విష్ణు స్వరూప్ (30) పేరిట రెండు జీవిత బీమా ఎండోమెంట్ పాలసీలు ఉన్నాయి. ఆరేళ్ల క్రితం తనకు ఉద్యోగం వచి్చన కొత్తలో ఆ పాలసీలను విష్ణు పేరిట ఆయన తండ్రి ప్రారంభించారు. వీటి కోసం ఏటా రూ.50,000 ప్రీమియంను విష్ణు స్వయంగా చెల్లిస్తున్నారు. ఈ రెండింటి రూపంలో వస్తున్న బీమా రక్షణ రూ.10 లక్షలు. కాల వ్యవధి 20 ఏళ్లు. ఎందుకోగానీ తాను తీసుకున్న బీమా ఉత్పత్తులు తగినంత రక్షణ ఇవ్వడం లేదన్న అభిప్రాయం అతడిలో కలిగింది. దీంతో ఓ ఆరి్థక సలహాదారుడిని సంప్రదించాడు.
పాలసీల పూర్తి వివరాలు, విష్ణు ఆదాయం, జీవిత లక్ష్యాలన్నింటినీ సమగ్రంగా విశ్లేíÙంచిన అనంతరం.. వెంటనే సదరు రెండు ఎండోమెంట్ పాలసీలను సరెండ్ చేసేయాలని ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచించారు. నిపుణుడిని సంప్రదిస్తే కానీ, ఆ పాలసీల వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్న విషయం అతడికి బోధపడలేదు. విష్ణు మాదిరే ఎండోమెంట్ పాలసీలకు భారీ ప్రీమియం చెల్లించే వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్కరూ ఒక్కసారి తమ ప్లాన్‌ను సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
నిన్న మొన్నటి వరకు జీవిత బీమా అంటే ఎక్కువ మందికి తెలిసింది ఎండోమెంట్ పాలసీల గురించే. టర్మ్ ఇన్సూరెన్స్ ఇటీవలి కాలంలోనే ఆదరణను, ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. ఎండోమెంట్ పాలసీలు గతంలో ప్రజల సహజ పొదుపు మనస్తత్వం కోణం నుంచి అభివృద్ధి చేసినవి. అంతేకానీ, అచ్చమైన బీమా రక్షణ కోసం కావు. పెట్టుబడుల సాధనాలు, రాబడులపై అవగాహన విస్తృతమవుతున్న కొద్దీ, టర్మ్ పాలసీల ప్రాధాన్యం తెలిసి వస్తోంది.
ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే.. పాలసీ హోల్డర్ దురదృష్టవశాత్తూ మరణిస్తే కుటుంబానికి మెరుగైన పరిహారం ఇచ్చి ఆదుకునేవి టర్మ్ ప్లాన్లు. కాల వ్యవధి ముగిసే రోజు వరకు జీవించి ఉంటే రూపాయి తిరిగి రాదు. దీనికి భిన్నంగా.. పాలసీ కాల వ్యవధిలో మరణించినా లేక పాలసీ గడువు ముగిసే వరకు జీవించి ఉన్నా.. ఈ రెండు సందర్భాల్లోనూ ఎంతో కొంత ముట్టజెప్పేవి ఎండోమెంట్ ప్లాన్లు. ఇవి తక్కువ బీమా రక్షణ, తక్కువ రాబడితో కూడినవి.
బీమా ఏజెంట్లు ఎండోమెంట్ ప్లాన్ల విక్రయానికే ఎక్కువగా మొగ్గు చూపిస్తుంటారు. దీనిపై వారికి లభించే కమీషన్ ఎక్కువగా ఉంటుంది. మొదటి ఏడాది ప్రీమియంలో 10–25 శాతం వరకు వారికి కమీషన్‌గా ముడుతుంది. అంతేకాదు రెండో సంవత్సరం నుంచి పాలసీ ముగిసే వరకు ఏటా ప్రీమియంపై 5–7 శాతం కమీషన్‌గా ఏజెంట్లకు ఆదాయం వస్తూనే ఉంటుంది. టర్మ్ ప్లాన్ల పైనే ఇదే స్థాయిలో కమీషన్ ఉంటుంది.
కాకపోతే టర్మ్ పాలసీల ప్రీమియం తక్కువ కనుక కమీషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. దేశ వాసుల్లో చాలా మందికి ఎండోమెంట్ ప్లాన్లే ఉన్నాయి. తెలిసిన ఏజెంట్ బలవంతం పెట్టాడని, స్నేహితులు, బంధువులు సూచించారని చెప్పి వీటిని తీసుకోవడం కనిపిస్తుంది. చెల్లిస్తున్న ప్రీమియానికి మెరుగైన బీమా రక్షణ ఇవ్వని, ప్రీమియం భారంతో కూడిన ఇలాంటి ఎండోమెంట్ ప్లాన్లను వదిలించుకునే మార్గం ఉంది. సరెండర్ చేసేయడమే..
ఎందుకు సరెండర్ చేయాలి..?
తాము తీసుకున్న జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్‌లో తగినంత కవరేజీ లేదని, ప్రీమియం ఎక్కువగా ఉందని అనిపిస్తే దాన్ని నిలిపివేయడంలో ఎలాంటి తప్పు లేదు. జీవిత బీమా ప్లాన్ తీసుకునేది ఎందుకు..? తమకు ఏదైనా జరిగితే కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పాలు కాకూడదనే. తమపై ఆధారపడిన వారు, అసాధారణ సందర్భాల్లో కష్టాలు పడకూడదంటే అందుకు తగినంత కవరేజీతో లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉండాల్సిందే.
పిల్లల విద్య ఆగిపోకూడదు. వారి రోజువారీ జీవనం, ఇతర వ్యయాలు అన్నింటినీ జీవిత బీమా పరిహారం ఆదుకునే విధంగా ఉండాలి. అందుకే వార్షిక ఆదాయానికి ఎంతలేదన్నా కనీసం పది రెట్ల మేరకు బీమా కవరేజీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. విష్ణు స్వరూప్‌నే ఉదాహరణగా తీసుకుందాం. అతడు రూ.10 లక్షల కవరేజీ కోసం ఏటా రూ.50వేలు చెల్లిస్తున్నాడు. కానీ, కేవలం రూ.20 వేల వార్షిక ప్రీమియం చెల్లించడం ద్వారా విష్ణు రూ.1.5 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు.
ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాతో విష్ణు అదే పనిచేశాడు. ఉన్న ఎండోమెంట్ ప్లాన్లను సరెండ్ చేశాడు. రూ.1.5 కోట్ల టర్మ్‌ప్లాన్ తీసుకున్నాడు. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తి రూ.కోటి సమ్ అష్యూరెన్స్‌తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే వార్షిక ప్రీమియం రూ.25,000. ఎండోమెంట్ పాలసీల్లో బీమా రక్షణతోపాటు, ఎంతో కొంత రాబడి ఉంటుందన్నది చాలా మంది అభిప్రాయం. కానీ, ఇందులో వాస్తవం ఏంటన్నది పాలసీదారులకు తప్పకుండా తెలిసి ఉండాలి.
ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి 4.5–5.5 శాతం మించి ఉండదు. అరుదైన సందర్భాల్లోనే రాబడి 6 శాతం ఉంటుంది. కానీ ద్రవ్యోల్బణం కూడా దీర్ఘకాల సగటు అదే స్థాయిలో ఉంది. దీంతో నికరంగా వచ్చే రాబడి ఏమీ ఉండదు. ఉదాహరణకు రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్‌తో ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. సమ్ అష్యూర్డ్‌పై ఏటా 5 శాతం సింపుల్ గ్యారంటీడ్ అడిషన్ వస్తుంది. ఈ పాలసీలో మెచ్యూరిటీ కింద రూ.21 లక్షలు వస్తుంది. రాబడి రేటు 6.22 శాతం. ద్రవ్యోల్బణం 6 శాతం (సగటున) మినహాయిస్తే నికర రాబడి 0.22 శాతమే. అదే ఈక్విటీ పథకాల్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేస్తే రాబడి వార్షికంగా 10–12 శాతం లేదా అంతకంటే ఎక్కువే ఉంటుంది. డెట్ సాధనాల్లోనూ 7 శాతం మేర రాబడి వస్తుంది.
పాలసీని నిలిపివేస్తే..?
ఎండోమెంట్ ప్లాన్ గురించి ఈ వివరాలు తెలుసుకున్న తర్వాత, ఇక వద్దనుకుంటే పాలసీదారుల ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. అప్పటి నుంచి ప్రీమియం చెల్లించకుండా ఉండిపోవడం. లేదంటే పాలసీని సరెండర్ చేయడమే సరైనది. పాలసీలో కవరేజీ, రాబడి ఆకర్షణీయంగా లేదని అసంతృప్తిగా ఉంటే అప్పటి నుంచి ప్రీమియం చెల్లించకుండా ఆగిపోవచ్చు. కాల వ్యవధి తర్వాత ఫండ్ వెనక్కి వస్తుంది. దీన్నే పాలసీ పెయిడప్ అని అంటారు.
మెచ్యూరిటీ తర్వాత ఎంత వస్తుందన్నది బీమా సంస్థ చెబుతుంది. అంతేకాదు, జీవిత బీమా కవరేజీ కూడా కొనసాగుతుంది. కాకపోతే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు అనుగుణంగా జీవిత బీమా కవరేజీని తగ్గిస్తారు. ఉదాహరణకు రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 20 ఏళ్ల కాలానికి తీసుకుని, ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లించారని అనుకుందాం. అప్పుడు రూ.10 లక్షలకు బదులు రూ.2.5 లక్షల జీవిత బీమా కవరేజీ కాల వ్యవధి ముగిసే వరకు లభిస్తుంది. పెయిడప్ చేసే నాటికి జమ అయిన గ్యారంటీడ్ అడిషన్స్, బోనస్‌లు కలిపి పెయిడప్ వ్యాల్యూని నిర్ణయిస్తారు.
సరెండర్ ఎప్పుడు చేయాలి?
బీమా పాలసీల్లో సరెండర్ పెనాల్టీ ఎంతో ఎక్కువగా ఉంటుందని భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ నితిన్ మెహతా తెలిపారు. పాలసీ సరెండర్ చేయడానికి ముందే, ఎదురయ్యే ఆరి్థక ప్రతికూలతలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అందుకుని సరెండర్ చేసే ముందు ఎంత వస్తుందన్నది తెలుసుకోవాలి. ఎండోమెంట్ ప్లాన్‌కు ప్రీమియం ఇక చెల్లించడం కష్టంగా ఉందని భావిస్తే అప్పుడు సరెండర్ చేస్తే ఎంతొస్తుంది? పెయిడప్‌గా మారిస్తే గడువు ముగిసిన తర్వాత ఎంతొస్తుందన్నది విశ్లేíÙంచుకోవాలి.
సరెండర్ చేసినా లేక పెయిడప్ చేసినా.. అదే సమయంలో టర్మ్ ప్లాన్ తీసుకోవడం తప్పనిసరి. లేదంటే అసులు లక్ష్యమే దెబ్బతింటుంది. రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 20 ఏళ్ల కాలానికి తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు ఏటా రూ.50,000 చొప్పున ప్రీమియం చెల్లించిన తర్వాత సరెండర్ చేసేయాలని నిర్ణయించారు. దీంతో అప్పటి నుంచి ఏటా రూ.50,000 ప్రీమియం రూపంలో ఆదా అవుతుంది. అప్పుడు ఏటా రూ.20,000 ప్రీమియంపై రూ.కోటి టర్మ్ ప్లాన్ తీసుకోవాలి.
మిగిలిన రూ.30వేలను ఇండెక్స్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. ఇలా చేస్తే ఏటా 12 శాతం సగటు రాబడి అంచనా ఆధారంగా 15 ఏళ్ల తర్వాత రూ.12.50 లక్షలు సమకూరుతుంది. ఐదేళ్ల తర్వాత సరెండర్ చేయడం వల్ల వచి్చన మొత్తాన్ని తీసుకెళ్లి ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అది కూడా ఏటా 12 శాతం చొప్పున 15 ఏళ్లలో వృద్ధి చెందుతుంది. బీమా, పెట్టుబడిని కలిపి చూడకూడదు. అచ్చమైన బీమా రక్షణ ఏర్పాటు చేసుకోవడానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి రాబడి కోసం మేలైన పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి.
పాలసీ కాల వ్యవధి ముగియకముందే దాన్నుంచి వైదొలగాలని అనుకుంటే, సరెండర్ వేల్యూని వెనక్కి పొందొచ్చు. అప్పటి వరకు ఎన్నేళ్లపాటు ప్రీమియం చెల్లించారు, ఎంత చెల్లించారు, బోనస్, పెయిడప్ వేల్యూ ఆధారంగా సరెండర్ వేల్యూ ఎంతన్నది ఉంటుంది. ఇందుకు సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్ చార్ట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. సరెండర్ ఫ్యాక్టర్ 35 శాతం అనుకుంటే.. రూ.10 లక్షల పాలసీలో రూ.3.5 లక్షలు పాలసీదారునికి దక్కుతుంది. పాలసీ తీసుకుని కాల వ్యవధి పెరుగుతూ వెళుతున్న కొద్దీ, ఈ సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్ 70 శాతం వరకు చేరుతుంది. ‘‘కాల వ్యవధికి ముందే పాలసీని సరెండర్ చేస్తే తీవ్రంగా నష్టపోవాలి.
సరెండర్ ఫీజుల రూపంలో అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలో గణనీయమైన మొత్తాన్ని కోల్పోతారు. కొన్ని కేసుల్లో బోనస్ వంటివి కూడా రావు. కనుక పాలసీ నియమ, నిబంధనలను చదివి అర్థం చేసుకోవాలి’’అని ఫైనాన్షియల్ ప్లానింగ్ సంస్థ ‘ఫైనాన్షియల్ స్మార్ట్’ సీఈవో నీతా మెనెజెస్ సూచించారు. సరెండర్ వేల్యూ విషయంలో బీమా సంస్థల మధ్య ఏకరూపత కనిపించదు. కొన్ని బీమా సంస్థలు ప్రత్యేకమైన సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్‌చార్ట్‌లను ఉపయోగిస్తున్నాయి. కొన్ని సంస్థల్లో అయితే చాలా దారుణంగా, నామమాత్రంగా సరెండర్ వేల్యూని నిర్ణయిస్తున్నారు. అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం ఆధారంగా సరెండర్ వేల్యూని కొన్ని ఖరారు చేస్తున్నాయి.
సరెండర్ చేస్తే ఎంతొస్తుంది?
సమ్ అష్యూర్డ్: రూ.10లక్షలు
పాలసీ కాల వ్యవధి: 20 ఏళ్లు
వార్షిక ప్రీమియం: రూ.50వేలు
బోనస్ అడిషన్ ఏటా: రూ.50వేలు
సరెండర్ కాల వ్యవధి 5ఏళ్ల 10 ఏళ్ల 15 ఏళ్ల
తర్వాత తర్వాత తర్వాత
పెయిడప్ వేల్యూ (రూ.లక్షల్లో) 5 10 15
సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్ (శాతంలో) 35 50 70
సరెండర్ వేల్యూ (రూ.లక్షల్లో) 1.75 5 10.50.
Comments
Please login to add a commentAdd a comment