Police Cracked Mystery of Tribal Woman Lavanya Murder Case in Yadadri District - Sakshi
Sakshi News home page

Lavanya: అందరికీ చెబుతుందనే లావణ్య హత్య

Published Thu, May 12 2022 9:05 AM | Last Updated on Thu, May 12 2022 10:31 AM

Police Cracked Mystery of Tribal Woman Lavanya Murder Case Yadadri Dist - Sakshi

ముఢావత్‌ లావణ్య

సాక్షి, చౌటుప్పల్‌: ‘లైంగికదాడికి పాల్పడిన సమయంలో గిరిజన మహిళ నన్ను గుర్తించింది. విషయాన్ని భర్తతో పాటు నేను పనిచేస్తున్న తాపీమేస్త్రీలకు చెబుతానని హెచ్చరించడంతో భయపడి హత్య చేశా’ అని ఈ నెల 9వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామ శివారులో దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ఈడిగి హరీష్‌గౌడ్‌ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. గిరిజన మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.

బుధవారం తన కార్యాలయంలో స్థానిక ఏసీపీ ఉదయ్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. నాగర్‌కర్నూలు జిల్లా కోడూరు మండలం మైలారం పరిధిలోని కర్రెన్నబండతండాకు చెందిన ముడావత్‌ క్రిషీనా అతడి భార్య లావణ్య(28) ఇటీవల ఉపాధి నిమిత్తం మల్కాపురానికి వచ్చారు. అక్కడే ఉన్న ఓ కన్‌స్ట్రక్షన్‌ గోడౌన్‌లో లావణ్య వాచ్‌మన్‌గా, సమీపంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో భర్త సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 9న భర్త విధులకు వెళ్లగా భార్య గోడౌన్‌ వద్ద ఒంటరిగా ఉంది. 

ఐదురోజులుగా వ్యూహరచన 
దండుమల్కాపురం శివారులో మూతబడిన ఓ డెయిరీలో కొంత మంది తాపీ మేస్త్రీలు ఉంటున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం వెంకటాపురానికి చెందిన ఈడిగి హరీష్‌గౌడ్‌(25).. అంజనేయులు అనే మేస్త్రీ వద్ద కూలి పని చేస్తున్నాడు. ఈనెల 5న వారుంటున్న ప్రాంతంలో బోరు వేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మూతబడిన గోడౌన్‌లో లావణ్య  ఒంటరిగా ఉండడాన్ని నిందితుడు గమనించి వివరాలు తెలుసుకొని అప్పటి నుంచి వ్యూహరచన చేస్తున్నాడు. 

హరీష్‌గౌడ్‌.. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ ఉదయ్‌రెడ్డి

భర్త డ్యూటీకి వెళ్లగానే..
ముడావత్‌ క్రిషీనా సోమవారం డ్యూటీకి వెళ్లడాన్ని హరీష్‌గౌడ్‌ గమనించి సమయం కోసం వేచిచూశాడు. సాయంత్రం  4గంటలకు బాత్రూంకు వెళ్లిన లావణ్య వద్దకు వెళ్లి లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నించాడు. ప్రతిఘటించిన ఆమె తలపై కొట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అతన్ని గుర్తించిన మృతురాలు విషయాన్ని భర్తతో పాటు ఇతరులకు చెబుతానంది. దీంతో నిందితుడు ఆమె తలపై కర్రతో బలంగా కొట్టడంతో మృతిచెందింది. అనంతరం మరోసారి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకొని వెళ్లిపోయాడు. విధులు ముగించుకొని రాత్రి ఎనిమిదిన్నరకు ఇంటికి వచ్చిన భర్త చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

చదవండి: (మాటేసి.. కాటేసి..)

24గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు 
లైంగికదాడి, హత్య ఘటనను పోలీసులు 24గంటల్లోనే ఛేదించారు. ఘటనాస్థలిలో లభించిన కాళ్ల చెప్పుల ఆధారంగానే నిందితుడిని అతడు నివసించే మూతబడిన డెయిరీలోని గదిలో అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరం అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు. అతడి వద్ద 2బంగారు పుస్తెలు, 2 వెండి పట్టీలు, 4 వెండి మెట్టెలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడిపై అత్యాచారం, హత్య, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు వివరించారు. కేసును ఛేదించిన పోలీసులను రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ అభినందించారన్నారు. ఛేదించిన పోలీసులకు రివార్డు ప్రకటించారని తెలిపారు. సమావేశంలో సీఐలు  ఎన్‌.శ్రీనివాస్,  ఏరుకొండ వెంకటయ్య, ఎస్సైలు బి.సైదులు, డి.అనిల్, డి.యాకన్న పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement