నేడు, రేపు భారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో నగరంతో పాటు తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. గత 24 గంటల్లో రంగారెడ్డి జిల్లా హకీంపేటలో ఏకంగా 17 సెంటీమీటర్ల కుండపోత కురిసింది.
వరంగల్ జిల్లా ఘన్‌పూర్, పాలకుర్తి, ఖమ్మం జిల్లా ములకలపల్లిలలో 15, రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో 13, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో 12, జనగాం, మేడ్చల్‌లలో 11, ధర్మసాగర్, కొత్తగూడెంలలో 10, గూడూరు, హైదరాబాద్‌లలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక ఖానాపూర్, గోల్కొండ, శాయంపేట, బయ్యారం, సూర్యాపేట, పర్వతగిరిల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది.
మరో 10 రోజులు నైరుతి రుతుపవనాలు!
సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్ ఈ నెలాఖరుతోనే ముగిసిపోవాలి. కానీ ఈసారి మరో పది రోజులు అదనంగా ప్రభావం చూపే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. వచ్చే నెల 10 వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుందని, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలా జరుగుతుందన్నారు. నైరుతి రుతుపవనాల వల్ల వచ్చే నెల మొదటి వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపారు. ఇక లానినా ట్రెండ్ మొదలైనా పూర్తిస్థాయిలో ఏర్పడలేదని... అది ఏర్పడితే రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంటున్నారు.