నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు
చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లోనూ ఎడతెగని వర్షం
లోతట్టు ప్రాంతాలు జలమయం.. అనేకచోట్ల రాకపోకలకు అంతరాయం.. వాయుగుండం నేడు తీరం దాటే చాన్స్
అతిభారీ వర్షాలతో ఆకస్మిక వరదలకు అవకాశం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో ముందుకొచి్చన సముద్రం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రాష్ట్రాన్ని వణికిస్తోంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లోనూ రెండ్రోజులుగా ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. వర్షాల తీవ్రతకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నెల్లూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై ఉండడంతో జన జీవనానికి ఇబ్బంది ఏర్పడింది. మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అతిభారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
నేడు తీరం దాటనున్న వాయుగుండం
ఇక బుధవారం రాత్రికి చెన్నైకి 190 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 250 కిలోమీటర్లు, నెల్లూరుకి 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడులోని పొన్నేరి–తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట మధ్యలో బుధవారం అర్థరాత్రి 12 నుంచి గురువారం వేకువజామున 3 గంటలలోపు తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత అల్పపీడనంగా బలహీన పడే అవకాశం ఉందని వెల్లడించింది.
దీని ప్రభావంతో గురువారం రాత్రి వరకు రాయలసీమలోని నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్లు వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అయితే సూళ్లూరుపేట, తడ మండలాలకే ఎక్కువ ప్రమాదం ఉన్నట్లుగా హెచ్చరిస్తున్నారు.
తేరుకుంటున్న చెన్నై..
సాక్షి, చెన్నై/సాక్షి, బెంగళూరు : వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చెన్నైలో బుధవారం క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 450 ప్రాంతాల్లో వరద నీటిని పూర్తిగా తొలగించారు. కానీ, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు అవస్థలు తప్పలేదు. కొన్ని కుటుంబాలను పడవల ద్వారా శిబిరాలకు తరలించారు. వాయుగుండం గురువారం తీరం దాటే అవకాశాలతో రెడ్ అలర్ట్‌ను కొనసాగిస్తున్నారు. చెన్నై శివార్లలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించారు.
బెంగళూరు విలవిల..
మరోవైపు.. భారీ వర్షాలకు ఐటీ రాజధాని బెంగళూరు వణికిపోతోంది. వర్షాల తీవ్రత మంగళవారం ఎక్కువగా ఉండగా, చాలావరకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.
తిరుపతిలో భారీ వర్షాలు..
వాయుగుండం ప్రభావంతో తిరుపతి జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోని పలుచోట్ల చెరువు కట్టలు దెబ్బతిన్నాయి. తిరుపతిలో 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. పిచ్చాటూరు మండలంలోని అరణియార్ ప్రాజెక్టుకు ఒక్కసారిగా 20 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. ఇప్పటివరకు జిల్లాలో సరాసరి 198.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు.. తిరుమలలోనూ భారీ వర్షం కురుస్తోంది. దీంతో రెండో ఘాట్ రోడ్డులోని 15వ మైలు వద్ద, భాష్యకార్ల సన్నిధికి సమీపంలో, హరిణి వద్ద బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలతో తిరు మాడవీధుల్లో, శ్రీవారి ఆలయం ఎదుట నీరు ప్రవహిస్తోంది. మరోవైపు.. వర్షాల కారణంగా తిరుమలలోని డ్యాముల్లోకి పెద్దఎత్తున నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఐదు డ్యాములకు 250 లక్షల గ్యాలన్ల నీరు వచ్చిచేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. బుధవారం ఉ.7.35 గంటలకు హైదరాబాద్ నుంచి తిరుపతి విమానాశ్రయానికి ప్రయాణికులతో ఇండిగో విమానం చేరుకుంది.
ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో చెన్నైకు వెళ్లింది. అక్కడ రన్‌వేపై నీళ్లు ఉండటంతో తిరిగి రేణిగుంటకు చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా దింపి మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. అలాగే హైదరాబాద్ నుంచి తిరుపతి రావాల్సిన మరో ఇండిగో విమాన సర్వీసు రద్దయింది. అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరుతోపాటు రాజంపేటలలో వరి, బొప్పాయి, అరటికి నష్టం జరిగింది.
శ్రీవారి మెట్టు మార్గం మూసివేత..
ఇక భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని గురువారం వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది. అలాగే, బుధవారం రాత్రి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ఈఓ శ్యామలరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులతో వర్చువల్‌గా జరిగిన సమావేశంలో ఆదేశించారు. కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి వాటికీ ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం చూడాలన్నారు.
నెల్లూరు జిల్లాలో అత్యవసర పరిస్థితి..
మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కలెక్టర్ ఆనంద్ జిల్లాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అధికారులు, రెవెన్యూ, పంచాయతీ ఉద్యోగులకు సెలవులను రద్దుచేశారు. పెన్నా పరీవాహక ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేçస్తూ కలెక్టర్‌తో పాటు ఎస్పీ కృష్ణకాంత్, అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక నెల్లూరు నగరంలో వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని సుమారు 8.50 లక్షల జనాభాలో దాదాపు 1.5 లక్షల మంది వర్ష ప్రభావానికి గురయ్యారు. ఇక పలుచోట్ల వాగులు పొంగిపొర్లడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అలాగే, జిల్లాలో పలుచోట్ల సముద్రం ఐదారు మీటర్ల వరకు ముందుకొచ్చింది. మూడు నుంచి నాలుగు మీటర్ల వరకు అలలు ఎగసిపడుతున్నాయి. బాపట్ల జిల్లా సూర్యలంక సముద్రతీరం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్కసారిగా 120 అడుగుల మేర ముందుకు వచ్చింది. పౌర్ణమిరోజు వచ్చే పోటు సమయంలో సహజంగా 20 అడుగుల మేర సముద్రం ముందుకొస్తుంది. తీరంలోని వాచ్‌టవర్లు, తాత్కాలిక విశ్రాంతి బెడ్స్,, పర్యాటకులు కూర్చునే బల్లలను దాటుకుని సముద్రపునీరు ముందుకొచ్చింది. జిల్లాలో 14 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి బాధితులను వీటిలోకి తరలించారు. ఉలవపాడు మండల పరిధిలోని మన్నేటికోట గ్రామంలోని పునరావాస కేంద్రంలో బాధితుల్ని గాలికొదిలేశారు. రెవెన్యూ సిబ్బంది కొంత బియ్యం, కూరగాయలు షెల్టర్ వద్ద ఉంచి వెళ్లిపోయారు. దీంతో గిరిజనులే వండుకున్నారు.
అధికారులు బుధవారం మధ్యాహ్నం వరకు కూడా భోజనాల ఏర్పాట్లుచేయలేదు. బాధితులే వండుకున్నారు. కానీ, ఉన్నతాధికారులకు పంపే రిపోర్టులో మాత్రం పునరావాసంలో అన్నం వండి వారికి పెట్టినట్లుగా పేర్కొన్నారు. 8 ప్రకాశం జిల్లా అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. సింగరాయకొండ, కొత్తపట్నం, ఒంగోలు, సంతనూతలపాడు సముద్రతీర ప్రాంతాల్లో ఈదురు గాలుల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు వేట నిలిపివేశారు.
లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులకు గండ్లు పడటం, చెరువు కట్టలు తెగిపోవడం, పలుచోట్ల సప్టాలు మునిగిపోయాయి. ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నివాస ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment