అవసరానికి తగ్గ బీమా ఉంటే మీరే మిస్టర్ ధీమా! | Different insurance polices for relevant purposes | Sakshi
Sakshi News home page

అవసరానికి తగ్గ బీమా ఉంటే మీరే మిస్టర్ ధీమా!

Published Sun, Oct 27 2013 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM

అవసరానికి తగ్గ బీమా ఉంటే మీరే మిస్టర్ ధీమా!

అవసరానికి తగ్గ బీమా ఉంటే మీరే మిస్టర్ ధీమా!

టర్మ్, ఎండోమెంట్, మనీ బ్యాక్, యులిప్, రిటైర్మెంట్, హెల్త్... ఇలా రకరకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ పాలసీని తీసుకోవాలన్నదే పెద్ద సమస్య. ఎందుకంటే ఒక్కో పాలసీ ఒక్కో అవసరానికి పనికొస్తుంది. కొన్ని పాలసీలైతే ప్రతి ఒక్కరూ తీసుకోవాలి కూడా. మరి ఎవరెలాంటి పాలసీ తీసుకోవాలి? ఏ వయసు వారికి ఏది ముఖ్యం? ఈ అయోమయం చాలామందికి ఉంది. అలాంటి వారికోసమే... మార్కెట్లో ఉన్న వివిధ రకాల పాలసీలు, వాటి ప్రయోజనాలపై సాక్షి ‘ప్రాఫిట్’ అందిస్తున్న ఈ కథనం...
 
బీమా పాలసీలు ప్రధానంగా వ్యక్తుల ఆర్థిక లక్ష్యాలు, ప్రీమియం చెల్లించే స్తోమతను బట్టి తీసుకుంటుంటారు. పాలసీదారు వయసు కూడా దీన్లో ప్రధానమే. ఎందుకంటే వయసును బట్టే ప్రీమియం. తక్కువ వయసున్న వారికైతే తక్కువ ప్రీమియం. అదే వయసు పెరిగితే ప్రీమియం కూడా ఎక్కువే చెల్లించాలి. దాదాపు అన్ని కంపెనీలూ ఆఫర్ చేస్తున్న వివిధ పాలసీలను ఒకసారి చూస్తే...
 
టర్మ్ పాలసీ
కేవలం బీమా రక్షణే ఉంటుంది. ఎలాంటి అదనపు ప్రయోజనాలూ ఉండవు. అంటే... పాలసీదారు మరణించినపుడు మాత్రమే తన కుటుంబీకులకు బీమా చేసిన మొత్తం చేతికందుతుంది. ఈ పాలసీలో ఎటువంటి మెచ్యూరిటీ కూడా ఉండదు. అంటే పాలసీ గడువు ముగిశాక కూడా పాలసీదారుకు ఎలాంటి సొమ్మూ చేతికి రాదు. కాకపోతే మిగిలిన బీమా పథకాలతో పోలిస్తే వీటి ప్రీమియం చాలా తక్కువ. ఉదాహరణకు ఓ 35 ఏళ్ల వ్యక్తి ఏడాదికి 10 వేలు కడితే దాదాపు 50 లక్షల వరకూ బీమా కవరేజీ ఉంటుంది. కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన పాలసీ ఇది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా కవరేజీ అందిస్తుండటంతో ఇపుడు టర్మ్ పాలసీలకు బాగా ప్రాచుర్యం పెరుగుతోంది. దీర్ఘకాలానికి ఈ పాలసీని తీసుకుంటే వయసు పెరుగుతున్నా తక్కువ ప్రీమియంతోనే బీమా ప్రయోజనాన్ని కొనసాగించే అవకాశముంది. కొన్ని బీమా కంపెనీలు ఆన్‌లైన్‌లో చాలా తక్కువ ప్రీమియానికే అందిస్తున్నాయి.
ఎవరికి అనుకూలం: ప్రతి ఒక్కరికీ తప్పనిసరే. వార్షిక జీతానికి కనీసం 20 రెట్లు ఉండేలా చూసుకోవాలి. వయసుతో పాటు బాధ్యతలు, హౌసింగ్ లోన్ వంటి ఇతర రుణాలుంటే ఆ మేరకు బీమా రక్షణ కూడా పెంచుకోవాలి.
ఉదా: ఎల్‌ఐసీ అన్‌మోల్ జీవన్1, అమూల్య జీవన్1, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐకేర్, ప్యూర్ ప్రొటెక్ట్‌లు
 
ఎండోమెంట్ ప్లాన్...
ఎలాంటి రిస్కూ లేకుండా స్థిరమైన ఆదాయంతో పాటు బీమా రక్షణ కావాలనుకునే వారికి ఎండోమెంట్ పాలసీలు బెటర్. నిర్దిష్ట కాలానికి బీమా రక్షణ కల్పిస్తూ, కాలపరిమితి ముగిశాక మెచ్యూరిటీ కింద మొత్తం సొమ్మును ఒకేసారి అందిస్తాయి. పైగా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇవి సాధారణంగా 10, 15, 20, 30 ఏళ్ళ కాలపరిమితుల్లో లభిస్తుంటాయి.
ఎవరికి అనుకూలం: సొంతిల్లు, కారు, పిల్లల చదువు వంటి ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఇవి అనుకూలం. మీ లక్ష్యం, కాలపరిమితి ప్రకారం పాలసీని ఎంచుకోవచ్చు. ఎంత చిన్న వయసులో ప్రారంభిస్తే ఇన్వెస్ట్‌మెంట్ పరంగా అంత అధిక ప్రయోజనం ఉంటుంది. 40 ఏళ్లు దాటితే ప్రీమియం పెరుగుతుంది.
ఉదా: ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్, జీవన్‌మిత్ర, జీవన్ అమృత్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సేవింగ్స్ సురక్ష, సేవింగ్ అండ్ ప్రొటెక్ట్, క్యాష్ అడ్వాంటేజ్
 
మనీ బ్యాక్ ప్లాన్
వయసుతో పాటు ఖర్చులూ పెరుగుతుంటాయి. ఇలా ఖర్చులు పెరుగుతున్నపుడు మధ్య మధ్యలో అవసరాలకు నగదు కావాలనుకునే వారికి మనీ బ్యాక్ పథకాలు అనువుగా ఉంటాయి. వీటి పనితీరు అచ్చం ఎండోమెంట్ పథకాల్లానే ఉన్నా మధ్య మధ్యలో నిర్ధిష్ట కాలపరిమితుల్లో నగదును వెనక్కి ఇస్తుంటాయి. సాధారణంగా ప్రతి మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి చొప్పున ఇవి నగదును వెనక్కి ఇస్తుంటాయి. ఈ మేరకు మెచ్యూరిటీ సమయంలో అందుకునే మొత్తం తగ్గుతుంది. అంతేకాక ఇలా మధ్యమధ్యలో నగదును వెనక్కి ఇస్తాయి కాబట్టి ఎండోమెంట్ పాలసీల కంటే మనీ బ్యాక్ పాలసీల ప్రీమియం అధికంగా ఉంటుంది.
ఎవరికి అనుకూలం: వేన్నీళ్ళకి చన్నీళ్లు తోడు అన్నట్లు మధ్య మధ్యలో నగదు కావాలనుకునే వారు మనీ బ్యాక్ పాలసీలకేసి చూడొచ్చు. కాని వీటి ప్రీమియం ఎక్కువగా ఉండటంతో పాటు ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఇతర పాలసీల కంటే తక్కువ రాబడిని అందిస్తాయి.
ఉదా: ఎల్‌ఐసీ జీవన్ బచత్, జీవన్ సురభి, ఐసీఐసీఐ ప్రు క్యాస్‌బ్యాక్
 
యులిప్స్
రిస్క్ చేయగల సామర్థ్యం ఉండి, బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడి పొందాలనుకునే వారికి యూనిట్ ఆధారిత బీమా పథకాలు (యులిప్) అనువుగా ఉంటాయి. వీటి పనితీరు ఇంచుమించు మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉన్నా... వీటిల్లో బీమా రక్షణ అనేది అదనం. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి వాటి నుంచి వచ్చే లాభనష్టాలను ఇన్వెస్టర్లకు అందిస్తారు. అందువల్ల వీటి బీమా కవరేజీకి హామీ ఉంటుంది తప్ప రాబడులపై కచ్చితమైన హామీ ఉండదు.
ఎవరికి అనుకూలం: దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి లాభాలను అందించడంలో ఈక్విటీలు ముందుంటాయి కనక పిల్లల చదువులు, పెళ్ళిళ్ల వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేయడానికి యులిప్‌లు అనువైనవి. ఎండోమెంట్ పాలసీలతో పోలిస్తే వీటి బీమా రక్షణ ప్రీమియం తక్కువే. కానీ 40 ఏళ్ళు దాటితే బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి ఆ మేరకు రిస్క్ తగ్గించుకోవాలి. కాబట్టి 40 ఏళ్ల లోపు యులిప్స్‌లో ఈక్విటీలకు ఎక్కువ కేటాయించినా, ఆ తర్వాత నుంచి క్రమేపీ తగ్గించుకుంటూ డెట్ పథకాల్లోకి మరల్చుకోవడం సురక్షితం.
ఉదా: ఎల్‌ఐసీ ఎండోమెంట్ ప్లస్, ఫ్లెక్సీ ప్లస్, ఐసీఐసీఐ ప్రు లైఫ్ స్టేజ్ వెల్త్2, లైఫ్‌టైమ్ ప్రీమియర్, ఎలైట్ వెల్త్.
 
హోల్‌లైఫ్ పాలసీలు
ఇప్పుడు అనేక బీమా కంపెనీలు హోల్‌లైఫ్ పేరిట జీవిత కాలం లేదా 100 ఏళ్ళ వరకు బీమా రక్షణ కల్పిస్తున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల జీవితకాలం బీమా రక్షణ లభిస్తుంది.
ఎవరికి అనుకూలం: జీవిత కాలం బీమా రక్షణ కావాలనుకునే వారికి ఇవి అనువైనవి. ఎంత చిన్న వయసులో తీసుకుంటే అంత తక్కువ ప్రీమియంతో జీవిత కాలం అంత ఎక్కువ బీమా రక్షణ పొందచ్చు.
ఉదా: ఎల్‌ఐసీ జీవన్ తరంగ్, జీవన్ ఆనంద్, హోల్‌లైఫ్ పాలసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ హోల్‌లైఫ్
 
రిటైర్మెంట్ ప్లాన్
పదవీ విరమణ తర్వాత పెన్షన్ కావాలనుకునే వారికోసం రూపొందించినవే రిటైర్మెంట్ ప్లాన్స్. సాధారణంగా అన్ని బీమా కంపెనీలు 55- 60 ఏళ్ళు వచ్చాక పెన్షన్ వచ్చేలా రూపొందిం చాయి. అవసరాన్ని బట్టి ప్రతి నెలా లేదా మూడు నెలలకు ఒకసారి చొప్పున పెన్షన్ తీసుకోవచ్చు.
ఎవరికి అనుకూలం: సంపాదన మొదలు పెట్టినప్పటి నుంచే రిటైర్మెంట్‌కు కేటాయించడం మొదలెడితే తక్కువ మొత్తంతోనే ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు. ఉద్యోగం చేస్తున్న సంస్థలో పెన్షన్ సౌకర్యం ఉన్నా ఇంకా అదనపు మొత్తం కావాలనుకునే వారికి ఇవి బెటర్. సాధారణంగా బీమా కంపెనీలు 45 ఏళ్ల లోపు వారినే ఇన్వెస్ట్ చేయడానికి అనుమతిస్తున్నాయి.
ఉదా: ఎల్‌ఐసీ జీవన్ నిధి, ఐసీఐసీఐ ఈజీ రిటైర్మెంట్, శుభ్ రిటైర్మెంట్(యులిప్).
 
హెల్త్‌పాలసీలు
ఇప్పుడు వైద్య ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం కనక అందరూ వైద్య బీమా తీసుకోక తప్పని పరిస్థితులున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్‌లోనూ టర్మ్ పాలసీ మాదిరి క్లెయిమ్‌లు తప్ప మెచ్యూర్టీ ఉండదు. వ్యక్తిగత పాలసీలతో పాటు కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు వైద్య బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాలసీ తీసుకుంటే జేబులో డబ్బు లేకుండా చికిత్స చేయించుకోవచ్చు.
ఎవరికి అనుకూలం: కుటుంబంలోని సభ్యులందరికీ వైద్య బీమా తప్పనిసరిగా ఉండాలి. క్రమం తప్పకుండా చెల్లిస్తూ, క్లెయిమ్‌లు లేకుంటే ప్రీమియం తగ్గటం లేక బీమా రక్షణ మొత్తం పెరగడం జరుగుతుంది.
ఉదా: అపలో మ్యూనిచ్, స్టార్ హెల్త్ వంటి ఆరోగ్య బీమాకంపెనీలతో పాటు జీవిత బీమా   కంపెనీలు ఇస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement