బీమా పాలసీ కొనసాగించలేకపోతున్నారా? | Paidup policy if the policy does not pay a premium | Sakshi
Sakshi News home page

బీమా పాలసీ కొనసాగించలేకపోతున్నారా?

Published Mon, Nov 18 2019 6:32 AM | Last Updated on Mon, Nov 18 2019 6:32 AM

Paidup policy if the policy does not pay a premium - Sakshi

కారణాలేవైనా కానీ  మీరు తీసుకున్న బీమా పాలసీని కొనసాగించలేకపోతున్నారా..? ప్రీమియం చెల్లింపును భారంగా భావిస్తున్నారా..? దీంతో పాలసీని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీ ముందు ఓ చక్కని మార్గం ఉంది. పాలసీ ప్రీమియం చెల్లించకపోతే అది ల్యాప్స్‌ అయిపోతుంది. దీనికంటే పెయిడప్‌ పాలసీగా మార్చుకుంటే సరి. ఈ అవకాశం ఎండోమెంట్‌ పాలసీల్లో ఉంటుంది. ఎండోమెంట్‌ పాలసీలు బీమా రక్షణతోపాటు, పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా పాలసీదారు జీవించి ఉంటే మెచ్యూరిటీ లభిస్తుంది. ఈ ఎండో మెంట్‌ పాలసీ కాల వ్యవధి ముగియక ముందే దాన్ని నిలిపివేయాలని భావిస్తే రెండు మార్గాలు ఉన్నాయి. దాన్ని పెయిడప్‌ పాలసీగా మార్చుకోవడం ఒకటి. ఇలా చేస్తే బీమా కవరేజీ కొనసాగుతుంది. లేదా పాలసీని బీమా సంస్థకు స్వాధీనం చేసి సరెండర్‌ వ్యాల్యూని పొందడం. ఈ రెండు మార్గాల్లో ఉన్న మంచి చెడులను తెలియజేసే కథనమే ఇది.

పెయిడప్‌ పాలసీ
పెయిడప్‌ పాలసీ ఆప్షన్‌లో జీవిత బీమా నిర్ణీత కాలం వరకు కొనసాగడం అనుకూలతగా చెప్పుకోవాలి. అంటే ప్రీమియం చెల్లించకపోయినా కానీ, ఈ కవరేజీ కొనసాగుతుంది. అలాగే, పాలసీ కాల వ్యవధి సమయంలో పాలసీదారు మరణిస్తే సమ్‌ అష్యూరెన్స్‌ (బీమా మొత్తం)ను నామినీకి చెల్లించడం జరుగుతుంది. పాలసీదారు జీవించి ఉంటే మెచ్యూరిటీ లభిస్తుంది. కాకపోతే పాలసీని పెయిడప్‌గా మార్చుకుంటే చివర్లో వచ్చే ప్రయోజనాలు కొంత తగ్గిపోతాయి. ఎందుకంటే అప్పటి నుంచి ప్రీమియం చెల్లించరు కనుక. దాంతో కాల వ్యవధి తీరిన తర్వాత పాలసీదారుకు లభించే మొత్తం తగ్గుతుంది. పెయిడప్‌గా మార్చిన నాటి నుంచి ప్రీమియం చెల్లించరు కనుక వార్షికంగా తాజా బోనస్‌లు కూడా నిలిచిపోతాయి. అప్పటి వరకు సమకూరిన బోనస్‌లను కాల వ్యవధి తీరిన తర్వాత చెల్లిస్తారు.

‘‘ఇటీవలి ఐఆర్‌డీఏఐ నాన్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్రొడక్ట్స్‌ నిబంధనలు 2019 ప్రకారం పెయిడప్‌కు అర్హమైన పాలసీల్లో చెల్లించాల్సిన కనీస ప్రీమియం రెండు సంవత్సరాలుగా నిర్దేశించడం జరిగింది. అంటే ఇంకా మిగిలి ఉన్న కాలంతో సంబంధం లేకుండా అన్ని పాలసీలకు పెయిడప్‌ విషయంలో రెండేళ్ల ప్రీమియం చెల్లిస్తే చాలు’’ అని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ కంపెనీ తెలిపింది. యూనిట్‌ లింక్డ్‌ ప్లాన్‌ (యులిప్‌)లను కూడా పెయిడప్‌ పాలసీలుగా మార్చుకోవచ్చు. అయితే, లాకిన్‌ పీరియడ్‌ వరకు (ఐదేళ్ల పాటు) అందులో కొనసాగాల్సి ఉంటుంది. పాలసీదారుపై చార్జీల భారం మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే యులిప్‌లలో జీవిత బీమా కవరేజీ రిస్క్‌ చార్జీలు పోను మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్‌ చేయడం జరుగుతుంది. కనుక ఫండ్‌ నిర్వహణ చార్జీలు కొనసాగుతాయి. నాన్‌ లింక్డ్‌ ఎండోమెంట్‌ పాలసీల్లో పెయిడప్‌గా మారిన తర్వాత ఎటువంటి చార్జీలను విధించడం జరగదు.

స్వాధీనం చేస్తే..?
ఒకవేళ పాలసీలో కొనసాగకూడదని భావిస్తే దాన్ని స్వాధీనం చేసి స్వాధీన విలువను (సరెండర్‌ వ్యాల్యూ) పొందొచ్చు. సరెండర్‌ చేసినట్టయితే ఆ తర్వాత బీమా కవరేజీ కూడా ముగిసినట్టే. ఈ ఆప్షన్‌లోనూ కనీసం కొంత కాలం పాటు ప్రీమియం చెల్లింపు తర్వాతే సరెండర్‌ చేయడానికి వీలుంటుందని పాలసీబజార్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ హెడ్‌ అక్షయ వైద్య తెలిపారు. యులిప్‌లలో కనీసం ఐదేళ్లు కొనసాగిన తర్వాతే సరెండర్‌కు వీలుంటుంది. యులిప్‌లలో ఐదేళ్లు ప్రీమియం చెల్లింపు తర్వాత ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చు. స్వాధీనం చేసే నాటికి ఉన్న ఫండ్‌ విలువ ను చెల్లించడం జరుగుతుంది. ముందుగా వైదొలిగినందుకు ఎటువంటి చార్జీల విధింపు ఉండదు. అదే నాన్‌ లింక్డ్‌ ప్లాన్‌లలో అయితే రెండేళ్ల తర్వాత స్వాధీనం చేయవచ్చు. సరెండర్‌ చార్జీలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. పాలసీ స్వాధీనం విషయంలో చెల్లించాల్సిన కనీస మొత్తాలను ఐఆర్‌డీఏఐ నిర్దేశించింది. అయితే, పాలసీ తొలి నాళ్లలో స్వాధీనం చేసినట్టయితే, చెల్లించిన ప్రీమియంలో 50%వరకు నష్టపోవాల్సి రావచ్చు. నాన్‌లింక్డ్‌ ఎండోమెంట్‌ ప్లాన్‌ను రెండో ఏడాది స్వాధీనం చేస్తే చెల్లించిన మొత్తం ప్రీమియంలో 30 శాతమే వెనక్కి వస్తుంది. మూడో ఏడాది స్వాధీనం చేస్తే 35% లభిస్తుంది. పాలసీ తొలినాళ్లలో స్వాధీనం చేయడం ద్వారా ఎక్కువ మొత్తాన్ని నష్టపోవాల్సి ఉంటుంది. పాలసీ తొలి ఏడేళ్ల కాలంలో స్వాధీనం చేస్తే ఎంత చెల్లించాలన్న దానిని ఐఆర్‌డీఏఐ పేర్కొంది.

పెయిడప్, సరెండర్‌... ఏది నయం?
ఒక్కసారి ఎండోమెంట్‌ పాలసీని కొనుగోలు చేసిన తర్వాత కనీసం రెండేళ్లు అయినా ప్రీమియం చెల్లిచాలి. అప్పుడే దాన్నుంచి పెద్దగా నష్టం రాదు. బీమాతోపాటు పొదుపు కలసిన పాలసీల్లో రెండేళ్లలోపే బయటపడితే వచ్చేదేమీ పెద్దగా ఉండదు. కనీసం రెండేళ్లు చెల్లించిన తర్వాత పెయిడప్, సరెండర్‌ ఆప్షన్లను పరిశీలించొచ్చు. అయినా కానీ తొలినాళ్లలో ఇలా చేయడం వల్ల అంత ప్రయోజం ఉండదు. పెయిడప్, సరెండర్‌ ఈ రెండింటిలో ఏది నయం? అన్న ప్రశ్నే ఎదురైతే పెయిడప్‌గా మార్చుకోవడమే మంచిది. ఎందుకంటే, ఇందులో జీవిత బీమా కొనసాగుతుంది. కాల వ్యవధి తీరాక  కొంత వెనక్కి వస్తుంది. పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీకి పరిహారం దక్కుతుంది. మరో జీవిత బీమా పాలసీ తీసుకున్నా తర్వాతే ఒక పాలసీ నుంచి వెదొలగడాన్ని పరిశీలించాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement