గంటకు 17 కి.మీ. వేగంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు పయనం
నేటి మధ్యాహ్నానికి అల్పపీడనంగా బలహీన పడే సూచనలు
6, 7 తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
7 నుంచి రాష్ట్రంలో మళ్లీ వానలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని గడగడలాడించిన వాయుగుండం కళింగపట్నం సమీపంలో అదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో తీరం దాటింది. భూమిపైకి చేరి దక్షిణ ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్ వైపు ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది గంటకు 17 కి.మీ. వేగంతో కదులుతోంది. ఇది పశి్చమ వాయువ్య దిశగా కదులుతూ తెలంగాణకు తూర్పున రామగుండం ప్రాంతానికి 310 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా కదులుతూ సోమవారం మధ్యాహా్ననికి బలహీనపడి అల్పపీడనంగా మారనుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి స్టెల్లా తెలిపారు.
దీనికి అనుగుణంగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మీదుగా రుతుపవన ద్రోణి పశి్చమ మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోందని వెల్లడించారు. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘అస్నా’ తుపాను ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందన్నారు.
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం నుంచి పరిగణనలోకి తీసుకుంటే కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలులో 24.25 మి.మీ., గోకవరంలో 14, మాకవరపాలెం, సాలూరులో 13, మద్దిపాడు, బాడంగిలో 12.5 మి.మీ.వర్షపాతం నమోదైంది.
ముంచుకొస్తున్న మరో తుపాను!
ఈ నెల 6, 7 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా మీదుగా పయనించి రెండు ప్రాంతాల మధ్యలో తీరం దాటనుందని భావిస్తున్నారు. ఈ అల్పపీడనంపై రెండు రోజుల్లో కచ్చితమైన సమాచారం అందుతుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో 6వ తేదీ సాయంత్రం నుంచి మళ్లీ రాష్ట్రంలో మోస్తరు వానలు విస్తారంగా కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment