Endowment Policy
-
బీమా పాలసీని వెనక్కి ఇచ్చేస్తే..?
విష్ణు స్వరూప్ (30) పేరిట రెండు జీవిత బీమా ఎండోమెంట్ పాలసీలు ఉన్నాయి. ఆరేళ్ల క్రితం తనకు ఉద్యోగం వచి్చన కొత్తలో ఆ పాలసీలను విష్ణు పేరిట ఆయన తండ్రి ప్రారంభించారు. వీటి కోసం ఏటా రూ.50,000 ప్రీమియంను విష్ణు స్వయంగా చెల్లిస్తున్నారు. ఈ రెండింటి రూపంలో వస్తున్న బీమా రక్షణ రూ.10 లక్షలు. కాల వ్యవధి 20 ఏళ్లు. ఎందుకోగానీ తాను తీసుకున్న బీమా ఉత్పత్తులు తగినంత రక్షణ ఇవ్వడం లేదన్న అభిప్రాయం అతడిలో కలిగింది. దీంతో ఓ ఆరి్థక సలహాదారుడిని సంప్రదించాడు. పాలసీల పూర్తి వివరాలు, విష్ణు ఆదాయం, జీవిత లక్ష్యాలన్నింటినీ సమగ్రంగా విశ్లేíÙంచిన అనంతరం.. వెంటనే సదరు రెండు ఎండోమెంట్ పాలసీలను సరెండ్ చేసేయాలని ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచించారు. నిపుణుడిని సంప్రదిస్తే కానీ, ఆ పాలసీల వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్న విషయం అతడికి బోధపడలేదు. విష్ణు మాదిరే ఎండోమెంట్ పాలసీలకు భారీ ప్రీమియం చెల్లించే వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్కరూ ఒక్కసారి తమ ప్లాన్‌ను సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నిన్న మొన్నటి వరకు జీవిత బీమా అంటే ఎక్కువ మందికి తెలిసింది ఎండోమెంట్ పాలసీల గురించే. టర్మ్ ఇన్సూరెన్స్ ఇటీవలి కాలంలోనే ఆదరణను, ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. ఎండోమెంట్ పాలసీలు గతంలో ప్రజల సహజ పొదుపు మనస్తత్వం కోణం నుంచి అభివృద్ధి చేసినవి. అంతేకానీ, అచ్చమైన బీమా రక్షణ కోసం కావు. పెట్టుబడుల సాధనాలు, రాబడులపై అవగాహన విస్తృతమవుతున్న కొద్దీ, టర్మ్ పాలసీల ప్రాధాన్యం తెలిసి వస్తోంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే.. పాలసీ హోల్డర్ దురదృష్టవశాత్తూ మరణిస్తే కుటుంబానికి మెరుగైన పరిహారం ఇచ్చి ఆదుకునేవి టర్మ్ ప్లాన్లు. కాల వ్యవధి ముగిసే రోజు వరకు జీవించి ఉంటే రూపాయి తిరిగి రాదు. దీనికి భిన్నంగా.. పాలసీ కాల వ్యవధిలో మరణించినా లేక పాలసీ గడువు ముగిసే వరకు జీవించి ఉన్నా.. ఈ రెండు సందర్భాల్లోనూ ఎంతో కొంత ముట్టజెప్పేవి ఎండోమెంట్ ప్లాన్లు. ఇవి తక్కువ బీమా రక్షణ, తక్కువ రాబడితో కూడినవి. బీమా ఏజెంట్లు ఎండోమెంట్ ప్లాన్ల విక్రయానికే ఎక్కువగా మొగ్గు చూపిస్తుంటారు. దీనిపై వారికి లభించే కమీషన్ ఎక్కువగా ఉంటుంది. మొదటి ఏడాది ప్రీమియంలో 10–25 శాతం వరకు వారికి కమీషన్‌గా ముడుతుంది. అంతేకాదు రెండో సంవత్సరం నుంచి పాలసీ ముగిసే వరకు ఏటా ప్రీమియంపై 5–7 శాతం కమీషన్‌గా ఏజెంట్లకు ఆదాయం వస్తూనే ఉంటుంది. టర్మ్ ప్లాన్ల పైనే ఇదే స్థాయిలో కమీషన్ ఉంటుంది. కాకపోతే టర్మ్ పాలసీల ప్రీమియం తక్కువ కనుక కమీషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. దేశ వాసుల్లో చాలా మందికి ఎండోమెంట్ ప్లాన్లే ఉన్నాయి. తెలిసిన ఏజెంట్ బలవంతం పెట్టాడని, స్నేహితులు, బంధువులు సూచించారని చెప్పి వీటిని తీసుకోవడం కనిపిస్తుంది. చెల్లిస్తున్న ప్రీమియానికి మెరుగైన బీమా రక్షణ ఇవ్వని, ప్రీమియం భారంతో కూడిన ఇలాంటి ఎండోమెంట్ ప్లాన్లను వదిలించుకునే మార్గం ఉంది. సరెండర్ చేసేయడమే.. ఎందుకు సరెండర్ చేయాలి..? తాము తీసుకున్న జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్‌లో తగినంత కవరేజీ లేదని, ప్రీమియం ఎక్కువగా ఉందని అనిపిస్తే దాన్ని నిలిపివేయడంలో ఎలాంటి తప్పు లేదు. జీవిత బీమా ప్లాన్ తీసుకునేది ఎందుకు..? తమకు ఏదైనా జరిగితే కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పాలు కాకూడదనే. తమపై ఆధారపడిన వారు, అసాధారణ సందర్భాల్లో కష్టాలు పడకూడదంటే అందుకు తగినంత కవరేజీతో లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉండాల్సిందే. పిల్లల విద్య ఆగిపోకూడదు. వారి రోజువారీ జీవనం, ఇతర వ్యయాలు అన్నింటినీ జీవిత బీమా పరిహారం ఆదుకునే విధంగా ఉండాలి. అందుకే వార్షిక ఆదాయానికి ఎంతలేదన్నా కనీసం పది రెట్ల మేరకు బీమా కవరేజీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. విష్ణు స్వరూప్నే ఉదాహరణగా తీసుకుందాం. అతడు రూ.10 లక్షల కవరేజీ కోసం ఏటా రూ.50వేలు చెల్లిస్తున్నాడు. కానీ, కేవలం రూ.20 వేల వార్షిక ప్రీమియం చెల్లించడం ద్వారా విష్ణు రూ.1.5 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాతో విష్ణు అదే పనిచేశాడు. ఉన్న ఎండోమెంట్ ప్లాన్లను సరెండ్ చేశాడు. రూ.1.5 కోట్ల టర్మ్‌ప్లాన్ తీసుకున్నాడు. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తి రూ.కోటి సమ్ అష్యూరెన్స్‌తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే వార్షిక ప్రీమియం రూ.25,000. ఎండోమెంట్ పాలసీల్లో బీమా రక్షణతోపాటు, ఎంతో కొంత రాబడి ఉంటుందన్నది చాలా మంది అభిప్రాయం. కానీ, ఇందులో వాస్తవం ఏంటన్నది పాలసీదారులకు తప్పకుండా తెలిసి ఉండాలి. ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి 4.5–5.5 శాతం మించి ఉండదు. అరుదైన సందర్భాల్లోనే రాబడి 6 శాతం ఉంటుంది. కానీ ద్రవ్యోల్బణం కూడా దీర్ఘకాల సగటు అదే స్థాయిలో ఉంది. దీంతో నికరంగా వచ్చే రాబడి ఏమీ ఉండదు. ఉదాహరణకు రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్‌తో ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. సమ్ అష్యూర్డ్‌పై ఏటా 5 శాతం సింపుల్ గ్యారంటీడ్ అడిషన్ వస్తుంది. ఈ పాలసీలో మెచ్యూరిటీ కింద రూ.21 లక్షలు వస్తుంది. రాబడి రేటు 6.22 శాతం. ద్రవ్యోల్బణం 6 శాతం (సగటున) మినహాయిస్తే నికర రాబడి 0.22 శాతమే. అదే ఈక్విటీ పథకాల్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేస్తే రాబడి వార్షికంగా 10–12 శాతం లేదా అంతకంటే ఎక్కువే ఉంటుంది. డెట్ సాధనాల్లోనూ 7 శాతం మేర రాబడి వస్తుంది. పాలసీని నిలిపివేస్తే..? ఎండోమెంట్ ప్లాన్ గురించి ఈ వివరాలు తెలుసుకున్న తర్వాత, ఇక వద్దనుకుంటే పాలసీదారుల ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. అప్పటి నుంచి ప్రీమియం చెల్లించకుండా ఉండిపోవడం. లేదంటే పాలసీని సరెండర్ చేయడమే సరైనది. పాలసీలో కవరేజీ, రాబడి ఆకర్షణీయంగా లేదని అసంతృప్తిగా ఉంటే అప్పటి నుంచి ప్రీమియం చెల్లించకుండా ఆగిపోవచ్చు. కాల వ్యవధి తర్వాత ఫండ్ వెనక్కి వస్తుంది. దీన్నే పాలసీ పెయిడప్ అని అంటారు. మెచ్యూరిటీ తర్వాత ఎంత వస్తుందన్నది బీమా సంస్థ చెబుతుంది. అంతేకాదు, జీవిత బీమా కవరేజీ కూడా కొనసాగుతుంది. కాకపోతే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు అనుగుణంగా జీవిత బీమా కవరేజీని తగ్గిస్తారు. ఉదాహరణకు రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 20 ఏళ్ల కాలానికి తీసుకుని, ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లించారని అనుకుందాం. అప్పుడు రూ.10 లక్షలకు బదులు రూ.2.5 లక్షల జీవిత బీమా కవరేజీ కాల వ్యవధి ముగిసే వరకు లభిస్తుంది. పెయిడప్ చేసే నాటికి జమ అయిన గ్యారంటీడ్ అడిషన్స్, బోనస్‌లు కలిపి పెయిడప్ వ్యాల్యూని నిర్ణయిస్తారు. సరెండర్ ఎప్పుడు చేయాలి? బీమా పాలసీల్లో సరెండర్ పెనాల్టీ ఎంతో ఎక్కువగా ఉంటుందని భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ నితిన్ మెహతా తెలిపారు. పాలసీ సరెండర్ చేయడానికి ముందే, ఎదురయ్యే ఆరి్థక ప్రతికూలతలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అందుకుని సరెండర్ చేసే ముందు ఎంత వస్తుందన్నది తెలుసుకోవాలి. ఎండోమెంట్ ప్లాన్‌కు ప్రీమియం ఇక చెల్లించడం కష్టంగా ఉందని భావిస్తే అప్పుడు సరెండర్ చేస్తే ఎంతొస్తుంది? పెయిడప్‌గా మారిస్తే గడువు ముగిసిన తర్వాత ఎంతొస్తుందన్నది విశ్లేíÙంచుకోవాలి. సరెండర్ చేసినా లేక పెయిడప్ చేసినా.. అదే సమయంలో టర్మ్ ప్లాన్ తీసుకోవడం తప్పనిసరి. లేదంటే అసులు లక్ష్యమే దెబ్బతింటుంది. రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 20 ఏళ్ల కాలానికి తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు ఏటా రూ.50,000 చొప్పున ప్రీమియం చెల్లించిన తర్వాత సరెండర్ చేసేయాలని నిర్ణయించారు. దీంతో అప్పటి నుంచి ఏటా రూ.50,000 ప్రీమియం రూపంలో ఆదా అవుతుంది. అప్పుడు ఏటా రూ.20,000 ప్రీమియంపై రూ.కోటి టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. మిగిలిన రూ.30వేలను ఇండెక్స్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. ఇలా చేస్తే ఏటా 12 శాతం సగటు రాబడి అంచనా ఆధారంగా 15 ఏళ్ల తర్వాత రూ.12.50 లక్షలు సమకూరుతుంది. ఐదేళ్ల తర్వాత సరెండర్ చేయడం వల్ల వచి్చన మొత్తాన్ని తీసుకెళ్లి ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అది కూడా ఏటా 12 శాతం చొప్పున 15 ఏళ్లలో వృద్ధి చెందుతుంది. బీమా, పెట్టుబడిని కలిపి చూడకూడదు. అచ్చమైన బీమా రక్షణ ఏర్పాటు చేసుకోవడానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి రాబడి కోసం మేలైన పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. పాలసీ కాల వ్యవధి ముగియకముందే దాన్నుంచి వైదొలగాలని అనుకుంటే, సరెండర్ వేల్యూని వెనక్కి పొందొచ్చు. అప్పటి వరకు ఎన్నేళ్లపాటు ప్రీమియం చెల్లించారు, ఎంత చెల్లించారు, బోనస్, పెయిడప్ వేల్యూ ఆధారంగా సరెండర్ వేల్యూ ఎంతన్నది ఉంటుంది. ఇందుకు సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్ చార్ట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. సరెండర్ ఫ్యాక్టర్ 35 శాతం అనుకుంటే.. రూ.10 లక్షల పాలసీలో రూ.3.5 లక్షలు పాలసీదారునికి దక్కుతుంది. పాలసీ తీసుకుని కాల వ్యవధి పెరుగుతూ వెళుతున్న కొద్దీ, ఈ సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్ 70 శాతం వరకు చేరుతుంది. ‘‘కాల వ్యవధికి ముందే పాలసీని సరెండర్ చేస్తే తీవ్రంగా నష్టపోవాలి. సరెండర్ ఫీజుల రూపంలో అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలో గణనీయమైన మొత్తాన్ని కోల్పోతారు. కొన్ని కేసుల్లో బోనస్ వంటివి కూడా రావు. కనుక పాలసీ నియమ, నిబంధనలను చదివి అర్థం చేసుకోవాలి’’అని ఫైనాన్షియల్ ప్లానింగ్ సంస్థ ‘ఫైనాన్షియల్ స్మార్ట్’ సీఈవో నీతా మెనెజెస్ సూచించారు. సరెండర్ వేల్యూ విషయంలో బీమా సంస్థల మధ్య ఏకరూపత కనిపించదు. కొన్ని బీమా సంస్థలు ప్రత్యేకమైన సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్చార్ట్లను ఉపయోగిస్తున్నాయి. కొన్ని సంస్థల్లో అయితే చాలా దారుణంగా, నామమాత్రంగా సరెండర్ వేల్యూని నిర్ణయిస్తున్నారు. అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం ఆధారంగా సరెండర్ వేల్యూని కొన్ని ఖరారు చేస్తున్నాయి. సరెండర్ చేస్తే ఎంతొస్తుంది? సమ్ అష్యూర్డ్: రూ.10లక్షలు పాలసీ కాల వ్యవధి: 20 ఏళ్లు వార్షిక ప్రీమియం: రూ.50వేలు బోనస్ అడిషన్ ఏటా: రూ.50వేలు సరెండర్ కాల వ్యవధి 5ఏళ్ల 10 ఏళ్ల 15 ఏళ్ల తర్వాత తర్వాత తర్వాత పెయిడప్ వేల్యూ (రూ.లక్షల్లో) 5 10 15 సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్ (శాతంలో) 35 50 70 సరెండర్ వేల్యూ (రూ.లక్షల్లో) 1.75 5 10.50. -
రాబడా.. రక్షణా.. మీ ‘పాలసీ’ ఏంటి?
ఆర్జించే ప్రతీ వ్యక్తికి జీవిత బీమా రక్షణ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఊహించనిది చోటు చేసుకుంటే ఆ కుటుంబం కష్టాల్లోకి వెళ్లకుండా.. బీమా పరిహారం అండగా నిలుస్తుంది. బీమాకు అర్థం ఇదే. మనలో చాలా మంది తమకూ బీమా పాలసీ ఉందిలేనన్న భరోసాతో ఉంటుంటారు. పరిశీలించి చూస్తే కానీ తెలియదు వాస్తవంగా వారికి ఉన్న రక్షణ ఏపాటిదో. అందుకే జీవిత బీమా ప్లాన్లలో అసలు ఎన్నెన్ని రకాలున్నాయి? వాటిల్లో ఉండే ప్రయోజనాలపై అవగాహన అవసరం. ఆ వివరాలు అందించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. రెండే రకాలు.. స్థూలంగా పరిశీలిస్తే.. జీవిత బీమా పాలసీలు రెండు రకాలే. ఒక్కటి అచ్చమైన రక్షణనిచ్చేది (ప్రొటెక్షన్ ప్లాన్/టర్మ్ ప్లాన్). రెండో రకం.. ఎంతో కొంత బీమా రక్షణనిస్తూనే పెట్టుబడులు, రాబడుల ప్రయోజనాలతో కలిసి ఉండేవి. ప్రొటెక్షన్/టర్మ్ ప్లాన్లు అన్నవి పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే పరిహారం చెల్లిస్తాయి. బీమా, పెట్టుబడి ప్రయోజనాలతో ఉండే ఎండోమెంట్/మనీబ్యాక్ ప్లాన్లలో అలా కాదు. పాలసీదారు మరణించిన సందర్భంలో, కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించి ఉన్న సందర్భంలోనూ ప్రయోజనం లభిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అర్థం చేసుకునేందుకు ఎంతో సులువైన ఉత్పత్తి టర్మ్ ఇన్సూరెన్స్. వీటినే ప్రొటెక్షన్ ప్లాన్లు అంటుంటారు. మరణ ప్రమాదానికి రక్షణనిస్తాయి. పాలసీ కాల వ్యవధి ముగిసేలోపు ఎటువంటి కారణంతో అయిన పాలసీదారు మరణానికి గురైతే నామినీకి బీమా సంస్థ పరిహారం చెల్లిస్తుంది. సాధారణంగా ఈ ప్లాన్లు 85 సంవత్సరాల వరకు కవరేజినిస్తాయి. 99 సంవత్సరాల వరకు కవరేజీతో కేవలం కొన్ని బీమా సంస్థలు ప్లాన్లను అందిస్తున్నాయి. పాలసీ కాల వ్యవధిలో మరణించినట్టయితేనే ఈ ప్లాన్లలో పరిహారం చెల్లింపు ఉంటుంది. కాల వ్యవధి తర్వాత ఎటువంటి ప్రయోజనం అందదు. అందుకే ఈ ప్లాన్లపై ప్రీమియం ఆకర్షణీయంగా ఉంటుంది. ఎక్కువ బీమా కవరేజీ తక్కువ ప్రీమియానికే టర్మ్ ప్లాన్లలో లభిస్తుంది. అంతేకాదు మొదటి ఏడాది చెల్లించిన ప్రీమియం పాలసీ కాల వ్యవధి ముగిసేవరకు స్థిరంగా ఉంటుంది. ప్రీమియం పెరగడం ఉండదు. కాకపోతే పాలసీ ప్రీమియంలో భాగంగా ఉండే వస్తు సేవల పన్నును (జీఎస్టీ) ప్రభుత్వం సవరించినట్టయితే ఆ మేరకు ప్రీమియంలో మార్పులు ఉంటాయి. టర్మ్ ప్లాన్లు ఇవి.. ప్రొటెక్షన్ ప్లాన్లలో మళ్లీ వివిధ రకాలు ఏంటి? అని సందేహపడుతున్నారా.. వివిధ వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారిని ఆకర్షించేందుకు బీమా సంస్థలు ప్లాన్లలో సదుపాయాలను జోడిస్తుంటాయి. ► రెగ్యులర్ ప్లాన్: ఇది అచ్చమైన టర్మ్ ప్లాన్. 30 ఏళ్ల వ్యక్తి తనకు 70 ఏళ్లు వచ్చే వరకు అంటే 40 ఏళ్ల కాలానికి రూ.కోటి బీమా రక్షణను తీసుకుంటే వార్షిక ప్రీమియం సుమారు రూ.11,210 చెల్లిస్తే చాలు. వివిధ బీమా సంస్థల మధ్య ఈ ప్రీమియంలో వ్యత్యాసం ఉంటుంది. అంతేకాదు, పాలసీదారుల జీవనశైలి, ఆరోగ్య సమస్యలు కూడా ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి. ► రిటర్న్ ఆఫ్ ప్రీమియం: టర్మ్ ప్లాన్లే కానీ, పాలసీ కాలవ్యవధి ముగిసిన తర్వాత అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తం వెనక్కి వస్తుంది. జీవించి ఉంటే రూపాయి కూడా వెనక్కి రాని పాలసీలు ఎందుకు? అని భావించే వారికోసం రూపొందించిన పాలసీలు ఇవి. అందుకే ప్రీమియం వెనక్కి రాని టర్మ్ప్లాన్లతో పోలిస్తే.. వెనక్కి వచ్చే ప్లాన్ల ప్రీమియం 50–100 శాతం అధికంగా ఉంటుంది. ఇలా ఈ అదనపు ప్రీమియాన్ని బీమా సంస్థలు తీసుకెళ్లి పెట్టుబడులుగా పెడతాయి. అలా ప్రీమియంను వెనక్కిచ్చేస్తాయి. ఈ ప్లాన్‌ను 30 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల కాలానికి తీసుకుంటే వార్షిక ప్రీమియం రూ.18,000 స్థాయిలో ఉంటుంది. ► పరిహారం చెల్లింపుల్లో ఆప్షన్లు: టర్మ్ ప్లాన్లలో మరణ పరిహారాన్ని చెల్లించే విషయంలో పలు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో పరిహారాన్ని ఒకేసారి చెల్లించేయకుండా.. ముందు ఎంపిక చేసుకున్న మొత్తాన్ని చెల్లించి.. మిగిలిన భాగాన్ని ప్రతీ నెలా ఇంత చొప్పున కొన్నేళ్ల పాటు చెల్లించే విధంగా ఉంటుంది. ఉదాహరణకు రూ.50లక్షల ప్లాన్‌లో.. పాలసీదారు మరణించినట్టయితే బీమా సంస్థ రూ.10–20 లక్షలను ఒకే విడతగా ఇస్తుంది. మిగిలిన రూ.40–30 లక్షలను 10 నుంచి 20 ఏళ్ల కాలానికి ప్రతీ నెలా చెల్లించే విధంగా పాలసీల నిర్మాణం ఉంటుంది. దీనివల్ల బాధిత కుటుంబ నెలవారీ అవసరాలకు ఆదాయం ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది. ఒకే విడత భారీ పరిహారాన్ని అందుకుంటే దాన్ని తీసుకెళ్లి పెట్టుబడిగా పెట్టుకుని, ప్రతీ నెలా ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. అటువంటి వారు ఈ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ► సింగిల్ ప్రీమియం: కొందరు ఏటా ప్రీమియం చెల్లించేందుకు సౌకర్యంగా ఉండకపోవచ్చు. ఇటువంటి వారు ఒకే విడతగా ప్రీమియం చెల్లించేందుకు వీలు కల్పించేవే సింగిల్ ప్రీమియం ప్లాన్లు. ఇందులో ఏటా రెన్యువల్ చేసుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. కాకపోతే ఒకే విడత కనుక ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లాన్లు 85 ఏళ్ల వరకు తీసుకునేందుకు అవకాశం ఉంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి రూ.కోటి కవరేజీని ఎంపిక చేసుకుంటే సింగిల్ ప్రీమియం కింద రూ.1.8 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ► కవరేజీ పెరుగుతూ.. తరుగుతూ: ద్రవ్యోల్బణం, బాధ్యతలకు అనుగుణంగా టర్మ్ ప్లాన్‌లో వివిధ దశల్లో కవరేజీ పెరుగుతూ వెళ్లే ఆప్షన్ కూడా ఉంటుంది. అదే విధంగా కవరేజీ తగ్గుతూ వెళ్లే ఆప్షన్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. కవరేజీ పెరుగుతూ వెళ్లే ఆప్షన్ ఎంపిక చేసుకుంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. కానీ, కవరేజీ పెరిగిన ప్రతీసారి ప్రీమియం పెరగడం ఉండదు. వివిధ దశల్లో పెరిగే బాధ్యతలకు అనుగుణంగా పెరిగే కవరేజీ ఉపయోగకరంగా ఉంటుంది. ► హోల్‌లైఫ్: హోల్‌లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు 99–100 ఏళ్ల కాల వ్యవధితో ఉంటాయి. పాలసీదారు 99–100 ఏళ్లలోపు మరణించినట్టయితే పరిహారాన్ని నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు. నూరేళ్లు జీవించి ఉంటే.. అప్పుడు పాలసీదారుకు ఏక మొత్తంలో ప్రయోజనాన్ని బీమా సంస్థ చెల్లించేస్తుంది. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తికి హోల్‌లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో రూ.కోటి కవరేజీకి వార్షిక ప్రీమియం సుమారుగా రూ.15,000 వరకు ఉంటుంది. తమ తర్వాత పిల్లలకు ఎంతో కొంత మొత్తం నగదు ప్రయోజనం లభించాలన్న అభిలాష ఉంటే తప్ప.. వీటి అవసరం పెద్దగా ఉండదు. పిల్లలు జీవితంలో స్థిరపడి, తమ రుణ బాధ్యతలు పూర్తిగా ముగిసే కాలం వరకు జీవిత బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ► లిమిటెడ్ ప్రీమియం పీరియడ్: పాలసీ కాల వ్యవధి ఎంత కాలం ఉన్నా కానీ, కొన్నేళ్లే ప్రీమియం చెల్లించే ఆప్షన్లు కూడా ఉంటున్నాయి. 5, 10, 15, 20 ఏళ్ల పాటే ప్రీమియం చెల్లించొచ్చు. లేదంటే 60 ఏళ్ల కాలవ్యవధి వరకు ప్రీమియం చెల్లించే విధంగా ప్లాన్‌ను తీసుకోవచ్చు. ► ఎవరికి: మీపై ఆధారపడిన వారు ఉంటే, రుణ బాధ్యతలు ఉన్నట్టయితే టర్మ్ప్లాన్ను తగినంత కవరేజీతో తీసుకోవాలి. వార్షికాదాయానికి 10–20 రెట్ల వరకు కవరేజీ ఉండాలన్నది ఆర్థిక సలహాదారుల సూచన. రుణ బాధ్యతలు దీనికి అదనం. ఒకవేళ రిటైర్ అయిన వారు, తమపై ఎవరూ ఆధారపడి లేని వారికి జీవిత బీమా అవసరం ఉండదు. సంప్రదాయ బీమా ప్లాన్లు ఇవి జీవిత బీమా, పెట్టుబడి కలగలసిన ప్లాన్లు. చెల్లించే ప్రీమియం పరంగా చూస్తే బీమా రక్షణ స్వల్పంగానే ఉంటుంది. ఎందుకంటే రాబడులను ఇవ్వాలి కనుక తీసుకునే ప్రీమియంలో కొంత కవరేజీకి మినహాయించి మిగిలిన మొత్తాన్ని పెట్టుబడులకు బీమా కంపెనీలు మళ్లిస్తాయి. ► ఎండోమెంట్ ప్లాన్: పాలసీదారు మరణించిన సందర్భాల్లో నామినీకి మరణ పరిహారం, బోనస్‌తోపాటు చెల్లింపులు ఉంటాయి. ఏటా కొంత చొప్పున బీమా సంస్థలు సమ్ అష్యూర్డ్‌పై బోనస్‌ను ప్రకటిస్తుంటాయి. పెట్టుబడిపై రాబడుల ఆధారంగా ఈ బోనస్ ఎంతన్నది ఉంటుంది. దీంతో పాలసీదారు మరణించేనాటికి జమ అయిన బోనస్‌తోపాటు బీమా మొత్తాన్ని చెల్లించే విధంగా ఒప్పందం ఉంటుంది. పాలసీదారు జీవించి ఉంటే కాల వ్యవధి ముగిసిన తర్వాత బోనస్‌తోపాటు, ముందుగా ఇచ్చిన హామీ మేరకు ఇతర ప్రయోజనాలను కంపెనీ చెల్లిస్తుంది. కనుక మరణించినా, జీవించినా కానీ ఈ ప్లాన్లలో ప్రయోజనం అందుతుంది. ఎక్కువ మందిని ఆకర్షించేది ఇదే. అందుకే, సరిపడా కవరేజీ తీసుకుంటున్నామా? అన్నది ప్రశ్నించుకోకుండా ఎక్కువ మంది ఎండోమెంట్ ప్లాన్ల వైపు మొగ్గు చూపుతుంటారు. రూ.10లక్షల కవరేజీతో ఎండోమెంట్ ప్లాన్ తీసుకోవాలంటే.. 30 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల టర్మ్ ప్లాన్ కోసం ఏటా ప్రీమియం రూ.50,000–60,000వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 20 ఏళ్ల కాలవ్యవధికి పదేళ్లపాటే ప్రీమియం చెల్లించే ఆప్షన్లో వార్షిక ప్రీమియం రూ.లక్ష వరకు ఉంటుంది. ► మనీబ్యాక్ ప్లాన్లు: పేరులోనే ఉన్నట్టు పాలసీ కాల వ్యవధిలోపు నిర్ణీత కాలానికోసారి చొప్పున నగదు ప్రయోజనాన్ని బీమా సంస్థ చెల్లింపులు చేస్తుంది. బోనస్‌ను పాలసీదారు మరణించిన సందర్భంలో లేదా కాలవ్యవధి చివర్లో చెల్లిస్తుంది. ఎండోమెంట్ ప్లాన్‌లో జీవించి ఉంటే చివర్లో కొంచెం పెద్ద మొత్తాన్నే అందుకోవచ్చు. మనీబ్యాక్ ప్లాన్‌లో ఐదేళ్లకు ఒకసారి ఎంతో కొంత బీమా సంస్థ చెల్లిస్తుంటుంది కనుక చివర్లో లభించేది కొద్ది మొత్తమే అని అర్థం చేసుకోవాలి. పిల్లల విద్యావసరాల కోసం మధ్య మధ్యలో కొంత చొప్పున నగదు ప్రయోజనం రావాలని కోరుకునే వారు మనీబ్యాక్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. టర్మ్ ప్లాన్లతో పోలిస్తే వీటి ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది. 30 ఏళ్ల వ్యక్తి రూ.10లక్షల కవరేజీని 20 ఏళ్ల కాలానికి ఎంపిక చేసుకుంటే వార్షికంగా రూ.1.20లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. ► ఎవరికి: మెరుగైన పెట్టుబడుల ప్రణాళికను అమలు చేయలేని వారు, ఇతర పెట్టుబడి సాధనాలను అర్థం చేసుకోలేని వారు వీటిని ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ రాబడి, రక్షణనిచ్చే ఈ ప్లాన్లు బీమా రక్షణ కోణం నుంచి చూస్తే అనుకూలమైనవి కావు. పన్ను ఆదా పరంగా చూసినా అంత ఆకర్షణీయమైన సాధనం కాదని తెలుసుకోవాలి. ► యులిప్‌లు: బీమా, పెట్టుబడి ఆధారిత ప్లాన్లే ఇవి కూడా. కాకపోతే ఈక్విటీ పెట్టుబడులకు యులిప్‌లు అవకాశం కల్పిస్తాయి. సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లు అన్నవి కేవలం డెట్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి. యులిప్‌లలో ఈక్విటీ, డెట్ రెండింటినీ ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీకి అవకాశం ఉంటుంది కనుక దీర్ఘకాలంలో ఎండోమెంట్ ప్లాన్లతో పోలిస్తే కాస్త మెరుగైన రాబడులకు యులిప్‌లలో అవకాశం ఉంటుంది. యులిప్‌లలో కనీసం ఐదేళ్ల వరకు ప్రీమియం చెల్లించి.. ఆ తర్వాత ఆపేసినా నష్టం ఉండదు. కాల వ్యవధి వరకు బీమా కవరేజీ కొనసాగుతుంది. ఇందులో కూడా ప్రీమియం చాలా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ప్రీమియంలో ఎక్కువ భాగం పెట్టుబడులకు వెళుతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి యులిప్‌ను ఎంపిక చేసుకుంటే రూ.10 లక్షల కవరేజీ కోసం వార్షికంగా రూ.లక్ష ప్రీమియంగా చెల్లించుకోవాలి. మధ్యలో విరమించుకోకుండా పాలసీ కాలవ్యవధి వరకు కొనసాగాలని గట్టిగా నిర్ణయించుకుంటే ఎండోమెంట్ ప్లాన్ బదులు యులిప్‌లను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది. యులిప్‌లలో పూర్తిగా ఈక్విటీ పెట్టుబడుల ఆప్షన్‌ను లేదంటే ఈక్విటీ, డెట్ కలయికతో ప్లాన్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. అంతేకాదు ఈక్విటీ మార్కెట్లు బాగా పెరిగిపోయాయని భావించినట్టయితే ఈక్విటీ నుంచి డెట్‌కు పెట్టుబడులను మళ్లించుకోవచ్చు. అదే విధంగా ఈక్విటీ మార్కెట్లు పడిపోయిన సందర్భాల్లో డెట్ భాగం నుంచి పూర్తిగా ఈక్విటీకి మళ్లిపోయే విధంగా ఇందులో స్వేచ్ఛ ఉంటుంది. మొత్తానికి తమకు ఏదైనా వాటిల్లితే తమ కుటుంబానికి ఎంత అవసరమో ఆ మేరకు బీమా కవరేజీ తీసుకోవడం ముఖ్యం. ఇందుకోసం టర్మ్ ప్లాన్‌ను తీసుకుని, వెసులుబాటు మేరకు పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్స్, నేరుగా స్టాక్స్, ఇతర సాధనాలను పరిశీలించొచ్చు. ఈ దశలో అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. -
రుణాలకు దారులెన్నో..
కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు తారుమారవుతున్నాయి. వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితులతోపాటు కొందరి వేతనాలు తగ్గిపోగా.. ఉపాధి కోల్పోయిన వారూ ఉన్నారు. సందర్భం ఏదైనా.. నిధుల అవసరం ఏర్పడితే గట్టెక్కేందుకు రుణం తీసుకోవడం ఒక మార్గం. డబ్బులతో అవసరం ఏర్పడినప్పుడు అప్పటికే చేసిన పెట్టుబడులను వెనక్కి తీసేసుకోవడం కూడా ఒక మార్గమే. అయితే, ఇలా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి బదులు వాటిపై రుణాలు తీసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. వీలు చిక్కిన వెంటనే రుణం తీర్చివేయడం వల్ల తమ పెట్టుబడులను య«థావిధిగా కొనసాగించుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, జాతీయ పొదుపు పత్రాలు (ఎన్ఎస్సీ), పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, జీవిత బీమా పాలసీలు (ఎండోమెంట్) వీటిల్లో ఏ రూపంలో పెట్టుబడులు కలిగినా.. వాటిని రద్దు చేసుకోకుండా తనఖాపై రుణం పొందడానికి మార్గం ఉంది. పైగా వ్యక్తిగత రుణాలు, బంగారంపై రుణాలతో పోలిస్తే వడ్డీ రేటు తక్కువగా ఉండడం సానుకూలత. అంతేకాదు వీటిపై రుణాల జారీ సులభంగాను ఉంటుంది. తక్కువ రేటుకు లభించే ఈ సులభమైన రుణ మార్గాలపై సమాచారం అందించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. ఫిక్స్డ్ డిపాజిట్లు దాదాపు అన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ రూపంలో రుణాన్ని పొందొచ్చు. ఉదాహరణకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులు ఎఫ్డీపై రుణాలను పూర్తిగా ఆన్‌లైన్‌లోనూ ఆఫర్ చేస్తున్నాయి. డిపాజిట్ విలువలో గరిష్టంగా 90 శాతాన్ని రుణంగా తీసుకోవచ్చు. రుణానికి అర్హతలనేవి బ్యాంకుల మధ్య కొంచెం వేర్వేరుగా ఉండొచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అయితే కనీసం రూ.25,000 డిపాజిట్‌పైనే రుణాన్ని అందిస్తోంది. కనీస రుణ కాల వ్యవధి ఆరు నెలలు. రుణం జారీకి పట్టే సమయం ఒక రోజు. యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ కూడా కనీస రుణ అర్హతగా రూ.25,000ను అమలు చేస్తున్నాయి. ఎఫ్డీలపై రుణాన్ని ఓడీగా అందిస్తున్నాయి. మీ ఎఫ్డీపై వడ్డీ రేటుకు 1 నుంచి 3 శాతం అదనపు రేటును బ్యాంకులు సాధారణంగా వసూలు చేస్తుంటాయి. అదే సమయంలో మీ డిపాజిట్‌పై వడ్డీ రాబడి యథావిధిగా కొనసాగుతుంది. ఎస్బీఐ అయితే ఎఫ్డీ రేటుపై ఒక శాతాన్ని అదనంగా రుణ రేటు కింద తీసుకుంటోంది. యోనో యాప్ నుంచి రుణాన్ని తీసుకుంటే మరో పావు శాతాన్ని తగ్గింపు ఇస్తోంది. యాక్సిస్ బ్యాంకు టర్మ్ డిపాజిట్ రేటుపై 2 శాతం అదనంగా వసూలు చేస్తోంది. ఎఫ్డీపై రుణాలకు చాలా బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజును తీసుకోవడం లేదు. రుణాన్ని ముందస్తుగా తీర్చేసిన సందర్భాల్లోనూ ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. గడువులోపు రుణం చెల్లించకపోయినట్టయితే డిపాజిట్ మొత్తాన్ని బ్యాంకులు సర్దుబాటు చేసుకుంటాయి. సెక్యూరిటీలు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు సెక్యూరిటీల కిందకే వస్తాయి. వీటిపై చాలా బ్యాంకులు రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ఎటువంటి సెక్యూరిటీలపై రుణాలను అందించేదీ ఆయా బ్యాంకుల పోర్టళ్ల నుంచి తెలుసుకోవచ్చు. వీటిపై రుణాలు కూడా ఓడీ రూపంలోనే లభిస్తాయి. స్టాక్స్ అయితే మార్కెట్ విలువలో 50 శాతం నుంచి 60 శాతం వరకు గరిష్టంగా రుణాలను బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. గరిష్ట రుణ పరిమితి రూ.20 లక్షలు. ఉదాహరణకు రూ.కోటి విలువ చేసే షేర్లు ఉన్నా గరిష్టంగా అందుకునే రుణం రూ.20 లక్షలుగానే ఉంటుంది. కనీస రుణ పరిమితి అనేది బ్యాంకుల మధ్య మారిపోతుంది. ఎస్బీఐ అయితే కనీస రుణ పరిమితిగా రూ.50వేలను అమలు చేస్తోంది. అంటే ఎస్బీఐలో సెక్యూరిటీలపై రుణం తీసుకోవాలనుకునే వారు కనీసం రూ.లక్ష విలువ చేసే పెట్టుబడులను కలిగి ఉండాలి. అదే హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు అయితే రూ.లక్షను కనీస రుణంగా సెక్యూరిటీలపై ఆఫర్ చేస్తున్నాయి. కనుక వీటిల్లో రుణానికి రూ.2లక్షల విలువ చేసే సెక్యూరిటీలను కలిగి ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో డెట్, హైబ్రిడ్ ఫండ్స్‌తోపాటు ఈక్విటీ యూనిట్లపైనా రుణాన్ని పొందే అవకాశం ఉంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై చాలా బ్యాంకులు నికర విలువలో 50 శాతాన్నే రుణంగా ఆఫర్ చేస్తున్నాయని గమనించాలి. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే పెట్టుబడుల విలువపై గరిష్టంగా 80 శాతం వరకు రుణంగా తీసుకోవచ్చు. షేర్లు అయినా, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు అయినా వాటి విలువ ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులు ఆధారంగా మార్పులకు లోనవుతుంటుంది. షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల విలువను రోజువారీ లేదా వారానికోసారి బ్యాంకులు మదింపు చేస్తుంటాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకు అయితే ప్రతీ శుక్రవారం ఇలా విలువను మదింపు చేస్తుంటుంది. ఒకవేళ షేర్లు లేదా ఫండ్స్ యూనిట్ల విలువ గణనీయంగా పడిపోతే ఆ వ్యత్యాసాన్ని తిరిగి భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు అదనపు చెల్లింపులు చేయాలని బ్యాంకులు రుణ గ్రహీతలను కోరతాయి. లేదా ఆ మేరకు అదనపు షేర్లు లేదా పెట్టుబడులను హామీగా ఉంచినా సరిపోతుంది. అలాగే, పెట్టుబడుల విలువ పెరిగిన సందర్భాల్లో అదనపు రుణానికి అర్హత లభిస్తుంది. రేట్లు, చార్జీలు..: సెక్యూరిటీలపై ఇచ్చే రుణాలకు బ్యాంకులు 7–18 శాతం మధ్య వడ్డీ రేటును అమలు చేస్తున్నాయి. ఎస్బీఐ 9.75 శాతం వార్షిక రేటును అమలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు 8.4–10.6 శాతం మధ్య రేటును వసూలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.3,500ను చార్జ్ చేస్తోంది. దీనికి జీఎస్టీ చార్జీలు అదనం. రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన కాల వ్యవధి 12–36 నెలలుగా ఉంటుంది. పీపీఎఫ్, ఎన్ఎస్సీ, కేవీపీ చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్), జాతీయ పొదుపు పత్రం (ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)లపై బ్యాంకులు రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. పీపీఎఫ్‌పై రుణం కోరుకుంటే ఖాతాలోని బ్యాలెన్స్‌పై గరిష్టంగా 25 శాతానికే పరిమితం అవుతుంది. అదే ఎన్ఎస్సీ, కేవీపీలపై గరిష్టంగా 80–90 శాతం వరకు రుణాన్ని పొందొచ్చు. బ్యాంకు ఆఫ్ బరోడా (బీవోబీ) ఎన్ఎస్సీ, కేవీపీ ముఖ విలువపై 80–85 శాతం వరకు రుణంగా ఇస్తోంది. ఎన్ఎస్సీ విలువలో గరిష్టంగా 75 శాతాన్ని రుణంగా ఇండియన్ బ్యాంకు ఆఫర్ చేస్తోంది. పీపీఎఫ్‌పై రుణానికి వసూలు చేసే వడ్డీ రేటు వార్షికంగా ఒక శాతంగా ఉంటుంది. అయితే తీసుకున్న రుణం మేరకు పీపీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్‌పై వడ్డీని బ్యాంకులు ఆఫర్ చేయవన్న విషయాన్ని నిపుణులు గుర్తు చేన్నారు. రుణం తీర్చివేసిన అనంతరమే ఆ మొత్తంపై తిరిగి వడ్డీని బ్యాంకులు ఆఫర్ చేస్తాయి. ఒకవేళ పీపీఎఫ్‌పై తీసుకున్న రుణాన్ని 36 నెలల్లోపే తీర్చివేయలేకపోతే 6 శాతం వార్షిక వడ్డీ రేటును చెల్లించాల్సి వస్తుంది. ఎన్ఎస్సీ, కేవీపీలపై రుణాలకు వసూలు చేసే వడ్డీ రేటు బ్యాంకుల మధ్య మారిపోతుంది. ఉదాహరణకు ఎస్బీఐ అయితే వీటిపై రుణాలకు 11.9 శాతం వార్షిక వడ్డీ రేటును అమలు చేస్తోంది. జీవిత బీమా పాలసీలు సంప్రదాయ బీమా పాలసీ (ఎండోమెంట్, మనీబ్యాక్, హోల్‌లైఫ్)లపైనా రుణాలను తీసుకునే అవకాశం ఉంది. మీ వద్దనున్న బీమా పాలసీలపై రుణాలకు అర్హత ఉన్నదా, లేదా అన్న విషయం పాలసీ డాక్యుమెంట్‌ను చూసి తెలుసుకోవచ్చు. నిధుల అవసరం ఏర్పడితే అప్పుడు బీమా పాలసీలపై రుణాన్ని పరిశీలించొచ్చు. పాలసీ సరెండర్ వ్యాల్యూ (స్వాధీనత విలువ) ఆధారంగా మంజూరయ్యే రుణం ఆధారపడి ఉంటుంది. సరెండర్ వ్యాల్యూలో 80 శాతం వరకు రుణంగా పొందొచ్చు. సరెండర్ వ్యాల్యూ ఉంటే ల్యాప్స్ అయిన పాలసీపైనా రుణాన్ని తీసుకోవచ్చు. బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్, పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థలు రుణాలపై 9 శాతం రేటును వసూలు చేస్తున్నాయి. అదే బ్యాంకులు అయితే 9.25–13 శాతం మధ్య వడ్డీ రేటును అమలు చేస్తున్నాయి. బ్యాంకులతో పోలిస్తే బీమా కంపెనీలే తక్కువ రేటును ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా పాలసీ గడువు లోపు ఈ రుణాలను తీర్చే వెసులుబాటు ఉంటుంది. ఎంపిక ఎలా..? ఒకటికి మించిన సాధనాల్లో పెట్టుబడులు చేసిన వారికి.. నిధుల అవసరం ఏర్పడినప్పుడు వేటిపై రుణం తీసుకోవాలన్న సందేహం తలెత్తవచ్చు. కావాల్సిన రుణం, వడ్డీ రేట్లు, ఇతర చార్జీలు ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లను ముందుగా పరిశీలించొచ్చు. ఎందుకంటే ఎఫ్డీ విలువలో 80–90 శాతం వరకు రుణంగా పొందే వీలుంది. పైగా ఎఫ్డీ రేటుపై 1–3 శాతం మేరే అధికంగా రుణ రేటును బ్యాంకులు వసూలు చేస్తాయి. కనుక రుణ రేటు 10 శాతం లోపే ఉంటుంది. పైగా ఎఫ్డీపై రుణానికి బ్యాంకులు ఇతరత్రా చార్జీలు తీసుకోవడం లేదు. ఆ తర్వాత ఎన్ఎస్సీ లేదా సంప్రదాయ జీవిత బీమా పాలసీలపై రుణాలను పరిశీలించొచ్చు. ఎందుకంటే వాటి విలువలో 80–85 శాతం వరకు రుణంగా లభిస్తుంది. వడ్డీ రేటు ఎఫ్డీలతో పోలిస్తే కాస్త అధికంగా.. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే తక్కువగాను ఉంటుంది. సెక్యూరిటీలపై రుణం అన్నది చివరి ఎంపికగా ఉండాలి. ఎందుకంటే రుణం కోసం హామీగా ఉంచే సెక్యూరిటీల విలువ ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఆటుపోట్లకు గురవుతుంటుంది. -
చిన్నారి బీమా...ధీమానిస్తుందా?
పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నవి చైల్డ్ ప్లాన్లు. అయితే, వీటి గురించి పూర్తిగా తెలిసినది అతి తక్కువ మందికే. బీమా ఏజెంట్లు చైల్డ్ ప్లాన్ల గురించి ఆకర్షణీయమైన అంశాలు... ఆకర్షణీయ రాబడుల గణాంకాలను చూపించినప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి ఏర్పడవచ్చు. అంతేకాదు, కొందరు వెంటనే ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రారంభిస్తారు. ‘దిగితేకానీ లోతు ఎంతో తెలియదు’ అన్న చందంగా ఈ ప్లాన్లను అభివర్ణించాల్సి ఉంటుంది. ‘నీ ముక్కు ఏది?’ అని ప్రశ్నిస్తే తలచుట్టూ వేలిని తిప్పి చూపించినట్టుగా చైల్డ్ ప్లాన్లను పేర్కొనక తప్పదు. ప్రీమియం భారం... చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, ఇన్వెస్ట్‌మెంట్‌తో కలసి ఉంటాయి. వీటిని ఎండోమెంట్ పాలసీలుగానే చూడాల్సి ఉంటుంది. వీటిల్లో పాలసీదారులకు ఎంతొస్తుందన్నది పక్కన పెడితే.. పాలసీ చేయించిన ఏజెంట్‌కు మాత్రం మంచి కమీషన్ ముడుతుంది. ముఖ్యంగా ఈ పాలసీల్లో ఇన్వెస్ట్ చేసే వారిని ప్రధానంగా ఆకర్షించే అంశం ఒకటుంది. పాలసీదారుడు దురదృష్టవశాత్తూ మరణిస్తే.. ఆ తర్వాత కూడా ఈ పాలసీ కొనసాగుతుంది. కాకపోతే ఆ తర్వాత వార్షిక ప్రీమియంలను కట్టే బాధ్యత పాలసీదారుడి కుటుంబంపై పడదు. పాలసీదారుడి తరఫున బీమా కంపెనీయే పాలసీ గడువు తీరే వరకు వార్షిక ప్రీమియంను జమ చేస్తూ మెచ్యూరిటీ తర్వాత అసలు, రాబడులను కలిపి చెల్లిస్తుంది. చూడ్డానికి బాగానే ఉంది కానీ.. ఈ సదుపాయం కోసం పాలసీదారుడు భారీ ప్రీమియంను చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ పాలసీ గడువు తీరే వరకు పాలసీదారుడు జీవించి ఉంటే చివర్లో వచ్చే రాబడులు చాలా తక్కువ. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పూడ్చుకునేందుకు సరిపోతాయో లేదో కూడా అనుమానమే. పాలసీల్లో చేరాలని కోరే బీమా ఏజెంట్లు ఈ చైల్డ్ ప్లాన్లలో ఉండే వివిధ చార్జీల గురించి వివరంగా చెప్పడం అరుదే. ఎండోమెంట్ ప్లాన్ బీమా ఏజెంట్లు మార్కెటింగ్ చేసే చిన్నారి పథకాల్లో ఎక్కువగా ఎండోమెంట్ ప్లాన్లే ఉంటున్నాయి. ఇవి పొదుపు, బీమా కలసిన ప్లాన్లు. బీమా ప్లాన్లు కావడంతో పెట్టుబడులకు సంబంధించిన వివరాల్లో పారదర్శకత చాలా తక్కువ. పెట్టుబడుల వివరాలను కంపెనీలు వెల్లడించవు. సాధారణంగా డెట్ సాధనాల్లోనే బీమా సంస్థలు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. డెట్ సాధనాల్లో రాబడులు 7–9 శాతం మించవని తెలిసిందే. బీమా రిస్క్ చార్జీలను కంపెనీలు మినహాయించుకుంటాయి. దీంతో చెల్లించే ప్రీమియం అంతా పెట్టుబడులకు వెళ్లదు. ఫలితంగా దీర్ఘకాలానికి సగటు రాబడులు ఈ ప్లాన్లలో 4–5 శాతం వరకే ఉంటాయి. ఒకవేళ పిల్లల పేరిట పాలసీ తీసుకున్న పేరెంట్ (తల్లి లేదా తండ్రి)... పాలసీ ఆరంభమైన తొలినాళ్లలో మరణిస్తే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (రాబడి రేటు) కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. స్థూల రాబడి రేటును 8 శాతం అంచనాగా చూపించినప్పటికీ.. నికర రాబడులు 5 శాతం మించవు. పార్టిసిపేటింగ్ ప్లాన్ల (బీమా లాభాల నుంచి వాటా లభించేవి)లో రాబడి రేటు దీనికి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే ఏటా బోనస్ చెల్లిస్తాయి కనుక. అయితే, ఈ బోనస్‌ను ఏటా ప్రకటించాలన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత ఐదేళ్లలోపు తప్పుకుంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తంలో చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే బీమా సంస్థలు వివిధ చార్జీలను మినహాయించుకుని మిగిలినది చెల్లిస్తాయి. కనుక ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. చిన్నారుల భవిష్యత్తు లక్ష్యాలకు వారు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడం దీని కంటే మంచి ఆప్షన్ అవుతుంది. డెట్ సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులే మెరుగ్గా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, చిన్నారుల ఉన్నత విద్య, వివాహం ఇతర లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయకుండా భిన్న సాధనాల మధ్య (పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన) మధ్య వర్గీకరించుకోవడం వైవిధ్యంతో కూడుకున్న ఆప్షన్ అవుతుంది. చైల్డ్ యులిప్‌లు చిన్నారుల పేరుతో ఆఫర్ చేసే యులిప్ ప్లాన్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఇవి కూడా బీమా, పెట్టుబడులు కలగలసిన సాధనాలు. ఇవి ఈక్విటీ మార్కెట్‌తో ముడిపడిన సాధనాలు. బీమా, ఇతర ఖర్చులు పోను చెల్లించిన ప్రీమియంలో మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో బీమా కంపెనీలు ఇన్వెస్ట్ చేసి, వచ్చిన రాబడులను పాలసీదారులకు పంచుతుంటాయి. ఈ ప్లాన్లలో ఈక్విటీ లేదా డెట్.. ఈక్విటీ, డెట్ కలిసిన ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈక్విటీ ఆప్షన్‌తో కూడిన యులిప్ ప్లాన్లలో రాబడులు ఎండోమెంట్ ప్లాన్లతో పోల్చుకుంటే కాస్త నయమే. ఈక్విటీ ఆప్షన్‌తో కూడిన ప్లాన్లలో దీర్ఘకాలంలో సగటున 7–8 శాతం రాబడులను ఆశించొచ్చు. స్థూల, నికర రాబడుల మధ్య వ్యత్యాసం కూడా 2 శాతాన్ని మించి ఉండదు. అయితే, యులిప్ ప్లాన్లలో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇందులోనూ బీమా రక్షణ ఉంటుంది. చిన్నారుల కోసం యులిప్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి ఉన్నట్టయితే.. మ్యాక్స్ లైఫ్ శిక్షా ప్లస్ సూపర్ ప్లాన్‌ను పరిశీలించొచ్చు. ఇది నాన్ పార్టిసిపేట్ యులిప్ ప్లాన్. ఇందులో ఆరు రకాల ఫండ్లలో ఒకదాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంది. డైనమిక్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఎంచుకున్నట్టయితే.. పాలసీ ఆరంభంలో ప్రీమియంను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. పాలసీ కాల వ్యవధి గడుస్తున్న డెట్‌తో కూడిన కన్జర్వేటివ్ ఫండ్‌కు పెట్టుబడులను మళ్లిస్తుంది. అలాగే, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ యంగ్‌స్టార్ సూపర్ ప్రీమియం కూడా చైల్డ్ యులిప్ ప్లానే. ఇందులోనూ నాలుగు రకాల ఫండ్ ఆప్షన్లు ఉన్నాయి. చిన్నారుల పేరిట బీమా.. చిన్నారులకు బీమా రక్షణ కల్పించే ప్లాన్లు కూడా ఉన్నాయి. పిల్లలకు ఏదైనా జరిగితే పరిహారాన్ని తల్లిదండ్రులకు చెల్లించడం జరుగుతుంది. ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ ఇటువంటిదే. బీమా రక్షణ అనేది కుటుంబానికి ఆధారమైన వ్యక్తి కోసం ఉద్దేశించినది. అతనికి ప్రాణాపాయం వాటిల్లితే అతని పిల్లల చదువులకు ఇబ్బంది రాకూడదు. బీమా ఉంటే వచ్చే పరిహారం ఇందుకు ఉపయోగపడుతుంది. పిల్లలు ఎవరిమీద ఆధారపడ్డారో వారికి బీమా ఉండాలి. అంతే కానీ, పిల్లల పేరిట బీమా ఉంటే ఉపయోగం ఏమీ ఉండదు. కనుక పిల్లల పేరిట బీమాతో కూడిన పాలసీలను తీసుకోవడం తెలివైన నిర్ణయం అనిపించుకోదు. బీమా తగినంత ఉంటుందా..? చైల్డ్ ప్లాన్లలో బీమా రక్షణ వార్షిక ప్రీమియానికి 10 రెట్లకు మించదు. పాలసీదారు మరణించే నాటికి వార్షిక ప్రీమియానికి పది రెట్లు లేదా అప్పటి వరకు చెల్లించిన ప్రీమియానికి 105 శాతం.. ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మేరకు బీమా పరిహారం చెల్లించడం జరుగుతుంది. ఈ ప్రకారం చూస్తే ఒకవేళ వార్షికంగా చెల్లించే ప్రీమియం రూ.50,000 ఉందనుకున్నా.. బీమా కవరేజీ రూ.5లక్షలుగానే ఉంటుంది. కానీ, పిల్లల ఉన్నత విద్య, వివాహ అవసరాలకు ఇది ఏ మూలకు సరిపోతుంది..? అందుకే కుటుంబానికి, భవిష్యత్తు లక్ష్యాలకు బీమా రక్షణ కల్పించాలంటే అందుకు ఈ తరహా చైల్డ్ ప్లాన్లు లేదా ఎండోమెంట్ పాలసీలు ఏ విధంగానూ అనుకూలం కావన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చెల్లింపుల్లో సౌలభ్యం..? ఇక చైల్డ్ ప్లాన్లలో పిల్లల అవసరాలకు అనుగుణంగా చెల్లింపులను ఎంచుకునే సౌలభ్యం తక్కువే. ఉదాహరణకు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ స్మార్ట్ చాంప్ ఇన్సూరెన్స్ లో చెల్లింపులు పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రారంభం అవుతాయి. వార్షికంగా నాలుగు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరుగుతాయి. ఒకవేళ 21 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఏకమొత్తంలో చెల్లింపులు కోరుకుంటే ఆ అవకాశం లేదు. అదే విధంగా బజాజ్ అలియాంజ్ యంగ్ అష్యూర్ ప్లాన్‌లోనూ ఏక మొత్తంలో మెచ్యూరిటీ ప్రయోజనాలను చెల్లించే ఆప్షన్ లేదు. పాలసీ కాల వ్యవధి 10, 15, 20 ఏళ్లుగా ఉండగా, ఈ కాల వ్యవధి ముగిసిన తర్వాత 3/5/7 వాయిదాల్లో బీమా సంస్థ చెల్లింపులు చేస్తుంది. ఇలా కాకుండా మ్యాక్స్ లైఫ్ ఫ్యూచర్ జీనియర్ ఎడ్యుకేషన్ ప్లాన్‌లో అయితే 16, 18, లేదా 21 ఏళ్ల వయసులో మెచ్యూరిటీ చెల్లించే ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్లను తీసుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశ్యాన్ని గమనించినట్టయితే.. తమకు ఏదైనా జరగరానిది జరిగితే తమ పిల్లల విద్య, ఇతర కుటుంబ లక్ష్యాలకు విఘాతం కలగకుండా ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటుంటారు. కానీ, ఇందుకు టర్మ్ లైఫ్ ప్లాన్ చక్కగా సరిపోతుంది. ఎక్కువ చార్జీలను పిండుకునే ఈ తరహా చైల్డ్ప్లాన్లు లేదా ఎండోమెంట్ పాలసీలు, యులిప్‌లకు బదులు టర్మ్ పాలసీ తీసుకోవడం ఉత్తమం. టర్మ్ పాలసీల్లో మెచ్యూరిటీ అనంతరం ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. అందుకే తక్కువ ప్రీమియానికి ఎక్కువ కవరేజీ లభిస్తుంది. దీంతో కుటుంబం కోసం ఎక్కువ కవరేజీతో కూడిన ప్లాన్ తీసుకోవచ్చు. ఉదాహరణకు పిల్లల ఉన్నత విద్య, కుటుంబ పోషణ, ఇతర లక్ష్యాలకు రూ.కోటి కవరేజీతో టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే.. ప్రీమియం 30 ఏళ్ల వయసున్న ఆరోగ్యవంతుడైన వ్యక్తికి రూ.10,000గానే ఉంటుంది. కనుక ఇటువంటి గందరగోళాలకు తావివ్వని, సులభమైన, సూటి అయిన టర్మ్ ప్లాన్ మేలైనది. భవిష్యత్తు లక్ష్యాల కోసం పెట్టుబడులు పెట్టుకోవాలని భావిస్తే అందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్, పీపీఎఫ్ వంటి పథకాలను ఎంచుకోవచ్చు. -
బీమా పాలసీ కొనసాగించలేకపోతున్నారా?
కారణాలేవైనా కానీ మీరు తీసుకున్న బీమా పాలసీని కొనసాగించలేకపోతున్నారా..? ప్రీమియం చెల్లింపును భారంగా భావిస్తున్నారా..? దీంతో పాలసీని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీ ముందు ఓ చక్కని మార్గం ఉంది. పాలసీ ప్రీమియం చెల్లించకపోతే అది ల్యాప్స్ అయిపోతుంది. దీనికంటే పెయిడప్ పాలసీగా మార్చుకుంటే సరి. ఈ అవకాశం ఎండోమెంట్ పాలసీల్లో ఉంటుంది. ఎండోమెంట్ పాలసీలు బీమా రక్షణతోపాటు, పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా పాలసీదారు జీవించి ఉంటే మెచ్యూరిటీ లభిస్తుంది. ఈ ఎండో మెంట్ పాలసీ కాల వ్యవధి ముగియక ముందే దాన్ని నిలిపివేయాలని భావిస్తే రెండు మార్గాలు ఉన్నాయి. దాన్ని పెయిడప్ పాలసీగా మార్చుకోవడం ఒకటి. ఇలా చేస్తే బీమా కవరేజీ కొనసాగుతుంది. లేదా పాలసీని బీమా సంస్థకు స్వాధీనం చేసి సరెండర్ వ్యాల్యూని పొందడం. ఈ రెండు మార్గాల్లో ఉన్న మంచి చెడులను తెలియజేసే కథనమే ఇది. పెయిడప్ పాలసీ పెయిడప్ పాలసీ ఆప్షన్లో జీవిత బీమా నిర్ణీత కాలం వరకు కొనసాగడం అనుకూలతగా చెప్పుకోవాలి. అంటే ప్రీమియం చెల్లించకపోయినా కానీ, ఈ కవరేజీ కొనసాగుతుంది. అలాగే, పాలసీ కాల వ్యవధి సమయంలో పాలసీదారు మరణిస్తే సమ్ అష్యూరెన్స్ (బీమా మొత్తం)ను నామినీకి చెల్లించడం జరుగుతుంది. పాలసీదారు జీవించి ఉంటే మెచ్యూరిటీ లభిస్తుంది. కాకపోతే పాలసీని పెయిడప్‌గా మార్చుకుంటే చివర్లో వచ్చే ప్రయోజనాలు కొంత తగ్గిపోతాయి. ఎందుకంటే అప్పటి నుంచి ప్రీమియం చెల్లించరు కనుక. దాంతో కాల వ్యవధి తీరిన తర్వాత పాలసీదారుకు లభించే మొత్తం తగ్గుతుంది. పెయిడప్‌గా మార్చిన నాటి నుంచి ప్రీమియం చెల్లించరు కనుక వార్షికంగా తాజా బోనస్‌లు కూడా నిలిచిపోతాయి. అప్పటి వరకు సమకూరిన బోనస్‌లను కాల వ్యవధి తీరిన తర్వాత చెల్లిస్తారు. ‘‘ఇటీవలి ఐఆర్డీఏఐ నాన్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ నిబంధనలు 2019 ప్రకారం పెయిడప్కు అర్హమైన పాలసీల్లో చెల్లించాల్సిన కనీస ప్రీమియం రెండు సంవత్సరాలుగా నిర్దేశించడం జరిగింది. అంటే ఇంకా మిగిలి ఉన్న కాలంతో సంబంధం లేకుండా అన్ని పాలసీలకు పెయిడప్ విషయంలో రెండేళ్ల ప్రీమియం చెల్లిస్తే చాలు’’ అని హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీ తెలిపింది. యూనిట్ లింక్డ్ ప్లాన్ (యులిప్)లను కూడా పెయిడప్ పాలసీలుగా మార్చుకోవచ్చు. అయితే, లాకిన్ పీరియడ్ వరకు (ఐదేళ్ల పాటు) అందులో కొనసాగాల్సి ఉంటుంది. పాలసీదారుపై చార్జీల భారం మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే యులిప్‌లలో జీవిత బీమా కవరేజీ రిస్క్ చార్జీలు పోను మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కనుక ఫండ్ నిర్వహణ చార్జీలు కొనసాగుతాయి. నాన్ లింక్డ్ ఎండోమెంట్ పాలసీల్లో పెయిడప్‌గా మారిన తర్వాత ఎటువంటి చార్జీలను విధించడం జరగదు. స్వాధీనం చేస్తే..? ఒకవేళ పాలసీలో కొనసాగకూడదని భావిస్తే దాన్ని స్వాధీనం చేసి స్వాధీన విలువను (సరెండర్ వ్యాల్యూ) పొందొచ్చు. సరెండర్ చేసినట్టయితే ఆ తర్వాత బీమా కవరేజీ కూడా ముగిసినట్టే. ఈ ఆప్షన్లోనూ కనీసం కొంత కాలం పాటు ప్రీమియం చెల్లింపు తర్వాతే సరెండర్ చేయడానికి వీలుంటుందని పాలసీబజార్ టర్మ్ ఇన్సూరెన్స్ హెడ్ అక్షయ వైద్య తెలిపారు. యులిప్‌లలో కనీసం ఐదేళ్లు కొనసాగిన తర్వాతే సరెండర్‌కు వీలుంటుంది. యులిప్‌లలో ఐదేళ్లు ప్రీమియం చెల్లింపు తర్వాత ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చు. స్వాధీనం చేసే నాటికి ఉన్న ఫండ్ విలువ ను చెల్లించడం జరుగుతుంది. ముందుగా వైదొలిగినందుకు ఎటువంటి చార్జీల విధింపు ఉండదు. అదే నాన్ లింక్డ్ ప్లాన్లలో అయితే రెండేళ్ల తర్వాత స్వాధీనం చేయవచ్చు. సరెండర్ చార్జీలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. పాలసీ స్వాధీనం విషయంలో చెల్లించాల్సిన కనీస మొత్తాలను ఐఆర్డీఏఐ నిర్దేశించింది. అయితే, పాలసీ తొలి నాళ్లలో స్వాధీనం చేసినట్టయితే, చెల్లించిన ప్రీమియంలో 50%వరకు నష్టపోవాల్సి రావచ్చు. నాన్లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్‌ను రెండో ఏడాది స్వాధీనం చేస్తే చెల్లించిన మొత్తం ప్రీమియంలో 30 శాతమే వెనక్కి వస్తుంది. మూడో ఏడాది స్వాధీనం చేస్తే 35% లభిస్తుంది. పాలసీ తొలినాళ్లలో స్వాధీనం చేయడం ద్వారా ఎక్కువ మొత్తాన్ని నష్టపోవాల్సి ఉంటుంది. పాలసీ తొలి ఏడేళ్ల కాలంలో స్వాధీనం చేస్తే ఎంత చెల్లించాలన్న దానిని ఐఆర్డీఏఐ పేర్కొంది. పెయిడప్, సరెండర్... ఏది నయం? ఒక్కసారి ఎండోమెంట్ పాలసీని కొనుగోలు చేసిన తర్వాత కనీసం రెండేళ్లు అయినా ప్రీమియం చెల్లిచాలి. అప్పుడే దాన్నుంచి పెద్దగా నష్టం రాదు. బీమాతోపాటు పొదుపు కలసిన పాలసీల్లో రెండేళ్లలోపే బయటపడితే వచ్చేదేమీ పెద్దగా ఉండదు. కనీసం రెండేళ్లు చెల్లించిన తర్వాత పెయిడప్, సరెండర్ ఆప్షన్లను పరిశీలించొచ్చు. అయినా కానీ తొలినాళ్లలో ఇలా చేయడం వల్ల అంత ప్రయోజం ఉండదు. పెయిడప్, సరెండర్ ఈ రెండింటిలో ఏది నయం? అన్న ప్రశ్నే ఎదురైతే పెయిడప్‌గా మార్చుకోవడమే మంచిది. ఎందుకంటే, ఇందులో జీవిత బీమా కొనసాగుతుంది. కాల వ్యవధి తీరాక కొంత వెనక్కి వస్తుంది. పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీకి పరిహారం దక్కుతుంది. మరో జీవిత బీమా పాలసీ తీసుకున్నా తర్వాతే ఒక పాలసీ నుంచి వెదొలగడాన్ని పరిశీలించాలి. -
ఇన్వెస్ట్‌మెంట్‌కు వ్యవధి కీలకం...
మార్కెట్లు గరిష్ట స్థాయిల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని మంచి బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను సూచిస్తారా? ప్రస్తుత పరిస్థితుల్లో రూ. 5 లక్షలు మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన ఫండ్స్‌ను సూచించండి? - రామరాజు, విజయనగరం ప్రస్తుతమున్న మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి నా రికమండేషన్లు ఉండవు. ఇన్వెస్ట్మెంట్ కాలాన్ని బట్టి నా రికమండేషన్లు ఉంటాయి. 10-15 ఏళ్ల కాలం పాటు మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయగలిగితే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాను. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోలేని వాళ్లు, రిస్క్‌ను భరించలేని వాళ్లకైతే బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉత్తమం. బ్యాలెన్స్డ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ దాదాపు ఒక్కలాగే ఉంటాయి. అయితే ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఒడిదుడుకులు తక్కువ. ఒక వేళ మీ ఇన్వెస్ట్మెంట్ గడువు మూడేళ్లే అయితే, ఈక్విటీ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించకపోవడమే మంచిది. మీరు ఎలాంటి పన్నులు చెల్లించని వారైతే, బ్యాంక్ డిపాజిట్లు ఉత్తమం. ఒకవేళ మీరు ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నట్లైతే, ఫిక్స్డ్ మెచ్యురిటీ ప్లాన్‌ను పరిశీలించవచ్చు. ఈ రిటర్న్‌లపై మీకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాకుండా రిటర్న్‌లు బ్యాంక్ డిపాజిట్లకంటే మెరుగ్గానే ఉండే అవకాశాలున్నాయి. అందుకని మార్కెట్ పరిస్థితులను బట్టి కాకుండా మీరు ఎంత కాలానికి ఇన్వెస్ట్ చేయగలరు అన్న అంశాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలను తీసుకోవాలి. పదేళ్ల తర్వాత నా కూతురి పెళ్లి చేయాలనుకుంటున్నాను. దీని కోసం కొంత నిధిని ఏర్పాటు చేయడం లక్ష్యంగా నేను 2011 నుంచి ఎల్ఐసీ ఎండోమెంట్ ప్లస్ పాలసీ కోసం ఏడాదికి రూ.50,000 చొప్పున ప్రీమియం చెల్లిస్తున్నాను. ఇది సరైనదేనా? తగిన సూచనలు ఇవ్వండి. - దమయంతి, హైదరాబాద్ మీ కూతురి పెళ్లి కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం మీ లక్ష్యమైతే, ఎండోమెంట్ పాలసీలో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. అయితే మీరు ఇప్పుడు ఈ పాలసీ నుంచి వైదొలగడం కూడా సరైన విధానం కాదు. ఒకసారి మీ పాలసీ డాక్యుమెంట్లను అధ్యయనం చేసి సరెండర్ చార్జీలను పరిశీలించండి. పదేళ్ల ఇన్వెస్ట్మెంట్ కాలానికి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఎస్బీఐ కాంట్రా, ఎస్బీఐ మ్యాగ్నమ్ ట్యాక్స్ గెయిన్లలో ఏడేళ్ల క్రితం ఒక ఏజెంట్ ద్వారా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. వాటిని ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను. నేను పన్నులేమైనా చెల్లించాల్సి ఉంటుందా? వాటిని ఎలా ఉపసంహరించుకోవాలో కూడా వివరించండి? - లక్ష్మీ నాయక్, ఆదిలాబాద్ మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏ రోజునైనా ఉపసంహరించుకోవచ్చు. రెండు రోజుల్లో మీ సొమ్ము మీ చేతికందుతుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ రెండు ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ కావడం, మీరు ఏడేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయడం వంటి కారణాల వల్ల మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఈక్విటీ ఫండ్స్‌లో ఏడాదికి మించి ఇన్వెస్ట్ చేస్తే, క్యాపిటల్ గెయిన్స్‌పై ఎలాంటి పన్నులుండవు. రిడీమింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫామ్‌ను పూర్తి చేసి మీ అకౌంట్ ఉన్న ఎస్బీఐ బ్రాం చీలో ఆ ఫామ్‌ను ఇస్తే చాలు. మీరు రిడంప్షన్ ఫామ్‌ను మెయిల్ కూడా చేయవచ్చు. నేనొక రిటైరైన ప్రభుత్వ ఉద్యోగిని. నా రిటైర్మెంట్ డబ్బులను సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌లోనూ, బ్యాంక్ ఎఫ్డీల్లోనూ ఇన్వెస్ట్ చేశాను. వీటి నుంచి వచ్చే వడ్డీని - డీఎస్పీ బ్లాక్‌రాక్ టాప్ 100, యూటీఐ డివిడెండ్ ఈల్డ్, బిర్లా సన్‌లైఫ్ 95, యూటీఐ బ్యాలెన్స్డ్, హెచ్డీఎఫ్సీ ప్రుడెన్స్, రిలయన్స్ ఎంఐపీల్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. నేను ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఫండ్స్ అన్నింటికీ, ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండేది. ఇప్పుడు ఈ ఫండ్స్ రేటింగ్ తగ్గుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేనేం చేయాలి? - అబూ ఖాన్, కరీంనగర్ కొన్నేళ్ల క్రితం ఈ ఫండ్స్ పనితీరు బాగానే ఉండేది. కానీ ఇటీవల వీటి పనితీరు ఈ కేటగిరిలోని ఇతర ఫండ్స్‌తో పోల్చితే ఏమంత బాగా లేదనే చెప్పాలి. మీరు మీ రిటైర్మెంట్ సొమ్ములపై వచ్చే వడ్డీలను ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. మీ పోర్ట్‌ఫోలియోను ట్రిమ్ చేయండి. 2-3 బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ ఫండ్స్ రాబడులే బ్యాలెన్స్డ్ ఫండ్స్ కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ల్లో ఒడిదుడుకులు తక్కువ. కొంచెం స్థిరత్వం ఎక్కువ. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్- కెనరా రొబెకో బ్యాలెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాండేజ్, టాటా బ్యాలెన్స్డ్, హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్లను పరిశీలించవచ్చు.