సోమవారం హన్మకొండలో కేసు వివరాలను వెల్లడిస్తున్న డీసీపీ వెంకటలక్మి
కాజీపేట అర్బన్: మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తున్నాడు.. కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో విసిగి వేసారిన భార్య అతడిని హత్య చేయాలని నిర్ణయించింది. అయితే.. కుటుంబ పెద్దను హత్య చేస్తే తర్వాత తమ పరిస్థితి ఏమిటని ఆలోచించిన ఆమె.. రూ.20 లక్షలకు బీమా చేయించి మరీ ఘాతుకానికి పాల్పడింది. ఈ హత్యకు భర్త సోదరి, బావ సహకారం కూడా తీసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో జరిగిన ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం హన్మకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి ఈ కేసు వివరాలన మీడియాకు వెల్లడించారు. పర్వతగిరి మండలం హత్యా తండాకు చెందిన బాదావత్ వీరన్న భార్య యాకమ్మతో కలసి పున్నేలు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దోబీగా పనిచేసేవాడు. లాక్‌డౌన్‌తో పాఠశాలను మూసివేయగా ఖాళీ మద్యం సీసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. (ఫోన్ స్విచ్చాఫ్ చేసిన ఎస్సై )
మద్యానికి బానిసైన వీరన్న భార్యను వేధించడం.. కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. భార్య పలుమార్లు హెచ్చరించినా మార్పు రాలేదు. దీంతో యాకమ్మ భర్తను హత్య చేయాలని నిర్ణయించింది. ఇందుకు చెన్నారావుపేటలో నివాసం ఉండే వీరన్న సోదరి భూక్యా బుజ్జి, బావ భూక్యా బిచ్చాల సహకారం కోరింది. వారు అంగీకరించడంతో అందరూ కలసి హత్యకు పథక రచన చేశారు. తొలుత గ్రామంలోని గ్రామీణ బ్యాంకులో రూ.20 లక్షలకు వీరన్న పేరిట బీమా చేయించారు. తర్వాత ఈనెల 19వ తేదీన నెక్కొండ ప్రాంతంలో సైకిల్‌పై ఖాళీ మద్యం సీసాలను విక్రయించేందుకు వీరన్న వెళ్లగా.. ఆ సమాచారాన్ని భూక్యా బిచ్చాకు అందజేసింది. నెక్కొండలో సాయంత్రం వీరన్నను కలసిన బిచ్చా.. తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని హత్యాతండాకు బయలుదేరాడు. మార్గమధ్యలో మద్యం తాగి తమ వ్యవసాయ భూమి వద్దకు రాత్రి 11.45 గంటలకు తీసుకెళ్లగా.. అప్పటికే భార్య యాకమ్మ, సోదరి బుజ్జి ఉన్నారు. అందరూ కలసి వీరన్నకు తాడుతో ఉరి వేసి హత్య చేశారు. బతికి ఉన్నాడన్న అనుమానంతో ముఖంపై బండరాయితో కొట్టి పక్కనే ఉన్న కెనాల్‌లో పడేశారు. అనంతరం బిచ్చా, బుజ్జి తమ స్వగ్రామానికి వెళ్లిపోగా.. యాకమ్మ తన భర్తను ఎవరో హత్య చేశారని నటించడం మొదలు పెట్టింది. దీంతో పర్వతగిరి ఇన్‌స్పెక్టర్ పి.కిషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ పుటేజీల ఆధారంగా..
అయితే, సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా అనుమానం రావడంతో పోలీసులు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. ఈ హత్య తామే చేశామని వారు అంగీకరించారు. దీంతో నిందితులు యాకమ్మ, బిచ్చా, బుజ్జిలను అరెస్టు చేశారు. కాగా, ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన మామూనూర్ ఏసీపీ శ్యాంసుందర్, పర్వతగిరి ఇన్‌స్పెక్టర్ పి.కిషన్, ఎస్సైలు ప్రశాంత బాబు, నర్సింగరావు, సురేష్‌తో పాటు, కానిస్టేబుళ్లను సీపీ రవీందర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment