నిన్న నేడు రేపు | Tomorrow is more important to us than yesterday and today | Sakshi
Sakshi News home page

నిన్న నేడు రేపు

Published Mon, Jun 5 2023 12:25 AM | Last Updated on Sat, Jul 15 2023 4:30 PM

Tomorrow is more important to us than yesterday and today - Sakshi

నేడులో ఉన్న మనం నిన్నను దాటుకుని వచ్చాం. నేడునూ దాటుకుని మనం రేపులోకి వెళ్లాల్సి ఉంది. నిన్న, నేడులకన్నా మనకు రేపు ఎంతో ముఖ్యం. నిన్న, నేడుల్లో లాభం, నష్టం, సుఖం, శోకం, ప్రగతి, పతనం మనకు వచ్చి ఉంటాయి. వీటి ప్రాతిపదికన మనం రేపులోకి వెళ్లాల్సి ఉంటుంది. మనం ఏ స్థితిలో ఉన్నా, మన పరిస్థితి ఏదైనా మనం తప్పకుండా రేపు వైపు కదలాలి; కదులుదాం.

నిన్నవైపు కాదు మన చూపు రేపు వైపు ఉండాలి. నేడులో ఉండిపోవడం కాదు మనం రేపువైపు నడవాలి. రేపువైపు చూపు వేసి మనం కదులుతూ ఉండాలి. మన చూపు నిండా, మన కదలిక నిండా  చేవను మనం నింపుకోవాలి.

మనలో నీరసం ఉంటుంది. దాన్ని నిన్న మరిచిపోయినా నేడు నేల రాసేసుకోవాలి. మనలో చెడ్డతనం ఉంటుంది. అది నిన్నటి నుంచి నేడులోకి వచ్చేసినా  రేపులోకి రాకుండా దాన్ని కూలదోసుకోవాలి. మనలోని మూర్ఖత్వాన్ని నేడు తప్పకుండా విడిచి పెట్టెయ్యాలి. మన జాడ్యాలు మన రేపులోకి రాకుండా నేడు మనమే వాటిని మట్టు పెట్టుకోవాలి. నిన్న మనకు మనమే వేసుకున్న  కుత్సితాల సంకెలల్ని నేడైనా తెంచేసుకోవాలి. నిన్న మనలోకి వచ్చి చేరి నిలిచి ఉన్న మత్సరభావాల విషాన్ని నేడు పూర్తిగా ఒంపేసుకోవాలి.

నిన్నకు నేడు కొనసాగింపు కాకూడదు. నిన్నకు నేడు కొనసాగింపు అయి ఉంటే అది తప్పు అని తప్పకుండా తెలుసుకోవాలి. ఆ తప్పు కొనసాగకుండా నేడు మనం జాగ్రత్తపడాలి. జాగరూకతతో మనం రేపును స్పృశించాలి.
నిలిచి ఉండే చెలిమితోనూ,  నిజమైన నైజంతోనూ, నిర్మలమైన హదయంతోనూ, చల్లటి ఆశయాలతోనూ, చక్కని ఆలోచనలతోనూ సత్ప్రవర్తనతోనూ మనం రేపులోకి వెళ్లాలి. మన నిన్నలో, నిన్న మనలో అవి లేకపోయినా రేపు అవి మనకు ఎంతో అవసరం అని నేడైనా గ్రహించి మనం రేపులోకి వెళ్లాలి.

నిన్న మనం ఎలా ఉన్నా, నేడు మనం ఎలా ఉంటున్నా రేపు మాత్రం మనం గొప్పగా ఉండాలి; అధమపక్షం రేపు మనం బావుండాలి. అందుకు నేడు మనం సిద్ధపడాలి. రేపులో మనం మెరుగ్గానూ, మేలుగానూ ఉండేందుకు మనం నేడు తయారుగా ఉండాలి; మనల్ని మనం తయారు చేసుకోవాలి.

అలవాటుపడ్డ సోమరితనానికి, అభిప్రాయాలకూ నేటితో స్వస్తి పలికి, ఉండాల్సిన ఉత్సాహానికి, అవగాహనకూ నేడైనా నాంది పలికి అభ్యున్నతికి ప్రస్తావన కలిగేందుకు, కల్పించుకునేందుకు రేపులోకి వెళ్లాలి మనం. పనిచేస్తూ ప్రయోజనాన్ని పొందే చేతులతో, మెరిసే తలపులు కలిగే మస్తిష్కంతో భేషజాల పరదాలు తొలగించుకుని, వేషాలు పోయే గుణాన్ని మరచిపోయి మనం రేపులోకి చేరాలి.

పరుల బాధను పట్టించుకోవడం పాపం కాదు; తోటి వాడికి మంచి చెయ్యడం నేరం కాదు; సాటివాడికి చేయూతను ఇవ్వడం దోషం కాదు కాబట్టి వాటిని చేపట్టడానికి కూడా మనం రేపును వేదిక చేసుకోవాలి. రేపైనా మనల్ని మనం నరులం అని  నిరూపించుకోవాలి.
మన కోసం, మన రాక కోసం వేచి ఉన్నది సుమా రేపు అన్నది; లేచి వెళ్లి అందుకోవడానికే మనం ఉన్నది. మనంత మనంగా, మనం మనంగా నిజమైన మనుషులంగా జీవం ఉన్నవాళ్లంగా జీవించేందుకుగా మనం రేపును అందుకోవాలి.

మన రాగం, మన యాగం, మన త్యాగాలతో గణనీయమైన మనుగడను సాధించేందుకు, ఆపై మన గానం, మన ధ్యానం, మన జ్ఞానాలతో స్మరణీయమైన మనుషులం అయ్యేందుకు మనం రేపును ఆవాహన చేసుకోవాలి.

‘బెదురు లేకుండా కదులుతూ ఎదురు వెళ్లి రేపులోకి ప్రవేశిద్దాం; ఏ మాత్రమూ చెదిరిపోకుండా ఎదిగేందుకు విఫలం అవకుండా రేపుకు ప్రయుక్తం అవుదాం‘.

– రోచిష్మాన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement