వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం కూడా కొనసాగుతూ మధ్య, ఉత్తర బంగాళాఖాతం వైపు ప్రయాణిస్తోంది. ఇది నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతూ బలపడి పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరం వద్ద ఈనెల 9న వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వివరించింది.
దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. శుక్రవారం వనపర్తి జిల్లాలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గద్వాల జిల్లాలో 4.16 సెం.మీ., మహబూబ్‌నగర్ జిల్లాలో 3.16 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో నైరుతి సీజన్‌లో ఇప్పటివరకు 60.87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 85.57 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment