payout
-
మైండ్ బ్లోయింగ్ శాలరీ.. ఏడాదిలో రూ.7,400 కోట్లు!
Blackstone CEO Payout : సీఈవోల వేతనాల గురించి మనం తరచూ వింటుంటాం. అయితే అమెరికాకు చెందిన ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ బ్లాక్‌స్టోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) స్టీవ్ స్క్వార్జ్మాన్ (Steve Schwarzman) ఏడాదిలో తీసుకున్న వేతనం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. బ్లాక్‌స్టోన్ సీఈవో స్టీవ్ స్క్వార్జ్మాన్ గత సంవత్సరం రూ.896.7 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.7,400 కోట్లు) వేతనం అందుకున్నారు. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 30 శాతం తగ్గినప్పటికీ ఫైనాన్ రంగంలో అతిపెద్ద వార్షిక చెల్లింపులలో ఒకటి. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. 77 ఏళ్ల స్క్వార్జ్మాన్ కంపెనీలో తన సుమారు 20 శాతం వాటా నుంచి డివిడెండ్ల రూపంలోనే 777 మిలియన్ డాలర్లు (రూ.6,400 కోట్లు) అందుకున్నారు. అదనంగా 120 మిలియన్ డాలర్లు (రూ.990 కోట్లు)ప్రోత్సాహక రుసుములు, క్యారీడ్ వడ్డీగా అని పిలిచే ఫండ్ లాభాల వాటా ద్వారా సంపాదించారు. కాగా స్క్వార్జ్మాన్ 2022లో రికార్డు స్థాయిలో 1.27 బిలియన్ డాలర్లు అందుకున్నారు. స్క్వార్జ్మాన్ వాటాలు, డివిడెండ్లు ఇప్పటికీ ఆయనను ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకడిగా స్థిరపరుస్తున్నాయి. ఆయన అదృష్టం తాను సహ స్థాపించిన సంస్థతో ముడిపడి ఉంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం స్క్వార్జ్మాన్ నెట్‌వర్త్ 41.8 బిలియన్ డాలర్లు (రూ.3.4 లక్షల కోట్లు). -
చెప్పు..నీకు జీతం వేలల్లో కావాలా,లక్షల్లో కావాలా?!
సాక్షి, అమరావతి:ఎయిడెడ్ కాలేజీల్లో అవసరం లేకపోయినా బోధన, బోధనేతర సిబ్బందిని అన్ ఎయిడెడ్ ప్రాతిపదికన నియమించారు. ఆ సందర్భంలో పెద్దఎత్తున పైరవీలు నడిచాయి. సొమ్ములు కూడా చేతులు మారాయి. తాజాగా ఆ పోస్టులను క్రమబద్ధీకరణ (రెగ్యులర్) చేయిస్తామని.. నెలకు ఇచ్చే రూ.15 వేల నామమాత్రపు వేతనాన్ని రూ.లక్షకు పైగా ఇప్పించేలా చూస్తామంటూ సదరు కళాశాలల యాజమాన్యాలు వసూళ్ల పర్వానికి తెరలేపాయి. కోర్టుల్లో వ్యాజ్యాలు వేయించైనా ఆ పోస్టులను రెగ్యులర్ చేయిస్తామని నమ్మబలుకుతూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఉన్నత విద్యాశాఖలోని కొందరు కిందిస్థాయి అధికారుల ఆశీస్సులతో రూ.కోట్లు దండుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నత విద్యా శాఖకు పెద్దఎత్తున ఫిర్యాదులు సైతం అందుతున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం జీతాలొస్తాయంటూ.. రాష్ట్రంలో 137 ఎయిడెడ్ కాలేజీలు ఉండగా.. అందులో దేవదాయ శాఖకు చెందినవి 4, మైనార్టీ స్టేటస్‌లో 16 కాలేజీలు ఉన్నాయి. మిగిలినవి వివిధ యాజమాన్యాల్లో నడుస్తున్నాయి. వీటిలో ఎయిడెడ్ సెక్షన్లలో మొత్తంగా 1,02,234 సీట్లు ఉండగా.. 51,085 మంది విద్యార్థులున్నట్టు యాజమాన్యాలు చూపిస్తున్నాయి. అదే అన్ ఎయిడెడ్ సెక్షన్లలో 1,54,350 సీట్లున్నాయి. ఇక్కడ కూడా సగం మాత్రమే సీట్లు భర్తీ కాగా.. మిగిలినవన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఈ కాలేజీల్లోని ఎయిడెడ్ విభాగాల్లో 1,303 మంది బోధనా సిబ్బంది, 1,422 మంది బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. వీటిలో అన్ ఎయిడెడ్ విభాగంలో 1,621 మంది బోధనా సిబ్బంది, 909 మంది బోధనేతర సిబ్బంది కలిపి 2,530 మంది పని చేస్తున్నారు. వీరికి ఆయా యాజమాన్యాలు నెలకు రూ.15 వేల వరకు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నాయి. ఈ పోస్టుల్ని క్రమబద్ధీకరణ చేయిస్తే యూజీసీ నిబంధనల ప్రకారం ఒక్కొక్కరికీ రూ.లక్షకు పైగా వేతనం అందుతుంది. దీనిని ఆశగా చూపి యాజమాన్యాలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. అన్ ఎయిడెడ్ సిబ్బందిని రెగ్యులర్ చేయించేందుకు పకడ్బందీగా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. గతంలో ఇలాంటి వారిలో కొందరికి అనుకూలంగా ఉన్నత విద్యాశాఖలోని కొందరు అధికారుల సహకారంతో కోర్టు ఉత్తర్వులు జారీ చేయించి మరీ రెగ్యులర్ చేయించారు. ఆ ఉత్తర్వులను ఆధారం చేసుకుని ఇప్పుడు మొత్తం అందరినీ రెగ్యులర్ చేయిస్తామంటూ తెరవెనుక వ్యవహారం నడిపిస్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా.. ఉన్నత విద్యాసంస్థల్లో నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన యాక్ట్–1994కు వ్యతిరేకంగా ఈ వ్యవహారానలు నడిపిస్తున్నారు. ఆ చట్టం ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లోని కాంట్రాక్ట్, ఎన్‌ఎంఆర్‌లుగా తాత్కాలిక ప్రాతిపదికన చేస్తున్న వారి రెగ్యులరైజేషన్‌కు గతంలో ఒక అవకాశం ఇచ్చారు. 1993 నవంబర్ 25 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని మాత్రమే రెగ్యులర్ చేయాలని అప్పటి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వారికి యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉండి, ఎయిడెడ్ పోస్టుల్లో ఖాళీలు ఉంటే రెగ్యులర్ చేయాలని పేర్కొన్నారు. వారినీ తప్ప వేరెవరిని రెగ్యులర్ చేయడానికి వీల్లేదు. అలా చేయడం చట్ట వ్యతిరేకం. కానీ.. కోర్టుల నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చి గతంలో కొందరిని రెగ్యులర్ చేయించారు. ఇప్పుడు వాటినే చూపిస్తూ అందరినీ రెగ్యులర్ చేయిస్తామని కొన్ని యాజమాన్యాలు, ఉన్నత విద్యాశాఖలోని కొంతమంది అధికారులు పావులు కదుపుతున్నారు. చదవండి : ఉత్పత్తి ఉరకలెత్తేలా, రాష్ట్రానికి క్యూ కడుతున్న ఉక్కు కంపెనీలు -
ఉద్యోగాలు వదులుకున్నవారికి బంపర్ ఆఫర్..
బెంగుళూరు: ఐటీ సర్వీసుల గ్లోబల్ దిగ్గజం యాక్సెంచర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కరోనా ఉదృతి నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న విషయం తెలిసిందే. అయితే తమ సంస్థలో స్వచ్చందంగా ఉద్యోగాలు వదులుకునే వారికి 7 నెలల వేతనాలు చెల్లించాలని యాక్సెంచర్ భావిస్తోంది. ఇందులో ముడు నెలల కాలాన్ని నోటీస్ పిరియడ్‌గా పేర్కొనగా, మరో నాలుగు నెలలు వేతనాలను చెల్లించనుంది. అయితే మెజారిటీ ఐటీ కంపెనీలు ఉద్యోగాలు వదులుకున్న వారికి రెండు నుంచి మూడు నెలల మాత్రమే వేతానాలు చెల్లిస్తున్నాయి. కాగా యాక్సెంచర్ సంస్థలో నైపుణ్యం లేని 5శాతం ఉద్యోగులకు కోత విధించనున్నట్లు గతంలో యాక్సెంచర్ ప్రకటించింది. అయితే సంస్థ మాత్రం ప్రతి సంవత్సరం కొత్త ఉద్యోగాలు, ఉద్యోగాల కోత సహజమేనని పేర్కొంది. అయితే ఎక్కువగా టెక్నాలజీకి డిమాండ్ లేని ప్రాంతాలలో ఉద్యోగాల కోత ప్రభావం ఎక్కువుంటుంది. మరోవైపు టెక్నాలజీకి డిమాండ్ ఉన్న ప్రాంతాలలో కంపెనీలు కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. యాక్సెంచర్ సంస్థకు ఇప్పటికి 70శాతం రెవెన్యూ డిజిటల్ సేవల నుంచి లభిస్తున్నాయి. చదవండి: ఉద్యోగాలు, బోనస్ ఇస్తున్నాం: యాక్సెంచర్ -
బీమా పాలసీ కొనసాగించలేకపోతున్నారా?
కారణాలేవైనా కానీ మీరు తీసుకున్న బీమా పాలసీని కొనసాగించలేకపోతున్నారా..? ప్రీమియం చెల్లింపును భారంగా భావిస్తున్నారా..? దీంతో పాలసీని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీ ముందు ఓ చక్కని మార్గం ఉంది. పాలసీ ప్రీమియం చెల్లించకపోతే అది ల్యాప్స్ అయిపోతుంది. దీనికంటే పెయిడప్ పాలసీగా మార్చుకుంటే సరి. ఈ అవకాశం ఎండోమెంట్ పాలసీల్లో ఉంటుంది. ఎండోమెంట్ పాలసీలు బీమా రక్షణతోపాటు, పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా పాలసీదారు జీవించి ఉంటే మెచ్యూరిటీ లభిస్తుంది. ఈ ఎండో మెంట్ పాలసీ కాల వ్యవధి ముగియక ముందే దాన్ని నిలిపివేయాలని భావిస్తే రెండు మార్గాలు ఉన్నాయి. దాన్ని పెయిడప్ పాలసీగా మార్చుకోవడం ఒకటి. ఇలా చేస్తే బీమా కవరేజీ కొనసాగుతుంది. లేదా పాలసీని బీమా సంస్థకు స్వాధీనం చేసి సరెండర్ వ్యాల్యూని పొందడం. ఈ రెండు మార్గాల్లో ఉన్న మంచి చెడులను తెలియజేసే కథనమే ఇది. పెయిడప్ పాలసీ పెయిడప్ పాలసీ ఆప్షన్లో జీవిత బీమా నిర్ణీత కాలం వరకు కొనసాగడం అనుకూలతగా చెప్పుకోవాలి. అంటే ప్రీమియం చెల్లించకపోయినా కానీ, ఈ కవరేజీ కొనసాగుతుంది. అలాగే, పాలసీ కాల వ్యవధి సమయంలో పాలసీదారు మరణిస్తే సమ్ అష్యూరెన్స్ (బీమా మొత్తం)ను నామినీకి చెల్లించడం జరుగుతుంది. పాలసీదారు జీవించి ఉంటే మెచ్యూరిటీ లభిస్తుంది. కాకపోతే పాలసీని పెయిడప్‌గా మార్చుకుంటే చివర్లో వచ్చే ప్రయోజనాలు కొంత తగ్గిపోతాయి. ఎందుకంటే అప్పటి నుంచి ప్రీమియం చెల్లించరు కనుక. దాంతో కాల వ్యవధి తీరిన తర్వాత పాలసీదారుకు లభించే మొత్తం తగ్గుతుంది. పెయిడప్‌గా మార్చిన నాటి నుంచి ప్రీమియం చెల్లించరు కనుక వార్షికంగా తాజా బోనస్‌లు కూడా నిలిచిపోతాయి. అప్పటి వరకు సమకూరిన బోనస్‌లను కాల వ్యవధి తీరిన తర్వాత చెల్లిస్తారు. ‘‘ఇటీవలి ఐఆర్డీఏఐ నాన్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ నిబంధనలు 2019 ప్రకారం పెయిడప్కు అర్హమైన పాలసీల్లో చెల్లించాల్సిన కనీస ప్రీమియం రెండు సంవత్సరాలుగా నిర్దేశించడం జరిగింది. అంటే ఇంకా మిగిలి ఉన్న కాలంతో సంబంధం లేకుండా అన్ని పాలసీలకు పెయిడప్ విషయంలో రెండేళ్ల ప్రీమియం చెల్లిస్తే చాలు’’ అని హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీ తెలిపింది. యూనిట్ లింక్డ్ ప్లాన్ (యులిప్)లను కూడా పెయిడప్ పాలసీలుగా మార్చుకోవచ్చు. అయితే, లాకిన్ పీరియడ్ వరకు (ఐదేళ్ల పాటు) అందులో కొనసాగాల్సి ఉంటుంది. పాలసీదారుపై చార్జీల భారం మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే యులిప్‌లలో జీవిత బీమా కవరేజీ రిస్క్ చార్జీలు పోను మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కనుక ఫండ్ నిర్వహణ చార్జీలు కొనసాగుతాయి. నాన్ లింక్డ్ ఎండోమెంట్ పాలసీల్లో పెయిడప్‌గా మారిన తర్వాత ఎటువంటి చార్జీలను విధించడం జరగదు. స్వాధీనం చేస్తే..? ఒకవేళ పాలసీలో కొనసాగకూడదని భావిస్తే దాన్ని స్వాధీనం చేసి స్వాధీన విలువను (సరెండర్ వ్యాల్యూ) పొందొచ్చు. సరెండర్ చేసినట్టయితే ఆ తర్వాత బీమా కవరేజీ కూడా ముగిసినట్టే. ఈ ఆప్షన్లోనూ కనీసం కొంత కాలం పాటు ప్రీమియం చెల్లింపు తర్వాతే సరెండర్ చేయడానికి వీలుంటుందని పాలసీబజార్ టర్మ్ ఇన్సూరెన్స్ హెడ్ అక్షయ వైద్య తెలిపారు. యులిప్‌లలో కనీసం ఐదేళ్లు కొనసాగిన తర్వాతే సరెండర్‌కు వీలుంటుంది. యులిప్‌లలో ఐదేళ్లు ప్రీమియం చెల్లింపు తర్వాత ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చు. స్వాధీనం చేసే నాటికి ఉన్న ఫండ్ విలువ ను చెల్లించడం జరుగుతుంది. ముందుగా వైదొలిగినందుకు ఎటువంటి చార్జీల విధింపు ఉండదు. అదే నాన్ లింక్డ్ ప్లాన్లలో అయితే రెండేళ్ల తర్వాత స్వాధీనం చేయవచ్చు. సరెండర్ చార్జీలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. పాలసీ స్వాధీనం విషయంలో చెల్లించాల్సిన కనీస మొత్తాలను ఐఆర్డీఏఐ నిర్దేశించింది. అయితే, పాలసీ తొలి నాళ్లలో స్వాధీనం చేసినట్టయితే, చెల్లించిన ప్రీమియంలో 50%వరకు నష్టపోవాల్సి రావచ్చు. నాన్లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్‌ను రెండో ఏడాది స్వాధీనం చేస్తే చెల్లించిన మొత్తం ప్రీమియంలో 30 శాతమే వెనక్కి వస్తుంది. మూడో ఏడాది స్వాధీనం చేస్తే 35% లభిస్తుంది. పాలసీ తొలినాళ్లలో స్వాధీనం చేయడం ద్వారా ఎక్కువ మొత్తాన్ని నష్టపోవాల్సి ఉంటుంది. పాలసీ తొలి ఏడేళ్ల కాలంలో స్వాధీనం చేస్తే ఎంత చెల్లించాలన్న దానిని ఐఆర్డీఏఐ పేర్కొంది. పెయిడప్, సరెండర్... ఏది నయం? ఒక్కసారి ఎండోమెంట్ పాలసీని కొనుగోలు చేసిన తర్వాత కనీసం రెండేళ్లు అయినా ప్రీమియం చెల్లిచాలి. అప్పుడే దాన్నుంచి పెద్దగా నష్టం రాదు. బీమాతోపాటు పొదుపు కలసిన పాలసీల్లో రెండేళ్లలోపే బయటపడితే వచ్చేదేమీ పెద్దగా ఉండదు. కనీసం రెండేళ్లు చెల్లించిన తర్వాత పెయిడప్, సరెండర్ ఆప్షన్లను పరిశీలించొచ్చు. అయినా కానీ తొలినాళ్లలో ఇలా చేయడం వల్ల అంత ప్రయోజం ఉండదు. పెయిడప్, సరెండర్ ఈ రెండింటిలో ఏది నయం? అన్న ప్రశ్నే ఎదురైతే పెయిడప్‌గా మార్చుకోవడమే మంచిది. ఎందుకంటే, ఇందులో జీవిత బీమా కొనసాగుతుంది. కాల వ్యవధి తీరాక కొంత వెనక్కి వస్తుంది. పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీకి పరిహారం దక్కుతుంది. మరో జీవిత బీమా పాలసీ తీసుకున్నా తర్వాతే ఒక పాలసీ నుంచి వెదొలగడాన్ని పరిశీలించాలి. -
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు బ్రెగ్జిట్ షాక్ ?
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేసిన బ్రెగ్జిట్ ఉదంతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కూడా భారీ షాక్ ఇవ్వనుంది. సుదీర్ఘ కాలంగా గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న ఏడవ ఆర్థిక కమిషన్ అమలు ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. తొందర్లోనే అమలుకు నోచుకుంటుం దనుకుంటున్న 7వ వేతన సంఘం కమిషన్ సిఫారసుల అమలు మరో 2-3 నెలల జాప్యం కావచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ చెల్లింపులు భారం ప్రభుత్వ ఖజానాపై భారీగా పడనుందనీ, దేశీయ మార్కెట్లలో పెరిగిన అస్థిరత నేపథ్యంలో దీని అమలు ఆలస్యం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఫలితంగా ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిణామాల కారణంగా మన మార్కెట్ల స్థిరీకరణకు మరొక 2-3 నెలలు పట్టవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో చెల్లింపుల జాప్యానికి బలమైన అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనావేశారు. తత్ఫలితంగా వచ్చే ద్వైమాసిక ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష కూడా మరికొంతకాలం వాయిదా పడొచ్చంటున్నారు. అలాగే చెక్కుచెదరకుండా యథాతథంగా ఉంటాయని అంచనా వేస్తున్నవడ్డీ రేట్లలో స్వల్ప పెంపు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. దేశీయ ఈక్విటీ మార్కెట్లు కోలుకొని స్థిరపడేదాకా , అంటే సుమారు మరో మూడు నెలలు ప్రభుత్వం వెయిట్ అండ్ వాచ్ విధానాన్ని అవలంబించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ లో మరింత అస్థిరత పెరిగితే ఆర్థిక పరిస్థితి, రూపాయి మరింత బలహీనతపడుతుందని చెబుతున్నారు. కాగా బ్రెగ్జిట్ నిర్ణయంతో, ప్రపంచ మార్కెట్ల సంక్షోభం, పౌండ్ ధర రికార్డు క్షీణత, ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో దాదాపు లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిన సంగతి తెలిసిందే. -
కేసు గెలిచి, కోట్లు కాపాడుకున్న సౌదీ రాజు!
లండన్: దివంగత సౌదీ రాజు ఫహద్ కుమారుడు అబ్దుల్ అజీజ్ తన తండ్రి రహస్య భార్యకు నష్టపరిహారం చెల్లించే పరిస్థితి నుంచి బయటపడ్డారు. కొన్ని వందల కోట్ల రూపాయలను రాకుమారుడు తండ్రి మరణానంతరం ఆయన భార్యకు చెల్లించాలంటూ గత ఏడాది నవంబర్ లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఫహద్ మరణానంతరం జనన్ హర్బ్ అనే ఆమె సౌదీ రాజు తనను రహస్యంగా వివాహమాడారని కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన జడ్జి ఆమెకు రూ. 154 కోట్లతో పాటు లండన్ లో రెండు ఫ్లాట్లు ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై రాకుమారుడు అబ్దుల్ అజీజ్ పైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. జడ్జి ఆమె పట్ల పక్షపాతం వ్యవహరించారని వేరే జడ్జితో కేసు విచారణ జరిపించాలని కోరారు. విచారణ చేపట్టిన మరో జడ్జి ఆమెకు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పారు. కాగా, బ్రిటీష్ జాతీయురాలైన హర్బ్ 1968లో ఫహద్ ను వివాహమాడినట్లు తెలిపారు. 1982లో రాజైన ఫహద్ 2005లో చనిపోయే ముందు తనను జీవితకాలం ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేస్తానని మాటిచ్చినట్లు చెప్పారు. 2003లో అజీజ్ తనకు రూ. 80 కోట్ల పరిహారంతో పాటు థేమ్స్ నది ఒడ్డున రెండు ఫ్లాట్లు ఇస్తానని వాగ్దానం చేసినట్లు తెలిపారు.