రాబడా.. రక్షణా.. మీ ‘పాలసీ’ ఏంటి? | Sakshi Special Story About Endowment vs Money Back Policys | Sakshi
Sakshi News home page

రాబడా.. రక్షణా.. మీ ‘పాలసీ’ ఏంటి?

Published Mon, Jul 19 2021 1:05 AM | Last Updated on Mon, Jul 19 2021 1:25 AM

Sakshi Special Story About Endowment vs Money Back Policys

ఆర్జించే ప్రతీ వ్యక్తికి జీవిత బీమా రక్షణ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఊహించనిది చోటు చేసుకుంటే ఆ కుటుంబం కష్టాల్లోకి వెళ్లకుండా.. బీమా పరిహారం అండగా నిలుస్తుంది. బీమాకు అర్థం ఇదే. మనలో చాలా మంది తమకూ బీమా పాలసీ ఉందిలేనన్న భరోసాతో ఉంటుంటారు. పరిశీలించి చూస్తే కానీ తెలియదు వాస్తవంగా వారికి ఉన్న రక్షణ ఏపాటిదో. అందుకే జీవిత బీమా ప్లాన్లలో అసలు ఎన్నెన్ని రకాలున్నాయి? వాటిల్లో ఉండే ప్రయోజనాలపై అవగాహన అవసరం. ఆ వివరాలు అందించే ప్రాఫిట్‌ ప్లస్‌ కథనమే ఇది.

రెండే రకాలు..
స్థూలంగా పరిశీలిస్తే.. జీవిత బీమా పాలసీలు రెండు రకాలే. ఒక్కటి అచ్చమైన రక్షణనిచ్చేది (ప్రొటెక్షన్‌ ప్లాన్‌/టర్మ్‌ ప్లాన్‌). రెండో రకం.. ఎంతో కొంత బీమా రక్షణనిస్తూనే పెట్టుబడులు, రాబడుల ప్రయోజనాలతో కలిసి ఉండేవి. ప్రొటెక్షన్‌/టర్మ్‌ ప్లాన్లు అన్నవి పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే పరిహారం చెల్లిస్తాయి. బీమా, పెట్టుబడి ప్రయోజనాలతో ఉండే ఎండోమెంట్‌/మనీబ్యాక్‌ ప్లాన్లలో అలా కాదు. పాలసీదారు మరణించిన సందర్భంలో, కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించి ఉన్న సందర్భంలోనూ ప్రయోజనం      లభిస్తుంది.  

టర్మ్‌ ఇన్సూరెన్స్‌
అర్థం చేసుకునేందుకు ఎంతో సులువైన ఉత్పత్తి టర్మ్‌ ఇన్సూరెన్స్‌. వీటినే ప్రొటెక్షన్‌ ప్లాన్లు అంటుంటారు. మరణ ప్రమాదానికి రక్షణనిస్తాయి. పాలసీ కాల వ్యవధి ముగిసేలోపు ఎటువంటి కారణంతో అయిన పాలసీదారు మరణానికి గురైతే నామినీకి బీమా సంస్థ పరిహారం చెల్లిస్తుంది. సాధారణంగా ఈ ప్లాన్లు 85 సంవత్సరాల వరకు కవరేజినిస్తాయి. 99 సంవత్సరాల వరకు కవరేజీతో కేవలం కొన్ని బీమా సంస్థలు ప్లాన్లను అందిస్తున్నాయి.

పాలసీ కాల వ్యవధిలో మరణించినట్టయితేనే ఈ ప్లాన్లలో పరిహారం చెల్లింపు ఉంటుంది. కాల వ్యవధి తర్వాత ఎటువంటి ప్రయోజనం అందదు. అందుకే ఈ ప్లాన్లపై ప్రీమియం ఆకర్షణీయంగా ఉంటుంది. ఎక్కువ బీమా కవరేజీ తక్కువ ప్రీమియానికే టర్మ్‌ ప్లాన్లలో లభిస్తుంది. అంతేకాదు మొదటి ఏడాది చెల్లించిన ప్రీమియం పాలసీ కాల వ్యవధి ముగిసేవరకు స్థిరంగా ఉంటుంది. ప్రీమియం పెరగడం ఉండదు. కాకపోతే పాలసీ ప్రీమియంలో భాగంగా ఉండే వస్తు సేవల పన్నును (జీఎస్‌టీ) ప్రభుత్వం సవరించినట్టయితే ఆ మేరకు ప్రీమియంలో మార్పులు ఉంటాయి.

టర్మ్‌ ప్లాన్‌లు ఇవి..
ప్రొటెక్షన్‌ ప్లాన్లలో మళ్లీ వివిధ రకాలు ఏంటి? అని సందేహపడుతున్నారా.. వివిధ వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారిని ఆకర్షించేందుకు బీమా సంస్థలు ప్లాన్లలో సదుపాయాలను జోడిస్తుంటాయి.

► రెగ్యులర్‌ ప్లాన్‌: ఇది అచ్చమైన టర్మ్‌ ప్లాన్‌. 30 ఏళ్ల వ్యక్తి తనకు 70 ఏళ్లు వచ్చే వరకు అంటే 40 ఏళ్ల కాలానికి రూ.కోటి బీమా రక్షణను తీసుకుంటే వార్షిక ప్రీమియం సుమారు రూ.11,210 చెల్లిస్తే చాలు. వివిధ బీమా సంస్థల మధ్య ఈ ప్రీమియంలో వ్యత్యాసం ఉంటుంది. అంతేకాదు, పాలసీదారుల జీవనశైలి, ఆరోగ్య సమస్యలు కూడా ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి.

► రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం: టర్మ్‌ ప్లాన్లే కానీ, పాలసీ కాలవ్యవధి ముగిసిన తర్వాత అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తం వెనక్కి వస్తుంది. జీవించి ఉంటే రూపాయి కూడా వెనక్కి రాని పాలసీలు ఎందుకు? అని భావించే వారికోసం రూపొందించిన పాలసీలు ఇవి. అందుకే ప్రీమియం వెనక్కి రాని టర్మ్‌ప్లాన్లతో పోలిస్తే.. వెనక్కి వచ్చే ప్లాన్ల ప్రీమియం 50–100 శాతం అధికంగా ఉంటుంది. ఇలా ఈ అదనపు ప్రీమియాన్ని బీమా సంస్థలు తీసుకెళ్లి పెట్టుబడులుగా పెడతాయి. అలా ప్రీమియంను వెనక్కిచ్చేస్తాయి. ఈ ప్లాన్‌ను 30 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల కాలానికి తీసుకుంటే వార్షిక ప్రీమియం రూ.18,000 స్థాయిలో ఉంటుంది.  

► పరిహారం చెల్లింపుల్లో ఆప్షన్లు: టర్మ్‌ ప్లాన్లలో మరణ పరిహారాన్ని చెల్లించే విషయంలో పలు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో పరిహారాన్ని ఒకేసారి చెల్లించేయకుండా.. ముందు ఎంపిక చేసుకున్న మొత్తాన్ని చెల్లించి.. మిగిలిన భాగాన్ని ప్రతీ నెలా ఇంత చొప్పున కొన్నేళ్ల పాటు చెల్లించే విధంగా ఉంటుంది. ఉదాహరణకు రూ.50లక్షల ప్లాన్‌లో.. పాలసీదారు మరణించినట్టయితే బీమా సంస్థ రూ.10–20 లక్షలను ఒకే విడతగా ఇస్తుంది. మిగిలిన రూ.40–30 లక్షలను 10 నుంచి 20 ఏళ్ల కాలానికి ప్రతీ నెలా చెల్లించే విధంగా పాలసీల నిర్మాణం ఉంటుంది. దీనివల్ల బాధిత కుటుంబ నెలవారీ అవసరాలకు ఆదాయం ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది. ఒకే విడత భారీ పరిహారాన్ని అందుకుంటే దాన్ని తీసుకెళ్లి పెట్టుబడిగా పెట్టుకుని, ప్రతీ నెలా ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. అటువంటి వారు ఈ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

► సింగిల్‌ ప్రీమియం: కొందరు ఏటా ప్రీమియం చెల్లించేందుకు సౌకర్యంగా ఉండకపోవచ్చు. ఇటువంటి వారు ఒకే విడతగా ప్రీమియం చెల్లించేందుకు వీలు కల్పించేవే సింగిల్‌ ప్రీమియం ప్లాన్లు. ఇందులో ఏటా రెన్యువల్‌ చేసుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. కాకపోతే ఒకే విడత కనుక ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లాన్లు 85 ఏళ్ల వరకు తీసుకునేందుకు అవకాశం ఉంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి రూ.కోటి కవరేజీని ఎంపిక చేసుకుంటే సింగిల్‌ ప్రీమియం కింద రూ.1.8 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.  

► కవరేజీ పెరుగుతూ.. తరుగుతూ: ద్రవ్యోల్బణం, బాధ్యతలకు అనుగుణంగా టర్మ్‌ ప్లాన్‌లో వివిధ దశల్లో కవరేజీ పెరుగుతూ వెళ్లే ఆప్షన్‌ కూడా ఉంటుంది. అదే విధంగా కవరేజీ తగ్గుతూ వెళ్లే ఆప్షన్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. కవరేజీ పెరుగుతూ వెళ్లే ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. కానీ, కవరేజీ పెరిగిన ప్రతీసారి ప్రీమియం పెరగడం ఉండదు. వివిధ దశల్లో పెరిగే బాధ్యతలకు అనుగుణంగా పెరిగే కవరేజీ ఉపయోగకరంగా ఉంటుంది.

► హోల్‌లైఫ్‌: హోల్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లు 99–100 ఏళ్ల కాల వ్యవధితో ఉంటాయి. పాలసీదారు 99–100 ఏళ్లలోపు మరణించినట్టయితే పరిహారాన్ని నామినీ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. నూరేళ్లు జీవించి ఉంటే.. అప్పుడు పాలసీదారుకు ఏక మొత్తంలో ప్రయోజనాన్ని బీమా సంస్థ చెల్లించేస్తుంది. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తికి హోల్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లో రూ.కోటి కవరేజీకి వార్షిక ప్రీమియం సుమారుగా రూ.15,000 వరకు ఉంటుంది. తమ తర్వాత పిల్లలకు ఎంతో కొంత మొత్తం నగదు ప్రయోజనం లభించాలన్న అభిలాష ఉంటే తప్ప.. వీటి అవసరం పెద్దగా ఉండదు. పిల్లలు జీవితంలో స్థిరపడి, తమ రుణ బాధ్యతలు పూర్తిగా ముగిసే కాలం వరకు జీవిత బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి.

► లిమిటెడ్‌ ప్రీమియం పీరియడ్‌: పాలసీ కాల వ్యవధి ఎంత కాలం ఉన్నా కానీ, కొన్నేళ్లే ప్రీమియం చెల్లించే ఆప్షన్లు కూడా ఉంటున్నాయి. 5, 10, 15, 20 ఏళ్ల పాటే ప్రీమియం చెల్లించొచ్చు. లేదంటే 60 ఏళ్ల కాలవ్యవధి వరకు ప్రీమియం చెల్లించే విధంగా ప్లాన్‌ను తీసుకోవచ్చు.  

► ఎవరికి: మీపై ఆధారపడిన వారు ఉంటే, రుణ బాధ్యతలు ఉన్నట్టయితే టర్మ్‌ప్లాన్‌ను తగినంత కవరేజీతో తీసుకోవాలి. వార్షికాదాయానికి 10–20 రెట్ల వరకు కవరేజీ ఉండాలన్నది ఆర్థిక సలహాదారుల సూచన. రుణ బాధ్యతలు దీనికి అదనం. ఒకవేళ రిటైర్‌ అయిన వారు, తమపై ఎవరూ ఆధారపడి లేని వారికి జీవిత బీమా అవసరం ఉండదు.

సంప్రదాయ బీమా ప్లాన్లు
ఇవి జీవిత బీమా, పెట్టుబడి కలగలసిన ప్లాన్లు. చెల్లించే ప్రీమియం పరంగా చూస్తే బీమా రక్షణ స్వల్పంగానే ఉంటుంది. ఎందుకంటే రాబడులను ఇవ్వాలి కనుక తీసుకునే ప్రీమియంలో కొంత కవరేజీకి మినహాయించి మిగిలిన మొత్తాన్ని పెట్టుబడులకు బీమా కంపెనీలు మళ్లిస్తాయి.  

► ఎండోమెంట్‌ ప్లాన్‌: పాలసీదారు మరణించిన సందర్భాల్లో నామినీకి మరణ పరిహారం, బోనస్‌తోపాటు చెల్లింపులు ఉంటాయి. ఏటా కొంత చొప్పున బీమా సంస్థలు సమ్‌ అష్యూర్డ్‌పై బోనస్‌ను ప్రకటిస్తుంటాయి. పెట్టుబడిపై రాబడుల ఆధారంగా ఈ బోనస్‌ ఎంతన్నది ఉంటుంది. దీంతో పాలసీదారు మరణించేనాటికి జమ అయిన బోనస్‌తోపాటు బీమా మొత్తాన్ని చెల్లించే విధంగా ఒప్పందం ఉంటుంది. పాలసీదారు జీవించి ఉంటే కాల వ్యవధి ముగిసిన తర్వాత బోనస్‌తోపాటు, ముందుగా ఇచ్చిన హామీ మేరకు ఇతర ప్రయోజనాలను కంపెనీ చెల్లిస్తుంది. కనుక మరణించినా, జీవించినా కానీ ఈ ప్లాన్లలో ప్రయోజనం అందుతుంది. ఎక్కువ మందిని ఆకర్షించేది ఇదే. అందుకే, సరిపడా కవరేజీ తీసుకుంటున్నామా? అన్నది ప్రశ్నించుకోకుండా ఎక్కువ మంది ఎండోమెంట్‌ ప్లాన్ల వైపు మొగ్గు చూపుతుంటారు. రూ.10లక్షల కవరేజీతో ఎండోమెంట్‌ ప్లాన్‌ తీసుకోవాలంటే.. 30 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల టర్మ్‌ ప్లాన్‌ కోసం ఏటా ప్రీమియం రూ.50,000–60,000వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 20 ఏళ్ల కాలవ్యవధికి పదేళ్లపాటే ప్రీమియం చెల్లించే ఆప్షన్‌లో వార్షిక ప్రీమియం రూ.లక్ష వరకు ఉంటుంది.  

► మనీబ్యాక్‌ ప్లాన్లు: పేరులోనే ఉన్నట్టు పాలసీ కాల వ్యవధిలోపు నిర్ణీత కాలానికోసారి చొప్పున నగదు ప్రయోజనాన్ని బీమా సంస్థ చెల్లింపులు చేస్తుంది. బోనస్‌ను పాలసీదారు మరణించిన సందర్భంలో లేదా కాలవ్యవధి చివర్లో చెల్లిస్తుంది. ఎండోమెంట్‌ ప్లాన్‌లో జీవించి ఉంటే చివర్లో కొంచెం పెద్ద మొత్తాన్నే అందుకోవచ్చు. మనీబ్యాక్‌ ప్లాన్‌లో ఐదేళ్లకు ఒకసారి ఎంతో కొంత బీమా సంస్థ చెల్లిస్తుంటుంది కనుక చివర్లో లభించేది కొద్ది మొత్తమే అని అర్థం చేసుకోవాలి. పిల్లల విద్యావసరాల కోసం మధ్య మధ్యలో కొంత చొప్పున నగదు ప్రయోజనం రావాలని కోరుకునే వారు మనీబ్యాక్‌ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. టర్మ్‌ ప్లాన్లతో పోలిస్తే వీటి ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది. 30 ఏళ్ల వ్యక్తి రూ.10లక్షల కవరేజీని 20 ఏళ్ల కాలానికి ఎంపిక చేసుకుంటే వార్షికంగా రూ.1.20లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది.  

► ఎవరికి: మెరుగైన పెట్టుబడుల ప్రణాళికను అమలు చేయలేని వారు, ఇతర పెట్టుబడి సాధనాలను అర్థం చేసుకోలేని వారు వీటిని ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ రాబడి,  రక్షణనిచ్చే ఈ ప్లాన్లు బీమా రక్షణ కోణం నుంచి చూస్తే అనుకూలమైనవి కావు. పన్ను ఆదా పరంగా చూసినా అంత ఆకర్షణీయమైన సాధనం కాదని తెలుసుకోవాలి.  

► యులిప్‌లు: బీమా, పెట్టుబడి ఆధారిత ప్లాన్లే ఇవి కూడా. కాకపోతే ఈక్విటీ పెట్టుబడులకు యులిప్‌లు అవకాశం కల్పిస్తాయి. సంప్రదాయ ఎండోమెంట్‌ ప్లాన్లు అన్నవి కేవలం డెట్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. యులిప్‌లలో ఈక్విటీ, డెట్‌ రెండింటినీ ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీకి అవకాశం ఉంటుంది కనుక దీర్ఘకాలంలో ఎండోమెంట్‌ ప్లాన్లతో పోలిస్తే కాస్త మెరుగైన రాబడులకు యులిప్‌లలో అవకాశం ఉంటుంది. యులిప్‌లలో కనీసం ఐదేళ్ల వరకు ప్రీమియం చెల్లించి.. ఆ తర్వాత ఆపేసినా నష్టం ఉండదు. కాల వ్యవధి వరకు బీమా కవరేజీ కొనసాగుతుంది. ఇందులో కూడా ప్రీమియం చాలా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ప్రీమియంలో ఎక్కువ భాగం పెట్టుబడులకు వెళుతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి యులిప్‌ను ఎంపిక చేసుకుంటే రూ.10 లక్షల కవరేజీ కోసం వార్షికంగా రూ.లక్ష ప్రీమియంగా చెల్లించుకోవాలి.

మధ్యలో విరమించుకోకుండా పాలసీ కాలవ్యవధి వరకు కొనసాగాలని గట్టిగా నిర్ణయించుకుంటే ఎండోమెంట్‌ ప్లాన్‌ బదులు యులిప్‌లను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది. యులిప్‌లలో పూర్తిగా ఈక్విటీ పెట్టుబడుల ఆప్షన్‌ను లేదంటే ఈక్విటీ, డెట్‌ కలయికతో ప్లాన్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. అంతేకాదు ఈక్విటీ మార్కెట్లు బాగా పెరిగిపోయాయని భావించినట్టయితే ఈక్విటీ నుంచి డెట్‌కు పెట్టుబడులను మళ్లించుకోవచ్చు. అదే విధంగా ఈక్విటీ మార్కెట్లు పడిపోయిన సందర్భాల్లో డెట్‌ భాగం నుంచి పూర్తిగా ఈక్విటీకి మళ్లిపోయే విధంగా ఇందులో స్వేచ్ఛ ఉంటుంది. మొత్తానికి తమకు ఏదైనా వాటిల్లితే తమ కుటుంబానికి ఎంత అవసరమో ఆ మేరకు బీమా కవరేజీ తీసుకోవడం ముఖ్యం. ఇందుకోసం టర్మ్‌ ప్లాన్‌ను తీసుకుని, వెసులుబాటు మేరకు పెట్టుబడుల కోసం మ్యూచువల్‌ ఫండ్స్, నేరుగా స్టాక్స్, ఇతర సాధనాలను పరిశీలించొచ్చు. ఈ దశలో అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement