
సాక్షి, యాదాద్రి భువనగిరి: ఆలేరు మండలం గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన కన్‌రెడ్డి వెంకట్‌రెడ్డి(38) దారుణ హత్యను నిరసిస్తూ గ్రామస్థులు, మృతుడి బంధువులు పరుశరాములు అనే వ్యక్తి ఇంటిని తగులబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలేం జరిగిందంటే... గొలనుకొండ గ్రామానికి చెందిన కన్‌రెడ్డి వెంకటరెడ్డి... భార్య భాగ్యతో కలిసి సోమవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై జనగామకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం సిరిపురం రోడ్డు గుండా స్వగ్రామానికి వస్తున్న క్రమంలో గుర్తుతెలియని దుండగులు వెంకటరెడ్డి వాహనాన్ని అటకాయించారు. దీంతో అతడు బైక్ దిగి పరుగులు తీయగా.. దుండగులు వెంబడించి కత్తితో పాశవికంగా అతడిని హత్య చేశారు. తన భర్తను చంపవద్దని భాగ్య ఎంతగా వేడుకున్నా కనికరించకుండా ఆమెపై కూడా దాడికి తెగబడటంతో స్వల్పగాయాలపాలైంది.
ఈ నేపథ్యంలో గ్రామానికి చేరుకున్న భాగ్య... తమ గ్రామానికే చెందిన పరుశరాములు అనే వ్యక్తి తన భర్త వెంకటరెడ్డిని హతమార్చినట్లు గుర్తించింది. తన కళ్ల ముందే భర్తను పరశురాములు దారుణంగా కత్తితో చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, వెంకటరెడ్డి బంధువులు పరశురాములు ఇంటిని తగులబెట్టారు. ఘటనతో బెంబేలెత్తిన పరుశరాములు కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో గొలనుకొండలో భారీగా పోలీసులను మోహరించారు. కాగా మృతుడు వెంకటరెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు ఫంక్షన్ నిమిత్తం వస్త్రాలు కొనుగోలు చేసేందుకు వెళ్లి వస్తుండగా అతడి హత్య జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment