గెలవాలి అని మనం దృఢంగా నిర్ణయించుకోవాలి; మనం మనస్పూర్తిగా గెలుపును కోరుకోవాలి; మనం గెలిచేందుకు త్రికరణ శుద్ధిగా పూనుకోవాలి; మనం గెలవాలి. మనకు మనుగడ ఉంది అని అంటే అది గెలుస్తూ ఉండేందుకే అని తెలుసుకోవాలి. ఎన్ని అవరోధాలు ఉన్నా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎంత వ్యతిరేకత పైనపడినా మనం గెలవాలి అని నిలవాలి;
మనం గెలుస్తూ మెరుస్తూ ఉండాలి. ‘యమే వైష వృణుతే తేన లభ్యస్తైష ఆత్మా వివృణుతే తనూమ్ స్వామ్’ అని కఠోపనిషత్ చెబుతోంది. అంటే అతడి చేత ఏదైతే కోరుకోబడి అడగబడిందో దానివల్ల అతడు పొందబడతాడు; అతడికి ఆ ఆత్మ తన సహజ ప్రకృతిని తెరుస్తుంది అని అర్థం. ఈ సత్యాన్నే తెలియజేస్తూ ‘అడుగుడీ మీకియ్యబడును; వెదకుడీ మీకు దొరకును; తట్టుడీ మీకు తియ్యబడును’ అని చెప్పింది మత్తయి సువార్త. మనం గెలుపును కోరుకుని ప్రయత్నిస్తే మనకు గెలుపు తన తలుపును తెరుస్తుంది. మనం గెలుపును పొందాలనుకుని ఉద్యుక్తులం ఐతే మనం గెలుపు చేత పొందబడతాం.
మనం ఉన్న ఈ ప్రపంచం ఒక పద్మవ్యూహం. కానీ మనలో ఎవరూ అభిమన్యుడు కారాదు. ప్రతివ్యక్తీ అర్జునుడే అవాలి; అర్జునుడి తీరే మనకు ఆదర్శం కావాలి; మనకు మార్గదర్శకం కావాలి. తాను ఏ స్థితిలో ఉన్నా, శాపవశాత్తు తన స్థితే మారి తాను పేడిగా మారిపోయినా అర్జునుడు గెలుపునే కోరుకుని, గెలిచేందుకు పూనుకుని గెలుపు తలుపును తట్టాడు. గెలుపు తలుపు తెరుచుకోబడి ఆ గెలుపుచేత పొందబడ్డాడు; అర్జునుడు విజయుడుగా పేరుపొందాడు.
గెలుపు అనేది లక్ష్యమా? కాదు, కాదు. గెలుపు లక్ష్యంగా కాదు మనకు లక్షణంగా ఉండాలి. మనుగడ ఉన్నంతవరకూ మనం గెలుపు కోసమే, గెలుపుతోనే రోజుల్ని గడుపుతూ ఉండాలి. రోజు అనేది రావడమే ఒక గెలుపు. అదిగో ఆ రోజు రావడమే మనకు ప్రేరణ. రోజులాగా మనుగడ ఆసాంతమూ మనకు గెలుపు అనేది వస్తూనే ఉండాలి. రోజు ఒకసారి మాత్రమే వచ్చేదే ఐతే కాల గమనమూ, ప్రపంచ గమనమూ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుందాం. అలా జరిగితే కాలానికి, ప్రపంచానికి గమనమే ఉండదు కదా? రోజు అనేది వస్తూ ఉండడమే గమనం జరుగుతోంది అన్నదానికి ఋజువు. మనకు గెలుపు వస్తూ ఉండడమే మనుగడ గమనాన్ని నిర్ధారణ చేస్తుంది. పొందే ప్రతి గెలుపు మనిషికి ఒక మలుపు. మలుపులు తిరుగుతూ పయనం సాగాలి. గెలుపులతో సాగడమే మనుగడకు సార్థకత.
మనుగడ అన్నది ఒక సాగే తీగ అయితే ఆ తీగకు గెలుపుల పూలు పూస్తూ ఉండాలి. మనుగడ గెలుపుల పూలు పూచే ఒక వల్లరి కావాలి లేదా మనుగడ గెలుపుల పుష్పగుచ్ఛం కావాలి. గెలుపుల పూల పరిమళానికి ఆకృతిగా మనిషి మంచి మాటకెక్కాలి.
‘గెలుపును పొందాలని తలపోద్దాం; గెలుపును పొందుదాం.
గెలుస్తూ ఉన్నవాళ్లమై తల ఎత్తుకుని మనుగడ చేద్దాం;
మన తలలకు విలువను పొదువుకుందాం.
గెలుపు మనకు అభిరుచి కావాలి;
గెలుపును మనం చవి చూస్తూ ఉండాలి; మనం మనుగడకు చవిని చేకూర్చుకోవాలి‘.
100% – నేను గెలిచాను.
90% – నేను గెలుస్తాను.
80% – నేను గెలవగలను.
70% – నేను గెలవగలను అని అనుకుంటున్నాను.
60% – నేను గెలవగలనేమో.
50% – నేను గెలవచ్చేమో అని అనుకుంటున్నాను.
40% – ఏది గెలుపు?
30% – నాకు గెలవాలని ఉంది.
20% – ఎలా గెలవాలో నాకు తెలియదు.
10% – నేను గెలవలేను.
0% – నేను గెలవను.
ఇది గెలుపునకు నిచ్చెన. మనిషి ఈ నిచ్చెనను ఎక్కాలి; తప్పకుండా ఈ నిచ్చెనను ఎక్కి తనను తాను మనిషిని అని నిరూపించుకోవాలి.
– రోచిష్మాన్
Comments
Please login to add a commentAdd a comment