ఆశ మనిషిని కదిలించి నడిపించే రూపంలేని ఇంధనం; ఆశ మనిషిని ఎప్పటికప్పుడు బతికిస్తూ ఉండే ఆకృతి లేని మూలకం. ఆశలేకపోతే మనిషికి మనుగడే ఉండదు. మనుగడకు మనుగడ ఉండాలంటే మనిషికి ఆశ ఉండాలి. మనిషి పొందుతున్న ప్రతిదానికీ ఆశపడడమే కీలకం. మనిషి గమ్యానికీ ఆశ ఆరంభం. మనిషికి ఆశ అంతం అవడం ఉండకూడదు. ఆశ అన్నది అంతం అవడం అంటే మనిషి అంతం అవడం తప్పితే మరొకటి కాకూడదు. మనిషి క్రియాశీలకం అవడానికి ఆశే ప్రేరణ. ఆశవల్లే మొత్తం ప్రపంచం క్రియాశీలకం ఔతోంది.
‘ఆశ అనేది మనుషులకు ఉన్న శృంఖలాల్లో అత్యంత ఆశ్చర్యకరమైంది. దానికి బద్ధులైనవాళ్లు పరుగులు పెడతూ ఉంటారు; ఆ శృంఖలాల నుంచి విముక్తులైనవాళ్లు చతికిలబడిపోతూ ఉంటారు’ అని హితోపదేశం తెలియజెబుతోంది. ఆశ ఉన్న మనిషి పరుగెడుతూ ఉంటాడు; ఆశలేని మనిషి చతికిలబడిపోతాడు; చచ్చుబడిపోతాడు.
ఆశను కలిగించే మాటలు నీకు శక్తిని ఇస్తాయి‘ అని జపనీస్ కవి–బౌద్ధతాత్త్వికుడు దైసకు ఇకెద ఒక కవితలో అంటారు.
ఈ దైసకు ఇకేదకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేర్వేరు విశ్వవిద్యాలయాల నుంచి 300కు పైగా డాక్టరేట్స్ వచ్చాయి! 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబు దాడికి ఆయన మినహా కుటుంబం మొత్తం బలి అయిపోయింది. అ పరిస్థితి నుంచి ఆయన ఆశతో, ఆశ ఇచ్చిన శక్తితో విశ్వ – విశ్వవిద్యాలయాల నుంచి 300కు పైగా డాక్ట రేట్స్ అందుకున్న మహోన్నతుడిగా ఎదిగారు. శక్తై, మహాశక్తై ఆశ మనిషిని ముందుకు, మునుముందుకు నడిపిస్తూ ఉంటుంది; మహోన్నతుణ్ణి చేస్తూ ఉంటుంది.
ఆశ వేరు దురాశ వేరు. మనిషికి ఆశపడడంపై అవగాహన ఉండాలి. ఏ వ్యక్తి ఐనా తనను తాను చూసుకోకుండా లేదా తనను తాను తెలుసుకోకుండా ఆశపడుతూ ఉండడం తప్పు. ఆశ అనేదే లేకపోతే మనుగడ జరగదు. కానీ దురాశవల్ల మనుగడ తిన్నగా ఉండదు, సాగదు. ఆశ వికటిస్తే దురాశ ఔతుంది; వికృతమైన మనస్తత్వానికి దురాశ ఒక అభివ్యక్తి.
ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలి అన్న హిట్లర్ దురాశ పెనువినాశనానికి కారణమై చివరికి అతడి అంతానికీ కారణం ఐంది. నెపోలియన్ కూడా ప్రపంచాన్ని జయించేయాలన్న దురాశతో యుద్ధాలు చేసుకుంటూ వెళ్లి చివరికి బ్రిటిష్ వాళ్ల చేతికి చిక్కి చెరసాలపాలై ఆపై అనాథై మరణించాడు. ‘దురాశ దుఃఖానికి చేటు’ అని ఎప్పుడో చెప్పబడ్డ మాట ఇప్పటికీ, ఎప్పటికీ సరైందే; ఎప్పటికప్పుడు అది మనకు దిశానిర్దేశం చేసేదే. మనం ఎప్పుడూ దురాశకు అతీతంగానే ఉండాలి.
ఆశ ఫలించని వేళల్లో మనిషిని నిరాశ చుట్టుకుంటుంది. నిరాశకు లోనుకాని మనిషి ఉండడం ఉండదు. నిరాశకు బలి ఐపోయినవాళ్లూ ఉన్నారు. నిరాశ అనే వ్రణం ఎవరినైనా సలుపుతుంది. నిరాశ కలిగినప్పుడు ఆ నిరాశకు చిత్తైపోకుండా ఉండాలంటే, నిరాశపై విజయం సాధించి రాణించాలంటే మనిషికి ఉండాల్సింది ఆశే. ఆశతోనే మనిషి నిరాశపై నెగ్గాలి.
పుట్టిన ప్రతివ్యక్తికి పాలు తాగడం నుంచీ ఆశ మొదలు ఔతుంది. నిజానికి వ్యక్తికి పాలు తాగడంకన్నా ముందే ఆశ మొదలు ఔతుంది; ఆ ఆశవల్లే పాలుతాగడం మొదలు ఔతుంది; ఆశ మొదలుకాగా మనిషికి మనుగడ మొదలు ఔతుంది. మనిషి పోయేంత వరకూ మనిషిని వీడిపోకుండా ఉండాల్సింది ఆశ. వర్తమానం భవిష్యత్తును ఆవాహన చెయ్యాలంటే మనకు కావాల్సినవి ఆశ ఆపై సదాశ. ఆశ, సదాశలతో మనం అభ్యున్నతిని పొందాలి.
ఆశ ప్రగతికి మూలం; దురాశ పతనానికి మూలం.
ఈ విషయాన్ని మనిషి అవగతం చేసుకోవాలి. మనిషికి ఆశ ఉండాలి;
తన ఆశకు తగినట్టు మనిషి తనను తాను సిద్ధం చేసుకోవాలి.
ఆశ, సదాశల్ని ప్రయుక్తం చేసుకుని ప్రతిమనిషీ ప్రశస్తం అవాలి.
– రోచిష్మాన్
Comments
Please login to add a commentAdd a comment