ఈపీఎఫ్‌ నుంచి పాలసీ కట్టొచ్చు! | How to pay LIC Premium Payment using EPF corpus? | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌ నుంచి పాలసీ కట్టొచ్చు!

Published Mon, Jan 9 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM

ఈపీఎఫ్‌ నుంచి పాలసీ కట్టొచ్చు!

ఈపీఎఫ్‌ నుంచి పాలసీ కట్టొచ్చు!

కావాలంటే పీఎఫ్‌ సంస్థే కడుతుంది  
కానీ మీ ఖాతాలో డబ్బులుంటేనే సుమా!  
లేకపోతే పాలసీ రద్దయ్యే ప్రమాదమూ ఉంది  


ఎల్‌ఐసీ పాలసీలు మనలో చాలా మంది తీసుకుంటారు. ఉద్యోగులైతే ప్రత్యేకంగా వారి వేతనం నుంచి ప్రీమియం కట్టాల్సిన ఇబ్బంది లేకుండా భవిష్య నిధి (ఈపీ ఎఫ్‌)ని అందుకు ఉపయోగించుకోవచ్చు. చాలా మందికి ఈ విష యమై అవగాహన లేదు. ఈ సదుపాయం ఎలాగో ఓసారి చూద్దాం...


కొత్తగా ఎల్‌ఐసీ పాలసీ తీసుకుంటున్నా, ఇప్పటికే పాలసీ తీసుకుని ఉన్నా... సంబంధిత పాలసీ వివరాలను ఈపీఎఫ్‌వోకు తెలియజేసి ప్రీమియాన్ని తమ భవిష్య నిధి నుంచి చెల్లించాలని కోరవచ్చు. అయితే, ఈపీఎఫ్‌వోకు చెప్పాం కదా అని దాని గురించి పట్టించుకోవటం మానొద్దు. ఎందుకంటే బీమా పాలసీ ప్రీమియాన్ని పీఎఫ్‌ నుంచి చెల్లించాలని కోరిన తర్వాత మీ భవిష్యనిధి ఖాతాలో నగదు నిల్వలు తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే ఈపీఎఫ్‌వో ఎలా చెల్లిస్తుంది చెప్పండి? పైపెచ్చు ఈ విషయంలో మిమ్మల్ని ఈపీఎఫ్‌వో అప్రమత్తం చేయదు కూడా. ఆ బాధ్యత పాలసీదారుడిపైనే ఉంటుంది. ఈపీఎఫ్‌వో గనక ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్‌ అయిపోతుందని గుర్తుంచుకోవాలి. భవిష్య నిధిలో డబ్బులున్నంత కాలం ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపు సదుపాయం యాక్టివ్‌గానే ఉంటుంది. నిధిని ఖాళీ చేసేస్తే పాలసీదారు స్వయంగా బీమా పాలసీ ప్రీమియాన్ని గుర్తుంచుకుని మరీ చెల్లించుకోవాలి.

ఈపీఎఫ్‌కు హక్కులివ్వాలి...
భవిష్య నిధి నుంచి ఎల్‌ఐసీ పాలసీ ప్రీమియాన్ని చెల్లించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని అనుకుంటే... ఆ పాలసీపై హక్కుల్ని ఈపీఎఫ్‌వో సంస్థకు దఖలు పరచాలనే నిబంధన ఉంది. భవిష్య నిధి నుంచి పాలసీ ప్రీమియాన్ని చెల్లించడం ద్వారా దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా ఈ నిబంధన విధించినట్టు తెలుస్తోంది. ఉదాహరణకు ఎల్‌ఐసీ ఎండోమెంట్‌ పాలసీని సరెండ్‌ చేయడం ద్వారా కట్టిన మొత్తంలో కొంత వెనక్కి అందుకునే అవకాశం ఉందన్న విషయం తెలుసు. అలాగే, పాలసీపై రుణం పొందే సదుపాయం కూడా ఉంది. భవిష్య నిధిని బీమా పాలసీకి మళ్లించి అక్కడి నుంచి నిధిని తరలించుకుపోకుండా ఈ నిబంధన విధించి ఉండవచ్చు.

రెండేళ్లు నిండాలి...
ఈ సదుపాయం కోసం ఈపీఎఫ్‌ చందాదారుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న వారే అర్హులు. ఉద్యోగం చేస్తున్న సంస్థలోనే ఇందుకు సంబంధించి ఫామ్‌ 14ను ఇస్తే సరిపోతుంది. ఈ ఫామ్‌ను ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

భవిష్య నిధి నుంచి చెల్లించడం సరైనదేనా?
ఎల్‌ఐసీ పాలసీ ప్రీమియాన్ని భవిష్య నిధి నుంచి చెల్లించడం కరెక్టేనా? అన్న సందేహం సహజం. జీవితానికి బీమా పాలసీ ఎంతో కీలకమైనది. ప్రీమియం సకాలంలో చెల్లిస్తేనే పాలసీ మనుగడలో ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈపీఎఫ్‌వో ప్రీమియాన్ని చెల్లించిందా? లేదా? అన్నది గడువు తేదీ తర్వాత బీమా కార్యాలయంలో తెలుసుకోవాలి. లేదంటే వెంటనే చెల్లించాలి. ఈ మాత్రం సమయం కేటాయించే తీరిక ఉంటే భవిష్య నిధి నుంచి ప్రీమియాన్ని నిశ్చింతగా చెల్లించుకోవచ్చు. ఎందుకంటే భవిష్యనిధిలో నగదు నిల్వలు లేక ఈపీఎఫ్‌వో చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్‌ అవుతుంది. దాంతో పాలసీదారుడు రిస్క్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక, భవిష్యనిధి అనేది ఉద్యోగ విరమణ తర్వాత అక్కరకు వచ్చే చక్కని సాధనం. దాని నిల్వల నుంచి పాలసీ ప్రీమియం చెల్లించడం కంటే వీలుంటే సొంత బడ్జెట్‌ నుంచి చెల్లించటమే మంచిది. బడ్జెట్‌ కష్టంగా ఉంటే, వేతనం నుంచి కట్టే అవకాశం లేకపోతేనే ఈపీఎఫ్‌ నుంచి చెల్లించడం ఎంచుకోవాలి.

–సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement