
అలోక్ అగర్వాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైబర్ దాడుల ముప్పు తీవ్రమవుతున్న నేపథ్యంలో సైబర్ లయబిలిటీ బీమా పాలసీలకు క్రమంగా ఆదరణ పెరుగుతోందని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలోక్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఈ మార్కెట్ సుమారు రూ. 30 కోట్లుగా ఉందని.. వచ్చే ఏడాది వ్యవధిలో రూ. 75 కోట్లకు చేరవచ్చన్న అంచనాలు ఉన్నాయని ఆయన వివరించారు. తాము త్వరలోనే వ్యక్తిగత సైబర్ పాలసీని కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు అగర్వాల్ శుక్రవారమిక్కడ విలేకరులకు చెప్పారు.
దీనికి ఇటీవలే బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ అనుమతులు లభించాయన్నారు. మరోవైపు, వాహన విక్రయాలు మందగించడం .. మోటార్ పాలసీల విభాగంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అగర్వాల్ తెలిపారు. అయితే, బీమా పాలసీ నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు విధించేలా మోటార్ వాహనాల చట్టంలో తెచ్చిన సవరణలు కాస్త ఊతమిచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి టెక్నాలజీలను ఉపయోగించి, ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని అగర్వాల్ వివరించారు.