Money Back Policy
-
రాబడా.. రక్షణా.. మీ ‘పాలసీ’ ఏంటి?
ఆర్జించే ప్రతీ వ్యక్తికి జీవిత బీమా రక్షణ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఊహించనిది చోటు చేసుకుంటే ఆ కుటుంబం కష్టాల్లోకి వెళ్లకుండా.. బీమా పరిహారం అండగా నిలుస్తుంది. బీమాకు అర్థం ఇదే. మనలో చాలా మంది తమకూ బీమా పాలసీ ఉందిలేనన్న భరోసాతో ఉంటుంటారు. పరిశీలించి చూస్తే కానీ తెలియదు వాస్తవంగా వారికి ఉన్న రక్షణ ఏపాటిదో. అందుకే జీవిత బీమా ప్లాన్లలో అసలు ఎన్నెన్ని రకాలున్నాయి? వాటిల్లో ఉండే ప్రయోజనాలపై అవగాహన అవసరం. ఆ వివరాలు అందించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. రెండే రకాలు.. స్థూలంగా పరిశీలిస్తే.. జీవిత బీమా పాలసీలు రెండు రకాలే. ఒక్కటి అచ్చమైన రక్షణనిచ్చేది (ప్రొటెక్షన్ ప్లాన్/టర్మ్ ప్లాన్). రెండో రకం.. ఎంతో కొంత బీమా రక్షణనిస్తూనే పెట్టుబడులు, రాబడుల ప్రయోజనాలతో కలిసి ఉండేవి. ప్రొటెక్షన్/టర్మ్ ప్లాన్లు అన్నవి పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే పరిహారం చెల్లిస్తాయి. బీమా, పెట్టుబడి ప్రయోజనాలతో ఉండే ఎండోమెంట్/మనీబ్యాక్ ప్లాన్లలో అలా కాదు. పాలసీదారు మరణించిన సందర్భంలో, కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించి ఉన్న సందర్భంలోనూ ప్రయోజనం లభిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అర్థం చేసుకునేందుకు ఎంతో సులువైన ఉత్పత్తి టర్మ్ ఇన్సూరెన్స్. వీటినే ప్రొటెక్షన్ ప్లాన్లు అంటుంటారు. మరణ ప్రమాదానికి రక్షణనిస్తాయి. పాలసీ కాల వ్యవధి ముగిసేలోపు ఎటువంటి కారణంతో అయిన పాలసీదారు మరణానికి గురైతే నామినీకి బీమా సంస్థ పరిహారం చెల్లిస్తుంది. సాధారణంగా ఈ ప్లాన్లు 85 సంవత్సరాల వరకు కవరేజినిస్తాయి. 99 సంవత్సరాల వరకు కవరేజీతో కేవలం కొన్ని బీమా సంస్థలు ప్లాన్లను అందిస్తున్నాయి. పాలసీ కాల వ్యవధిలో మరణించినట్టయితేనే ఈ ప్లాన్లలో పరిహారం చెల్లింపు ఉంటుంది. కాల వ్యవధి తర్వాత ఎటువంటి ప్రయోజనం అందదు. అందుకే ఈ ప్లాన్లపై ప్రీమియం ఆకర్షణీయంగా ఉంటుంది. ఎక్కువ బీమా కవరేజీ తక్కువ ప్రీమియానికే టర్మ్ ప్లాన్లలో లభిస్తుంది. అంతేకాదు మొదటి ఏడాది చెల్లించిన ప్రీమియం పాలసీ కాల వ్యవధి ముగిసేవరకు స్థిరంగా ఉంటుంది. ప్రీమియం పెరగడం ఉండదు. కాకపోతే పాలసీ ప్రీమియంలో భాగంగా ఉండే వస్తు సేవల పన్నును (జీఎస్టీ) ప్రభుత్వం సవరించినట్టయితే ఆ మేరకు ప్రీమియంలో మార్పులు ఉంటాయి. టర్మ్ ప్లాన్లు ఇవి.. ప్రొటెక్షన్ ప్లాన్లలో మళ్లీ వివిధ రకాలు ఏంటి? అని సందేహపడుతున్నారా.. వివిధ వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారిని ఆకర్షించేందుకు బీమా సంస్థలు ప్లాన్లలో సదుపాయాలను జోడిస్తుంటాయి. ► రెగ్యులర్ ప్లాన్: ఇది అచ్చమైన టర్మ్ ప్లాన్. 30 ఏళ్ల వ్యక్తి తనకు 70 ఏళ్లు వచ్చే వరకు అంటే 40 ఏళ్ల కాలానికి రూ.కోటి బీమా రక్షణను తీసుకుంటే వార్షిక ప్రీమియం సుమారు రూ.11,210 చెల్లిస్తే చాలు. వివిధ బీమా సంస్థల మధ్య ఈ ప్రీమియంలో వ్యత్యాసం ఉంటుంది. అంతేకాదు, పాలసీదారుల జీవనశైలి, ఆరోగ్య సమస్యలు కూడా ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి. ► రిటర్న్ ఆఫ్ ప్రీమియం: టర్మ్ ప్లాన్లే కానీ, పాలసీ కాలవ్యవధి ముగిసిన తర్వాత అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తం వెనక్కి వస్తుంది. జీవించి ఉంటే రూపాయి కూడా వెనక్కి రాని పాలసీలు ఎందుకు? అని భావించే వారికోసం రూపొందించిన పాలసీలు ఇవి. అందుకే ప్రీమియం వెనక్కి రాని టర్మ్ప్లాన్లతో పోలిస్తే.. వెనక్కి వచ్చే ప్లాన్ల ప్రీమియం 50–100 శాతం అధికంగా ఉంటుంది. ఇలా ఈ అదనపు ప్రీమియాన్ని బీమా సంస్థలు తీసుకెళ్లి పెట్టుబడులుగా పెడతాయి. అలా ప్రీమియంను వెనక్కిచ్చేస్తాయి. ఈ ప్లాన్‌ను 30 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల కాలానికి తీసుకుంటే వార్షిక ప్రీమియం రూ.18,000 స్థాయిలో ఉంటుంది. ► పరిహారం చెల్లింపుల్లో ఆప్షన్లు: టర్మ్ ప్లాన్లలో మరణ పరిహారాన్ని చెల్లించే విషయంలో పలు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో పరిహారాన్ని ఒకేసారి చెల్లించేయకుండా.. ముందు ఎంపిక చేసుకున్న మొత్తాన్ని చెల్లించి.. మిగిలిన భాగాన్ని ప్రతీ నెలా ఇంత చొప్పున కొన్నేళ్ల పాటు చెల్లించే విధంగా ఉంటుంది. ఉదాహరణకు రూ.50లక్షల ప్లాన్‌లో.. పాలసీదారు మరణించినట్టయితే బీమా సంస్థ రూ.10–20 లక్షలను ఒకే విడతగా ఇస్తుంది. మిగిలిన రూ.40–30 లక్షలను 10 నుంచి 20 ఏళ్ల కాలానికి ప్రతీ నెలా చెల్లించే విధంగా పాలసీల నిర్మాణం ఉంటుంది. దీనివల్ల బాధిత కుటుంబ నెలవారీ అవసరాలకు ఆదాయం ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది. ఒకే విడత భారీ పరిహారాన్ని అందుకుంటే దాన్ని తీసుకెళ్లి పెట్టుబడిగా పెట్టుకుని, ప్రతీ నెలా ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. అటువంటి వారు ఈ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ► సింగిల్ ప్రీమియం: కొందరు ఏటా ప్రీమియం చెల్లించేందుకు సౌకర్యంగా ఉండకపోవచ్చు. ఇటువంటి వారు ఒకే విడతగా ప్రీమియం చెల్లించేందుకు వీలు కల్పించేవే సింగిల్ ప్రీమియం ప్లాన్లు. ఇందులో ఏటా రెన్యువల్ చేసుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. కాకపోతే ఒకే విడత కనుక ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లాన్లు 85 ఏళ్ల వరకు తీసుకునేందుకు అవకాశం ఉంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి రూ.కోటి కవరేజీని ఎంపిక చేసుకుంటే సింగిల్ ప్రీమియం కింద రూ.1.8 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ► కవరేజీ పెరుగుతూ.. తరుగుతూ: ద్రవ్యోల్బణం, బాధ్యతలకు అనుగుణంగా టర్మ్ ప్లాన్‌లో వివిధ దశల్లో కవరేజీ పెరుగుతూ వెళ్లే ఆప్షన్ కూడా ఉంటుంది. అదే విధంగా కవరేజీ తగ్గుతూ వెళ్లే ఆప్షన్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. కవరేజీ పెరుగుతూ వెళ్లే ఆప్షన్ ఎంపిక చేసుకుంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. కానీ, కవరేజీ పెరిగిన ప్రతీసారి ప్రీమియం పెరగడం ఉండదు. వివిధ దశల్లో పెరిగే బాధ్యతలకు అనుగుణంగా పెరిగే కవరేజీ ఉపయోగకరంగా ఉంటుంది. ► హోల్‌లైఫ్: హోల్‌లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు 99–100 ఏళ్ల కాల వ్యవధితో ఉంటాయి. పాలసీదారు 99–100 ఏళ్లలోపు మరణించినట్టయితే పరిహారాన్ని నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు. నూరేళ్లు జీవించి ఉంటే.. అప్పుడు పాలసీదారుకు ఏక మొత్తంలో ప్రయోజనాన్ని బీమా సంస్థ చెల్లించేస్తుంది. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తికి హోల్‌లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో రూ.కోటి కవరేజీకి వార్షిక ప్రీమియం సుమారుగా రూ.15,000 వరకు ఉంటుంది. తమ తర్వాత పిల్లలకు ఎంతో కొంత మొత్తం నగదు ప్రయోజనం లభించాలన్న అభిలాష ఉంటే తప్ప.. వీటి అవసరం పెద్దగా ఉండదు. పిల్లలు జీవితంలో స్థిరపడి, తమ రుణ బాధ్యతలు పూర్తిగా ముగిసే కాలం వరకు జీవిత బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ► లిమిటెడ్ ప్రీమియం పీరియడ్: పాలసీ కాల వ్యవధి ఎంత కాలం ఉన్నా కానీ, కొన్నేళ్లే ప్రీమియం చెల్లించే ఆప్షన్లు కూడా ఉంటున్నాయి. 5, 10, 15, 20 ఏళ్ల పాటే ప్రీమియం చెల్లించొచ్చు. లేదంటే 60 ఏళ్ల కాలవ్యవధి వరకు ప్రీమియం చెల్లించే విధంగా ప్లాన్‌ను తీసుకోవచ్చు. ► ఎవరికి: మీపై ఆధారపడిన వారు ఉంటే, రుణ బాధ్యతలు ఉన్నట్టయితే టర్మ్ప్లాన్ను తగినంత కవరేజీతో తీసుకోవాలి. వార్షికాదాయానికి 10–20 రెట్ల వరకు కవరేజీ ఉండాలన్నది ఆర్థిక సలహాదారుల సూచన. రుణ బాధ్యతలు దీనికి అదనం. ఒకవేళ రిటైర్ అయిన వారు, తమపై ఎవరూ ఆధారపడి లేని వారికి జీవిత బీమా అవసరం ఉండదు. సంప్రదాయ బీమా ప్లాన్లు ఇవి జీవిత బీమా, పెట్టుబడి కలగలసిన ప్లాన్లు. చెల్లించే ప్రీమియం పరంగా చూస్తే బీమా రక్షణ స్వల్పంగానే ఉంటుంది. ఎందుకంటే రాబడులను ఇవ్వాలి కనుక తీసుకునే ప్రీమియంలో కొంత కవరేజీకి మినహాయించి మిగిలిన మొత్తాన్ని పెట్టుబడులకు బీమా కంపెనీలు మళ్లిస్తాయి. ► ఎండోమెంట్ ప్లాన్: పాలసీదారు మరణించిన సందర్భాల్లో నామినీకి మరణ పరిహారం, బోనస్‌తోపాటు చెల్లింపులు ఉంటాయి. ఏటా కొంత చొప్పున బీమా సంస్థలు సమ్ అష్యూర్డ్‌పై బోనస్‌ను ప్రకటిస్తుంటాయి. పెట్టుబడిపై రాబడుల ఆధారంగా ఈ బోనస్ ఎంతన్నది ఉంటుంది. దీంతో పాలసీదారు మరణించేనాటికి జమ అయిన బోనస్‌తోపాటు బీమా మొత్తాన్ని చెల్లించే విధంగా ఒప్పందం ఉంటుంది. పాలసీదారు జీవించి ఉంటే కాల వ్యవధి ముగిసిన తర్వాత బోనస్‌తోపాటు, ముందుగా ఇచ్చిన హామీ మేరకు ఇతర ప్రయోజనాలను కంపెనీ చెల్లిస్తుంది. కనుక మరణించినా, జీవించినా కానీ ఈ ప్లాన్లలో ప్రయోజనం అందుతుంది. ఎక్కువ మందిని ఆకర్షించేది ఇదే. అందుకే, సరిపడా కవరేజీ తీసుకుంటున్నామా? అన్నది ప్రశ్నించుకోకుండా ఎక్కువ మంది ఎండోమెంట్ ప్లాన్ల వైపు మొగ్గు చూపుతుంటారు. రూ.10లక్షల కవరేజీతో ఎండోమెంట్ ప్లాన్ తీసుకోవాలంటే.. 30 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల టర్మ్ ప్లాన్ కోసం ఏటా ప్రీమియం రూ.50,000–60,000వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 20 ఏళ్ల కాలవ్యవధికి పదేళ్లపాటే ప్రీమియం చెల్లించే ఆప్షన్లో వార్షిక ప్రీమియం రూ.లక్ష వరకు ఉంటుంది. ► మనీబ్యాక్ ప్లాన్లు: పేరులోనే ఉన్నట్టు పాలసీ కాల వ్యవధిలోపు నిర్ణీత కాలానికోసారి చొప్పున నగదు ప్రయోజనాన్ని బీమా సంస్థ చెల్లింపులు చేస్తుంది. బోనస్‌ను పాలసీదారు మరణించిన సందర్భంలో లేదా కాలవ్యవధి చివర్లో చెల్లిస్తుంది. ఎండోమెంట్ ప్లాన్‌లో జీవించి ఉంటే చివర్లో కొంచెం పెద్ద మొత్తాన్నే అందుకోవచ్చు. మనీబ్యాక్ ప్లాన్‌లో ఐదేళ్లకు ఒకసారి ఎంతో కొంత బీమా సంస్థ చెల్లిస్తుంటుంది కనుక చివర్లో లభించేది కొద్ది మొత్తమే అని అర్థం చేసుకోవాలి. పిల్లల విద్యావసరాల కోసం మధ్య మధ్యలో కొంత చొప్పున నగదు ప్రయోజనం రావాలని కోరుకునే వారు మనీబ్యాక్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. టర్మ్ ప్లాన్లతో పోలిస్తే వీటి ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది. 30 ఏళ్ల వ్యక్తి రూ.10లక్షల కవరేజీని 20 ఏళ్ల కాలానికి ఎంపిక చేసుకుంటే వార్షికంగా రూ.1.20లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. ► ఎవరికి: మెరుగైన పెట్టుబడుల ప్రణాళికను అమలు చేయలేని వారు, ఇతర పెట్టుబడి సాధనాలను అర్థం చేసుకోలేని వారు వీటిని ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ రాబడి, రక్షణనిచ్చే ఈ ప్లాన్లు బీమా రక్షణ కోణం నుంచి చూస్తే అనుకూలమైనవి కావు. పన్ను ఆదా పరంగా చూసినా అంత ఆకర్షణీయమైన సాధనం కాదని తెలుసుకోవాలి. ► యులిప్‌లు: బీమా, పెట్టుబడి ఆధారిత ప్లాన్లే ఇవి కూడా. కాకపోతే ఈక్విటీ పెట్టుబడులకు యులిప్‌లు అవకాశం కల్పిస్తాయి. సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లు అన్నవి కేవలం డెట్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి. యులిప్‌లలో ఈక్విటీ, డెట్ రెండింటినీ ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీకి అవకాశం ఉంటుంది కనుక దీర్ఘకాలంలో ఎండోమెంట్ ప్లాన్లతో పోలిస్తే కాస్త మెరుగైన రాబడులకు యులిప్‌లలో అవకాశం ఉంటుంది. యులిప్‌లలో కనీసం ఐదేళ్ల వరకు ప్రీమియం చెల్లించి.. ఆ తర్వాత ఆపేసినా నష్టం ఉండదు. కాల వ్యవధి వరకు బీమా కవరేజీ కొనసాగుతుంది. ఇందులో కూడా ప్రీమియం చాలా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ప్రీమియంలో ఎక్కువ భాగం పెట్టుబడులకు వెళుతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి యులిప్‌ను ఎంపిక చేసుకుంటే రూ.10 లక్షల కవరేజీ కోసం వార్షికంగా రూ.లక్ష ప్రీమియంగా చెల్లించుకోవాలి. మధ్యలో విరమించుకోకుండా పాలసీ కాలవ్యవధి వరకు కొనసాగాలని గట్టిగా నిర్ణయించుకుంటే ఎండోమెంట్ ప్లాన్ బదులు యులిప్‌లను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది. యులిప్‌లలో పూర్తిగా ఈక్విటీ పెట్టుబడుల ఆప్షన్‌ను లేదంటే ఈక్విటీ, డెట్ కలయికతో ప్లాన్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. అంతేకాదు ఈక్విటీ మార్కెట్లు బాగా పెరిగిపోయాయని భావించినట్టయితే ఈక్విటీ నుంచి డెట్‌కు పెట్టుబడులను మళ్లించుకోవచ్చు. అదే విధంగా ఈక్విటీ మార్కెట్లు పడిపోయిన సందర్భాల్లో డెట్ భాగం నుంచి పూర్తిగా ఈక్విటీకి మళ్లిపోయే విధంగా ఇందులో స్వేచ్ఛ ఉంటుంది. మొత్తానికి తమకు ఏదైనా వాటిల్లితే తమ కుటుంబానికి ఎంత అవసరమో ఆ మేరకు బీమా కవరేజీ తీసుకోవడం ముఖ్యం. ఇందుకోసం టర్మ్ ప్లాన్‌ను తీసుకుని, వెసులుబాటు మేరకు పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్స్, నేరుగా స్టాక్స్, ఇతర సాధనాలను పరిశీలించొచ్చు. ఈ దశలో అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. -
టర్మ్ పాలసీలపై ఐసీఐసీఐ దృష్టి
♦ టర్మ్ పాలసీల నుంచి ఏటా రెట్టింపు ప్రీమియం ఆదాయ లక్ష ్యం ♦ సంప్రదాయ ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీలకు తగ్గుతున్న డిమాండ్ ♦ ఇన్వెస్ట్మెంట్ కోసం యులిప్‌ల వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు ♦ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సందీప్ బాత్ర హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాలసీదారుల ఆలోచనలో మార్పువస్తోందని, సంప్రదాయ ఎండోమెంట్ పాలసీల కంటే అధిక బీమా రక్షణ ఇచ్చే టర్మ్ పాలసీలకే మొగ్గు చూపుతున్నట్లు ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ అంటోంది. గతంలో వలే బీమాను ఇన్వెస్ట్మెంట్గా చూడకుండా ఆర్థిక రక్షణ కల్పించే సాధనంగా చూడటంతో టర్మ్ ఇన్సూరెన్స్‌కి డిమాండ్ పెరుగుతున్నట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సందీప్ బాత్ర తెలిపారు. ప్రస్తుతం మొత్తం బీమా వ్యాపారంలో టర్మ్ ఇన్సూరెన్స్ వాటా రెండు శాతంగానే ఉందని, కానీ ఈ విభాగం వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా బాత్ర ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. 2014లో ఐఆర్డీఏ 37 కొత్త టర్మ్ పాలసీలకు అనుమతిస్తే, ఈ సంఖ్య 2015 నాటికి 97కి చేరిందన్నారు. ఐసీఐసీఐ ఈ మధ్యనే విడుదల చేసిన ఐ ప్రోటక్ట్ స్మార్ట్‌కు మంచి స్పందన వస్తోందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ. 49 కోట్ల నుంచి రూ. 78 కోట్లకు పెరిగిందని వచ్చే ఏడాది ఈ మొత్తం రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. హోమ్‌లోన్ వంటి దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న వారు వాటితో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం కూడా డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా చెపుతున్నారు. గతంతో పోలిస్తే అనేక ఇన్వెస్ట్మెంట్ సాధనాలు అందుబాటులోకి రావడంతో బీమాను ఇన్వెస్ట్మెంట్గా చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. ట్యాక్స్ ప్రయోజనాలు దృష్ట్యా రిటైర్మెంట్ పాలసీలు కూడా అంత ఆకర్షణీయంగా లేకపోవడంతో రిటైర్మెంట్ పాలసీల అమ్మకాలు కూడా తగ్గుతున్నాయన్నారు. కానీ రిస్క్ చేసే సామర్థ్యం ఉన్న వారు మాత్రం యులిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ విషయానికి వస్తే 2013లో మొత్తం అమ్మకాల్లో 45.5 శాతంగా ఉన్న సంప్రదాయ బీమా పాలసీల వాటా ఇప్పుడు 15.4 శాతానికి పడిపోయిందని, ఇదే సమయంలో యులిప్ అమ్మకాలు 54.5 శాతం నుంచి 84.6 శాతానికి చేరిందన్నారు. స్టాక్ మార్కెట్లు పెరగడం కూడా యులిప్స్ అమ్మకాలు పెరగడానికి ఒక కారణంగా ఆయన పేర్కొన్నారు. -
అవసరానికి తగ్గ బీమా ఉంటే మీరే మిస్టర్ ధీమా!
టర్మ్, ఎండోమెంట్, మనీ బ్యాక్, యులిప్, రిటైర్మెంట్, హెల్త్... ఇలా రకరకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ పాలసీని తీసుకోవాలన్నదే పెద్ద సమస్య. ఎందుకంటే ఒక్కో పాలసీ ఒక్కో అవసరానికి పనికొస్తుంది. కొన్ని పాలసీలైతే ప్రతి ఒక్కరూ తీసుకోవాలి కూడా. మరి ఎవరెలాంటి పాలసీ తీసుకోవాలి? ఏ వయసు వారికి ఏది ముఖ్యం? ఈ అయోమయం చాలామందికి ఉంది. అలాంటి వారికోసమే... మార్కెట్లో ఉన్న వివిధ రకాల పాలసీలు, వాటి ప్రయోజనాలపై సాక్షి ‘ప్రాఫిట్’ అందిస్తున్న ఈ కథనం... బీమా పాలసీలు ప్రధానంగా వ్యక్తుల ఆర్థిక లక్ష్యాలు, ప్రీమియం చెల్లించే స్తోమతను బట్టి తీసుకుంటుంటారు. పాలసీదారు వయసు కూడా దీన్లో ప్రధానమే. ఎందుకంటే వయసును బట్టే ప్రీమియం. తక్కువ వయసున్న వారికైతే తక్కువ ప్రీమియం. అదే వయసు పెరిగితే ప్రీమియం కూడా ఎక్కువే చెల్లించాలి. దాదాపు అన్ని కంపెనీలూ ఆఫర్ చేస్తున్న వివిధ పాలసీలను ఒకసారి చూస్తే... టర్మ్ పాలసీ కేవలం బీమా రక్షణే ఉంటుంది. ఎలాంటి అదనపు ప్రయోజనాలూ ఉండవు. అంటే... పాలసీదారు మరణించినపుడు మాత్రమే తన కుటుంబీకులకు బీమా చేసిన మొత్తం చేతికందుతుంది. ఈ పాలసీలో ఎటువంటి మెచ్యూరిటీ కూడా ఉండదు. అంటే పాలసీ గడువు ముగిశాక కూడా పాలసీదారుకు ఎలాంటి సొమ్మూ చేతికి రాదు. కాకపోతే మిగిలిన బీమా పథకాలతో పోలిస్తే వీటి ప్రీమియం చాలా తక్కువ. ఉదాహరణకు ఓ 35 ఏళ్ల వ్యక్తి ఏడాదికి 10 వేలు కడితే దాదాపు 50 లక్షల వరకూ బీమా కవరేజీ ఉంటుంది. కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన పాలసీ ఇది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా కవరేజీ అందిస్తుండటంతో ఇపుడు టర్మ్ పాలసీలకు బాగా ప్రాచుర్యం పెరుగుతోంది. దీర్ఘకాలానికి ఈ పాలసీని తీసుకుంటే వయసు పెరుగుతున్నా తక్కువ ప్రీమియంతోనే బీమా ప్రయోజనాన్ని కొనసాగించే అవకాశముంది. కొన్ని బీమా కంపెనీలు ఆన్లైన్లో చాలా తక్కువ ప్రీమియానికే అందిస్తున్నాయి. ఎవరికి అనుకూలం: ప్రతి ఒక్కరికీ తప్పనిసరే. వార్షిక జీతానికి కనీసం 20 రెట్లు ఉండేలా చూసుకోవాలి. వయసుతో పాటు బాధ్యతలు, హౌసింగ్ లోన్ వంటి ఇతర రుణాలుంటే ఆ మేరకు బీమా రక్షణ కూడా పెంచుకోవాలి. ఉదా: ఎల్ఐసీ అన్మోల్ జీవన్1, అమూల్య జీవన్1, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐకేర్, ప్యూర్ ప్రొటెక్ట్లు ఎండోమెంట్ ప్లాన్... ఎలాంటి రిస్కూ లేకుండా స్థిరమైన ఆదాయంతో పాటు బీమా రక్షణ కావాలనుకునే వారికి ఎండోమెంట్ పాలసీలు బెటర్. నిర్దిష్ట కాలానికి బీమా రక్షణ కల్పిస్తూ, కాలపరిమితి ముగిశాక మెచ్యూరిటీ కింద మొత్తం సొమ్మును ఒకేసారి అందిస్తాయి. పైగా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇవి సాధారణంగా 10, 15, 20, 30 ఏళ్ళ కాలపరిమితుల్లో లభిస్తుంటాయి. ఎవరికి అనుకూలం: సొంతిల్లు, కారు, పిల్లల చదువు వంటి ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఇవి అనుకూలం. మీ లక్ష్యం, కాలపరిమితి ప్రకారం పాలసీని ఎంచుకోవచ్చు. ఎంత చిన్న వయసులో ప్రారంభిస్తే ఇన్వెస్ట్మెంట్ పరంగా అంత అధిక ప్రయోజనం ఉంటుంది. 40 ఏళ్లు దాటితే ప్రీమియం పెరుగుతుంది. ఉదా: ఎల్ఐసీ జీవన్ ఆనంద్, జీవన్‌మిత్ర, జీవన్ అమృత్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సేవింగ్స్ సురక్ష, సేవింగ్ అండ్ ప్రొటెక్ట్, క్యాష్ అడ్వాంటేజ్ మనీ బ్యాక్ ప్లాన్ వయసుతో పాటు ఖర్చులూ పెరుగుతుంటాయి. ఇలా ఖర్చులు పెరుగుతున్నపుడు మధ్య మధ్యలో అవసరాలకు నగదు కావాలనుకునే వారికి మనీ బ్యాక్ పథకాలు అనువుగా ఉంటాయి. వీటి పనితీరు అచ్చం ఎండోమెంట్ పథకాల్లానే ఉన్నా మధ్య మధ్యలో నిర్ధిష్ట కాలపరిమితుల్లో నగదును వెనక్కి ఇస్తుంటాయి. సాధారణంగా ప్రతి మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి చొప్పున ఇవి నగదును వెనక్కి ఇస్తుంటాయి. ఈ మేరకు మెచ్యూరిటీ సమయంలో అందుకునే మొత్తం తగ్గుతుంది. అంతేకాక ఇలా మధ్యమధ్యలో నగదును వెనక్కి ఇస్తాయి కాబట్టి ఎండోమెంట్ పాలసీల కంటే మనీ బ్యాక్ పాలసీల ప్రీమియం అధికంగా ఉంటుంది. ఎవరికి అనుకూలం: వేన్నీళ్ళకి చన్నీళ్లు తోడు అన్నట్లు మధ్య మధ్యలో నగదు కావాలనుకునే వారు మనీ బ్యాక్ పాలసీలకేసి చూడొచ్చు. కాని వీటి ప్రీమియం ఎక్కువగా ఉండటంతో పాటు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇతర పాలసీల కంటే తక్కువ రాబడిని అందిస్తాయి. ఉదా: ఎల్ఐసీ జీవన్ బచత్, జీవన్ సురభి, ఐసీఐసీఐ ప్రు క్యాస్‌బ్యాక్ యులిప్స్ రిస్క్ చేయగల సామర్థ్యం ఉండి, బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడి పొందాలనుకునే వారికి యూనిట్ ఆధారిత బీమా పథకాలు (యులిప్) అనువుగా ఉంటాయి. వీటి పనితీరు ఇంచుమించు మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉన్నా... వీటిల్లో బీమా రక్షణ అనేది అదనం. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి వాటి నుంచి వచ్చే లాభనష్టాలను ఇన్వెస్టర్లకు అందిస్తారు. అందువల్ల వీటి బీమా కవరేజీకి హామీ ఉంటుంది తప్ప రాబడులపై కచ్చితమైన హామీ ఉండదు. ఎవరికి అనుకూలం: దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి లాభాలను అందించడంలో ఈక్విటీలు ముందుంటాయి కనక పిల్లల చదువులు, పెళ్ళిళ్ల వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేయడానికి యులిప్‌లు అనువైనవి. ఎండోమెంట్ పాలసీలతో పోలిస్తే వీటి బీమా రక్షణ ప్రీమియం తక్కువే. కానీ 40 ఏళ్ళు దాటితే బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి ఆ మేరకు రిస్క్ తగ్గించుకోవాలి. కాబట్టి 40 ఏళ్ల లోపు యులిప్స్‌లో ఈక్విటీలకు ఎక్కువ కేటాయించినా, ఆ తర్వాత నుంచి క్రమేపీ తగ్గించుకుంటూ డెట్ పథకాల్లోకి మరల్చుకోవడం సురక్షితం. ఉదా: ఎల్ఐసీ ఎండోమెంట్ ప్లస్, ఫ్లెక్సీ ప్లస్, ఐసీఐసీఐ ప్రు లైఫ్ స్టేజ్ వెల్త్2, లైఫ్‌టైమ్ ప్రీమియర్, ఎలైట్ వెల్త్. హోల్‌లైఫ్ పాలసీలు ఇప్పుడు అనేక బీమా కంపెనీలు హోల్‌లైఫ్ పేరిట జీవిత కాలం లేదా 100 ఏళ్ళ వరకు బీమా రక్షణ కల్పిస్తున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల జీవితకాలం బీమా రక్షణ లభిస్తుంది. ఎవరికి అనుకూలం: జీవిత కాలం బీమా రక్షణ కావాలనుకునే వారికి ఇవి అనువైనవి. ఎంత చిన్న వయసులో తీసుకుంటే అంత తక్కువ ప్రీమియంతో జీవిత కాలం అంత ఎక్కువ బీమా రక్షణ పొందచ్చు. ఉదా: ఎల్ఐసీ జీవన్ తరంగ్, జీవన్ ఆనంద్, హోల్‌లైఫ్ పాలసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ హోల్‌లైఫ్ రిటైర్మెంట్ ప్లాన్ పదవీ విరమణ తర్వాత పెన్షన్ కావాలనుకునే వారికోసం రూపొందించినవే రిటైర్మెంట్ ప్లాన్స్. సాధారణంగా అన్ని బీమా కంపెనీలు 55- 60 ఏళ్ళు వచ్చాక పెన్షన్ వచ్చేలా రూపొందిం చాయి. అవసరాన్ని బట్టి ప్రతి నెలా లేదా మూడు నెలలకు ఒకసారి చొప్పున పెన్షన్ తీసుకోవచ్చు. ఎవరికి అనుకూలం: సంపాదన మొదలు పెట్టినప్పటి నుంచే రిటైర్మెంట్కు కేటాయించడం మొదలెడితే తక్కువ మొత్తంతోనే ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు. ఉద్యోగం చేస్తున్న సంస్థలో పెన్షన్ సౌకర్యం ఉన్నా ఇంకా అదనపు మొత్తం కావాలనుకునే వారికి ఇవి బెటర్. సాధారణంగా బీమా కంపెనీలు 45 ఏళ్ల లోపు వారినే ఇన్వెస్ట్ చేయడానికి అనుమతిస్తున్నాయి. ఉదా: ఎల్ఐసీ జీవన్ నిధి, ఐసీఐసీఐ ఈజీ రిటైర్మెంట్, శుభ్ రిటైర్మెంట్(యులిప్). హెల్త్పాలసీలు ఇప్పుడు వైద్య ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం కనక అందరూ వైద్య బీమా తీసుకోక తప్పని పరిస్థితులున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్‌లోనూ టర్మ్ పాలసీ మాదిరి క్లెయిమ్‌లు తప్ప మెచ్యూర్టీ ఉండదు. వ్యక్తిగత పాలసీలతో పాటు కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు వైద్య బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాలసీ తీసుకుంటే జేబులో డబ్బు లేకుండా చికిత్స చేయించుకోవచ్చు. ఎవరికి అనుకూలం: కుటుంబంలోని సభ్యులందరికీ వైద్య బీమా తప్పనిసరిగా ఉండాలి. క్రమం తప్పకుండా చెల్లిస్తూ, క్లెయిమ్‌లు లేకుంటే ప్రీమియం తగ్గటం లేక బీమా రక్షణ మొత్తం పెరగడం జరుగుతుంది. ఉదా: అపలో మ్యూనిచ్, స్టార్ హెల్త్ వంటి ఆరోగ్య బీమాకంపెనీలతో పాటు జీవిత బీమా కంపెనీలు ఇస్తున్నాయి.