గుడిని గుడికి కానుకగా ఇస్తే ఎంత బాగుంటుంది? తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నామోజు లావణ్య దేశంలోని ఆలయాలకు వెళ్లి అక్కడి ఆధ్యాత్మికతను, గుడి ప్రాంగణాన్ని, ఆలయ గోపురాలను లైవ్ పెయింటింగ్ చేసి ఆ చిత్రాలను గుడికే బహుమానంగా ఇస్తోంది. దీని వల్ల గుడి రూపం చిత్రకళలో నిలుస్తోంది. అలాగే గుడికి వచ్చే భక్తులకు ఆలయ సౌందర్యాన్ని తెలియచేస్తుంది.
‘ప్రతి ముఖ్యమైన గుడిలో నా చిత్రం ఉండాలి. అలాగే మరుగున పడిన గుడి నా చిత్రకళ ద్వారా కాస్తయినా ప్రచారం పొందాలని ఆలయ చిత్రాలను లైవ్ పెయింటింగ్ ద్వారా నిక్షిప్తం చేస్తున్నాను. ఇందుకు వస్తున్న ఆదరణ ఆనందం కలిగిస్తోంది’ అంది పాతికేళ్ల నామోజు లావణ్య. ‘ఇందుకు నా పెయింటింగ్స్ అమ్మకాల వల్ల వచ్చే డబ్బునే ఉపయోగిస్తున్నాను ఇటీవల భద్రాచల ఆలయంలోని సీతారాముల వారి మూర్తులు, ఆలయం లైవ్ పెయింటింగ్ చేసి దేవస్థానానికి అందజేశాను’ అందామె. ఒకరకంగా ఇది ఆధ్యాత్మిక చిత్రకళా సాధన అని కూడా అనుకోవచ్చు.
మన సంస్కృతి కోసం
‘మాది యాదాద్రి భువనగిరి. కామర్స్‌తో డిగ్రీ పూర్తి చేశాను. పోటీ పరీక్షలకు హాజరై, ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ నా ఇష్టం మొత్తం పెయింటింగ్స్ మీదే ఉంది. దీంతో ఏడాది నుంచి పెయింటింగ్‌నే నా వృత్తిగా మార్చుకున్నాను. స్కూల్ ఏజ్ నుంచి నోట్ బుక్స్‌లో పెయింటింగ్స్ వేస్తుండేదాన్ని. పాశ్చాత్య సంస్కృతి పెరుగుతున్న ఈ కాలంలో సోషల్‌మీడియా ద్వారా మన సంస్కృతిని, మంచిని కూడా పరిచయం చేయవచ్చు అనిపించి సంవత్సరం నుంచి ఆలయ శిల్పాన్ని, హైందవ సంస్కృతిని నా ఆర్ట్ ద్వారా చూపుతున్నాను’.
రాక్ స్టోన్స్ పై జంతువులు
‘మెదక్ జిల్లా మరపడ దగ్గర ఒక వెంచర్ వాళ్లు ఆర్ట్‌కు సంబంధించిన విషయం మాట్లాడటానికి పిలిస్తే నేను, మా అంకుల్ శ్రీనివాస్ వెళ్లాం. అక్కడ ఒక గ్రామదేవత టెంపుల్ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద రాళ్లను చూశాక వాటిని ఆకారాలుగా చూపవచ్చనిపించింది. మొత్తం 42 రకాల పెద్ద పెద్ద రాక్ స్టోన్స్ ఉన్నాయి. వాటిని ఏనుగులు, ఆవులు, కోతులు, తాబేలు, కొలనుగా రంగులద్ది మార్చాను. మొన్నటి మే నెల ఎండలో వేసిన పెయింటింగ్స్. అక్కడికి వచ్చినవాళ్లు ‘ఆడపిల్ల అంత పెద్ద రాళ్లు ఎక్కి ఏం పెయింటింగ్స్ వేస్తుంది’ అన్నారు. కానీ అవి పూర్తయ్యాక చాలా సంతోషించారు’ అంది లావణ్య.
వెడ్డింగ్ లైవ్ ఆర్ట్
‘వివాహవేడుక జరుగుతుండగా ఆ సన్నివేశం, సందర్భం చూడటానికి చాలా బాగుంటుంది. లైవ్ ఆర్టిస్ట్‌ను అని తెలియడంతో గత పెళ్లిళ్ల సీజన్‌లో వివాహం జరుగుతుండగా ఆ సీన్ మొత్తం పెయింటింగ్ చేసే అవకాశం వచ్చింది. చాలా ఆనందంగా ఆ కార్యక్రమాన్ని కళ్లకు కట్టినట్టుగా చిత్రించి, ఇచ్చాను. కాలేజీ రోజుల్లోనే తొమ్మిది నెలల పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. యువతకు మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తుంటాను. షీ టీమ్ వారు ‘షీ ఫర్ హర్’ అవార్డు ఇచ్చారు. నాన్న సురేందర్ కరోనా సమయంలో చనిపోయారు. అమ్మ గృహిణి. తమ్ముడు శివప్రసాద్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. గ్రామీణ నేపథ్యం గల కుటుంబమే మాది. నా కళకు సపోర్ట్ చేసేవారుంటే మరెన్నో విజయాలు అందుకోవచ్చు’ అంటూ తెలిపింది ఈ హార్టిస్ట్.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment