
ముంబై, సాక్షి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో లోక్‌సభ ఎన్నికల కోసం ఇద్దరు వృద్ధులతో ఓటేయించడానికి ఎన్నికల అధికారులు సాహసం చేశారు. ప్రమాదకరమైన మలుపులు, అడవుల గుండా 107 కిలోమీటర్లు ప్రయాణించారు.
వివరాల్లోకి వెళ్తే.. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి-చిమూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గంలో 100 ఏళ్లు, 86 సంవత్సరాల వయస్సు గల ఓటర్లు ఇద్దరు ఉన్నారు. ఎన్నికల సంఘం 85 ఏళ్లు పైబడిన వారికి, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది.
దీంతో ఎన్నికల అధికారులు అహేరి నుండి సిరొంచ వరకు 107 కిలోమీటర్లు ప్రయాణించి 100 ఏళ్ల కిష్టయ్య మదర్బోయిన, 86 ఏళ్ల కిష్టయ్య కొమెర ఇళ్లకు చేరుకున్నారు. వీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసే పరిస్థితిలో లేరు కానీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని ఎన్నికల అధికారి తెలిపారు. గడ్చిరోలి-చిమూర్ నియోజకవర్గంలో 1,037 మంది 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, 338 మంది దివ్యాంగుల దరఖాస్తులను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 1,205 మంది ఓటర్లు ఇంటి వద్ద నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.