ముంబై: మహారాష్ట్రలోని ముంబై వాయువ్య లోక్‌సభ నియోజకవర్గ శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్, జైలును తప్పించుకునేందుకే తాను శివసేన (యూబీటీ) నుంచి ఫిరాయించానని ప్రకటించి తన పార్టీని ఇరుకున పడేశారు. జోగేశ్వరిలోని సివిక్ ప్లాట్‌లో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి సంబంధించి ఈడీ ఆయనపై పీఎంఎల్‌ఏ కేసు నమోదు చేసింది.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరడం మినహా తనకు వేరే మార్గం లేదని ఒక మరాఠీ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీంద్ర వైకర్ పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరేకు అత్యంత విధేయుడిగా రవీంద్ర వైకర్ పేరుగాంచారు. ఉద్ధవ్ థాకరే స్వయంగా వైకర్ నివాసానికి వెళ్లి బుజ్జగించారంటేనే ఆయనకు శివసేన (యూబీటీ) ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు.
తన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగడంతో రవీంద్ర వైకర్ దిద్దుబాటుకు ప్రయత్నించారు. ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. శివసేన (యూబీటీ) నుండి వైదొలగే ముందు తాను ఉద్ధవ్‌తో మూడు సార్లు సమావేశమయ్యానని, తన ఇబ్బందులను తెలియజేశానని చెప్పారు.
కాగా ముంబై నార్త్-వెస్ట్ స్థానంలో శివసేన (యూబీటీ)కి చెందిన అమోల్ కీర్తికర్‌తో వైకర్ పోటీలో ఉన్నారు. అమోల్ తండ్రి కీర్తికర్ ప్రస్తుతం ఇక్కడ సిటింగ్ ఎంపీ. ఈ లోక్‌సభ స్థానానికి ఐదో దశలో మే 20న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment