మొక్కల పెంపకంతోనే మనుగడ
మొక్కల పెంపకంతోనే మనుగడ
Published Tue, Jul 19 2016 10:52 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ : ప్రజలు, జీవకోటి మనుగడ కోసం మొక్కలు నాటి బాధ్యతగా పెంచాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం స్థానిక అటవీ కార్యాలయంలో రూ.కోటి 50 లక్షలతో నిర్మించిన హరిత నీలగిరి నందనవనాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అటవీ కార్యాలయ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి రామన్న మాట్లాడుతూ నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పచ్చదనం లేకపోవడం వల్లనే వర్షాలు కురవడం లేదన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో పచ్చదనం ఉండటం వల్లే అధిక వర్షాలు కురుస్తున్నాయన్నారు. ప్రజల మనుగడ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలన్నారు. సీఎం కేసీఆర్ హరితహారం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే ప్రజలంతా సామాజిక బాధ్యతగా హారితాహారంలో మొక్కలు నాటుతున్నారన్నారు. 33 శాతం వనాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లా కేంద్రంలో 47 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన నందనవనం బాగుందని అభినందించారు. హైదరాబాద్‌లో 14 పార్కులను అభివృద్ధి చేశామన్నారు. కరువు పరిస్థితులకు కారణం అటవీ విస్తీర్ణం లేకపోవడమేనన్నారు.
కోతులు వాపస్ పోవాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి
ఊళ్లలోకి వచ్చిన కోతులు వాపస్ పోవాలి.. పోయిన వానలు వాపస్ రావాలి.. ఇందుకు ప్రజలంతా మొక్కలు నాటి రంక్షించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. జాతీయ రహదారిపై నాటిన మొక్కలను రక్షిస్తామని అన్నారు. జిల్లాలో 4 కోట్ల 80 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నాటిన మొక్కల్లో 10 శాతం చనిపోయిన వాటి స్థానంలో తిరిగి మొక్కలు నాటుతామన్నారు. నీరు ఉన్న ప్రాంతంలో మొక్కలు నాటేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కువగా చెట్లు లేకపోవడం వల్లే వర్షాలు కురవడం లేదన్నారు. తెలియక చెట్లు నరకడం వల్ల కరువు పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం అందరూ మొక్కలు నాటాలన్నారు. ఇది అందరి బాధ్యతగా గుర్తించాలన్నారు. జిల్లాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ, ఏజేసీ వెంకట్రావ్, డీఎఫ్‌ఓ సుదర్శన్‌రెడ్డి, ఆర్డీఓ వెంకటాచారి, ఆర్‌ఎఫ్‌ఓ వెంకటేశ్వర్లు, ఎస్‌ఎఫ్‌ఓ మాధవరావు, స్థానిక కౌన్సిలర్ అవుట రవీందర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ జెల్లా మార్కండేయులు, అబ్బగోని రమేశ్, దండంపల్లి సత్తయ్య, ఎడ్ల గీతా శ్రీనివాస్, నారబోయిన భిక్షం పాల్గొన్నారు.
Advertisement