66 ఏళ్ల వామన్ మహదేవ్ సంగలే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. అంతగా తెలియని ధర్మరాజ్య పక్ష అనే పార్టీలో కార్యకర్తగా మారాడు. రోజువారీ ప్రయాణికుల కోసం ముంబై-నాసిక్, ముంబై-పూణే లోకల్ రైళ్లను ప్రారంభించాలనే ఏకైక కల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. వాటి సాధన కోసమే నాసిక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగారు.
రైల్వేలో చీఫ్ లోకో ఇన్‌స్పెస్టర్‌గా పనిచేసిన సంగలే ఉద్యోగ విరమణ తర్వాత కూడా రైలు ప్రయాణికులకు సేవలను మెరుగుపరచడం కోసం పరితపిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు హేమంత్ గాడ్సే ద్వారా లోకల్ ట్రైన్ తెప్పించి ట్రయల్స్ నిర్వహించాలని రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకురావడంలో ఆయన కొంత సఫలమయ్యారు.
అయితే సొరంగాల పరిమితులు, నిటారు ఎత్తుపల్లాల కారణంగా ట్రయల్స్ మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. కానీ పట్టువదలని సంగలే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో నేరుగా పోటీకి దిగారు. "అవును. ధర్మరాజ్య పక్ష తరఫున 'టేబుల్'ను నా గుర్తుగా చేసుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నా వద్ద మేనిఫెస్టో కూడా ఉంది. ప్రజల కోసం నా ప్రాధాన్యతలను జాబితా చేశాను" అని వామన్ మహదేవ్ సంగలే చెబుతున్నారు.
'కసారా నుంచి నాసిక్, కర్జాత్ నుంచి పుణె వరకు లోకల్ ట్రైన్‌ను ముంబైకి అనుసంధానం చేయడం నేను చేసిన సూచనల్లో ఒకటి. దీని కోసం నేను చాలా ఏళ్లుగా పోరాడుతున్నాను. రైల్వేలను మెరుగుపరచడానికి నేను సూచించిన 15 సూచనలలో ఇది ఒకటి. ఈ ప్రాజెక్టు ఎంఎంఆర్ పరిధిలోని నాసిక్, పుణె, ముంబై ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది’ అని ఆయన అన్నారు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ రైల్ శిబిరాన్ని నిర్వహించారని, అందులో తాను చేసిన 15 సూచనల్లో మూడింటిని ఎంపిక చేశారని సంగలే పేర్కొన్నారు.
సంగలే మేనిఫెస్టో ఇదే..
కల్యాణ్‌ను నాసిక్, పుణెలకు లోకల్ రైళ్ల ద్వారా అనుసంధానించడమే తన మొదటి ప్రాధాన్యత అని సంగలే పేర్కొన్నారు. భుసావల్ డివిజన్ లో మెయిన్ లైన్ ఈఎంయూ రైళ్లు నడపడం, నాసిక్‌కు పెద్ద ఈఎంయూ కార్ షెడ్ నిర్మాణం, నాసిక్ నుంచి గుజరాత్ రైల్వే లైన్ వంటివి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నాయని సంగలే వివరించారు.
అలాగే నిఫాద్ నుంచి మన్మాడ్ వరకు తీవ్రమైన తాగునీటి కొరత సమస్యను పరిష్కరించడం, ప్రతిపాదిత నాసిక్ మెట్రో రైలు పురోగతి, కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య, పంచవటిలోని రాంకుండ్, సీతాకుండ్ వంటి పుణ్యక్షేత్రాలను శుభ్రం చేయడం, గోదావరి నదిని పరిశుభ్రం చేయడం వంటివి తన ప్రాధాన్యతలు అని వామన్ మహదేవ్ సంగలే నాసిక్ ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. కాగా నాసిక్ లోక్‌సభ స్థానానికి ఐదవ దశలో మే 20న పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment