతరం ఈ-అకౌంట్ వివరాలను చూడటానికి, నిర్వహించడానికి ఎవరికి అనుమతించవచ్చని ముందే అడుగుతారు. అంటే ఒక విధంగా నామినీ కిందన్న మాట. ఇక్కడ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ అంటారు. అకౌంట్ హోల్డర్‌కి జరగరానిది ఏమైనా జరిగితే ఈ అకౌంట్‌పై హక్కులు ఆ వ్యక్తికి బదలాయించబడతాయి.
 
 ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ కావాలి...
 ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే ముందుగా మీకు ఈ- ఇన్సూరెన్స్ అకౌంట్ ఉండాలి. ఇందుకోసం ఐఆర్‌డీఏ ఐదు ఇన్సూరెన్స్ రిపాజిటరీ సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఈ ఐదు సంస్థల్లో ఏదో ఒక దాంట్లో అకౌంట్ ప్రారంభించవచ్చు. బీమా కంపెనీలు ఈ రిపాజిటరీ సంస్థలతో నేరుగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఆ విధంగా మీ బీమా కంపెనీ ఎంచుకున్న రిపాజిటరీ సంస్థ నుంచి కాని లేదా మీకు నచ్చిన రిపాజిటరీ సంస్థ నుంచైనా అకౌంట్‌ను ప్రారంభించవచ్చు. కాని ఈ అకౌంట్ ప్రారంభించాలంటే మాత్రం పాన్‌కార్డు కాని ఆధార్ కార్డు కాని తప్పనిసరిగా ఉండాలి. అకౌంట్‌ను ప్రారంభించాలంటే ముందుగా మీకు నచ్చిన రిపాజిటరీ సంస్థ లేదా బీమా కంపెనీకి చెందిన వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. లేకపోతే మీ దగ్గరలోని రిపాజిటరీ కార్యాలయం లేదా బీమా ఏజెంట్ దగ్గర నుంచైనా వీటిని పొందవచ్చు.
 
 ఈ అప్లికేషన్‌ను పూర్తి చేసి వీటితోపాటు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఐడీ ప్రూఫ్, నివాస ధ్రువపత్రం, పాన్ కార్డు లేదా ఆధార్‌కార్డు కాపీలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఏడు పనిదినాల్లోగా రిపాజిటరీ సంస్థ యూనిక్ ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ నెంబర్‌ను ఇవ్వడం జరుగుతుంది. తదుపరి లావాదేవీలు నిర్వహించేటప్పుడు ఈ-నంబర్‌ను కోట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆన్‌లైన్‌లో అకౌంట్ నిర్వహించుకోవడానికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కూడా కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి కేవలం ఒక ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్‌ను మాత్రమే కలిగి ఉంటాడు. అంటే ఐదు రిపాజిటరీ సం స్థల్లో కేవలం ఒకదాం ట్లోనే అకౌంట్‌ను తెరవగలడు. ఒక దాంట్లో అకౌంట్ తెరిచిన తర్వాత మిగిలిన రిపాజిటరీలు అకౌంట్‌ను తెరవడానికి దరఖాస్తు చేస్తే తిరస్కరిస్తాయి. ఈ-అకౌంట్‌తోనే మిగిలిన అన్ని బీమా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ-అకౌంట్ ప్రారంభించడానికి ఎలాంటి రుసుములు చెల్లించనవసరం లేదు.
 
 పాత పాలసీలు మార్చుకోవాలంటే..
 మీరు అకౌంట్ తెరిచిన రిపాజిటరీ సంస్థలోనే కాగితం రూపంలో ఉన్న పాత పథకాలను ఈ-పాలసీలుగా మార్చుకోవడానికి ఒక ప్రత్యేక అప్లికేషన్ ఉంటుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని అందులో మీ యునిక్ ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ నంబర్‌తోపాటు మీ దగ్గర ఉన్న వివిధ బీమా పథకాల పాలసీ నెంబర్లు పొందుపర్చి దాఖలు చేస్తే పాత పాలసీలన్నీ కూడా ఈ-పాలసీలుగా మారిపోతాయి. లేకపోతే మీ బీమా కంపెనీకి యునిక్ ఈ-ఇన్సూరెన్స్ నంబర్‌ను తెలియచేస్తూ, పాలసీలన్నింటినీ ఈ-అకౌంట్‌లోకి మార్చమని దరఖాస్తు చేసుకున్నా చాలు. ఇలా మార్చిన దానికి కూడా ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదు. దీనికయ్యే ఖర్చులన్నీ ఆయా బీమా కంపెనీలే భరిస్తాయి.
 
 ఇన్సూరెన్స్ రిపాజిటరీ సంస్థలు
 కార్వీ ఇన్సూరెన్స్ రిపాజిటరీ
 ఎన్‌ఎస్‌డీఎల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్
 ఎస్‌హెచ్‌సీఐఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్
 కామ్స్ రిపాజిటరీ సర్వీసెస్
 సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ
 
 - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement