శ్రావణి, మనీషాల హత్య కేసు.. ఎవరీ శ్రీనివాసరెడ్డి? | Accused Held in Hazipur Double Murder Case | Sakshi
Sakshi News home page

శ్రావణి, మనీషాల హత్య కేసు.. ఎవరీ శ్రీనివాసరెడ్డి?

Published Mon, Apr 29 2019 6:35 PM | Last Updated on Mon, Apr 29 2019 6:36 PM

Accused Held in Hazipur Double Murder Case - Sakshi

సాక్షి, బొమ్మలరామారం: తెలంగాణలో సంచలనం రేపిన హాజీపూర్‌ హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. శ్రావణి, మనీషాలను హత్య కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. హాజీపూర్‌ గ్రామానికి చెందిన పాత నేరస్తుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రావణి హత్య కేసులో అతడిని విచారిస్తున్న క్రమంలోనే మనీషా హత్య కూడా వెలుగులోకి వచ్చింది. మనీషాపై అత్యాచారం చేసి చంపేసినట్టు పోలీసులు ముందు నిందితుడు అంగీకరించినట్టు తెలుస్తోంది. అతడు ఇచ్చిన వాంగూల్మం ఆధారంగా మనీషా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శ్రావణి మృతదేహాన్ని పాతిపెట్టిన బావిలోనే మనీషా మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.

కీసరలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిపై ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, హైదరాబాద్‌లో పలు కేసులు ఉన్నాయి. హాజీపూర్‌ నుంచి ప్రతిరోజు కీసరకు వెళ్లే క్రమంలో అమ్మాయిలను ట్రాప్‌ చేసివుంటాడని అనుమానిస్తున్నారు. నెలరోజుల వ్యవధిలోనే ఇద్దరు అమ్మాయిలను అతడు హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అతడు ఇంకా ఎన్ని దారుణాలకు పాల్పడ్డాడనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు గ్రామస్తులు దాడి చేస్తారన్న భయంతో అతడి కుటుంబ సభ్యులు హాజీపూర్‌ వదిలి పారిపోయారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా భద్రతా దళాలను మొహరించారు. అయితే శ్రీనివాస్‌రెడ్డి అరెస్ట్‌ను పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.

నెలా పది రోజుల క్రితం కాలేజీకి వెళ్లి తన కూతురు తిరిగి రాలేదని మనీషా తండ్రి మల్లేశ్‌ తెలిపారు. పరువు పోతుందన్న భయంతో బయటికి చెప్పలేదని, తన కూతురు హత్యకు గురవుతుందని ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. మనీషా తన నాలుగో కూతురని, హంతకుడిని కఠినంగా శిక్షించాలని అన్నాడు. తానొక వ్యక్తిని ప్రేమించానని, అతడిని పెళ్లి చేసుకుంటానని తన కుటుంబ సభ్యులతో మనీషా చెప్పిందని.. తర్వాత ఆమె కనిపించకపోవడంతో ప్రేమికుడితో వెళ్లిపోయివుంటారని అందరూ భావించారు.

శ్రీనివాసరెడ్డి కారణంగా తమ గ్రామానికి చెడ్డ పేరు వచ్చిందని హాజీపూర్‌ వాసులు వాపోయారు. మొదటి నుంచి అతడికి నేర చరిత్ర ఉందని వెల్లడించారు. కచ్చితంగా అతడే ఈ రెండు హత్యలు చేసివుంటాడని అన్నారు. గతంలో హత్యకు గురైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన మహిళను కూడా అతడే చంపివుంటాడన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కర్నూలులోనూ శ్రీనివాసరెడ్డిపై హత్య కేసు నమోదైందని తెలిపారు. బైకు దొంగతనాలకు కూడా పాల్పడినట్టు చెప్పారు. (శ్రావణిని పూడ్చిపెట్టిన బావిలోనే మనీషా మృతదేహం లభ్యం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement