retired Railway employee
-
ఈయన పోటీ రైళ్ల కోసం.. ప్రత్యేక మేనిఫెస్టోతో ప్రజల్లోకి..
66 ఏళ్ల వామన్ మహదేవ్ సంగలే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. అంతగా తెలియని ధర్మరాజ్య పక్ష అనే పార్టీలో కార్యకర్తగా మారాడు. రోజువారీ ప్రయాణికుల కోసం ముంబై-నాసిక్, ముంబై-పూణే లోకల్ రైళ్లను ప్రారంభించాలనే ఏకైక కల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. వాటి సాధన కోసమే నాసిక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగారు.రైల్వేలో చీఫ్ లోకో ఇన్స్పెస్టర్గా పనిచేసిన సంగలే ఉద్యోగ విరమణ తర్వాత కూడా రైలు ప్రయాణికులకు సేవలను మెరుగుపరచడం కోసం పరితపిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు హేమంత్ గాడ్సే ద్వారా లోకల్ ట్రైన్ తెప్పించి ట్రయల్స్ నిర్వహించాలని రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకురావడంలో ఆయన కొంత సఫలమయ్యారు.అయితే సొరంగాల పరిమితులు, నిటారు ఎత్తుపల్లాల కారణంగా ట్రయల్స్ మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. కానీ పట్టువదలని సంగలే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో నేరుగా పోటీకి దిగారు. "అవును. ధర్మరాజ్య పక్ష తరఫున 'టేబుల్'ను నా గుర్తుగా చేసుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నా వద్ద మేనిఫెస్టో కూడా ఉంది. ప్రజల కోసం నా ప్రాధాన్యతలను జాబితా చేశాను" అని వామన్ మహదేవ్ సంగలే చెబుతున్నారు.'కసారా నుంచి నాసిక్, కర్జాత్ నుంచి పుణె వరకు లోకల్ ట్రైన్‌ను ముంబైకి అనుసంధానం చేయడం నేను చేసిన సూచనల్లో ఒకటి. దీని కోసం నేను చాలా ఏళ్లుగా పోరాడుతున్నాను. రైల్వేలను మెరుగుపరచడానికి నేను సూచించిన 15 సూచనలలో ఇది ఒకటి. ఈ ప్రాజెక్టు ఎంఎంఆర్ పరిధిలోని నాసిక్, పుణె, ముంబై ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది’ అని ఆయన అన్నారు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ రైల్ శిబిరాన్ని నిర్వహించారని, అందులో తాను చేసిన 15 సూచనల్లో మూడింటిని ఎంపిక చేశారని సంగలే పేర్కొన్నారు.సంగలే మేనిఫెస్టో ఇదే..కల్యాణ్‌ను నాసిక్, పుణెలకు లోకల్ రైళ్ల ద్వారా అనుసంధానించడమే తన మొదటి ప్రాధాన్యత అని సంగలే పేర్కొన్నారు. భుసావల్ డివిజన్ లో మెయిన్ లైన్ ఈఎంయూ రైళ్లు నడపడం, నాసిక్‌కు పెద్ద ఈఎంయూ కార్ షెడ్ నిర్మాణం, నాసిక్ నుంచి గుజరాత్ రైల్వే లైన్ వంటివి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నాయని సంగలే వివరించారు.అలాగే నిఫాద్ నుంచి మన్మాడ్ వరకు తీవ్రమైన తాగునీటి కొరత సమస్యను పరిష్కరించడం, ప్రతిపాదిత నాసిక్ మెట్రో రైలు పురోగతి, కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య, పంచవటిలోని రాంకుండ్, సీతాకుండ్ వంటి పుణ్యక్షేత్రాలను శుభ్రం చేయడం, గోదావరి నదిని పరిశుభ్రం చేయడం వంటివి తన ప్రాధాన్యతలు అని వామన్ మహదేవ్ సంగలే నాసిక్ ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. కాగా నాసిక్ లోక్‌సభ స్థానానికి ఐదవ దశలో మే 20న పోలింగ్ జరగనుంది. -
అపూరూప కలెక్షన్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): చరిత్రకు సాక్ష్యాలు స్టాంపులు, నాణేలు. వివిధ దేశాలకు చెందిన నాణేలు, స్టాంపులను సేకరించి ఎన్నో ప్రదర్శనలిచ్చారు నగరానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి అమ్ము కృష్ణారావు. 1978లో ఆయన కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను సందర్శించారు. ఆ సమయంలో గంగా నదిలో నేపాల్ దేశానికి చెందిన 2 పైసలు, చిన్న సైజు కోడిగుడ్డు ఆకారంలో ఉన్న నున్నని రాయి ఆయనకు దొరికాయి. నేపాల్ 2 పైసల మీద ఆవు, ఎవరెస్ట్ శిఖరం, త్రిశూలం, ఢమరుకం గుర్తులు ఉండడంతో ఆ నాణేన్ని, రాయిని తన పూజ గదిలోకి చేర్చారు. అంతకుముందు 1972లో హైదరాబాద్‌లో నివసిస్తున్న సమయంలో రోజువారీ ఖర్చులు పోనూ మిగిలిన చిల్లర నాణేల్లో బొమ్మలున్న వాటిని పక్కన పెట్టడం అలవాటు చేసుకున్నారు. 1984లో సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో టెక్నీషియన్ గ్రేడ్–3గా టిట్లాఘడ్లో రైల్వేలో కృష్ణారావు ప్రస్థానం ప్రారంభించారు. 1985లో కుటుంబంతో కలిసి దక్షిణ భారత యాత్ర చేస్తున్న సమయంలో రామేశ్వరంలో శ్రీలంక నాణేలు కొన్ని దొరికాయి. అలా నాణేల సేకరణ పట్ల ఆకర్షితులై నాటి నుంచి నేటి వరకు వందల సంఖ్యలో నాణేలను ఆయన సంపాదించారు. 1990లో విశాఖపట్నం డీజిల్ లోకో షెడ్‌కు బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి ఏటా జరిగే విశ్వకర్మ పూజ రోజున ఈ నాణేలను ప్రదర్శించేవారు కృష్ణారావు. 2000లో వారణాసిలోని ఓ ఆలయ ప్రాంగణంలో నేలపై వెండి నాణేలు తాపడం చేసి ఉండడం చూసిన ఆయన తన దృష్టిని అటు వైపుగా సారించారు. ఇంకా ఎంతో సాధించాల్సింది ఉందని ఆ రోజు తెలుసుకున్నారు. అప్పుడే విశాఖపట్నంలోని న్యూమిస్మాటిక్ అండ్ ఫిలాటెలిక్ అసోసియేషన్‌లో జీవితకాల సభ్యుడిగా చేశారు. నాణేలు, కరెన్సీ సేకరణలో మెళకువలు నేర్చుకున్నారు. 2022 ఏప్రిల్ 30న ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా రిటైర్ అయ్యారు. రైల్వేపై ఆసక్తి ఇలా... ఇలా సాగిపోతున్న సమయంలో 2003లో నాగ్‌పూర్ పోస్ట్ ఆఫీస్‌లో 150 ఏళ్ల భారతీయ రైల్వేల ప్రస్థానంపై విడుదల చేసిన ప్రత్యేక స్టాంప్, మినీయేచర్ షీట్‌ను ఆయన చూశారు. అప్పుడే రైల్వే మీద విడుదల చేసిన స్టాంపుల సేకరణ మొదలుపెట్టారు. రైల్ జర్నీ త్రూ పోస్టల్ స్టాంప్స్ అనే పేరుతో 2004లో నగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొని రజత పతకం కైవసం చేసుకున్నారు. 2007లో చెన్నైలో జాతీయస్థాయి ప్రదర్శనలో రజతం, 2011లో న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. దీనికి కొనసాగింపుగా రైల్వే టోకెన్లు, నాణేలు, కరెన్సీ మొదలైనవి సేకరించారు. వీటితో సుమారు 100 ప్రదర్శనలిచ్చి ఎన్నో ప్రశంసలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు కృష్ణారావు. ఇవే కాకుండా... ఇవి మాత్రమే కాకుండా బ్రిటిష్ ఇండియా కాయన్ల కలెక్షన్ ఆయన వద్ద ఉంది. 1835 నుంచి 1947 వరకు గల వివిధ నాణేలను ఆయన సేకరించారు. 1950 నుంచి నేటి వరకు అన్ని మింట్లు విడుదల చేసిన నాణేలు ఆయన వద్ద ఉన్నాయి. స్మారక నాణేల సెట్, 1, 2, 5, 20 రూపాయల కరెన్సీ, సిగ్నేచర్, ఇన్సెట్, ప్రిఫిక్స్ ప్రకారం సేకరించారు. స్టార్ నోట్స్ 1, 10, 20, 50, 100, 200 ఆయన కలెక్షన్లో చేరాయి. అమృతోత్సవాల్లో సైతం... ఇటీవల వాల్తేర్ డివిజన్ నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో కృష్ణారావు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాపూజీ జీవిత విశేషాలతో కూడిన 200 ప్రత్యేక ఫొటోలతో ఎగ్జిబిషన్, స్టాంపుల, నాణేల ప్రదర్శనను ఆయన ఏర్పాటు చేశారు. దీనిని తిలకించిన డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్ కుమార్ సత్పతి కృష్ణారావును ప్రత్యేకంగా అభినందించారు. చదవండి: బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా? -
రూ.3 లక్షలు ఎర..రూ.59 లక్షలు స్వాహా!
సాక్షి, సిటీబ్యూరో: మీరు చేసిన ఓ ఇన్సూరెన్స్ పాలసీ మీద రూ.3 లక్షల బోనస్ వచ్చిందంటూ మీకు ఓ ఫోన్ కాల్ వచ్చిందనుకుందాం... ఆ మొత్తం క్లైమ్ చేసుకోవడానికి కొంత డిపాజిట్ చేయమని చెప్పారనుకోండి... గరిష్టంగా మీరు ఎంత కడతారు... ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చెల్లించే మొత్తం రూ.లక్షకు మించనీయరు. అయితే నగరానికి చెందిన ఓ రిటైర్డ్ రైల్వే అధికారి మాత్రం ఏకంగా రూ.59 లక్షలు చెల్లించేలా చేశారు సైబర్ నేరగాళ్ళు. ఓ పక్క మాటల గారడీతో పాటు మరోపక్క కట్టింది మొత్తం రిఫండ్ వస్తుందంటూ చెప్పిన ఆన్లైన్ కేటుగాళ్లు భారీ మొత్తం స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కస్టమర్ ఐడీ అంటూ... దక్షిణ మధ్య రైల్వేలో పని చేసి పదవీ విరమణ చేసిన ఓ అధికారి ప్రస్తుతం బొగ్గులకుంటలో నివసిస్తున్నారు. ఈయనకు 2015 జనవరిలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. గౌరవ్ ఖన్నా అంటూ పరిచయం చేసుకున్న అతను మీ ఇన్సూరెన్స్ పాలసీపై రూ.2,83,683 బోనస్ వచ్చిందని, ఇది త్వరలోనే రద్దయ్యే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పాడు. అలా కాకుండా ఉండాలంటే ప్రాథమికంగా రూ.72 వేలు చెల్లించి కస్టమర్ ఐడీ పొందాలంటూ సూచించాడు. ఇతడి మాటలు నమ్మిన రిటైర్డ్ ఉద్యోగి ఘజియాబాద్‌లో ఉన్న బ్యాంకు ఖాతాలోకి ఆ మొత్తం ట్రాన్స్ఫర్ చేశారు. ఆపై ‘లైన్లోకి’ వచ్చిన అశోక్ గుప్త అనే వ్యక్తి ఫొటో, పాన్‌కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు ఈ–మెయిల్ ద్వారా పంపమని బాధితుడిని కోరాడు. అంతకు ముందు ఓ రూ.10,417 ట్రాన్స్ఫర్ చేయమని చెప్పడంతో బాధితుడు అలానే చేశాడు. రిఫండ్ వస్తాయంటూ నమ్మించి... వీరిద్దరి తర్వాత ఆ ముఠాకు చెందిన అనేక మంది మోసగాళ్ళు, వివిధ విభాగాల పేర్లతో బాధితుడికి ఫోన్ చేశారు. ఆదాయపుపన్ను శాఖ నుంచి అంటూ దినేష్కార్ల, దిషబ్ త్యాగి, రియ అంటూ ముగ్గురు నామినేషన్ పేర్ల కోసమని, ఐబీఏ నుంచి నిరంజన్ అగర్వాల్ పేరుతో స్టాంప్ డ్యూటీ కోసమని, గవర్నమెంట్ బాడీ ఆఫ్ ఇన్సూరెన్స్ నుంచి అమిత్ కె.మిశ్రా అని బాధితుడితో మాట్లాడారు. ఒక్కొక్కరూ ఒక్కో పన్ను, చార్జీల పేరు చెప్పి మొత్తం రూ.40 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించారు. కొంత మొత్తం చెల్లించిన తర్వాత బాధితుడు సందేహించగా... ఇవన్నీ రిఫండబుల్ చార్జెస్ అని, ఇన్సూరెన్స్ బోనస్‌తో పాటు ప్రతి పైసా తిరిగి వస్తుందంటూ డబ్బు కట్టించారు. 2016 ఆగస్టులో ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నానంటూ ఆర్కే దుగ్గల్గా చెప్పుకున్న వ్యక్తి నుంచి బాధితుడికి ఫోన్ వచ్చింది. మీకు సంబంధించిన భారీ మొత్తం తమ వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పాడు. రూ.45 లక్షలు ఇస్తామంటూ మరికొంత... అదే ఏడాది అక్టోబర్‌లో సుచిత్ర పటేల్ అనే మహిళ నుంచి బాధితుడికి ఫోన్ వచ్చింది. మీరు ఇప్పటి వరకు చెల్లించిన డబ్బు, ఇన్సూరెన్స్‌పై బోనస్‌తో కలిపి మొత్తం రూ.45 లక్షలు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్పింది. ఇందుకుగాను తుది చెల్లింపుగా రూ.82 వేలు ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఇది జరిగిన తర్వాత బాధితుడు కొన్నాళ్ళ పాటు అమెరికాలో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత సైతం సుచిత్ర వదిలిపెట్టలేదు. ఆమెతో పాటు ఆమె సహాయకుడిగా చెప్పుకున్న ప్రాకాష్ భన్సాల్ ఫోన్లు చేసి బాధితుడితో మాట్లాడి అతడి నుంచి మరో రూ.3.75 లక్షలు స్వాహా చేశారు. ఇలా వివిధ దఫాల్లో రూ.59 లక్షల వరకు పోగొట్టుకున్న బాధితుడు కొన్నాళ్ళ పాటు మోసగాళ్ళ నుంచి డబ్బు వస్తుందనే ఆశతో గడిపాడు. చివరకు మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ బి.రమేష్ దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా నిందితులు వాడిన సెల్‌ఫోన్ నెంబర్లు, బాధితుడు డబ్బు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంక్ ఖాతాల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. ఉత్తరాదికి చెందిన ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. -
పండుటాకు..పాడు పని
కుషాయిగూడ: బాలికలకు చాక్లెట్లు ఆశచూపి లైంగిక దాడులకు పాల్పడుతున్న వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు.రాచకొండ షీటీమ్స్ ఇన్చార్జి సలీమా, ఏసీపీ కృష్ణమూర్తితో కలిసి కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. రాచకొండ షీటీమ్స్ ఆధ్వర్యంలో కాప్రా ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయగా పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల నుంచి తమకు ఆరు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. వాటిపై విచారణ చేపట్టగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. పాఠశాల సమీపంలో ఉంటున్న రిటై ర్డ్ రైల్వే ఉద్యోగి సత్యనారాయణ(88) అనే వృద్ధుడు అటువైపుగా వచ్చిన విద్యార్థినులకు చాక్లెట్లు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని డబ్బులు కూడా ఇచ్చేవాడని బాధితులు తెలిపారన్నారు. గత ఆరు నెలలుగా ఆరుగురు విద్యార్థినులపై లైంగికదాడులకు పాల్పడినట్లు విచారణలో తేలిందని, బాధితుల్లో నలుగురు ఎస్సీలు ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుడిపై పీడీ యాక్ట్.. నిందితుడు సత్యనారాయణపై వివిధ సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసు, పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఆమె వివరించారు. -
రైల్వేస్టేషన్లో యువతి అపహరణకు యత్నం
సికింద్రాబాద్ : మాయమాటలు చెప్పి యువతి (16)ని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. రైల్వే ఇన్స్పెక్టర్ అంబటి ఆంజనేయులు కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన యువతి కొద్దిరోజుల క్రితం బోయిన్‌పల్లిలో ఉండే తమ బంధువుల ఇంటికి వచ్చింది. బుధవారం తిరిగి విజయవాడ వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి.. 8వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై రైలు కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమెను తనతో తీసుకెళ్లేందుకు యత్నించాడు. అతని కుతంత్రం గ్రహించిన ఆ యువతి తాను రానని చెప్పింది. దీంతో అతను చేతులు పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లేందుకు యత్నించగా.. కేకలు వేసింది. ఇది గమనించిన తోటి ప్రయాణికులు యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడు మల్కాజిగిరి వసంతపురి కాలనీకి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పి.పరంజ్యోతి(62) అని తేలింది. రైల్వేపోలీసులు అతడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.