బీమా చేసి.. వదిలేశారా..?? | Indians gift Rs 5000 crore to LIC every year | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీకి ఏటా రూ.5వేల కోట్లు మిగులు

Published Sun, Sep 9 2018 7:32 PM | Last Updated on Mon, Sep 10 2018 2:49 AM

Indians gift Rs 5000 crore to LIC every year - Sakshi

మనలో చాలా మంది జీవిత బీమా పాలసీలు తీసుకుంటూ ఉంటారు. వీరిలో ఎక్కువ మంది ఆదాయం పన్ను మినహాయింపు పొందడం కోసం పాలసీ తీసుకుంటారు.అయితే, ఆ అవసరం తీరిపోయాకా పాలసీ గురించి పట్టించుకోరు. క్రమం తప్పకుండా ప్రీమియంలు కట్టరు.దాంతో  ఆ పాలసీ లాప్స్‌ అయిపోతుంది.ఇలా పాలసీ చేసి ప్రీమియంలు కట్టకపోవడం వల్ల ఎల్‌ఐసీకి ఏటా 5వేల కోట్ల రూపాయలకు పైగా మిగులుతోందని తేలింది.దేశంలో ఉన్న బీమా కంపెనీలు చేయించే పాలసీలలో 25శాతం పాలసీలు మొదటి ఏడాది తర్వాత లాప్స్‌ అయిపోతున్నాయి. పాలసీ కట్టిన ఏడాది లోపు అది లాప్స్‌ అయిపోతే కట్టిన వారికి డబ్బులేమీ తిరిగి రావు. బీమా సంస్థలు పాలసీకి సంబంధించిన ఖర్చులన్నీ–ఏజెంట్‌ కమిషన్‌ సహా–తీసేసు కుంటాయి.దాంతో పాలసీదారునికి ఎంత డబ్బు తిరిగి వస్తుందన్నది అనుమానమే.2016–17 సంవత్సరంలో జీవిత బీమా సంస్థ(ఎస్‌ఐటీ) రూ.22,178 కోట్ల విలువైన రెగ్యులర్‌ ప్రీమియం పాలసీలను (క్రమం తప్పకుండా ప్రీమియంలు కట్టాల్సిన పాలసీలు) విక్రయించింది. దేశం మొత్తం మీద జరిగిన పాలసీ విక్రయాల్లో ఇది 44శాతం.అయితే, ఏడాది తర్వాత ‘పీమియంలు కట్టని కారణంగా దీనిలో 25శాతం పాలసీలు లాప్స్‌ అయిపోవడం వల్ల ఎల్‌ఐసీకి 5వేల కోట్ల రూపాయలకు పైగా మిగిలిందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

కొందరు పాలసీదారులు ఉద్దేశ పూర్వకంగానే ప్రీమియంలు కట్టరు. మరి కొందరు గుర్తులేకో, సమయానికి డబ్బు అందకో మరే కారణం చేతో ప్రీమియం కట్టలేకపోతున్నారు. పాలసీ చేయించిన ఏజెంటు కూడా పాలసీ కట్టించుకున్న తర్వాత దాని గురించి పట్టించుకోకపోవడం కూడా ఒక కారణం. విదేశాల్లో అయితే, పాలసీ లాప్స్‌ అయితే కంపెనీలు సంబంధిత ఏజెంటుకిచ్చిన కమీషన్‌ నుంచి కొంత మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తాయి. దానివల్ల ఏజెంట్లు పాలసీలు లాప్స్‌ కాకుండా చూసుకుంటారు.మన దగ్గర ఆ విధానం లేదు.

ఇదిలా ఉంటే, కొందరు జీవిత బీమా పాలసీలు చేసి ప్రీమియంలు కూడా చివరి వరకు కడతారు.అయితే ఆ వివరాలేమీ ఇంట్లో వాళ్లకి చెప్పరు.దాంతో వారు చనిపోతే ఆ పాలసీ సొమ్ము కంపెనీ దగ్గరే ఉండిపోతుంది.ఇలా ఎవరూ క్లెయిమ్‌ చేయని సొమ్ము 15వేల కోట్ల వరకకు బీమా కంపెనీల దగ్గర ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement