నామినేషన్ దాఖలు చేసిన శివసేన అభ్యర్థులు | Sakshi
Sakshi News home page

నామినేషన్ దాఖలు చేసిన శివసేన అభ్యర్థులు

Published Tue, Apr 30 2024 8:59 AM

Shiv Sena (UBT) Candidates File Nomination For Lok Sabha Elections In Mumbai

ముంబయి: లోక్‌సభ ఎన్నికల ఐదో దశకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. శివసేన (యూటీబీ) నాయకులు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్ సహా మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు సోమవారం ముంబైలో తమ నామినేషన్లను దాఖలు చేశారు. అరవింద్ సావంత్ ముంబై సౌత్ నుంచి, అనిల్ దేశాయ్ ముంబై సౌత్ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు.

సావంత్ తన నామినేషన్ ఫారమ్‌తో పాటు అఫిడవిట్ ద్వారా తన సంపద సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. అరవింద్ సావంత్ భార్య అనుయా అరవింద్ సావంత్ పేరిట ఉన్న ఆస్తుల సమాచారాన్ని కూడా అఫిడవిట్‌లో ప్రస్తావించారు.

అఫిడవిట్ ప్రకారం.. అరవింద్ సావంత్ వద్ద ప్రస్తుతం రూ.135000 నగదు ఉందని, అతని భార్య వద్ద రూ.60000 ఉందని వెల్లడించారు. సావంత్ వద్ద 251.070 గ్రాముల బంగారం, 3000 గ్రాముల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. సావంత్ భార్య వద్ద 509.10 గ్రాముల బంగారం, 8000 గ్రాముల వెండి ఉందని వెల్లడించారు. అరవింద్ సావంత్ ఆస్తి మొత్తం రూ.2 కోట్ల 13 లక్షల 91 వేల 322. భార్య పేరు మీద 2 కోట్ల 26 లక్షల 65 వేల 869 రూపాయల ఆస్తులున్నట్లు వివరించారు.

ముంబై సౌత్ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న శివసేన నేత రాహుల్ షెవాలే సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ముంబై సౌత్ నుంచి డాక్టర్ మయూరి సంతోష్ షిండే, సబీహా బానో సహా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ముంబైలోని ఆరు స్థానాలకు మే 20న ఓటింగ్ జరుగుతుంది. నామినేషన్స్ దాఖలు చేయడానికి చివరి రోజు మే 3.

Advertisement
 
Advertisement