నేడు రేపు జిల్లాలో జగన్ పర్యటన
నేడు రేపు జిల్లాలో జగన్ పర్యటన
Published Wed, Dec 7 2016 12:22 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM
వ్యాధులతో సతమతం ... పెద్దాసుపత్రికి వెళ్లినా ఆగని మరణాలు ... ఆ వ్యాధి ఎందుకు సోకుతుందో వైద్యులకే అంతబట్టని వైనం... కాళ్లవాపుతో కొందరు ... పురిటిలోనే వసివాడని పసి పిల్లలకు కూడా నిండూ నూరేళ్లు నిండిపోతున్న విషాదం... ఆదుకోవల్సిన వారు కాళ్ల వాపుతో కన్నుమూత... ఇదీ తూర్పు మన్యంలో దయనీయ దుస్థితి.
మన్యం వాసుల్లో మనోధైర్యం నింపి...
పోలవరం నిర్వాసితులతో ముఖాముఖీ
కాళ్లవాపు మృతులు, శిశు మరణాల కుటుంబాలకు ఓదార్పు
రేఖపల్లిలో బహిరంగ సభ
సాక్షిప్రతినిధి, కాకినాడ : పాలకుల నిర్లక్ష్యం కారణంగా ’తూర్పు’మన్యంలో గిరిజనులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లాకు బుధవారం రానున్నారు. ఇటు దేవీపట్నం మండలం, అటు నాలుగు విలీన మండలాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలిచేందుకు ఆయన వస్తున్నారు. ప్యాకేజీ, కోల్పోయిన భూములకు నష్టపరిహారం పెంపు, భూమికి భూమి, ఇళ్ల నిర్మాణం తదితర సమస్యలపై నిర్వాసితులతో కలిసి జగన్ మాట్లాడతారు. పౌష్టికాహార లోపం కారణంగా రాజవొమ్మంగి మండలంలోని పలు గ్రామాల్లో 13 మంది నవజాత శిశువులు, బాలింత మృతి చెందారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం వైపు నుంచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పార్టీ జిల్లా నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జగన్ మోహన్‌రెడ్డి ఆ కుటుంబాలను పలకరిస్తారు.
కాళ్లవాపు వ్యాధి మృతుల కుటుంబాలతో...
కాళ్లవాపు వ్యాధితో మన్యంలో 14 మంది మృతి చెందినా ... వ్యాధికి కారణాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకూ గుర్తించ లేకపోయింది. మృతులంతా విలీన మండలానికి చెందిన వారే కావడంతో రెండో రోజు గురువారం పర్యటనలో వరా రామచంద్రాపురంలో మృతుల కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. నాలుగు విలీన మండలాల్లో వేలాది మంది రైతులు, పోలవరం నిర్వాసితులు రెండున్నరేళ్లుగా పరిష్కారం కాకుండా వేధిస్తున్న పలు సమస్యలను జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. అనంతరం రేఖపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు.
చురుకుగా ఏర్పాట్లు...
గడచిన మూడు రోజులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ తదితర నేతలు జగన్ రెండు రోజుల పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం రాత్రి పర్యటన షెడ్యూల్‌ను కాకినాడలో కన్నబాబు విలేకర్లకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కాంట్రాక్టర్లకు రేట్లు పెంచడానికి చూపిస్తున్న శ్రద్ధ ముంపు బాధితుల పునరావాసం తదితర అంశాలపై చూపడంలేదని విమర్శించారు. బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు.ఈ విషయాన్ని తెలియచేసేందుకు ముంపు బాధితుల్లో ధైర్యాన్ని నింపేందుకు జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారని చెప్పారు.
–బుధవారం ఉదయం 10 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు.
విమానాశ్రయం నుంచి రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడి సమీపంలో గుమ్ములూరు గ్రామం సందర్శన
–గుమ్ములూరు నుంచి గోకవరం మీదుగా రంపచోడవరం చేరుకుంటారు.
–రంపచోడవరంలో దేవీపట్నం మండలానికి చెందిన పోలవరం ముంపు రైతులతో ముఖాముఖీలో పాల్గొంటారు.
–అక్కడే పౌష్టికాహార లోపంతో మృతిచెందిన నవ జాతశిశువుల కుటుంబాలను పరామర్శిస్తారు.
–పెదగెద్దాడ మీదుగా మారేడుమిల్లి చేరుకుని ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌లో బుధవారం రాత్రి బస చేస్తారు.
–గురువారం ఉదయం 9 గంటలకు బయలుదేరి చింతూరు మీదుగా వరా‡ రామచంద్రపురం మండలం చేరుకుంటారు.
–కాళ్ల వాపు వ్యాధితో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు.
–పోలవరం నిర్వాసితుల సమస్యలపై రేఖపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
-బహిరంగ సభ అనంతరం విజయవాడ వెళ్తారు.
Advertisement