మొబైల్ ఫోన్ నుంచే వ్యాలెట్ల వినియోగం, బ్యాంకింగ్ సేవలు, డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగం బాగా విస్తృతమవుతోంది. అత్యాధునిక టెక్నాలజీలతో.. వినియోగదారులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల నుంచి డిజిటల్ లావాదేవీలు చక్కబెట్టేస్తున్నారు. ఈ కామర్స్ షాపింగ్ కూడా మొబైల్ ఫోన్ల నుంచే ఎక్కువగా కొనసాగుతోంది. ఆర్థిక లావాదేవీలు కానీయండి.. వినోదం, షాపింగ్, విద్య ఇలా ఒకటేమిటి ఎన్నో అవసరాల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడడం పట్టణ, నగర జీవనంలో భాగంగా మారిపోయింది. దీంతో సమాచారానికి భద్రతా రిస్క్ నెలకొంది. మొబైల్ ఫోన్ అయినా, కంప్యూటర్ అయినా.. సైబర్ నేరగాళ్లు కీలక సమాచారాన్ని కొల్లగొట్టేందుకు ఎన్నో మార్గాలు వెతుక్కుంటున్నారు. కనుక వినియోగదారులుగా మన బ్యాంకు ఖాతాలు, కార్డులు, ఫోన్లు, వ్యాలెట్‌లకు తగినంత భద్రత ఉందా? అన్నది సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఇటీవలే ఓ ఈ కామర్స్ పోర్టల్‌కు సంబంధించి 2 కోట్ల వినియోగదారుల వ్యక్తిగత వివరాలు లీకయ్యాయి. వెంటనే డార్క్ వెబ్‌లో ఈ వివరాలను అమ్మకానికి పెట్టడం కూడా జరిగిపోయింది. అదే విధంగా ఈ ఏడాది ఆగస్ట్‌లో 3,69,000 బ్యాంకింగ్ ఖాతాదారుల వివరాలను చోరీ చేసే ప్రయత్నం చోటు చేసుకుంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతాయే హ్యాకింగ్‌కు గురైందంటే సామాన్యుల ఖాతాలకు రక్షణ ఏ పాటిది? ఈ ఉదాహరణలన్నీ కూడా డిజిటల్ వేదికలపై మన సమాచారం చోరీకి గురికాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసేవే.
కవరేజీ అన్నింటికీ కాదు..
ఉద్దేశపూర్వక, నేరపూరిత, మోసపూరిత తదితర చర్యలకు పాలసీ కవరేజీ ఉండదు. అలాగే, ఈ ప్లాన్‌లు పాలసీదారులకు అయ్యే గాయాలకు గానీ, మానసిక, భావోద్వేగ ఇబ్బందులు తదితర వాటికి పరిహారం ఇవ్వవు. కంప్యూటర్లు, పరికరాలకు వాటిల్లే నష్టానికీ పరిహారం రాకపోవచ్చు. కనుక పాలసీ డాక్యుమెంట్‌ను ముందే పూర్తిగా చదవడం అవసరం.
క్లెయిమ్ ప్రక్రియ
ఇతర సాధారణ బీమా పాలసీల మాదిరే క్లెయిమ్ ప్రక్రియ ఉంటుంది. పోలీసు లేదా సైబర్ సెల్ నుంచి ఎఫ్‌ఐఆర్ కాపీ తీసుకుని, దానిని క్లెయిమ్ ఫామ్‌కు జత చేసి బీమా కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది. లావాదేవీలకు సంబంధించిన రుజువులను కూడా చూపించాలి. సైబర్ దాడి లేదా చోరీ జరిగిన వెంటనే బీమా సంస్థకు ఫోన్ రూపంలో లేదా ఈ మెయిల్ ద్వారా వెంటనే తెలియజేయడం మంచిది. కస్టమర్లు తమ సంస్థ పోర్టల్‌పై క్లెయిమ్ నమోదు చేసుకోవచ్చని లేదా కస్టమర్‌కేర్ విభాగానికి సమాచారం తెలియజేయవచ్చ ని ఐసీఐసీఐ లాంబార్డ్‌కు చెందిన సంజయ్‌దత్తా సూచించారు. క్లెయిమ్స్ మేనేజర్, సైబర్ నిపుణులు ఈ విషయంలో పాలసీదారుకు అవసరమైన సహకారాన్ని అందిస్తారని చెప్పారు.
రక్షణ కావాల్సిందే..
స్మార్ట్ పరికరాలను వాడే వారిలో అధిక శాతం మందికి.. మాల్వేర్, ఫైర్‌వాల్స్ విషయంలో రక్షణ గురించి అవగాహన లేదు. కార్యాలయాల్లో మనం వినియోగించే పరికరాలకు ఎక్కువ భద్రతే ఉంటుంది. కానీ, కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇంటి నుంచే పని విధానం (వర్క్ ఫ్రమ్ హోమ్) పెరిగిపోయింది. అందుకే ఇటీవలి కాలంలో సైబర్ ఇన్సూరెన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఉదాహరణకు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఇండివిడ్యువల్ సైబర్ ఇన్సూరెన్స్ కవరేజీ కోసం వివరాలు కోరే వారు 2020–21తొలి 6 నెలల్లో 20% అధికంగా ఉన్నట్టు కంపెనీ తెలియజేసింది.
ఇక ఫ్యూచర్ జన రాలి ఇండియా ఇన్సూరెన్స్ సైబర్ పాలసీలకూ డిమాండ్ 30–40% అధికమైంది. ‘‘సైబర్ దాడుల నుంచి సైబర్ ఇన్సూరెన్స్ మీకు రక్షణ ఇవ్వదు. కాకపోతే ఈ తరహా సైబర్ దాడుల కారణంగా మీకు వాటిల్లే నష్టానికి పరిహారాన్ని అందించే విధంగా ఉంటుంది. కీలకమైన సమాచారాన్ని చోరీ చేసినా, దుర్వినియోగం చేసినా లేక మీ ప్రతిష్టకు నష్టం కలుగజేసినా కవరేజీనిస్తుంది’’ అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ టీఏ రామలింగం తెలిపారు.
పాలసీ తీసుకునే ముందు
► రిస్క్‌ల మదింపు: ఆన్‌లైన్‌లో సైబర్ రిస్క్ ఏ స్థాయిలో ఉంది? డిజిటల్ లావాదేవీలను ఏ స్థాయిలో చేస్తున్నారు.. ఎన్ని రోజులకోసారి లేదా రోజువారీగా చేస్తున్నారా అన్నది పరిశీలించాలి. అదే విధంగా సోషల్ మీడియా ఖాతాల వినియోగం, డిజిటల్ లాకర్లు, డిజిటల్ స్టోరేజీలను కూడా వాడుతున్నారేమో చూసుకోవాలి.
► సరైన కవరేజీ: మీకున్న రిస్క్ స్థాయిని పూర్తిగా అంచనా వేసిన తర్వాత అవసరమైనంత కవరేజీతో పాలసీని తీసుకోవాలి. సాధారణంగా సైబర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు వ్యక్తులకు అయితే రూ.50వేల నుంచి రూ.2 కోట్ల వరకు కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి.
► సరైన సంస్థ: మీ అవసరాలన్నింటికీ కవరేజీనిచ్చే పాలసీని ఎంపిక చేసుకోవడం ముఖ్యమైన అంశం అయితే.. ఆ పాలసీని ఏ బీమా సంస్థ నుంచి తీసుకోవాలన్నది కూడా చాలా కీలకం అవుతుంది. ఇందుకోసం బీమా సంస్థ చెల్లింపుల చరిత్ర మంచిగా ఉన్నదా, లేదా అన్నది పరిశీలించాలి. తక్కువ చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థ నుంచి పాలసీని తీసుకుంటే.. ఆ తర్వాత మీకు క్లెయిమ్ అవసరం ఏర్పడినప్పుడు సమస్యలు ఎదురుకావచ్చు.
► సరైన కవరేజీలు: మీరు తీసుకునే పాలసీ సమగ్ర కవరేజీతో కూడిన ప్లాన్ అయి ఉండాలి. అందులో అవసరమైన కవరేజీలు అన్నీ ఉండేలా చూసుకోవాలి.
సరైన కవరేజీ
సైబర్ ఇన్సూరెన్స్ అన్నది.. సైబర్ దాడి లేదా సమాచార చోరీ అనంతరం అవసరమైన న్యాయ, రక్షణ, విచారణ ఖర్చులను చెల్లిస్తుంది. కోర్టు విచారణకు హాజరు అయ్యేందుకు ఖర్చులను కూడా చెల్లిస్తుంది. చోరీకి గురైన డేటాను తిరిగి పొందడంతోపాటు, ఇన్‌స్టాలేషన్‌కు అయ్యే వ్యయాలను కూడా చెల్లిస్తుంది. గోప్యత, సమాచార ఉల్లంఘనల్లో మూడో పక్షానికి వాటిల్లే నష్టానికి కూడా పరిహారం అందిస్తుంది. అంతేకాదు ఆర్థికంగా ఏర్పడే నష్టాన్ని కూడా (మీరు తీసుకున్న కవరేజీకి లోబడి) భర్తీ చేస్తుంది. ‘‘కరోనా మహమ్మారి సమయంలో చాలా వరకు సంస్థలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ నమూనాను అనుసరించాయి. దీంతో సంస్థలు తమ ఐటీ అప్లికేషన్ల సేవలను, డేటాబేస్‌లను క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లపైకి మళ్లించడంతో సైబర్ దాడుల రిస్క్ పెరిగింది. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు ఉపయోగించే నెట్‌వర్క్‌లు పూర్తి స్థాయి రక్షణతో ఉన్నవి కావు. దీంతో సైబర్ దాడుల బారిన పడే రిస్క్ ఎక్కువైంది’’ అని ఐసీఐసీఐ లాంబార్డ్ అండర్‌రైటింగ్, క్లెయిమ్స్, రీఇన్సూరెన్స్ చీఫ్ సంజయ్‌దత్తా వివరించారు.
వీటిని మర్చిపోవద్దు..
సైబర్ బీమా తీసుకుంటే చాలులే అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు. ప్రతీ ఒక్కరూ తమకంటూ ఉన్న రిస్క్‌లు ఏవేవి? అన్నది పరిశీలించుకుని, వాటికి కవరేజీనిచ్చే పాలసీని ఎంచుకోవడం కీలకం అవుతుంది. అంతేకాదు, అవసరమైన యాడాన్ కవరేజీలను కూడా జోడించుకోవాలి. ఇందులో ముఖ్యంగా రిస్క్ పరిమాణాన్ని అంచనా వేయాలి. ఇందుకుగాను ఇంటర్నెట్ వేదికపై ఎంత విలువ మేర ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నదీ చూడాల్సి ఉంటుంది. తరచూ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను, అదే విధంగా కార్డు చెల్లింపులు, ఈ వ్యాలెట్లను వినియోగించే వారు అయితే సైబర్ ఇన్సూరెన్స్‌ను తప్పకుండా తీసుకోవడం మంచిదని ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీరాజ్ దేశ్‌పాండే సూచించారు.
రక్షణ చర్యలు
సైబర్ బీమా తీసుకోవడం ఒక విధమైన రక్షణ అయితే.. మరోవైపు ఈ సైబర్ దాడుల బారిన పడకుండా మనవంతు రక్షణ చర్యలు తీసుకోవడం కూడా అవసరమే. ఇందుకోసం ఏం చేయాలంటే..
► కంప్యూటర్‌కు రక్షణ: మొదటగా చేయాల్సింది ఇదే. కంప్యూటర్ నుంచి ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసే వారు తప్పకుండా యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎక్కువ రక్షణనిచ్చే సాఫ్ట్‌వేర్‌ను ఎంచుకోవాలి. దీనిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ కూడా చేసుకోవాలి.
► పటిష్ట పాస్‌వర్డ్‌లు: కొంత మంది అయితే పాస్‌వర్డ్‌లను ఎప్పటికీ మార్చకుండా వాటినే వినియోగిస్తుంటారు. కానీ ఇది చాలా రిస్క్‌తో కూడినది. పాస్‌వర్డ్‌లను ఇంకొకరు సులభంగా ఊహించే విధంగా ఉండకుండా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. పాస్‌వర్డ్‌లో నంబర్లు, ప్రత్యేక క్యారెక్టర్లు తప్పక ఉండాలి. ఎప్పటికప్పుడు పాస్‌వర్డ్‌లను మార్చుకుంటూ ఉండాలి.
► సోషల్ మీడియా ఖాతాలకు రక్షణ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై మీ ప్రొఫైల్‌ను ప్రైవేటు అకౌంట్స్ కోసమే అని ఎంచుకోవాలి. దాంతో మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మాత్రమే వాటిని చూడగలరు. అకౌంట్‌ను ప్రైవేటుగా ఎంచుకునే ఆప్షన్ అన్ని ప్లాట్‌ఫామ్‌లపైనా ఉంది.
► ఫిషింగ్ ఈమెయిల్స్‌తో జాగ్రత్త: ఈ మెయిల్స్‌కు వచ్చే ప్రతీ సందేశంపైనా క్లిక్ చేయకూడదు. క్లిక్ చేసే ముందు సోర్స్ చూడాలి. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? మీకు తెలిసిన వేదిక నుంచేనా అన్నది పరిశీలించుకోవాలి. బహుమతులు, మంచి ఆఫర్లు అంటూ తెలియని వేదికలు, కొత్త వేదికల నుంచి వచ్చే మెయిల్స్‌ను కూడా ముట్టుకోకుండా ఉండడమే మంచిది
► డేటా రక్షణ: మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఫైల్స్‌కు ఎన్‌క్రిప్షన్ ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు బ్యాకప్ కూడా తీసుకోవడం మర్చిపోవద్దు.
► మొబైల్ ఫోన్‌కు రక్షణ: మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు కూడా మంచి యాంటీ వైరస్ అవసరం ఎంతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment