చౌక పాలసీకి ఆన్‌లైన్‌ మార్గం! | more covarage on small policy in online market | Sakshi
Sakshi News home page

చౌక పాలసీకి ఆన్‌లైన్‌ మార్గం!

Published Sun, Apr 2 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

చౌక పాలసీకి ఆన్‌లైన్‌ మార్గం!

చౌక పాలసీకి ఆన్‌లైన్‌ మార్గం!

తక్కువ ప్రీమియానికే అధిక కవరేజీ  
ఆన్‌లైన్‌లో 10 శాతం తక్కువకే ఇవ్వాలన్న ప్రభుత్వం


నచ్చిన వస్తువును ఆన్‌లైన్లో ఒక్క క్లిక్‌తో కొనేస్తున్న రోజులివి. కాలు బయటపెట్టకుండా... చౌకగా స్మార్ట్‌ఫోన్‌ నుంచే కొనే వెసులుబాటుంటే ఎవరాగుతారు చెప్పండి? మరి బీమా పాలసీలను సైతం ఇదే విధంగా ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చని ఎప్పుడైనా ఆలోచించారా? భౌతికంగా పత్రాల రూపంలో, బీమా ఏజెంట్‌ సాయంతో తీసుకునే పాలసీలతో పోలిస్తే ఆన్‌లైన్‌ పాలసీలు తక్కువ ప్రీమియానికే అందుబాటులో ఉంటాయని గమనించారా? నిజం!! ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఇప్పుడు ఈ పాలసీలు ఇంకాస్త చౌకగా మారాయి. ఆ వివరాలే ఈ కథనం..

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న సంకల్పంతో... ప్రభుత్వ రంగంలోని ఎల్‌ఐసీ ద్వారా తీసుకునే జీవిత బీమా పాలసీలు, నాలుగు సాధారణ బీమా కంపెనీల నుంచి తీసుకునే మోటారు, ఆరోగ్య బీమా, ఇతర పాలసీలను 8 నుంచి 10 శాతం తక్కువకే అందించాలని కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అంటే ఏటా రూ.10,000 ప్రీమియం కట్టే చోట ఆన్‌లైన్‌ పాలసీ అయితే, రూ.వెయ్యి వరకు ఆదా చేసుకునేందుకు ప్రభుత్వ నిర్ణయం వీలు కల్పించింది. కనుక పాలసీ తీసుకునే ముందు ఆన్‌లైన్‌లో ఎల్‌ఐసీ, ఓరియెంటల్‌ ఇన్సూరెన్స్, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్‌ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్‌ సంస్థల సైట్లను ఆశ్రయించడం ద్వారా చౌకగా పాలసీలు ఏవైనా లభిస్తున్నాయేమో చూసుకోవాలి.

ఆన్‌లైన్‌లో ఎందుకు చౌక?
ఆన్‌లైన్‌ మాధ్యమంలో పాలసీల జారీ వల్ల కంపెనీలకు వ్యయాలు ఆదా అవుతాయి. మధ్యవర్తులు ఎవరూ ఉండరు. నేరుగా పాలసీదారుడు, కంపెనీకి మధ్య వ్యవహారాలు నడుస్తాయి. దాంతో పరిపాలనా, ఇతర కమీషన్ల వ్యయాలు కంపెనీలకు మిగులుతాయి. ఇలా మిగిలే మొత్తంలో కొంత శాతాన్ని ప్రీమియం తగ్గింపు ద్వారా పాలసీదారులకు బదిలీ చేస్తాయి. జీవిత బీమాల్లో టర్మ్‌ పాలసీలు, సాధారణ బీమాలో మోటారు, ఆరోగ్య, పర్యాటక బీమా పాలసీలు ఇలా పోటాపోటీగా చౌక ప్రీమియానికే లభించే పరిస్థితి ఉంది.

ప్రీమియం వ్యవధి బట్టి రాయితీ
ప్రీమియం తగ్గింపు అన్నది ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. బీమా కవరేజీ అధికంగా ఎంచుకుంటే తగ్గింపు ఎక్కువ లభిస్తుంది. ఎందుకంటే ఆ స్థాయిలో కంపెనీలకు వ్యయాలు మిగులుతాయి మరి. అలాగే, ప్రీమియం చెల్లింపు ఏడాదికోసారి అయితే రాయితీ ఎక్కువ లభిస్తుంది. అదే ఆరు నెలలకోసారి అయితే రాయితీ తగ్గుతుంది. నిజానికి ఆన్‌లైన్‌ విభాగంలో పాలసీల అమ్మకాలు తక్కువే. అందులోనూ సాధారణ బీమా కంపెనీల పాలసీల్లో ఇది మరింత తక్కువగా ఉందనేది ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఉన్నతాధికారి గుంజన్‌ ఘాయ్‌ మాట. అధిక శాతం సాధారణ బీమా కంపెనీలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ కోసం వేర్వేరు పాలసీలను నిర్వహించడం లేదని ఆయన చెప్పారు. కానీ, జీవిత బీమా పాలసీల్లో ఈ పరిస్థితి లేదు. కంపెనీలు టర్మ్‌ పాలసీల్లో అయితే పోటాపోటీగా తక్కువ ప్రీమియంకే పాలసీలు ఆఫర్‌ చేస్తున్నాయి.

ఎల్‌ఐసీలో రెండు పాలసీలే...
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ... ఆన్‌లైన్‌ ద్వారా రెండు రకాల పాలసీలనే అందిస్తోంది. అవి టర్మ్‌ పాలసీలు, ఇమిడియెట్‌ యాన్యుటీ ప్లాన్స్‌. టర్మ్‌ పాలసీలను రూ.25 లక్షలు అంతకుమించిన కవరేజీతోనే అందిస్తోంది. రూ.50 లక్షలకు టర్మ్‌ పాలసీని 30 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్ల కాలానికి ఎంచుకుంటే ఆన్‌లైన్‌ పాలసీలో ప్రీమియం సుమారు రూ.7,300 వరకు ఉంటోంది. ఇదే పాలసీని ఆఫ్‌లైన్‌లో బీమా కార్యాలయం నుంచి తీసుకుంటే ప్రీమియం రూ.11,600గా ఉంది. దీనికి సేవారుసుం అదనం. ఇక ఇమిడియట్‌ యాన్యుటీ పాలసీల్లో (పాలసీ తీసుకున్న తర్వాత నుంచి నెలవారీ, వార్షికంగా చెల్లింపులు చేసేవి/పెన్షన్‌ ప్లాన్లు). ఈ విభాగంలో ఎల్‌ఐసీ ఆన్‌లైన్‌లో తీసుకునే పాలసీల్లో ఒక శాతం అధిక రాబడులను అందిస్తోంది.

ప్రోత్సాహకం ఏదీ...?
ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే పాలసీలపై 8 నుంచి 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం డీమోనిటైజేషన్‌ తర్వాత ప్రకటించినప్పటికీ ప్రభుత్వ రంగంలోని నాలుగు సాధారణ బీమా కంపెనీలు ఇంత వరకు ఒక్క ఆన్‌లైన్‌ పాలసీనీ ప్రత్యేకంగా ప్రారంభించలేదు. ఎల్‌ఐసీ మాత్రం ప్రస్తుతం అందిస్తున్న పాలసీలకు... తొలి ఏడాది ప్రీమియంను 8 శాతం వరకూ తగ్గిస్తోంది. అయినప్పటికీ ప్రైవేటు రంగ బీమా కంపెనీలతో పోలిస్తే ఎల్‌ఐసీలో పాలసీ ప్రీమియంలు అధికమేనని చెప్పొచ్చు. ఉదాహరణకు ఎల్‌ఐసీ అన్మోల్‌ జీవన్‌ పాలసీలో 30 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల కాలానికి రూ.15 లక్షల కవరేజీకి గాను ప్రీమియం రూ.4,571 (పన్నులతో కలుపుకుని). దీనిపై 8 శాతం తగ్గింపు అంటే రూ.365 పోను ప్రీమియం రూ.4,205గా ఉంటుందనుకోవచ్చు. కానీ, ఇంతే మొత్తం బీమా కవరేజీని ప్రైవేటు కంపెనీలు రూ.3,000 నుంచి రూ.3,500కే అందిస్తుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement