ఈ-కామర్స్ వెబ్సైట్లలో బీమా పాలసీలు
♦ అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి
♦ ఐఆర్‌డీఏఐ చైర్మన్ టి.ఎస్.విజయన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బీమా పాలసీలు ఇక నుంచి ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో లభించనున్నాయి. పాలసీల అమ్మకం, సేవలు అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయని ఐఆర్‌డీఏఐ చైర్మన్ టి.ఎస్.విజయన్ వెల్లడించారు. గురువారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. హై కమర్షియల్ పాలసీలకు అక్టోబర్ 1 తప్పనిసరి చేయనున్నట్టు విజయన్ చెప్పారు. కస్టమర్ కోరితే కంపెనీ తప్పనిసరి ఆన్ లైన్‌లో అందుబాటులోకి తేవాల్సిందేనని అన్నారు. బీమా పోర్టబిలిటీ రానున్న రోజుల్లో పెద్ద సవాల్‌గా నిలువనుందన్నారు.
‘ప్రస్తుతం ఆరోగ్య బీమా పాలసీలకు మాత్రమే పోర్టబిలిటీ ఉంది. పాలసీ ప్రమాణీకరించి (స్టాండర్డైజ్) ఉంటేనే పోర్టబిలిటీకి ఆస్కారం ఉంటుంది. పాలసీలో విభిన్న షరతులు (క్లాజులు) ఉంటే ముందుగా సరళీకృతం చేసి ప్రమాణీకరించాలి. పోర్టబిలిటీ విషయంలో ఐఆర్‌డీఏఐ ముందు ఎటువంటి రోడ్ మ్యాప్ లేదు. పాలసీల డిజిటైజేషన్ తొలి అడుగు. ఇది పూర్తి అయితే పోర్టబిలిటీ గురించి ఆలోచిస్తాం. ఇది అమలైతే కంపెనీ సేవలకు రేటింగ్ ఇచ్చేందుకు కస్టమర్లకు వీలు కలుగుతుంది. మంచి సేవలందించే కంపెనీని ఎంచుకోవచ్చు’ అని వివరించారు.