మహారాష్ట్రలో తుది అంకానికి పోరు
13 లోక్‌సభ స్థానాలకు 20న ఎన్నిక
బరిలో కేంద్ర మంత్రులు, సీఎం కుమారుడు
దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 48 స్థానాలకు గాను నాలుగు విడతల్లో 35 సీట్లకు ఎన్నిక ముగిసింది. మిగతా 13 నియోజకవర్గాలకు ఐదో విడతలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరగనుంది.
రెండుగా చీలిన శివసేన, ఎన్సీపీల్లో అసలు పారీ్టగా ప్రజలు దేన్ని గుర్తిస్తున్నదీ ఈ ఎన్నికలతో తేలనుంది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్, సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తదితరులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో తుది దశలో పోలింగ్ జరగనున్న కీలక స్థానాలపై ఫోకస్...
నాసిక్
ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం, ఎగుమతి సుంకాల పెంపు తదితరాలపై ఇక్కడి రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది అభ్యర్థులందరికీ పరీక్షగా మారింది. అధికార మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యర్థి హేమంత్ గాడ్సే బరిలో ఉన్నారు. విపక్ష ఎంవీఏ కూటమి నుంచి శివసేన (ఉద్ధవ్) అభ్యర్థి రాజాభావు వాజే పోటీలో ఉన్నారు.
దేశవ్యాప్తంగా 111 ఆశ్రమాలు, ఏడు గురుకులాలతో ప్రజల్లో బాగా పేరున్న శాంతిగిరి మహారాజ్ ఇండిపెండెంట్‌గా వీరిద్దరికీ పెను సవాలు విసురుతున్నారు. ఉల్లి రైతులను ప్రసన్నం చేసుకునేందుకు గాడ్సే, వాజే శ్రమిస్తున్నారు. సీఎం షిండే ముమ్మరంగా ప్రచారం చేశారు. వంచిత్ బహుజాన్ అగాడీ నుంచి కరణ్ గైకర్ కూడా బరిలో ఉండటంతో చతుర్ముఖ పోరు నెలకొంది.
పాల్గఢ్
ఈ ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానం నుంచి మహాయుతి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి హేమంత్ విష్ణు సవర బరిలో ఉన్నారు. శివసేన (ఉద్ధవ్) నుంచి భారతి భరత్ కామ్డి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ, వంచిత్ బహుజన్ అగాడీ, స్థానికంగా బలమున్న బహుజన్ వికాస్ అగాడీ కూడా పోటీలో ఉన్నాయి. దాంతో బహుముఖ పోటీ నెలకొంది. నిరుద్యోగం, వైద్య సౌకర్యాల లేమి ఇక్కడి ప్రధాన సమస్యలు.
ఈ ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడు ఇటీవలే పాక్ జైల్లో మరణించడం, ఇక్కడ ఇద్దరు సాధువులను కొట్టి చంపడం ఎన్నికల అంశాలుగా మారాయి. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, బీజేపీ అగ్ర నేతలు సాధువుల హత్యను పదేపదే ప్రస్తావించారు. రూ.76,000 కోట్లతో ప్రతిపాదించిన వాద్వాన్ పోర్టుపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శివసేన (షిండే)కు చెందిన సిట్టింగ్ ఎంపీ రాజేంద్ర దేద్య గవిట్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం.
భివండి
బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ ఇక్కడ ఆయనే గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. ఎన్సీపీ (ఎస్‌పీ) నుంచి సురేశ్ మాత్రే (బాల్యా మామ), స్వతంత్ర అభ్యర్థి నీలేశ్ సంబారే పాటిల్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు.
నియోజకవర్గంలోని 21 లక్షల ఓటర్లలో 5 లక్షల మంది ముస్లింలే. 4.5 లక్షలు కుంబి, 3 లక్షలు అగ్ర వర్గీయులున్నారు. పాటిల్, మాత్రే ఇద్దరూ అగ్ర కులస్థులు. సంబారే కుంబి వర్గానికి చెందినవారు. మాత్రే గెలుపు కోసం శరద్ పవార్ తన పలుకుబడినంతా ఉపయోగిస్తున్నారు. తమకు బాగా పట్టున్న ఈ స్థానాన్ని ఎన్సీపీకి ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. ఇది మాత్రే విజయావకాశాలపై ప్రభావం చూపేలా ఉంది.
ముంబై నార్త్
ఇక్కడ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను బీజేపీ బరిలోకి దింపింది. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన ఎంపికకు ముందు గట్టి కసరత్తే చేసింది. గోయల్ కోసం తొలుత దక్షిణ ముంబై స్థానాన్ని పరిశీలించినా చివరికి ముంబై నార్త్ వైపే మొగ్గుచూపించింది. ఇది ఒకప్పుడు కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న స్థానం. 1989లో బీజేపీ నుంచి రాం నాయక్ విజయం సాధించాక పరిస్థితులు మారాయి.
2008లో లోక్‌సభ స్థానాల పునరి్వభజన తర్వాత ఇక్కడ మరాఠీయేతర మధ్య తరగతి ఓటర్లు పెరిగారు. దాంతో బీజేపీ మరింత బలపడింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ నిరుపమ్‌పై బీజేపీ నేత గోపాల్ చిన్నయ్య శెట్టి 4.47 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గారు. 2019 ఎన్నికల్లో ఆయన మెజారిటీని మరింతగా పెంచుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, నటి ఊర్మిళా మతోండ్కర్‌ను ఓడించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు.
కల్యాణ్
అధికార మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యరి్థగా సీఎం కుమారుడు శ్రీకాంత్ షిండే బరిలో ఉండటంతో ఆసక్తి నెలకొంది. 2014, 2019 ఎన్నికల్లోనూ శివసేన టికెట్‌పై శ్రీకాంత్ ఎన్సీపీని ఓడించారు. విపక్ష అగాడీ కూటమి నుంచి శివసేన (ఉద్ధవ్) అభ్యరి్థగా వైశాలి దారేకర్ రాణే బరిలో నిలిచారు. దాంతో ఇంతకాలంగా శివసేనను ఆదరిస్తున్న ఓటర్లకు పరీక్ష ఎదురైంది.
సంప్రదాయ ఓటర్లు ఈ రెండు పారీ్టల మధ్య చీలితే ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నెలకొంది. గత రెండుసార్లూ రెండో స్థానంలో నిలిచిన ఎన్సీపీ (ఎస్‌పీ) మద్దతు ఉద్దవ్ వర్గం అభ్యరి్థకి కలిసొచ్చే అంశం. ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి తన కుమారుడు ఎంతో చేశాడని, ఈసారీ గెలిపిస్తే మిగతా పనులన్నీ పూర్తి చేస్తాడని సీఎం షిండే భరోసా ఇస్తున్నారు.
థానే
ఇక్కడ రెండు శివసేనల మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ఇతరులు పోటీలో ఉన్నా నామమాత్రమే. 2019 ఎన్నికల్లో శివసేన అభ్యర్థి రాజన్ బాబూరావు విచారే 4.12 లక్షల ఓట్ల మెజారిటీతో ఎన్సీపీ నేత ఆనంద్ పరాంజపేపై ఘన విజయం సాధించారు. ఈ విడత విచారే శివసేన (ఉద్ధవ్) అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యర్థిగా నరేశ్ గణపత్ మాస్కే బరిలో ఉన్నారు.
విచారే ముందునుంచీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. మాస్కేకు మద్దతుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సేన, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. కానీ ఆయన అభ్యరి్థత్వాన్ని బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తుండడం ప్రతికూలంగా మారింది. విచారే, మాస్కే ఇద్దరూ థానే మేయర్లుగా పనిచేసిన వారే. కానీ నగర పరిసర ప్రాంతాలు సరైన అభివృద్ధికి నోచుకోలేదన్న అసంతృప్తి స్థానికుల్లో బాగా ఉంది.
ఐదో విడత పోలింగ్ జరిగే స్థానాలు
ధూలే, దిండోరి, నాసిక్, పాల్ఘర్, భివండి, కల్యాణ్, థానే, ముంబై నార్త్, ముంబై నార్త్–వెస్ట్, ముంబై నార్త్–ఈస్ట్, ముంబై నార్త్–సెంట్రల్, ముంబై సౌత్–సెంట్రల్, ముంబై సౌత్
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment