
ఒకప్పుడు గుండెపోటు వంటివి కాస్త పెద్ద వయసు వారికే వచ్చేవి. ఇపుడు వయసుతో సంబంధం లేకుండా దీనికి గురవుతున్నారు. గుండెకు ఉన్న అత్యధిక ప్రాధాన్యం దృష్ట్యా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇటీవలే ’కార్డియాక్ కేర్’ పేరుతో హార్ట్ ప్లాన్ తెచ్చింది. గుండె సంబంధిత అనారోగ్య సమస్యలకయ్యే వైద్య ఖర్చులను ఇది భరిస్తుంది. సాధారణంగా క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీలు అన్ని ముఖ్యమైన అనారోగ్యాలను కవర్ చేస్తాయి. కానీ, విడిగా ఒక్కో అవయవానికి సంబంధించిన ప్లాన్‌ను తీసుకుంటే, కవరేజీ సమగ్రంగా లభిస్తుంది. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ తీసుకొచ్చిన కార్డియాక్ కేర్‌ను ఓ సారి పరిశీలించాల్సిందే...
18–65 ఏళ్ల వయసు వారు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. కనిష్టంగా 5 సంవత్సరాలు, గరిష్టంగా 40 సంవత్సరాల వరకు కవరేజీ పొందొచ్చు. కనీసం రూ.2 లక్షలు, గరిష్టంగా రూ.50 లక్షల కవరేజీని పొందే అవకాశం ఉంది. గుండెకు సంబంధించి 18 రకాల అనారోగ్య సమస్యలకు హెచ్‌డీఎఫ్‌సీ కార్డియాక్ కేర్‌లో కవరేజీ పొందొచ్చు. ప్రతి మూడేళ్లకోసారి ప్రీమియాన్ని కంపెనీ సవరిస్తుంటుంది. ప్రీమియంలో మార్పు ఉంటే అది అమల్లోకి రావడానికి ముందే ఆ విషయాన్ని పాలసీదారునికి నోటీసు రూపంలో తెలియజేస్తుంది. ప్రీమియం చెల్లింపునకు 30 రోజుల సమయాన్ని కూడా ఇస్తోంది.
పాలసీ ప్రయోజనాలు
ఈ పాలసీలో ఉన్న ప్రయోజనం కవరేజీలో పేర్కొన్న ఏదేనీ గుండె అనారోగ్యం బయటపడితే బీమా మొత్తాన్ని చెల్లించేస్తుంది. ఆ సమస్యకు చికిత్స ఎంత అయిందన్న దానితో సంబంధం లేదు. సాధారణ క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీల్లో మినహాయింపు ఉన్న పలు చికిత్సలకు కూడా హెచ్‌డీఎఫ్‌సీ కార్డియాక్ కేర్ కవరేజీనిస్తోంది. వీటిలో కీహోల్ లేదా మినిమల్లీ ఇన్వేసివ్ లేదా రోబోటిక్ కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్, బెలూన్ వాల్వోటోమీ లేదా వాల్వో ప్లాస్టీ, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ ఆఫ్ అరోటా, పేస్‌మేకర్ ఏర్పాటు వంటివి ఉన్నాయి.
వీటికి హెచ్‌డీఎఫ్‌సీ కార్డియాక్ కేర్ కవరేజీనిస్తోంది. మొత్తం 18 రకాల గుండె సమస్యలను అధిక తీవ్రత (ఎ), మధ్య స్థాయి తీవ్రత (బి), తక్కువ తీవ్రత (సి) అని మూడు గ్రూపులుగా పాలసీలో వర్గీకర ణలు చేయడం జరిగింది. పాలసీదారులకు వచ్చిన సమస్య వీటిలో ఏ గ్రూపులో ఉన్నదనే అంశాన్ని బట్టి పరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది.
ఉదాహరణకు గ్రూప్ ఏ పరిధిలోని సమస్య అయితే 100 శాతం, గ్రూపు బి అయితే 50 శాతం, గ్రూపు సి అయితే 25 శాతం బీమా మొత్తంలో చెల్లిస్తుంది. ఇక ఒక్కో సమస్యకు బేసిక్ కవరేజీకి అదనంగా హాస్పిటలైజేషన్, ద్రవ్యోల్బణంతో కూడిన ఇండెక్సేషన్, ఇన్‌కమ్ బెనిఫిట్స్‌ను కూడా ఎంచుకోవచ్చు. అయితే అదనపు ప్రీమియం చెల్లించాలి.
హాస్పిటలైజేషన్
ఒక్కసారి పాలసీ తీసుకునే సమయంలో ఎంచుకున్న బెనిఫిట్స్‌ను తిరిగి సవరించడం ఉండదు. హాస్పిటలైజేషన్ బెనిఫిట్ కింద ఆస్పత్రిలో ఐసీయూలో చేరితే బీమా మొత్తంలో 2 శాతాన్ని ప్రతి రోజూ చెల్లిస్తుంది. గరిష్ట పరిమితి రూ.20,000. కాకపోతే ఏడాదిలో ఇలా ఐదు రోజుల వరకే చెల్లింపులు చేస్తుంది. పాలసీ కాల వ్యవధిలో మొత్తం మీద 15 రోజులకే హాస్పిటలైజేషన్ బెనిఫిట్ పరిమితం.
ఒకవేళ ఐసీయూ కాకుండా ఆస్పత్రిలో చేరి పొందే చికిత్సలకు బీమా మొత్తంలో 1 శాతం పరిహారం చెల్లించడం జరుగుతుంది. రోజుకు గరిష్ట పరిమితి రూ.10,000. ఏడాదిలో 10 రోజుల వరకు, పాలసీ కాల వ్యవధిలో 30 రోజుల వరకు ఈ ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఒక ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే హెల్త్ పాలసీల్లో మాదిరే కార్డియాక్ కేర్‌లోనూ నో క్లెయిమ్ బోనస్ లభిస్తుంది. బీమా మొత్తం 10 శాతం పెరుగుతుంది. అయితే, ఒక్కసారి క్లెయిమ్ చేశారంటే, సమ్ ఇన్సూర్డ్ మొత్తం పెరగదు.
నెలవారీ ఆదాయం
పాలసీలో భాగంగా ఇన్‌కమ్ బెనిఫిట్ ఎంచుకుంటే, పాలసీలోని గ్రూప్ ఏలో పేర్కొన్న గుండె అనారోగ్యాల్లో ఏదైనా బయటపడితే బీమా మొత్తంలో ఒక శాతం చొప్పున ప్రతి నెలా చెల్లించడం జరుగుతుంది. ఇలా ఐదేళ్ల పాటు నెలవారీ ఆదాయం పొందొచ్చు. ఒకవేళ ఈ ఐదేళ్ల నెలవారీ బెనిఫిట్ చెల్లింపుల సమయంలో పాలసీదారుడు మరణిస్తే మిగిలిన మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు.
ఎంత వరకు లాభం..?
సాధారణ క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్లతో పోలిస్తే హెచ్‌డీఎఫ్‌సీ కార్డియాక్ కేర్ చాలా అంశాల్లో లాభసాటే అని చెప్పొచ్చు. అయితే, చాలా అంశాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ హార్ట్ ప్రొటెక్ట్ ప్లాన్‌తో హెచ్‌డీఎఫ్‌సీ కార్డియాక్ కేర్‌కు పోలిక ఉంది. ఈ రెండు పాలసీలు కూడా 18 రకాల గుండె సమస్యలకు కవరేజీనిస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ హార్ట్ ప్రొటెక్ట్‌లో పాలసీదారుని గుండె సమస్యను బట్టి 25 శాతం లేదా 100 శాతం పరిహారం లభిస్తుంది.
మైనర్ అయితే 25 శాతం, మేజర్ సమస్య అయితే 100 శాతం పొందొచ్చు. అదే హెచ్‌డీఎఫ్‌సీ కార్డియాక్ కేర్‌లో మూడు వర్గీకరణలు ఉన్నాయి. మూడు రకాల పరిహారాలు పొందొచ్చు. అంటే దీని ప్రకారం ఐసీఐసీఐ ప్లాన్‌లో కొన్నింటికి 25 శాతమే పరిహారం లభిస్తే, అవే సమస్యలకు హెచ్‌డీఎఫ్‌సీ ప్లాన్‌లో అధిక కవరేజీ లభిస్తోంది. ఇక హెచ్‌ఢీఎఫ్‌సీ కార్డియాక్ కేర్‌లో బెలూన్ వాల్వోటోమీ లేదా వాల్వో ప్లాస్టీ, కరోటిడ్ ఆర్టరీ సర్జరీ, ఇంప్లాంటబుల్ కార్డియో వెర్టెర్ డిఫిబ్రిలాటో, వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైజ్‌ల ఏర్పాటు సర్జరీ, ఆర్టిఫిషియల్ హార్ట్ ఏర్పాటుకు బీమా మొత్తంలో 50% పరిహారం లభిస్తుంది.
ఇక హెచ్‌డీఎఫ్‌సీ కార్డియాక్ కేర్‌లో ఒకే రకమైన సమస్యకు ఒకటికి మించి క్లెయిమ్‌లకు అవకాశం ఉంది. ఐసీఐసీఐ పాలసీలో అది లేదు. కాకపోతే హెచ్‌డీఎఫ్‌సీ కార్డియాక్ కేర్ ప్లాన్‌లో ఒక ప్రతికూలత ఉంది. పాలసీ పరిధిలో ఉన్న సమస్యల్లో ఏది బయటపడినా, పాలసీదారుడు 30 రోజుల పాటు జీవించి ఉంటేనే పరిహారం లభిస్తుంది. ఐసీఐసీఐ ప్లాన్‌లో ఇది ఏడు రోజులుగానే ఉంది.
పీఎన్‌బీ మెట్‌లైఫ్, బిర్లా సన్‌లైఫ్, అవివాలైఫ్, ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా హార్ట్‌కేర్ ప్లాన్లను అందిస్తున్నాయి. కాకపోతే వీటితో పోలిస్తే హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ అందిస్తున్న పాలసీలు మరింత సమగ్రమైన కవరేజీతో ఉంటున్నాయి. ప్రీమియం చూస్తే 35ఏళ్ల వ్యక్తి రూ.25 లక్షల కవరేజీని 20 ఏళ్ల కాలానికి తీసుకుంటే ఏటా రూ.6,213 ప్రీమియం చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment