పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు పయనం.. రాష్ట్రంలో భారీ వర్షాలకు విరామం
ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల కురిసిన కుంభవృష్టితో అతలాకుతలమైన రాష్ట్రంపై దూసుకొచ్చి కలవరపెట్టిన మరో అల్పపీడనం దిశ మార్చుకొని బంగ్లాదేశ్ వైపుగా కదులుతోంది. దీంతో రాష్ట్రానికి ముప్పు తప్పింది. రాష్ట్రంలో భారీ వర్షాలకు మరో నాలుగు రోజుల పాటు బ్రేక్ పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం సమీపంలో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ వైపుగా కదులుతోంది.
ఈ నెల 9 నాటికి ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, అనంతరం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తీరం దాటిన అనంతరం జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణిస్తూ బలహీనపడే సూచనలున్నాయని చెప్పారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి ఉత్తరాంధ్ర మీదుగా బీహార్ వరకూ విస్తరించి ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు 3 రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment