రూ.3 లక్షలు ఎర..రూ.59 లక్షలు స్వాహా! | 59lakhs fraud in cyber crime | Sakshi
Sakshi News home page

రూ.3 లక్షలు ఎర..రూ.59 లక్షలు స్వాహా!

Published Fri, Feb 16 2018 8:10 AM | Last Updated on Fri, Feb 16 2018 8:10 AM

59lakhs fraud in cyber crime - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:  మీరు చేసిన ఓ ఇన్సూరెన్స్‌ పాలసీ మీద రూ.3 లక్షల బోనస్‌ వచ్చిందంటూ మీకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చిందనుకుందాం... ఆ మొత్తం క్‌లైమ్‌ చేసుకోవడానికి కొంత డిపాజిట్‌ చేయమని చెప్పారనుకోండి... గరిష్టంగా మీరు ఎంత కడతారు... ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చెల్లించే మొత్తం రూ.లక్షకు మించనీయరు. అయితే నగరానికి చెందిన ఓ రిటైర్డ్‌ రైల్వే అధికారి మాత్రం ఏకంగా రూ.59 లక్షలు చెల్లించేలా చేశారు సైబర్‌ నేరగాళ్ళు. ఓ పక్క మాటల గారడీతో పాటు మరోపక్క కట్టింది మొత్తం రిఫండ్‌ వస్తుందంటూ చెప్పిన ఆన్‌లైన్‌ కేటుగాళ్లు భారీ మొత్తం స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

కస్టమర్‌ ఐడీ అంటూ...
దక్షిణ మధ్య రైల్వేలో పని చేసి పదవీ విరమణ చేసిన ఓ అధికారి ప్రస్తుతం బొగ్గులకుంటలో నివసిస్తున్నారు. ఈయనకు 2015 జనవరిలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. గౌరవ్‌ ఖన్నా అంటూ పరిచయం చేసుకున్న అతను మీ ఇన్సూరెన్స్‌ పాలసీపై రూ.2,83,683 బోనస్‌ వచ్చిందని, ఇది త్వరలోనే రద్దయ్యే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పాడు. అలా కాకుండా ఉండాలంటే ప్రాథమికంగా రూ.72 వేలు చెల్లించి కస్టమర్‌ ఐడీ పొందాలంటూ సూచించాడు. ఇతడి మాటలు నమ్మిన రిటైర్డ్‌ ఉద్యోగి ఘజియాబాద్‌లో ఉన్న బ్యాంకు ఖాతాలోకి ఆ మొత్తం ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఆపై ‘లైన్‌లోకి’ వచ్చిన అశోక్‌ గుప్త అనే వ్యక్తి ఫొటో, పాన్‌కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు ఈ–మెయిల్‌ ద్వారా పంపమని బాధితుడిని కోరాడు. అంతకు ముందు ఓ రూ.10,417 ట్రాన్స్‌ఫర్‌ చేయమని చెప్పడంతో బాధితుడు అలానే చేశాడు.

రిఫండ్‌ వస్తాయంటూ నమ్మించి...
వీరిద్దరి తర్వాత ఆ ముఠాకు చెందిన అనేక మంది మోసగాళ్ళు, వివిధ విభాగాల పేర్లతో బాధితుడికి ఫోన్‌ చేశారు. ఆదాయపుపన్ను శాఖ నుంచి అంటూ దినేష్‌కార్ల, దిషబ్‌ త్యాగి, రియ అంటూ ముగ్గురు నామినేషన్‌ పేర్ల కోసమని, ఐబీఏ నుంచి నిరంజన్‌ అగర్వాల్‌ పేరుతో స్టాంప్‌ డ్యూటీ కోసమని, గవర్నమెంట్‌ బాడీ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ నుంచి అమిత్‌ కె.మిశ్రా అని బాధితుడితో మాట్లాడారు. ఒక్కొక్కరూ ఒక్కో పన్ను, చార్జీల పేరు చెప్పి మొత్తం రూ.40 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేయించారు. కొంత మొత్తం చెల్లించిన తర్వాత బాధితుడు సందేహించగా... ఇవన్నీ రిఫండబుల్‌ చార్జెస్‌ అని, ఇన్సూరెన్స్‌ బోనస్‌తో పాటు ప్రతి పైసా తిరిగి వస్తుందంటూ డబ్బు కట్టించారు. 2016 ఆగస్టులో ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నానంటూ ఆర్‌కే దుగ్గల్‌గా చెప్పుకున్న వ్యక్తి నుంచి బాధితుడికి ఫోన్‌ వచ్చింది. మీకు సంబంధించిన భారీ మొత్తం తమ వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పాడు. 

రూ.45 లక్షలు ఇస్తామంటూ మరికొంత...
అదే ఏడాది అక్టోబర్‌లో సుచిత్ర పటేల్‌ అనే మహిళ నుంచి బాధితుడికి ఫోన్‌ వచ్చింది. మీరు ఇప్పటి వరకు చెల్లించిన డబ్బు, ఇన్సూరెన్స్‌పై బోనస్‌తో కలిపి మొత్తం రూ.45 లక్షలు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్పింది. ఇందుకుగాను తుది చెల్లింపుగా రూ.82 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుంది. ఇది జరిగిన తర్వాత బాధితుడు కొన్నాళ్ళ పాటు అమెరికాలో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత సైతం సుచిత్ర వదిలిపెట్టలేదు. ఆమెతో పాటు ఆమె సహాయకుడిగా చెప్పుకున్న ప్రాకాష్‌ భన్సాల్‌ ఫోన్లు చేసి బాధితుడితో మాట్లాడి అతడి నుంచి మరో రూ.3.75 లక్షలు స్వాహా చేశారు. ఇలా వివిధ దఫాల్లో రూ.59 లక్షల వరకు పోగొట్టుకున్న బాధితుడు కొన్నాళ్ళ పాటు మోసగాళ్ళ నుంచి డబ్బు వస్తుందనే ఆశతో గడిపాడు. చివరకు మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ బి.రమేష్‌ దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా నిందితులు వాడిన సెల్‌ఫోన్‌ నెంబర్లు, బాధితుడు డబ్బు డిపాజిట్‌/ట్రాన్స్‌ఫర్‌ చేసిన బ్యాంక్‌ ఖాతాల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. ఉత్తరాదికి చెందిన ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement