human survival
-
పథం దృక్పథం
దృక్పథం... ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఉండేది దృక్పథం. మనస్థితి, పరిస్థితి వీటిని బట్టి ఎవరికైనా దృక్పథం అన్నది ఉంటూనే ఉంటుంది. దృక్పథం ఉండని మనిషి ఉండడు. మనిషి అన్నాక దృక్పథం ఉండకుండా ఉండదు. దృక్పథం మనిషి మనుగడ స్థాయిని, తీరును, నిర్ణయిస్తుంది. దృక్పథం మనిషి ప్రగతికి, పతనానికి మూలం ఔతుంది. సరైన దృక్పథం లేకపోతే మనుగడ సరిగ్గా లేనట్టే; మేలైన దృక్పథం ఉంటే మనుగడ మేలుగా ఉన్నట్టే. చంద్రుడిపై కాలు మోపిన తొలి మనిషి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అన్నది మనకు తెలిసిందే. కానీ ప్రణాళిక ప్రకారం ఎడ్విన్ ఆల్డ్రిన్ ముందుగా చంద్రుడిపై దిగాలి. ఆల్డ్రిన్ చంద్రుడిపై కాలు పెట్టబోయే తొలి మానవుడుగా నిర్ణయం అయిపోయింది. అయితే చంద్రుడిపై రాకెట్ దిగి తలుపులు తెరుచుకున్నాక ఆల్డ్రిన్ కదల్లేదు. అతడికి దిగమని ఆదేశాలు అందినా అతడు కదల్లేదు. ముందుగా చంద్రుడిపై దిగితే తనకు ఏం జరుగుతుందో అన్న దృక్పథం ఎడ్విన్ ఆల్డ్రి¯Œ ను కదలనివ్వలేదు. ఆల్డ్రిన్ కదలకపోవడంతో ఆర్మ్‌స్ట్రాంగ్‌కు దిగమని ఆదేశాలు అందాయి. ఏమైనా పరవాలేదు అన్న దృక్పథంతో ఆర్మ్‌స్ట్రాంగ్ రాకెట్ నుంచి చంద్రుడిపై దిగాడు; చంద్రుడిపై కాలు మోపిన తొలి మానవుడుగా చరిత్రలో నమోదు అయ్యాడు. ఆల్డ్రిన్ ఆ అవకాశాన్ని తన దృక్పథం కారణంగా జారవిడుచుకున్నాడు; చారిత్రిక ప్రాశస్త్యాన్ని కోల్పోయాడు. ‘మనం మన దృక్పథానికి అంటిపెట్టుకుని ఉంటాం అన్నీ దాని ఆధారంగానే ఉంటాయి అని. అయినా మన అభిప్రాయాలకు శాశ్వతత్వం లేదు. వసంతం, హేమంతాలలాగా అవి తొలగిపోతూంటాయి’ ఆని ప్రఖ్యాత చైనీస్ తత్త్వవేత్త జువాంగ్ చి ఒక సందర్భంలో అన్నారు. తన దృక్పథం సరైంది అనుకుంటూ దాన్నే అంటిపెట్టుకుని ఉండడం మనిషి బలహీనతల్లో బలమైంది. దృఢమైన దృక్పథం అన్నది మనిషికి బరువైన అవరోధం ఔతుంది. కదలని నీరు కాలక్రమంలో బురద అయిపోయినట్టుగా మారని దృక్పథం మనిషిని పాడుచేస్తుంది. మనిషి తన దృక్పథాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పరిణామాలను బట్టి దృక్పథం ఉండాలి. దృక్పథం ప్రయోజనాల్ని సాధించగలిగేదై ఉండాలి. కొందరు నేతల దృక్పథ దోషాలవల్ల ప్రపంచానికి ఎంతో హాని జరిగింది, జరుగుతోంది. ఇవాళ్టి రోజున రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఉక్రెయి¯Œ పై రష్యా దృక్పథం, రష్యాపై ఉక్రెయిన్ దృక్పథం వల్లే యుద్ధం సాగుతూ పెనువినాశనం జరుగుతోంది. ఆ దృక్పథ వైరుద్ధ్యం పలు ఇతర దేశాల్ని అవాంఛనీయ పర్యవసానానికి గురిచేస్తోంది. ఈ దుస్థితి తొలగిపోవాలంటే ఇంకా విధ్వంసం జరగకుండా ఉండాలంటే ఆ ఇరుదేశాల దృక్పథాలూ మారాలి. వ్యక్తిపరంగానూ, సామాజికంగానూ, సాంస్కృతికంగానూ, కళల పరంగానూ, భాషపరంగానూ దృక్పథం తిన్నగా ఉండడమే కావల్సింది. దృక్పథం తిన్నగా ఉండకపోవడం నష్టాన్ని, నాశనాన్ని కలిగిస్తుంది. కొన్ని దశాబ్దుల క్రితం మెరుగైన దృక్పథం లోపించడంవల్ల ఇవాళ తెలుగు భాష, తెలుగు కవిత్వం వైభవాన్ని కోల్పోవడం కాదు వికృతం అయిపోయిన వైనాన్ని అందుకు ఉదాహరణగా మనం చూడచ్చు. పలువురు తమ దృక్పథాల్ని మార్చుకోలేక తాము పతనమైపోవడమే కాకుండా తమ కుటుంబాలకు తీక్షణమెన హాని చేస్తున్నారు. దృక్పథ వక్రత అన్న దానివల్ల సమాజానికి తీవ్రమైన చేటు కలుగుతోంది. దృక్పథం అన్నది మనిషి మనుగడలో ప్రముఖమైంది ఆపై ప్రధానమైంది. ప్రతిమనిషికి దృక్పథం అన్నది ప్రత్యగ్రంగా ఉండాలి. మనిషికి దృక్పథం భవ్యంగా ఆపై సవ్యంగా ఉంటే సత్పథం అమరుతుంది. సత్పథం అమరితే మనుగడ ఉన్నతంగా ఆపై ఉజ్జ్వలంగా ఉంటుంది. కనుక మనిషి తన దృక్పథాన్ని సరిచూసుకుంటూ ఆపై సరిచేసుకుంటూ మనుగడకు మహత్తును సాధించుకోవాలి. ‘దృక్పథం మనిషిని ఎత్తులకు తీసుకు వెళుతుంది. దృక్పథం మనిషిని చిత్తు చేస్తుంది. దృక్పథం ఎత్తుల్లో ఉన్న వ్యక్తిని చిత్తు అయేట్టు చేస్తుంది. దృక్పథం చిత్తు అయిన వ్యక్తిని ఎత్తులకు చేరుస్తుంది. ఎత్తులకు చేరుకోవడానికైనా, చిత్తు అయిపోవడానికి అయినా దృక్పథం కీలకం’ – రోచిష్మాన్ -
రూపం లేని ఇంధనం ఆశ
ఆశ మనిషిని కదిలించి నడిపించే రూపంలేని ఇంధనం; ఆశ మనిషిని ఎప్పటికప్పుడు బతికిస్తూ ఉండే ఆకృతి లేని మూలకం. ఆశలేకపోతే మనిషికి మనుగడే ఉండదు. మనుగడకు మనుగడ ఉండాలంటే మనిషికి ఆశ ఉండాలి. మనిషి పొందుతున్న ప్రతిదానికీ ఆశపడడమే కీలకం. మనిషి గమ్యానికీ ఆశ ఆరంభం. మనిషికి ఆశ అంతం అవడం ఉండకూడదు. ఆశ అన్నది అంతం అవడం అంటే మనిషి అంతం అవడం తప్పితే మరొకటి కాకూడదు. మనిషి క్రియాశీలకం అవడానికి ఆశే ప్రేరణ. ఆశవల్లే మొత్తం ప్రపంచం క్రియాశీలకం ఔతోంది. ‘ఆశ అనేది మనుషులకు ఉన్న శృంఖలాల్లో అత్యంత ఆశ్చర్యకరమైంది. దానికి బద్ధులైనవాళ్లు పరుగులు పెడతూ ఉంటారు; ఆ శృంఖలాల నుంచి విముక్తులైనవాళ్లు చతికిలబడిపోతూ ఉంటారు’ అని హితోపదేశం తెలియజెబుతోంది. ఆశ ఉన్న మనిషి పరుగెడుతూ ఉంటాడు; ఆశలేని మనిషి చతికిలబడిపోతాడు; చచ్చుబడిపోతాడు. ఆశను కలిగించే మాటలు నీకు శక్తిని ఇస్తాయి‘ అని జపనీస్ కవి–బౌద్ధతాత్త్వికుడు దైసకు ఇకెద ఒక కవితలో అంటారు. ఈ దైసకు ఇకేదకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేర్వేరు విశ్వవిద్యాలయాల నుంచి 300కు పైగా డాక్టరేట్స్ వచ్చాయి! 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబు దాడికి ఆయన మినహా కుటుంబం మొత్తం బలి అయిపోయింది. అ పరిస్థితి నుంచి ఆయన ఆశతో, ఆశ ఇచ్చిన శక్తితో విశ్వ – విశ్వవిద్యాలయాల నుంచి 300కు పైగా డాక్ట రేట్స్ అందుకున్న మహోన్నతుడిగా ఎదిగారు. శక్తై, మహాశక్తై ఆశ మనిషిని ముందుకు, మునుముందుకు నడిపిస్తూ ఉంటుంది; మహోన్నతుణ్ణి చేస్తూ ఉంటుంది. ఆశ వేరు దురాశ వేరు. మనిషికి ఆశపడడంపై అవగాహన ఉండాలి. ఏ వ్యక్తి ఐనా తనను తాను చూసుకోకుండా లేదా తనను తాను తెలుసుకోకుండా ఆశపడుతూ ఉండడం తప్పు. ఆశ అనేదే లేకపోతే మనుగడ జరగదు. కానీ దురాశవల్ల మనుగడ తిన్నగా ఉండదు, సాగదు. ఆశ వికటిస్తే దురాశ ఔతుంది; వికృతమైన మనస్తత్వానికి దురాశ ఒక అభివ్యక్తి. ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలి అన్న హిట్లర్ దురాశ పెనువినాశనానికి కారణమై చివరికి అతడి అంతానికీ కారణం ఐంది. నెపోలియన్ కూడా ప్రపంచాన్ని జయించేయాలన్న దురాశతో యుద్ధాలు చేసుకుంటూ వెళ్లి చివరికి బ్రిటిష్ వాళ్ల చేతికి చిక్కి చెరసాలపాలై ఆపై అనాథై మరణించాడు. ‘దురాశ దుఃఖానికి చేటు’ అని ఎప్పుడో చెప్పబడ్డ మాట ఇప్పటికీ, ఎప్పటికీ సరైందే; ఎప్పటికప్పుడు అది మనకు దిశానిర్దేశం చేసేదే. మనం ఎప్పుడూ దురాశకు అతీతంగానే ఉండాలి. ఆశ ఫలించని వేళల్లో మనిషిని నిరాశ చుట్టుకుంటుంది. నిరాశకు లోనుకాని మనిషి ఉండడం ఉండదు. నిరాశకు బలి ఐపోయినవాళ్లూ ఉన్నారు. నిరాశ అనే వ్రణం ఎవరినైనా సలుపుతుంది. నిరాశ కలిగినప్పుడు ఆ నిరాశకు చిత్తైపోకుండా ఉండాలంటే, నిరాశపై విజయం సాధించి రాణించాలంటే మనిషికి ఉండాల్సింది ఆశే. ఆశతోనే మనిషి నిరాశపై నెగ్గాలి. పుట్టిన ప్రతివ్యక్తికి పాలు తాగడం నుంచీ ఆశ మొదలు ఔతుంది. నిజానికి వ్యక్తికి పాలు తాగడంకన్నా ముందే ఆశ మొదలు ఔతుంది; ఆ ఆశవల్లే పాలుతాగడం మొదలు ఔతుంది; ఆశ మొదలుకాగా మనిషికి మనుగడ మొదలు ఔతుంది. మనిషి పోయేంత వరకూ మనిషిని వీడిపోకుండా ఉండాల్సింది ఆశ. వర్తమానం భవిష్యత్తును ఆవాహన చెయ్యాలంటే మనకు కావాల్సినవి ఆశ ఆపై సదాశ. ఆశ, సదాశలతో మనం అభ్యున్నతిని పొందాలి. ఆశ ప్రగతికి మూలం; దురాశ పతనానికి మూలం. ఈ విషయాన్ని మనిషి అవగతం చేసుకోవాలి. మనిషికి ఆశ ఉండాలి; తన ఆశకు తగినట్టు మనిషి తనను తాను సిద్ధం చేసుకోవాలి. ఆశ, సదాశల్ని ప్రయుక్తం చేసుకుని ప్రతిమనిషీ ప్రశస్తం అవాలి. – రోచిష్మాన్ -
Global warming: సముద్ర జీవజాలానికి భూతాపం ముప్పు
ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న శిలాజ ఇంధనాల వినియోగం.. తద్వారా నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం. వీటివల్ల భూగోళంపై మానవాళి మనుగడకు ముప్పు ముంచుకొస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం భూమిపై ఉన్న జీవజాలమే కాదు, సముద్రాల్లోని జీవులు సైతం అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా సైంటిస్టులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ఈ వివరాలను ‘నేచర్’ పత్రికలో ప్రచురించారు. ► ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం అనేది యథాతథంగా కొనసాగితే అంటార్కిటికాలో మంచు మరింత కరిగి, ఆ మంచినీరంతా సముద్రాల్లోకి చేరుతుంది. ► కొత్త నీటి రాకతో సముద్రాల ఉపరితల జలంలో లవణీయత, సాంద్రత తగ్గిపోతుంది. ఈ పరిణామం సముద్ర ఉపరితలం నుంచి అంతర్భాగంలోకి జల ప్రవాహాన్ని నిరోధిస్తుందని పరిశోధకులు తేల్చారు. సాధారణంగా సముద్రాల్లో పైభాగం నుంచి లోపలి భాగంలోకి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అంతర్భాగంలో కూడా ఒకచోటు నుంచి మరోచోటుకి జల ప్రవాహాలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ► మంచు కరిగి, కొత్త నీరు వస్తే సముద్రాల పైభాగం నుంచి 4,000 మీటర్ల(4 కిలోమీటర్ల) దిగువన నీటి ప్రవాహాలు తొలుత నెమ్మదిస్తాయి. ఆ తర్వాత పూర్తిగా స్తంభించిపోతాయి. ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతుంది. ► నీటి ప్రవాహం స్తంభిస్తే సముద్రాల్లో లోతున ఉండే ప్రాణవాయువు(ఆక్సిజన్), ఇతర పోషకాలు సైతం అంతమైపోతాయని సైంటిస్టు ప్రొఫెసర్ మాథ్యూ ఇంగ్లాండ్ చెప్పారు. దీంతో సముద్రాల్లోని జీవుల మనగడకు అవసరమైన వనరుల కొరత ఏర్పడుతుందని తెలిపారు. వాటి మనుగడ ప్రమాదంలో పడుతుందని వివరించారు. ఇదంతా మొత్తం సముద్ర జీవావరణ వ్యవస్థను దెబ్బతీస్తుందని వారు వెల్లడించారు. ► సముద్రాల్లో జలమట్టం పెరిగితే ఉపరితలంపై కొత్త నీటి పొరలు ఏర్పడుతాయి. దానివల్ల సముద్రాలు కార్బన్ డయాక్సైడ్ను శోషించుకోలేవు. అంతేకాకుండా తమలోని కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి విడుదల చేస్తాయి. సముద్రాల నుంచి కర్బన ఉద్గారాలు ఉధృతమవుతాయి. ఫలితంగా భూగోళం మరింత వేడెక్కుతుంది. ► అంటార్కిటికాలో ప్రతిఏటా 250 ట్రిలియన్ టన్నుల చల్లని, ఉప్పు, ఆక్సిజన్‌తో కూడిన నీరు చేరుతుంది. ఇది ఉత్తర దిశగా విస్తరిస్తుంది. హిందూ, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లోకి ఆక్సిజన్‌ను చేరుస్తుంది. రానున్న రోజుల్లో అంటార్కిటికా నుంచి విస్తరించే ఆక్సిజన్ పరిమాణం తగ్గనుందని అంచనా వేస్తున్నారు. ► ప్రపంచ కర్బన ఉద్గారాలను సమర్థంగా నియంత్రించకపోతే రాబోయే 40 సంవత్సరాల్లో అంటార్కిటికాలోని సముద్రాల కింది భాగంలో జల ప్రవాహం ఆగిపోతుందని, సముద్ర జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని సైంటిస్టులు నిర్ధారించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సముద్రాల గుండె చప్పుడు విందాం!
వాషింగ్టన్: వాతావరణ మార్పులు.. భూగోళంపై మానవళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించాయి. ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. ధ్రువ ప్రాంతాల్లోని మంచు వేగంగా కరిగిపోతోంది. ఫలితంగా సముద్రాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. తీర ప్రాంతాల్లో ముంపు భయం వెంటాడుతోంది. వీటన్నింటికి మానవుల అత్యాశే కారణమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సముద్రాల గుండె ఘోష వినేందుకు ఐర్లాండ్‌కు చెందిన కళాకారిణి సియోభాన్ మెక్‌డొనాల్డ్ నడుం బిగించారు. సముద్రాల అడుగు భాగంలో సంభవించే భూకంపాలు, విరిగిపడే కొండ చరియలు, జీవజాలం మనుగడ, కాలుష్యం, కరిగిపోతున్న మంచు గురించి సమగ్రంగా తెలుసుకొనేందుకు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సముద్రం వివిధ ప్రాంతాల్లో మైక్రోఫోన్లు(హైడ్రోఫోన్స్) జార విడుస్తున్నారు. ఇందుకోసం గ్రీన్‌ల్యాండ్, కెనడా మధ్య ఉన్న డెవిస్ అఖాతాన్ని ఎంచుకున్నారు. ఇప్పటిదాకా 12 మైక్రోఫోన్లను జారవిడిచారు. ఈ ప్రయోగానికి అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తోంది. ఈ ప్రయోగం ఒక టైమ్ క్యాప్సూల్ మైక్రోఫోన్లు రెండేళ్లపాటు సముద్రంలోనే ఉంటాయి. 2024లో బయటకు తీస్తారు. ఇవి ప్రతి గంటకోసారి సముద్ర అడుగు భాగంలోని శబ్దాలను స్పష్టంగా రికార్డు చేస్తాయి. ఈ శబ్దాలన్నింటిని కలిపి ఒక ఆడియోను రూపొందిస్తారు. ఇది ‘సముద్ర జ్ఞాపకం’గా మెక్‌డొనాల్డ్ అభివర్ణించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ విపత్తుల విషయంలో ఇదే మొట్టమొదటి సైన్స్, ఆర్ట్స్ ఉమ్మడి ప్రయోగమని చెబుతున్నారు. సముద్రాల గుండె చప్పుడు వినడం ద్వారా భూమిపై సమీప భవష్యత్తులో సంభవించే విపరిణామాలను ముందే అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రయోగం ఒక టైమ్ క్యాప్సూల్ లాంటిదేనని మెక్‌డొనాల్డ్ అన్నారు. పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ తనను ఈ ప్రయత్నానికి పురికొల్పిందని చెప్పారు. గ్రీన్‌ల్యాండ్‌లో పెద్ద ఎత్తున మంచు పేరుకొని ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు శిలాజ ఇంధనాల వాడకం ఆపేసినా సరే గ్రీన్‌ల్యాండ్‌లో 110 క్వాడ్రిలియన్ టన్నుల మంచు కరిగిపోయి సముద్ర మట్టం 27 సెంటీమీటర్లు(10.6 అంగుళాలు) పెరుగుతుందని అంచనా. -
800 కోట్ల మంది లక్ష ఏళ్లు బతకొచ్చు!
లిస్మోర్(ఆస్ట్రేలియా): భూమికి ఉపగ్రహమైన చంద్రుడిపై మానవ మనుగడకు ఆస్కారం ఉందా? అనే అంశంపై దశాబ్దాలుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మనిషి జీవించాలంటే శ్వాసించాల్సిందే. అందుకు ప్రాణవాయువు(ఆక్సిజన్) కావాలి. ఆ ప్రాణవాయువు చందమామపై ఇబ్బడిముబ్బడిగా ఉందని ఆస్ట్రేలియా స్సేస్ ఏజెన్సీ చెబుతోంది. అయితే, అది గాలి రూపంలో లేదని, చంద్రుడి ఉపరితలంపై వివిధ రాళ్లు, ఖనిజాల్లో నిక్షిప్తమై ఉన్నట్లు గుర్తించింది. చందమామపై రాళ్లను సేకరించి, వాటినుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్రక్రియపై ఇప్పుడు ఆస్ట్రేలియా దృష్టి పెట్టింది. ఇందుకోసం ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా తయారు చేసే రోవర్‌ను చంద్రుడిపైకి పంపిస్తారు. ఈ రోవర్ సాయంతో చంద్రుడిపై రాళ్లను సేకరించి, భూమిపైకి తీసుకొస్తారు. వాస్తవానికి చందమామపై వాతావరణం లేదు. రాళ్లు, దుమ్ము ధూళితోపాటు సిలికా, అల్యూమినియం, ఐరన్, మెగ్నీషియం ఆక్సైడ్ ఉన్నాయి. వీటన్నింటిలో ఆక్సిజన్ సమృద్ధిగా ఉందని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ పరిశోధకులు చెబుతున్నారు. అది ఎంతమేరకు ఉందన్న దానిపై ఒక అంచనాకొచ్చారు. ఉపరితలం నుంచి కేవలం 10 మీటర్ల లోతులో ఒక క్యూబిక్ మీటర్ రాళ్లలో 630 కిలోల ఆక్సిజన్ ఉందని పేర్కొంటున్నారు. మనిషి ఒకరోజు జీవించాలంటే 800 గ్రాముల ఆక్సిజన్‌ను శ్వాసించాలి. 630 కిలోల ఆక్సిజన్‌తో ఒకరు రెండేళ్లకుపైగానే జీవించవచ్చు. ఈ లెక్కన 800 కోట్ల మంది లక్ష ఏళ్లపాటు జీవించేందుకు అవసరమైన ఆక్సిజన్ చంద్రుడిపై 10 మీటర్ల లోతుదాకా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయితే, చంద్రుడిపై ఉన్న ప్రాణవాయువును ఎంత సమర్థంగా వెలికితీసి, వాడుకుంటామన్న దానిపై ఇదంతా ఆధారపడి ఉంటుంది. -
మానవ మనుగడకు భౌతిక శాస్త్ర పరిశోధనలే కీలకం
విజయనగరం అర్బన్ : విశ్వమానవ మనుగడకు భౌతిక శాస్త్ర పరిశోధనలే కీలకమని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ సంస్థ (భువనేశ్వర్) డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ పండా అన్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు సంయుక్త సహకారంలో స్థానిక మహరాజా అటానమస్ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న సదస్సు ప్రారంభోత్సవ సభలో గురువారం ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ గురుత్వాకర్షణ తరంగాల నుంచి అంతరాల పరమాణు కణాల వరకు ప్రతి అంశం మానవ జీవనానికి ముడిపడినవేని చెప్పారు. భౌతిక శాస్త్ర అంశాలపై పరిశోధనలు విస్తృత స్థాయిలో జరగాలని సూచించారు. విద్యార్ధి దశ నుంచి పరిశోధనా దృక్పథాన్ని కల్పించే బోధనాంశాల శైలి రావాలని అభిప్రాయపడ్డారు. అనంతరం సదస్సు తొలిరోజు కార్యక్రమాలను ప్రారంభించారు. తొలిరోజు వక్తలుగా ప్రొఫెసర్లు అజిత్ మోహన్ శ్రీవత్స, డాక్టర్ సంజీవకుమార్ అగర్వాలా, డాక్టర్ నిష్నికాంత్ కాందాయ పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ఎ.కల్యాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాన్సాస్ ట్రస్ట్ సభ్యులు పూసపాటి అదితిగజపతిరాజు, కరస్పాండెంట్ డాక్టర్ డి.ఆర్.కె.రాజు, ఫిజిక్స్ విభాగ అధిపతి డాక్టర్ డి.బి.ఆర్.కె.మూర్తి, కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు, పీజీ, డిగ్రీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆ దిబ్బలో ఏముంది..?
సాక్షి, హైదరాబాద్: వేల ఏళ్ల మానవ మనుగడ.. తొలి చారి త్రక యుగం, బృహత్శిలా యుగం, కొత్త రాతి యుగం.. ఇలా వివిధ కాలాల్లో మనిషి వర్ధిల్లా డు. ఇప్పుడు మిగిలింది ‘బూడిద’. వేల ఏళ్ల మా నవ ఆవాసం కొనసాగిందనేందుకు నిదర్శనంగా బూడిద కుప్ప తరహాలో దిబ్బ ఏర్ప డింది. మరి వేల ఏళ్ల కాల ప్రవాహంలో అక్కడ మనిషి జాడ ఎందుకు కనుమరుగైంది..? ఇప్పు డు ఇక్కడి మర్మం కనుక్కునేందుకు బృహత్తర అన్వేషణకు తెర లేవబోతోంది. మానవ మనుగడలో కీలక భూమిక పోషించిన అంశాలు.. అక్కడ వినియోగించిన ధాన్యం.. మనిషితో పెనవేసుకున్న వృక్ష సంపద.. నాటి పర్యావరణం.. ఉపద్రవాలేమైనా సంభవించాయా.. అక్కడ మనిషి మనుగడ లేకుండా అదృశ్యమవటానికి కారణమైన అంశాలేంటి..? ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) నేతృత్వంలో ఈ అన్వేషణ కొనసాగ నుంది. ఈ బృహత్తర కార్యక్రమానికి జనగా మకు దగ్గర లోని కొన్నె–రామచంద్రాపురం ప్రాంతా ల్లోని గజగిరిగుట్ట కేంద్రం కాబోతోంది. ముందు జాగ్రత్తకు.. సాధారణంగా పురావస్తు అన్వేషణలు చరిత్రను కళ్ల ముందుంచుతాయి. గతించిన కాలానికి చెందిన వైభవాన్ని ప్రస్ఫుటిస్తాయి. తాజాగా జరగబోయే అన్వేషణ మాత్రం చరిత్రతో పాటు భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సమాయత్తం చేసేందుకు దోహదపడనుండటం విశేషం. ప్రకృతి ఉపద్రవాలను ముందే ఊహించి వాటి నుంచి బయటపడేందుకు పద్ధతులను అన్వేషించటం, అసలు ఉపద్రవాలు ఎందుకొచ్చాయో తెలుసుకోవటం చాలా అవసరం. పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్న మానవ తప్పిదాలు భవిష్యత్తును ఆందోళనకరంగా మారుస్తున్నాయి. ఈ క్రమంలో గత అనుభవాలను స్పష్టంగా తెలుసుకుంటే భవిష్యత్తులో ఉపద్రవాల నుంచి బయటపడేందుకు మార్గం సుగమమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఆర్కియాలజీ విభాగం ప్రొఫెసర్ డోరియన్ ఫుల్లర్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించారు. ఈ పరిశోధనల్లో ఫుల్లర్, హెచ్‌సీయూ ప్రొఫెసర్ కె.పుల్లారావు ముందుకొచ్చారు. అత్యాధునిక పద్ధతిలో.. గతంలో కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా పరిశోధన జరిగినా అది పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో సాగింది. తొలిసారి ఆధునిక పద్ధతిలో అధ్యయనానికి సిద్ధమవుతున్నారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి మానవ మనుగడ సాగిన కాలాన్ని కచ్చితంగా నిర్ధారిస్తారు. ప్రస్తుతం బూడిద మట్టి పేరుకుపోయిన ప్రాంతంలో కొన్ని మీటర్ల లోతు తవ్వి నాటి మనుషులు ఆహారంగా వినియోగించిన ధాన్యపు గింజలు, ఇతర పదార్థాల అవశేషాలను గుర్తిస్తారు. మట్టి పొరల్లో నిక్షిప్తమైన పుప్పొడి అవశేషాలనూ సేకరిస్తారు. దీనివల్ల నాటి ఆహార పదార్థాలు, సేకరణ తీరు, పుప్పొడి ఆధారంగా నాటి వృక్ష జాతి, పర్యావరణం తీరును కచ్చితంగా అంచనా వేస్తారు. ఇందుకు ‘యాక్సలేటర్ మాస్ స్పెక్ట్రోమిట్రీ (ఏఎంఎస్)’అనే ఆధునిక విధానాన్ని అనుసరించనున్నారు. దీని ద్వారా సేకరించిన అతి సూక్ష్మ నమూనాలను అత్యాధునిక పరిశోధన శాలలున్న ఆక్స్ఫర్డ్, ఆరిజోనా యూనివర్సిటీ ల్యాబ్‌ల్లో పరిశోధిస్తారు. జనగామ ప్రాంతమే ఎందుకు? జనగామ సమీపంలోని కొన్నె–రామచంద్రాపురం ప్రాంతాల్లో వేల ఏళ్లనాటి మానవ నివాస జాడలున్నాయి. ఇక్కడి గజగిరిగుట్ట వద్ద పెద్ద ఆవాసం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రొఫెసర్ పుల్లారావు ఆధ్వర్యంలో అధ్యయనం జరిగింది. అక్క డ తొలి చారిత్రక యుగం, బృహత్ శిలా యుగం, కొత్తరాతియుగం కాలాల్లో మాన వులు నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఆధారాలు వెలుగు చూశాయి. ఆయా కాలాల్లో వినియోగించిన పనిముట్లు, ఆయుధాలు, పాత్రలు కనిపించాయి. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో మానవ సమాధులకు చిహ్నాలైన రాక్షస గుళ్లు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని డోరియర్ ఫుల్లర్ దృష్టికి తేవటంతో ఆయన ఇక్కడికొచ్చి పరిశీలించారు. పరిశోధనలకు అనుమతి కావాలంటూ గతంలో హెచ్‌సీయూ కేంద్రాన్ని కోరింది. తాజాగా కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ అనుమతి మంజూరు చేసింది. ఈ పరిశోధన చాలా కీలకం: ప్రొఫెసర్ పుల్లారావు ‘ఈ పరిశోధనల వల్ల ప్రకృతితో మానవుడి అనుబంధం, పర్యావరణ పరంగా వచ్చిన మార్పులు, మనిషి చెల్లాచెదురయ్యేందుకు కారణాలను కనుక్కొనే అవకాశముంది. ఇలాంటి పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా చాలాచోట్ల వచ్చాయి. అయితే కారణాలు కనుక్కుంటే భవిష్యత్తు ఉపద్రవాలను ఎదుర్కోవచ్చు. ఇదే దిశగా మా పరిశోధన ఉండనుంది. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంది’. -
మొక్కల పెంపకంతోనే మనుగడ
నల్లగొండ : ప్రజలు, జీవకోటి మనుగడ కోసం మొక్కలు నాటి బాధ్యతగా పెంచాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం స్థానిక అటవీ కార్యాలయంలో రూ.కోటి 50 లక్షలతో నిర్మించిన హరిత నీలగిరి నందనవనాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అటవీ కార్యాలయ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి రామన్న మాట్లాడుతూ నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పచ్చదనం లేకపోవడం వల్లనే వర్షాలు కురవడం లేదన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో పచ్చదనం ఉండటం వల్లే అధిక వర్షాలు కురుస్తున్నాయన్నారు. ప్రజల మనుగడ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలన్నారు. సీఎం కేసీఆర్ హరితహారం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే ప్రజలంతా సామాజిక బాధ్యతగా హారితాహారంలో మొక్కలు నాటుతున్నారన్నారు. 33 శాతం వనాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లా కేంద్రంలో 47 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన నందనవనం బాగుందని అభినందించారు. హైదరాబాద్‌లో 14 పార్కులను అభివృద్ధి చేశామన్నారు. కరువు పరిస్థితులకు కారణం అటవీ విస్తీర్ణం లేకపోవడమేనన్నారు. కోతులు వాపస్ పోవాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి ఊళ్లలోకి వచ్చిన కోతులు వాపస్ పోవాలి.. పోయిన వానలు వాపస్ రావాలి.. ఇందుకు ప్రజలంతా మొక్కలు నాటి రంక్షించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. జాతీయ రహదారిపై నాటిన మొక్కలను రక్షిస్తామని అన్నారు. జిల్లాలో 4 కోట్ల 80 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నాటిన మొక్కల్లో 10 శాతం చనిపోయిన వాటి స్థానంలో తిరిగి మొక్కలు నాటుతామన్నారు. నీరు ఉన్న ప్రాంతంలో మొక్కలు నాటేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కువగా చెట్లు లేకపోవడం వల్లే వర్షాలు కురవడం లేదన్నారు. తెలియక చెట్లు నరకడం వల్ల కరువు పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం అందరూ మొక్కలు నాటాలన్నారు. ఇది అందరి బాధ్యతగా గుర్తించాలన్నారు. జిల్లాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ, ఏజేసీ వెంకట్రావ్, డీఎఫ్ఓ సుదర్శన్‌రెడ్డి, ఆర్డీఓ వెంకటాచారి, ఆర్ఎఫ్ఓ వెంకటేశ్వర్లు, ఎస్ఎఫ్ఓ మాధవరావు, స్థానిక కౌన్సిలర్ అవుట రవీందర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ జెల్లా మార్కండేయులు, అబ్బగోని రమేశ్, దండంపల్లి సత్తయ్య, ఎడ్ల గీతా శ్రీనివాస్, నారబోయిన భిక్షం పాల్గొన్నారు.