
మధ్యవర్తిల మహా జోరు..
భారీగా పెరుగుతున్న ఆన్‌లైన్ ఆగ్రిగేటర్లు
ట్యాక్సీ నుంచి బీమా పాలసీల దాకా అన్నిటికీ ప్రతి రంగానికీ విస్తరిస్తున్న ఆగ్రిగేటింగ్ వెబ్‌సైట్లు
భవిష్యత్తు దృష్ట్యా ఆకాశానికి ఎగస్తున్న వాల్యుయేషన్లు ‘ఉబెర్’ విలువ ఏకంగా రూ.2.5 లక్షల కోట్లపైనే
రూ. 1,200 కోట్లు పెట్టి ట్యాక్సీ ఫర్ స్యూర్‌ను కొన్న ఓలా పాలసీ బజార్‌లో ప్రేమ్‌జీ రూ.300 కోట్ల పెట్టుబడి
మధ్యవర్తి. మరోరకంగా చెప్పాలంటే దళారి
పేరేదైనా... చేసే పని మాత్రం కొనుగోలుదారు, అమ్మకందారు మధ్య సంధానకర్త్తే. దుస్తులు... షూలు... కిచెన్ వేర్... ఎలక్ట్రానిక్స్... ఏ వస్తువైనా కావొచ్చు.. కొనాలనుకున్నప్పుడు సాధారణంగా ఏం చేస్తాం? ఎకాయెకిన కొనేయకుండా నాలుగైదు షాపులు తిరిగి రేట్లు తెలుసుకుని, నాణ్యమైనది ఎక్కడ చవకగా దొరుకుతోందో చూస్తాం. అక్కడే కొనుక్కుంటాం. మరి ఇన్ని షాపుల చుట్టూ ఇలా తిరక్కుండా... అసలు ఇంటి నుంచి కాలు బయటపెట్టాల్సిన అవసరమే లేకుండా ఆన్‌లైన్లోనే అన్ని షాపుల్లోని, అన్ని బ్రాండ్ల ధరలూ ఒకేచోట దొరికేస్తే! అన్ని కంపెనీల సేవలూ ఒకేచోట దొరికేస్తే..! అన్నిటినీ పోల్చిచూసుకునే అవకాశం ఒకేచోట ఉంటే...? ఉండకేం... బీమా పాలసీల నుంచి మ్యూచ్‌వల్ ఫండ్ల వరకూ... సినిమా టికెట్ల నుంచి విమానం టికెట్ల వరకూ... ట్యాక్సీ నుంచి హోటల్ ప్యాకేజీల వరకూ అన్ని సేవలనూ ‘ఒకే గేట్‌వే’ నుంచి అందించడానికి బోలెడన్ని ‘ఆగ్రిగేటర్లు’ వచ్చాయి. ఇండియాలో ఇంటర్నెట్‌తో పాటు ఆగ్రిగేటర్ల వాడకమూ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అసలీ ఆగ్రిగేటర్ల కథేంటి? వీటి భవిష్యత్తేంటి? వీటితో ఉపయోగాలేంటి? అనే విశ్లేషణే ఈ కథనం...
సమాచార్‌తో అరంగేట్రం...
ఆగ్రిగేటర్లంటే మొదట చెప్పాల్సింది వార్తల ఆగ్రిగేటర్‌గా అరంగేట్రం చేసిన సమాచార్ డాట్ కామ్ గురించే. 1990ల చివరల్లో ఇండియా వరల్డ్ సంస్థ ఆరంభించిన ఈ న్యూస్ ఆగ్రిగేటర్‌ను, మరో మూడునాలుగు వెబ్‌సైట్లను కలిపి అప్పట్లో సత్యం కంప్యూటర్స్ సంస్థ... సిఫీ ద్వారా ఏకంగా రూ.499 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అప్పట్లో అదొక రికార్డు. తమక్కూడా న్యూస్ పోర్టల్ (సిఫీ.కామ్) ఉంది కనక రెండిటినీ కలిపితే విదేశాల్లోని భారతీయ నెటిజన్లంతా తమ పోర్టలే చూస్తారని, ఈ ఏకచ్ఛత్రాధిపత్యం కోసమే అంత సొమ్ము పెట్టామని అప్పట్లో సిఫీ చెప్పింది. అయితే తరువాతి పరిణామాల్లో ఇంటర్‌నెట్‌తో పాటు న్యూస్ పోర్టళ్లూ బాగా అభివృద్ధి చెంది అవే సొంతగా యూజర్ల మొబైల్స్‌కు ఫ్లాష్‌లు పంపటం, ఎక్స్‌క్లూజివ్ వార్తల్ని కూడా మెసేజ్‌లు, మెయిల్స్ ద్వారా పుష్ చేయటం మొదలెట్టాయి. ఫలితంగా యూజర్లు నేరుగా నచ్చిన సైట్‌కే వెళుతుండటంతో సొంత వార్తలతో సహా ఆగ్రిగేటర్ సేవలనూ అందిస్తున్న సమాచార్ డాట్‌కామ్ వెనకబడిపోయింది.
ప్రతి పనికీ ఆగ్రిగేటర్లే!
నిజానికి ఈ ఆగ్రిగేటింగ్ వెబ్‌సైట్లకు సొంత ఉత్పత్తులేమీ ఉండవు. వాటిని విక్రయించే వివిధ సంస్థలు, వెబ్‌సైట్ల నుంచి సమాచారం సేకరించి, ఒకే చోట అందించడమే వీటి పని. దీంతో కస్టమర్లు తమకు కావాల్సిన ఉత్పత్తులు లేదా సర్వీసులను వివిధ సంస్థలు ఏ రేటుకు, ఎంత నాణ్యంగా అందిస్తున్నాయో పోల్చి చూసుకుని... వీలైతే అక్కడే కొనుగోలు చేయటమో, లేకుంటే సదరు సంస్థ సొంత వెబ్‌సైట్లో కొనటమో చేయొచ్చు. ఇంటర్ నెట్, మొబైల్ నెట్ బూమ్‌తో ఇపుడు ఆగ్రిగేటర్ల హవా అంతకంతకూ పెరుగుతుండటంతో వాటి వాల్యుయేషన్లూ ఆకాశాన్నంటుతున్నాయి.
రిఫరల్ సేవలు కూడా...
ధరలను పోల్చే ఆన్‌లైన్ అగ్రిగేటర్ల వ్యాపార విధానాలు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి మధ్యవర్తి విధానం కాగా.. మరొకటి రిఫరల్ విధానం. మొదటిది యాత్రా, మేక్‌మైట్రిప్ వంటి ట్రావెల్ పోర్టల్స్ తరహాలో ఉంటుంది. కస్టమర్ సదరు సైటును సందర్శించి... విమాన టికెట్లు, హోటళ్లు, టూర్ ప్యాకేజీల వంటి ఉత్పత్తుల గురించి తెలుసుకున్నాక ఆ సైట్ నుంచే నేరుగా కొనుగోలు చేయొచ్చు. రిఫరల్ విధానానికి వస్తే... ఇక్సిగో తదితర వెబ్‌సైట్లు ఈ కోవలోకి వస్తాయి. కస్టమర్ ఆగ్రిగేటర్ సైట్లోకి వెళ్లి వివిధ కంపెనీల కొటేషన్లను పోల్చి చూసుకున్నాక నేరుగా కావాల్సిన కంపెనీ సైటుకు అక్కడి నుంచే లావాదేవీని నిర్వహించుకోవచ్చు. కస్టమర్‌ను అందించినందుకు రిఫరల్ ఆగ్రిగేటరుకు కంపెనీ నుంచి కొంత కమిషన్ లభిస్తుంది. కూపన్‌దునియా, షాపింగ్‌పైరేట్స్ వంటి కూపన్ వెబ్‌సైట్లు ఈ కోవలోనివే.
భవిష్యత్తేంటి?
ఈ-కామర్స్ అభివృద్ధిపై రెండో అభిప్రాయానికి తావులేకున్నా... వాటి ఆదాయాలు, వాల్యుయేషన్లపై మాత్రం విశ్లేషకుల అంచనాల్లో ఏకాభిప్రాయం లేదు. చాలా ఈ కామర్స్ సంస్థలకు స్పష్టమైన ఆదాయ మార్గాలు లేవని, అలాంటపుడు ఈ వాల్యుయేషన్లు ఏ మేరకు కరెక్టనుకోవాలనేది వారి వాదన. ఆ లెక్కన చూస్తే ఆగ్రిగేటర్లు ఆధార పడాల్సిందల్లా రిఫర్ చేసిన సైట్లు అందించే కమిషన్‌పైనే. ఇపుడు ఈ కామర్స్ సంస్థలు భారీ ప్రచారం, ప్రత్యేక డీల్స్, షాపింగ్ ఫెస్టివల్స్ వంటి ఆకర్షణలతో నేరుగా వినియోగదారుల్ని తమ సైట్లకే రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
అవి విజయవంతమవుతున్నాయి కూడా. మున్ముందు ఈ కామర్స్ రంగంలో పునరేకీకరణ జరిగి చిన్నచిన్న వెబ్‌సైట్లు టేకోవర్ అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. అదే జరిగితే మిగిలిన పెద్ద సంస్థలు నేరుగా కస్టమర్లను తమవద్దకే రప్పించుకోవటం పెద్ద కష్టమేమీ కాబోదు. అపుడు ఈ ఆగ్రిగేటర్ల భవిష్యత్తేంటనేది ఇప్పుడే చెప్పలేం. బ్రిటన్ బీమా రంగంలో 60 మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు, 50 శాతం వ్యక్తిగత బీమా పాలసీలు అగ్రిగేటర్ల ద్వారానే అమ్ముడవుతున్నాయి. 2018 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది వద్ద స్మార్ట్ మొబైల్ ఫోన్లు ఉంటాయి, దీంతో ఆగ్రిగేటర్ల వాడకమూ పెరుగుతుంది.
ఈ-కామర్స్‌లోనూ హవా
జంగ్లీ.కామ్, మైస్మార్ట్‌ప్రైస్.కామ్, ప్రైస్‌దేఖో.కామ్, 91మొబైల్స్.కామ్... ఇలా డజన్ల కొద్దీ ఈ-కామర్స్ అగ్రిగేటర్లున్నాయి. మొబైల్ ఫోన్లు, దుస్తులు, బుక్స్, ఆభరణాలు.. ఇలా పలు ఉత్పత్తుల సంస్థలకు అగ్రిగేటర్‌గా జంగ్లీడాట్‌కామ్ ఉంది. ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫీబీమ్, స్నాప్‌డీల్, అమెజాన్ తదితర ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో అమ్మే ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, గృహోపకరణాల ధరలను పోల్చి చూపించేందుకు మైస్మార్ట్‌ప్రైస్ ఉపయోగపడుతోంది. ప్రైస్‌దేఖో కూడా అలాంటిదే. ఒకేసారి పలు ఫోన్ల స్పెసిఫికేషన్లు, ధరలను పోల్చిచూసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి స్మార్ట్‌ప్రిక్స్, 91మొబైల్స్ తదితర సైట్లు. రియల్‌ఎస్టేట్‌లో మకాన్, మ్యాజిక్‌బ్రిక్స్ లాంటి వెబ్‌సైట్లు... ఆటోమొబైల్స్‌లో కార్‌వాలే తదితర సైట్లు ఆగ్రిగేషన్ సేవలందిస్తున్నాయి. కాగా ఈ కామర్స్ భవిష్యత్తుపై నమ్మకంతో పలు ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు క్రమంగా అగ్రిగేటర్లుగా మారుతున్నాయి. యేభీ డాట్‌కామ్, బీస్టయిలిష్ డాట్‌కామ్ లాంటివి ఈ కోవలోనివే.
ఆర్థిక సేవల్లో ముందంజ...
రుణాలు, క్రెడిట్ కార్డుల సమాచారం కావాలంటే బ్యాంక్‌బజార్ డాట్‌కామ్‌కు వెళితే చాలు. ఫండ్స్ ఇండియా అనేది మ్యూచువల్ ఫండ్స్ ఆగ్రిగేటర్‌గా కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థ వ్యాపారం ఏటా 300-400 శాతం వృద్ధి చెందుతోందంటే పరిస్థితి తెలుస్తోంది. ఇక వివిధ బీమా కంపెనీల పాలసీలకు అగ్రిగేటర్‌గా పాలసీ బజార్ డాట్‌కామ్ వ్యవహరిస్తోంది. 2010-11లో ఈ వెబ్‌సైట్ ద్వారా నెలకు 1,000 కన్నా తక్కువ లావాదేవీలు జరగ్గా... 2013-14లో ఈ సంఖ్య ఏకంగా 32,000కు చేరింది. పాలసీబజార్ ఇటీవలే మరో రూ. 300 కోట్లు నిధులు సమీకరణ కోసం ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ (విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ సంస్థ)తో డీల్ కుదుర్చుకుంది. దీని ప్రకారం పాలసీబజార్ విలువ ఏకంగా రూ. 1,200 కోట్లుగా లెక్కగట్టారు. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ వెబ్‌సైట్లోని వివరాల మేరకు ప్రస్తుతం మై ఇన్సూరెన్స్‌క్లబ్, ఎక్యూరేట్ కోట్స్, బైస్మార్ట్‌పాలసీ... లాంటి సంస్థలకు ఆగ్రిగేటర్లుగా వ్యవహరించేందుకు అనుమతి ఉంది.
- ‘సాక్షి’ బిజినెస్ విభాగం