Hope
-
కోరిక కాదు ఓపిక కావాలి.. ఇంట్రస్టింగ్ స్టోరీ
ఒకప్పుడు ఋషులు, మునీశ్వరులు, సాధువులు, మహర్షులు సంవత్సరాల తరబడి సృష్టికర్త దర్శనభాగ్యం కోసం యోగముద్రలో, ధ్యానంలో ఉండేవారు. సృష్టికర్త దర్శనమిచ్చేంతవరకు వారి కార్యదీక్ష భగ్నం చేసుకునే వారు కాదు. వారి పూర్వజన్మ సుకృతమో, కర్మఫలమో ఫలించి ఆ భగవంతుడి దర్శనంతోనే వారి జన్మ ధన్యమైపోయేది.రాను రాను మనిషికి ఆలోచనలు ఎక్కువై పోయాయి. కోరికలు తోడయ్యాయి. దైవపూజలు చేస్తూనే కోర్కెలు దేవుడి ముందు ఏకరువు పెడుతున్నారు. దేవుడికి సేవ చేయాలి కానీ కోరికలు కోరడం సరికాదు. మనిషి తలరాతను రాసింది ఆయనే కదా!కోరికలు తీరుతాయా అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మనిషి భూత, భవిష్యత్, వర్తమానాలన్నింటినీ ఆ సృష్టికర్త ఆ మనిషి నొసటనే ముందుగానే రాస్తాడు. మంచి అయినా, చెడు అయినా జరిగి΄ోతూనే వుంటాయి. బ్రహ్మ రాతను మార్చటం అసాధ్యం. ఏది జరగాలనుందో అదే జరుగుతుంది. అలాంటి పాప, పుణ్యాలన్నీ కూడా గత జన్మలోని కర్మల ఫలితాలుగానే భావించాలి. ఫలానా పని జరిగితే నీకు కొబ్బరికాయలు కొడతాను, అన్నదానాలు, వస్త్రదానాలు, నిలువుదోపిడీ ఇస్తామని మొక్కుకుంటారు. మనం మానవమాత్రులం కాబట్టి ఇలాంటి ఆలోచనలు, కోర్కెలు ఉండటం సహజం. (చాలా కాస్ట్లీ గురూ! ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్య్..!)ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు సాందీప మహర్షి గురువు దగ్గర అన్ని విద్యలూ నేర్చుకుంటాడు. శ్రీ కృష్ణుడు సాందీప మహర్షిని గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోమంటాడు. సాందీప మహర్షి భార్యతో చర్చించి చనిపోయిన తమ కుమారున్ని తిరిగి ఇవ్వాలని కోరతాడు. కోరిన వెంటనే శ్రీ కృష్ణ పరమాత్ముడు వారి కోరికను నెరవేరుస్తాడు. అంతటి గొప్ప మహర్షి కూడా భగవంతుడు వరం కోరుకొమ్మంటే ఏమీ పాలుపోక తన కొడుకునిస్తే చాలని అంటాడు. అంతటి మేధావికన్నా మామూలు మనుషులం మనం ఆ భగవంతుడు ప్రత్యక్షమైతే ఎలాంటి కోరికలు కోరే అవకాశం లేదు. కాబట్టి దైవసేవ చేయడం మానవ జన్మ ఎత్తిన పుణ్యమే. ఇక ΄ాపపుణ్యాలన్నీ పూర్వజన్మ కర్మల ఫలితాలుగానే భావిస్తే అంతా శుభమే..ఇదీ చదవండి: శానిటరీ ప్యాడ్ అడిగితే.. ఇంత దారుణమా! నెటిజన్ల ఆగ్రహంభక్తుడు పురోగతి సాధించినప్పుడు నీటి రుచిలో దేవుడిని అనుభవిస్తాడు. విత్తనాన్ని తినాలని చీమలు చూస్తాయ్. మొలకలను తినాలని పక్షులు చూస్తాయ్. మొక్కని తినాలని పశువులు చూస్తాయ్. అన్నిటినీ తప్పించుకుని ఆ విత్తనం వృక్షమైనపుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్. జీవితం కూడా అంతే! వచ్చేవరకు వేచివుండాల్సిందే. దానికి కావాల్సింది ఓపిక మాత్రమే...– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి. -
మధ్యంతర బడ్జెట్ ఈ ఐదింటిపై ఆశలొద్దు !
కేంద్ర బడ్జెట్ పేరు వినగానే మధ్య తరగతి ప్రజల్లో ఒకింత ఉత్సుకత మొదలవడం సహజం. పన్ను శ్లాబులు తగ్గిస్తారనో, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే చర్యలేవో తీసుకుంటారనో ఆశ పడుతుంటారు. మహిళలు, యువత కోసం ప్రత్యేక పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తుందేమోనని ఎదురుచూస్తుంటారు. మధ్యంతర బడ్జెట్ అయినా సామాన్య ప్రజానీకం మొదలు కార్పొరేట్ వర్గాల దాకా అందరి అంచనాలు భారీగానే ఉన్నాయి. మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఎన్నికల తాయిలాలు బడ్జెట్లో కనిపించవచ్చని అందరి అంచనా. అయితే ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఒక ఐదు అంశాలపై ఆశలు పెట్టుకోకపోవడమే ఉత్తమం అని వారు సెలవిస్తున్నారు. ఆ ఐదేంటో ఓసారి చూసేద్దాం. – సాక్షి, నేషనల్ డెస్క్ 1. ప్రభుత్వ విధానపర నిర్ణయాలు త్వరలో లోక్‌సభ ఎన్నికలున్నాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమి గెలిస్తే ఈ మధ్యంతర బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యాలను కొత్త ప్రభుత్వం నెలవేరుస్తుందన్న గ్యారెంటీ లేదు. అందుకే దీర్ఘకాలిక ఆర్థిక సంస్కరణల జోలికి వెళ్లకుండా ఇప్పటి పద్దుల సంగతే చూడాలని ప్రభుత్వం భావిస్తోందట. అందుకే ప్రభుత్వం ఎలాంటి నూతన ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించదల్చుకోలేదని కొందరు ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఈసారి బడ్జెట్లో కొత్త పథకాలు ఏమీ ఉండబోవని ఇప్పటికే విత్త మంత్రి నిర్మల సెలవివ్వడం గమనార్హం. ప్రస్తుత ఖర్చుల మీద మాత్రమే దృష్టిపెడతామని ఆమె ప్రకటించారు. 2. పన్ను మినహాయింపులు పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భాల్లో మాత్రమే పన్ను శ్లాబుల్లో మార్పుల వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వాలు ప్రకటించడం చూశాం. ఇది మధ్యంతర బడ్జెట్ కాబట్టి పన్ను శ్రేణుల్లో సవరణలు ఆశించలేమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంటే పన్ను శ్లాబుల్లో మార్పులు రావాలంటే కొత్త ప్రభుత్వం కొలువుతీరాక వచ్చే పూర్తి బడ్జెట్ దాకా వేచి ఉండక తప్పదు. 3. నూతన సంక్షేమ పథకాలు కొత్త సంక్షేమ పథకానికి రూపకల్పన చేయాలంటే చాలా సమయం పడుతుంది. మూడోసారి హ్యాట్రిక్ కొట్టి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడంపై దృష్టిపెట్టిన బీజేపీ.. కొత్త పథకాలను పట్టించుకోదనే వాదన ఉంది. నూతన సంక్షేమ పథక రచనకు విస్తృతస్తాయి సంప్రదింపులు జరగాలి. ఎన్డీఏ కూటమికి అంత వ్యవధిలేదని మూడోసారి గెలిచాక వాటి సంగతి చూసుకుందామనే ధోరణి బీజేపీలో కనిపిస్తోందని ఒక రాజకీయ విశ్లేషకుడు అంచనావేశారు. కొత్త సంక్షేమ పథకం ప్రకటించి అమలుచేయాలంటే అందుకు తగ్గ ఆర్థికవనరులనూ సమకూర్చుకోవాల్సిందే. అంటే పూర్తి బడ్జెట్ స్థాయిలో కేటాయింపులు జరగాలి. మధ్యంతర బడ్జెట్లో అది సాధ్యమేనా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. అందుకే కొత్త సంక్షేమ పథకాల పాట బీజేపీ పాడదని మాట వినిపిస్తోంది. 4. ద్రవ్యలోటు కట్టడి చర్యలు ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు ఖర్చులను తగ్గించుకోవడం వంటి చర్యలకు ఉపక్రమించాలి. ఆ పని చేయాలంటే సంబంధిత అన్ని శాఖలతో విస్తృతస్థాయి సంప్రతింపులు అవసరం. అత్యంత కఠిన ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ద్రవ్యలోటు కట్టడి చర్యలకు దిగితే దాని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. సార్వత్రిక ఎన్నికలపై పూర్తిగా దృష్టిపెట్టే సర్కార్ మళ్లీ ద్రవ్యలోటు అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటుందా లేదా అనేది తెలియాల్సిఉంది. ద్రవ్యలోటు భారాన్ని దింపేందుకు మధ్యంతర బడ్జెట్ సరైన వేదిక కాదనే భావన ఉండొచ్చు. 5. నూతన ఆర్థిక విధానాలు చాలా నెలలుగా అమలవుతోన్న ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు తెస్తూ ప్రకటించే నూతన ఆర్థిక విధానాలు వ్యవస్థను ఒక్కసారిగా కుదుపునకు గురిచేస్తుంది. ఇలాంటి ప్రయోగాలు సాధారణంగా పూర్తిస్తాయి బడ్జెట్లోనే చేస్తారు. మధ్యంతర బడ్జెట్‌కు ఈ ఫార్ములా నప్పదు అనే అభిప్రాయం ఒకటి ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికలు, సంబంధిత రంగాల సంస్థలతో చర్చోపచర్చల తర్వాతే మామూలుగా ఇలాంటి నూతన ఆర్థిక విధానాలను ప్రకటిస్తారు. నూతన ఆర్థిక విధానాలు ప్రకటిస్తే స్టాక్ మార్కెట్లు స్పందించడం సర్వసాధారణం. సానుకూలమో, ప్రతికూలమో, లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోవడమో.. ఇంకేదైనా జరగొచ్చు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాల అమలుకు మధ్యంతర బడ్జెట్‌ను ప్రభుత్వం వాడుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. అయినా కొన్ని అంచనాలు.. 1.పెట్రోల్, డీజిల్ ధరలను కిందకు దించుతారని ఆశలూ ఎక్కువయ్యాయి. అధిక పెట్రో ధరల కారణంగా ప్రభుత్వ చమురు రిటైల్ కంపెనీలు ఇటీవలికాలంలో అధిక లాభాలను కళ్లజూశాయి. ఈ లాభాలను పౌరులకు కాస్తంత మళ్లించే యోచన ఉందట. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 5–10వరకు తగ్గించవచ్చని అనుకుంటున్నారు. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించడం, విద్యుత్ వాహనాలకు రాయితీ పొడిగింపు వంటి ప్రకటనలు బడ్జెట్ రోజు వెలువడొచ్చని భావిస్తున్నారు. 2. పట్టణవాసులు భారీ లబ్ది చేకూరేలా నివాస గృహాలపై తక్కువ వడ్డీకే రుణాలు అందించవచ్చని భావిస్తున్నారు. సబ్సిడీతో పీఎం ఆవాస్ యోజన తరహా కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా పథకం అమలుచేస్తే బాగుంటుందని మంత్రి గతంలో వ్యాఖ్యానించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. 3.దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర పథకం పీఎం– కిసాన్ కింద ఇచ్చే నగదు మొత్తాన్ని మరింత పెంచుతారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇంతకంటే ఎక్కువ మొత్తం ఇస్తున్నాయి. అందుకే పీఎం–కిసాన్ నగదు సాయాన్ని అధికం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వార్తలొచ్చాయి. ఈ ఆలోచన బడ్జెట్లో ఆచరణాత్మకం అవుతుందో లేదో చూడాలి. పీఎం కిసాన్ మొత్తాన్ని దాదాపు రూ.9,000కు పెంచే వీలుందని సమాచారం. 4. గత బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబాలకు పన్ను రిబేట్‌ను ఏకంగా రూ.7,00,000 పెంచడం వంటి చాలా కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. దీంతో ఈసారి అలాంటి కలలనే మధ్యతరగతి కుటుంబాలు కంటున్నాయి. ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్ (ప్రామాణిక తగ్గింపు) ప్రస్తుతం రూ. 50 వేలుగా ఉంది. కొత్త, పాత పన్ను విధానాల్లో ఈ డిడక్షన్‌ను రూ.1,00,000కు పెంచాలని మధ్యాదాయ వర్గాలు అభిలషిస్తున్నాయి.. 5. బ్యాంకు ఖాతాదారులకు పన్ను మినహాయింపులు పెరగొచ్చని మరో అంచనా. వీరి సేవింగ్స్ ఖాతా వడ్డీపైనా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50,000కు పెంచుతారని ఆశిస్తున్నారు. 6. ఆదాయపు పన్ను చట్టంలో ముఖ్యమైనదైన సెక్షన్–80సీ కింద ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నారు. పొదుపు పథకాల్లో పెట్టుబడులు, జీవిత బీమా చందా చెల్లింపులు, ట్యూషన్ ఫీజులు, గృహ రుణాల చెల్లింపులు, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ దీని కిందికే వస్తాయి. కాబట్టి ఈ మొత్తాన్ని రూ. 3,00,000కు పెంచాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. -
రూపం లేని ఇంధనం ఆశ
ఆశ మనిషిని కదిలించి నడిపించే రూపంలేని ఇంధనం; ఆశ మనిషిని ఎప్పటికప్పుడు బతికిస్తూ ఉండే ఆకృతి లేని మూలకం. ఆశలేకపోతే మనిషికి మనుగడే ఉండదు. మనుగడకు మనుగడ ఉండాలంటే మనిషికి ఆశ ఉండాలి. మనిషి పొందుతున్న ప్రతిదానికీ ఆశపడడమే కీలకం. మనిషి గమ్యానికీ ఆశ ఆరంభం. మనిషికి ఆశ అంతం అవడం ఉండకూడదు. ఆశ అన్నది అంతం అవడం అంటే మనిషి అంతం అవడం తప్పితే మరొకటి కాకూడదు. మనిషి క్రియాశీలకం అవడానికి ఆశే ప్రేరణ. ఆశవల్లే మొత్తం ప్రపంచం క్రియాశీలకం ఔతోంది. ‘ఆశ అనేది మనుషులకు ఉన్న శృంఖలాల్లో అత్యంత ఆశ్చర్యకరమైంది. దానికి బద్ధులైనవాళ్లు పరుగులు పెడతూ ఉంటారు; ఆ శృంఖలాల నుంచి విముక్తులైనవాళ్లు చతికిలబడిపోతూ ఉంటారు’ అని హితోపదేశం తెలియజెబుతోంది. ఆశ ఉన్న మనిషి పరుగెడుతూ ఉంటాడు; ఆశలేని మనిషి చతికిలబడిపోతాడు; చచ్చుబడిపోతాడు. ఆశను కలిగించే మాటలు నీకు శక్తిని ఇస్తాయి‘ అని జపనీస్ కవి–బౌద్ధతాత్త్వికుడు దైసకు ఇకెద ఒక కవితలో అంటారు. ఈ దైసకు ఇకేదకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేర్వేరు విశ్వవిద్యాలయాల నుంచి 300కు పైగా డాక్టరేట్స్ వచ్చాయి! 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబు దాడికి ఆయన మినహా కుటుంబం మొత్తం బలి అయిపోయింది. అ పరిస్థితి నుంచి ఆయన ఆశతో, ఆశ ఇచ్చిన శక్తితో విశ్వ – విశ్వవిద్యాలయాల నుంచి 300కు పైగా డాక్ట రేట్స్ అందుకున్న మహోన్నతుడిగా ఎదిగారు. శక్తై, మహాశక్తై ఆశ మనిషిని ముందుకు, మునుముందుకు నడిపిస్తూ ఉంటుంది; మహోన్నతుణ్ణి చేస్తూ ఉంటుంది. ఆశ వేరు దురాశ వేరు. మనిషికి ఆశపడడంపై అవగాహన ఉండాలి. ఏ వ్యక్తి ఐనా తనను తాను చూసుకోకుండా లేదా తనను తాను తెలుసుకోకుండా ఆశపడుతూ ఉండడం తప్పు. ఆశ అనేదే లేకపోతే మనుగడ జరగదు. కానీ దురాశవల్ల మనుగడ తిన్నగా ఉండదు, సాగదు. ఆశ వికటిస్తే దురాశ ఔతుంది; వికృతమైన మనస్తత్వానికి దురాశ ఒక అభివ్యక్తి. ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలి అన్న హిట్లర్ దురాశ పెనువినాశనానికి కారణమై చివరికి అతడి అంతానికీ కారణం ఐంది. నెపోలియన్ కూడా ప్రపంచాన్ని జయించేయాలన్న దురాశతో యుద్ధాలు చేసుకుంటూ వెళ్లి చివరికి బ్రిటిష్ వాళ్ల చేతికి చిక్కి చెరసాలపాలై ఆపై అనాథై మరణించాడు. ‘దురాశ దుఃఖానికి చేటు’ అని ఎప్పుడో చెప్పబడ్డ మాట ఇప్పటికీ, ఎప్పటికీ సరైందే; ఎప్పటికప్పుడు అది మనకు దిశానిర్దేశం చేసేదే. మనం ఎప్పుడూ దురాశకు అతీతంగానే ఉండాలి. ఆశ ఫలించని వేళల్లో మనిషిని నిరాశ చుట్టుకుంటుంది. నిరాశకు లోనుకాని మనిషి ఉండడం ఉండదు. నిరాశకు బలి ఐపోయినవాళ్లూ ఉన్నారు. నిరాశ అనే వ్రణం ఎవరినైనా సలుపుతుంది. నిరాశ కలిగినప్పుడు ఆ నిరాశకు చిత్తైపోకుండా ఉండాలంటే, నిరాశపై విజయం సాధించి రాణించాలంటే మనిషికి ఉండాల్సింది ఆశే. ఆశతోనే మనిషి నిరాశపై నెగ్గాలి. పుట్టిన ప్రతివ్యక్తికి పాలు తాగడం నుంచీ ఆశ మొదలు ఔతుంది. నిజానికి వ్యక్తికి పాలు తాగడంకన్నా ముందే ఆశ మొదలు ఔతుంది; ఆ ఆశవల్లే పాలుతాగడం మొదలు ఔతుంది; ఆశ మొదలుకాగా మనిషికి మనుగడ మొదలు ఔతుంది. మనిషి పోయేంత వరకూ మనిషిని వీడిపోకుండా ఉండాల్సింది ఆశ. వర్తమానం భవిష్యత్తును ఆవాహన చెయ్యాలంటే మనకు కావాల్సినవి ఆశ ఆపై సదాశ. ఆశ, సదాశలతో మనం అభ్యున్నతిని పొందాలి. ఆశ ప్రగతికి మూలం; దురాశ పతనానికి మూలం. ఈ విషయాన్ని మనిషి అవగతం చేసుకోవాలి. మనిషికి ఆశ ఉండాలి; తన ఆశకు తగినట్టు మనిషి తనను తాను సిద్ధం చేసుకోవాలి. ఆశ, సదాశల్ని ప్రయుక్తం చేసుకుని ప్రతిమనిషీ ప్రశస్తం అవాలి. – రోచిష్మాన్ -
హోప్ సెంచరీ వృథా
ఢాకా: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లాదేశ్ చివరిదైన మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి 2–1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఓపెనర్ షై హోప్ (131 బంతుల్లో 108 నాటౌట్; 9 ఫోర్లు, సిక్స్) అజేయ శతకంతో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు మెహదీ హసన్ (4/29), షకీబ్ (2/40), మోర్తజ (2/32) ధాటికి విండీస్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. అనంతరం తమీమ్ ఇక్బాల్ (81 నాటౌట్; 9 ఫోర్లు), సౌమ్య సర్కార్ (80; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) రాణించడంతో బంగ్లాదేశ్ 38.3 ఓవర్లలో 2 వికెట్లకు 202 పరుగులు చేసి గెలిచింది. -
విండీస్‌ను గెలిపించిన షై హోప్
ఢాకా: ఓపెనర్ షై హోప్ (144 బంతుల్లో 146 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకంతో కడదాకా నిలవడంతో బంగ్లాదేశ్‌తో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ నాలుగు వికెట్లతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 255 పరుగులు చేసింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (50), వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ (62), ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్ (65) అర్ధశతకాలు సాధించారు. ఒషేన్ థామస్ (3/54) కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా చూశాడు. ఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హోప్ దాదాపు ఒంటరి పోరాటం చేశాడు. డారెన్ బ్రేవో (27), మార్లోన్ శామ్యూల్స్ (26) ఫర్వాలేదనిపించగా, హేమ్రాజ్ (3), హెట్‌మైర్ (14), రావ్మన్ పావెల్ (1), ఛేజ్ (9) విఫలమయ్యారు. 185 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో హోప్‌కు కీమో పాల్ (18 నాటౌట్) అండగా నిలిచాడు. దీంతో విండీస్ 49.4 ఓవర్లలో 256 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రెండు జట్ల మధ్య మొదటి వన్డేలో బంగ్లాదేశ్ నెగ్గింది. సిరీస్‌లో నిర్ణయాత్మకమైన మూడో వన్డే శుక్రవారం జరుగనుంది. -
కూలీల రాత మారేనా?
ఈయన పేరు నడిపి రాజం. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ బతుకుబండిని లాగుతున్నారు. భార్యాభర్తలిద్దరూ రోజంతా కష్టపడితే వచ్చేది రూ.400. అదీ పని దొరికితే! కూలీ లేని సమయంలో భార్య బీడీలు చుడుతుంది. కొడుకు చదువు, పండుగలూపబ్బాలు, ఉప్పూపప్పు.. మిగతా ఖర్చులన్నీ వచ్చే కాస్త సంపాదనతోనే తీర్చుకోవాలి. ‘‘అన్నీ రేట్లు పెరిగిపోతున్నయి. బియ్యం.. కూరగాయల ధరలు మండిపోతున్నయ్. వాటికే నెలకు రూ.3–5 వేల ఖర్చు వస్తుంది. తిండికే మస్తు తక్లీబు అయితంది’’అని రాజం వాపోయాడు. ఈయనలాంటివారు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. పనిదొరికితే తిండి లేదంటే.. పస్తులు ఉంటున్న కుటుంబాలెన్నో ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని వచ్చి, ఎన్ని మారినా వీరి తలరాతలు మాత్రం మారడం లేదు. కేంద్ర ప్రభుత్వం తమలాంటి గరీబోళ్లను ఆదుకోవాలని, రోజువారీ సరుకుల ధరలు తగ్గించాలని వీరంతా కోరుతున్నారు. మరి జైట్లీ తన బడ్జెట్లో వీరికోసం ఏం చేస్తారు..? సుస్థిర ఉపాధికి ఏం భరోసా ఇస్తారు..? వేచి చూడాల్సిందే..!! -
బ్రాత్‌వైట్, హోప్ సెంచరీలు
లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో విండీస్ అదరగొడుతోంది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (134; 17 ఫోర్లు, 2 సిక్సర్లు), షాయ్ హోప్ (147 బ్యాటింగ్; 23 ఫోర్లు) శతకాలతో చెలరేగారు. దాంతో రెండో రోజు ఆట ముగిసేసమయానికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 329 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగులకు ఆలౌటైంది. -
సహయం కోసం నిరీక్షణ
కంటి చూపు కోల్పోయిన బాధితుల వేదన స్పందించని అధికారులు, లయన్స్ క్లబ్ వర్గాలు పరామర్శలే తప్ప సహాయం లేదు నేడు అమెరికా నుంచి రానున్న క్లబ్ బృందం సామర్లకోట (పెద్దాపురం) : కంటి చూపు కోల్పొయిన బాధితులకు ఇంతవరకూ ప్రభుత్వం నుంచి లేదా లయన్స్ క్లబ్ నుంచి ఎటువంటి సహాయం అందలేదు. దీంతో బాధితులు సాయం కోసం నిరీక్షిస్తున్నారు. ఏప్రిల్ 13వ తేదీన వేట్లపాలెం గ్రామానికి చెందిన 10 మంది జగ్గంపేట వెళ్లి కోడూరి రంగారావు లయన్స్ క్లబ్ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు చేయించుకోవడం, వారి చూపు మందగించడం విదితమే. బాధితులు మూడు నెలల పాటు వారి చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో.. చివరికి విలేకరులను ఆశ్రయించారు. అధికారులు, లయన్స్ క్లబ్ సభ్యులు తగిన అన్యాయంపై న్యాయం చేస్తారని ఆశ పడిన వారికి నిరాశే మిగిలింది. వేట్లపాలెం గ్రామంలో ఒక చర్చిలో ప్రార్థనలు చేసుకుంటోన్న సమయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు చేయిస్తోందని, అవసరమైన వారికి ఉచితంగానే కంటి ఆపరేషన్లు చేస్తామని ప్రకటించడంతో ఈ బాధితులు వైద్యం కోసం వెళ్లారు. మసకగా ఉన్న కంటి చూపు మెరుగుపడుతుందని ఆశించిన వారికి కంటి చూపే పొయింది. ఈ గ్రామస్తులు రామిశెట్టి సత్యవతి, బావిశెట్టి రాంబాయి, కుప్పాల కృపారావు, చిట్టూరి సత్యనారాయణ, గొడత రామకృష్ణ, బొండా సత్యానందం, దోణం పెద్దిరాజులకు కంటి ఆపరేషన్లు చేయడంతో వారికి ఉన్న చూపు కోల్పోయిన విషయం విదితమే. చూపు కనిపించకపోవడమే కాకుండా కంటిలో ఈగలు తిరుగుతున్న ఉందని బాధితులు వాపోతున్నారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఈ నెల 5న బాధితులను పరామర్శించి ప్రభుత్వ కంటి వైద్యులతో మెరుగైన వైద్యం అందిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి వైద్యం అందలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కంటి చూపు పోయిన వారి పట్ల సానుభూతి చూపించేవారే తప్ప వారికి సహాయం చేసేవారు లేకుండా పోయారని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగ్గంపేటలోని కోడూరి రంగారావు లయన్స్ ఆస్పత్రి ప్రతినిధులు అమెరికాలోని అంతర్జాతీయ లయన్స్ క్లబ్ సమావేశాలకు వెళ్లారని, వారు వచ్చిన తరువాత బాధితులకు న్యాయం చేస్తామని లయన్ప్ క్లబ్ ప్రతినిధులు చెబుతున్నారు. ఆమెరికా ప్రతినిధి బృందం సోమవారం జిల్లాకు వస్తారనే ప్రచారం సాగుతోంది. వారు వచ్చిన తరువాత అయినా బాధితులకు సరైన న్యాయం చేస్తారా లేదో చూడాలని గ్రామస్తులు అంటున్నారు. -
సిద్ధరామయ్యపైనే కర్ణాటక కాంగ్రెస్ భారం
-
నిరాశను కుంగదీయాలి
ఆత్మీయం మనిషికి ఆశ ఉండాలి కానీ, దురాశ ఉండకూడదు. అదేవిధంగా నిరాశ కూడా ఉండకూడదు. నిరాశ మనిషిని కుంగదీసేస్తుంది. ఏ పనీ చెయ్యనివ్వకుండా అడ్డుపడుతుంటుంది. నిరాశగా ఉన్న వ్యక్తిని చూస్తే ఎదుటి వాళ్లకు కూడా చికాకు పుడుతుంది. నిరాశ అనేది నిప్పును కప్పిన బూడిద వంటిది. నిప్పుమీద చేరిన బూడిదను ఎప్పటికప్పుడు తొలగించకపోతే నిప్పు కూడా ఆరిపోతుంది. డిప్రెషన్‌కు మిత్రుడు నిరాశే. ‘‘నాకెవ్వరూ లేరు. నేనేమీ చేయలేను, నాకెవ్వరూ ఏమీ చేయరు. నన్ను ఒడ్డెక్కింటే వాడే లేడు’’ లాంటి నిరాశాపూరిత ఆలోచనలు మనసులోకి వచ్చాయంటే కుంగదీసి పీల్చి పిప్పి చేస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆశ అనేది మినుకు మినుకు మని వెలిగే దీపంలాంటిదయితే, చీకటి గుయ్యారం లాంటిది నిరాశ. ఆశ ఉంటే దేనినైనా సాధించగలం. బతకగలం. బతుకును ఇవ్వగలం. నిరాశ ఉంటే బతకలేము; బతుకును ఇవ్వలేము. రాముడు, సీత, హనుమంతుడు.. వీళ్లు ఆశకు, ఆశయానికి ప్రతీకలు. తానెక్కడున్నదో తన భర్త కనుక్కోలేడని సీత నిరాశ పడితే..? ‘ఒక సాధారణమైన కోతినైన నేను ఈ మహా సముద్రాన్ని ఎలా దాటగలను, ఒకవేళ దాటినా కనీసం ముఖం కూడా చూసి ఉండని సీతమ్మను నేను ఎలా కనుక్కోగలను’ అని హనుమ అనుకుని ఉంటే..? మామూలు మనిషినైన నేను అపారమైన బలసంపదలు గల ఆ రావణాసురుడిని ఎలా సంహరించగలను అని రాముడు నిరాశ పడి ఉంటే అసలు రామాయణమే ఉండేది కాదు! -
కష్టాలకు చెక్
తాడేపల్లిగూడెం/ఏలూరు (మెట్రో) : పెద్ద నోట్ల రద్దు అనంతరం కష్టాల్లో కూరుకుపోయిన రైతులకు కొంత ఊరట లభించింది. రైతులు వారి ఖాతాల నుంచి రూ.25 వేల వరకు నగదు తీసుకునే వెసులుబాటు కల్పించడంతో ఇటు జిల్లా అధికారులు.. అటు కమీష¯ŒS వ్యాపారులు ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల ఖాతాలకు వీలైనంత త్వరగా నగదు జమ చేసేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు కమీష¯ŒS వ్యాపారులు రైతులకు బ్యాంక్ చెక్కులిచ్చి మరీ ధాన్యం కొంటున్నారు. దీంతో శుక్రవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇప్పటివరకూ కళ్లాలు, రోడ్ల వెంబడి రాశులుగా పోసి ఉంచిన ధాన్యం నిల్వలు ఐకేపీ కేంద్రాలు, మిల్లుల వైపు వేగంగా కదులుతున్నాయి. జిల్లాలోని ఐకేపీ కేంద్రాల్లో శుక్రవారం ఒక్కరోజే 3,985 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కమీష¯ŒS దారులు, మిల్లర్లు సైతం పెద్దఎత్తున ధాన్యం కొన్నారు. ఒక్క తాడేపల్లిగూడెం ప్రాంతం నుంచే సుమారు 300 లారీల ధాన్యం మిల్లులకు తరలిం దని అంచనా. కమీష¯ŒSదారులు గతంలో ధాన్యం తీసుకెళ్లిన నాలుగైదు రోజుల అనంతరం రైతులకు నగదు చెల్లించేవారు. ఇప్పుడు చిల్లర నోట్లు, కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం కొన్న మొత్తానికి బ్యాంకు చెక్కు ఇస్తున్నారు. వాటిని రైతులు వారి బ్యాంక్ ఖాతాల్లో వేసుకోవడం ద్వారా నగదు పొందే అవకాశం ఏర్పడటంతో అమ్మకాలు ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయి. ధర ఫర్వాలేదు ఈసారి ధర విషయంలో రైతులకు కొంత బాగానే ఉంది. కమీష¯ŒSదారులు ఆరబెట్టిన ధాన్యం బస్తా (75 కేజీలు)కు రూ.1,120 చెల్లిస్తున్నారు. యంత్రంతో కోసిన ఆరుదల లేని ధాన్యానికి రూ.980 ఇస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర కంటే బస్తాకు రూ.18 వరకు అదనంగా రైతులకు లభిస్తోంది. కేరళ నుంచి ఉప్పుడు బియ్యానికి డిమాండ్ ఉండటంతో మిల్లర్లు, కమీష¯ŒSదారులు అనుకూలమైన ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఫలితమిస్తున్న ఉపశమన చర్యలు రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం గురువారం ఉపశమన చర్యలు ప్రకటించింది. పంట రుణం పొందిన లేదా కిసా¯ŒS క్రెడిట్ కార్డు ఉన్న రైతు తన ఖాతా నుంచి వారానికి రూ.25 వేల నగదు తీసుకోవచ్చు. పంట అమ్మగా వచ్చిన సొమ్ము ఆర్టీజీఎస్ లేదా చెక్కు ద్వారా రైతు ఖాతాలోకి వచ్చి ఉంటే, వారానికి అదనంగా మరో రూ.25 వేలు తీసుకోవచ్చు. అంటే ఇలాంటి సందర్భాల్లో రైతు గరిష్టంగా వారానికి రూ.50 వేలు తీసుకునే అవకాశం ఉంది. వరి కోతలు ముమ్మరంగా సాగుతుండటం, రబీ సీజ¯ŒS సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఈ ఉపశమన చర్యలు రైతులకు ఊరట ఇస్తున్నాయి. అయితే, సహకార సంఘాల్లో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోవడంతో వాటిలో ఖాతాలున్న రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. సొమ్ము చెల్లింపుల్ని వేగవంతం చేశాం ఐకేపీ కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ప్రతి గింజనూ కొనేలా ఏర్పాట్లు చేశాం. చెల్లింపులను వేగవంతం చేశాం. గడచిన 10 రోజుల్లో 14,241 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, శుక్రవారం ఒక్కరోజే 3,985 మెట్రిక్ టన్నులు కొన్నాం. 1,286 మంది రైతులకు రూ.20.93 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.11.70 కోట్లు చెల్లించాం. రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన చర్యలు వారికి ఉపశమనం కల్పించాయి. – ఎం.గణపతి, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల శాఖ -
అశోక వృక్షంలో క్యాన్సర్ ఔషధం
బెంగళూరు: క్యాన్సర్ నిరోధానికి సాగుతున్న పరిశోధనలు ఊహకు అందని విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. గతంలో పసిఫిక్ యూ చెట్లలో ఉండే టాక్సాల్ అనే రసాయన సమ్మేళనం అశోకా చెట్లలో(సరాకా అశోకా) కూడా లభ్యమవుతోందని తాజా అధ్యయనాలు తేల్చాయి. ఈ టాక్సన్ ‘ట్యూమర్ల’ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చెట్టు లభ్యత కష్టంగా మారడంతో ప్రత్యామ్నాయాలపై పరిశోధన జరిగింది. బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ జీవశాస్త్ర విభాగం వివిధ రకాల ఔషధ మొక్కలపై గత దశాబ్ద కాలంగా జరిపిన అధ్యయనాల్లో ఈ ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. దీంతో భారత్ శ్రీలంక దేశాలలో విస్తృతంగా పెరిగే బహుళ ఆయుర్వేద ప్రయోజనాలున్న పుష్పించే చెట్టు, అశోక వృక్షంపై క్యాన్సర్ నివారణలో మరిన్ని ఆశలు నెలకోనున్నాయి. ప్రసిద్ధ ఔషధ మొక్కల్లోని ఎండోఫిటిక్ ఫంగస్ పెరుగుదల, వాటి ఔషధ విలువల గుర్తింపు , సహజ పద్ధతిలో ఆయా కాంపౌండ్స్ వెలికితీత పై తమ సుదీర్ఘ పరిశోధనలో అశోక చెట్టు శిలీంధ్రంలో కొలెస్ట్రాల్ గ్లూకోజ్ అనే యాంటి క్యాన్సర్ కాంపౌండ్ ను గుర్తించామని డిపార్ట్ మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ జయభాస్కరన్ తెలిపారు. గతంలో పసిఫిక్ యూ చెట్టు బెరడు లో లభ్యమైన ఒక రసాయన సమ్మేళనం ప్రఖ్యాత టాక్సాన్ అశోక ఫంగస్ లో ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. మొక్క నుంచి వేరుచేసిన ఫంగస్ ను పులియబెట్టడానికి ముందే యాంటీ క్యాన్సర్ ఔషధ లక్షణాలను కలిగి ఉండడమని విశేషమని తెలిపారు. ఈ సమ్మేళాన్ని శుభ్రంచేసి, క్లినికల్, ప్రీ క్లినికల్ పరీక్షలకు వెళ్లాల్సి వుంటుందని తెలిపారు. దీంతోపాటుగా వివిధ రకాల క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే అనేక మొక్కలు, చెట్లలో అందుబాటులో ఉన్న ఈ ఫంగస్ పై ఎఫ్‌డీఏ అనుమతి పొందాల్సి ఉందన్నారు. పరిశ్రమ స్థాయిలో ఈ శిలీంధ్రాన్ని ఔషధంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నామని జయచంద్రన్ పేర్కొన్నారు. -
ప్రతినాయకి ఆశ
కథానాయకిగా సరుకు అయిపోతే ప్రతినాయకిగా సత్తా చాటాలని ఆశ పడే నటీమణుల పట్టికలో తాజాగా ప్రియమణి చేరారు. హీరోయిన్గా పలు భాషలలో పలు చిత్రాలు చేసిన నటి ప్రియమణి. కన్నాల్ ఖైదుచెయ్ చిత్రం ద్వారా భారతీరాజా పరిచయం దిగుమతి చేసిన మలయాళ భామ ప్రియమణి. ఆ చిత్రం చెయ్యి అందియ్యకున్నా కార్తీతో రొమాన్స్ చేసిన పరుత్తివీరన్ అమ్మడిని జాతీయ అవార్డును గెలుచుకునే స్థాయికి తీసుకెళ్లింది. ఆ తరువాత తెలుగు, మలయాళం, కన్నడం అంటూ చక్కర్లు కొట్టిన ప్రియమణికి ప్రస్తుతం జోరు తగ్గింది. నిజం చెప్పాలంటే ఏ భాషలోనూ సరైన అవకాశాలు లేవు. అయితే ఈ ఇషయాన్ని ప్రియమణి అంగీకరించరు. తాను రోజుకు రెండు, మూడు కథలు వింటున్నాననీ, అయితే పాత్ర నచ్చితేనే నటించాలని నిర్ణయించుకున్నట్లు డాబులు చెప్పుకుంటున్నారు. కథానాయకిగా అన్ని రకాల పాత్రలు చేశాననీ, అయితే కామెడీ హీరోయిన్గా నటించాలని ఆశగా ఉందని ఇటీవల ఒక బేటీలో పేర్కొనడం గమనార్హం. అదే విధంగా పడయప్పా చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి లాంటి ప్రతినాయకి పాత్ర చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ బ్యూటీకి దర్శకత్వం చేపట్టాలనే ఆకాంక్ష ఉందట. త్వరలో అది నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ప్రియమణి ఖండిచారు. తనకు దర్శకత్వంపై ఆసక్తి ఉందని అన్న మాట నిజమే గానీ ఇప్పట్లో ఆ ఆలోచన లేదన్నారు. దర్శకత్వం అన్నది చాలా బాధ్యతతో కూడుకున్న విషయం అనీ ప్రస్తుతం తాను మలయాళం, తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నాననీ చెప్పుకొచ్చారీ బ్యూటీ. -
ఎన్నాళ్లీ నిరీక్షణ!
సత్తెనపల్లి: తమ గ్రామం ఆదర్శంగా ఉండాలని, ప్రజలందరూ కలిసి పార్టీలకతీతంగా పాలకులనుఎన్నుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే నజారానాలతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామనుకున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగి ఏడాది గడిచింది. అయినా నిధుల జాడలేదు. రోడ్లు, కాల్వలు, అధ్వానంగా తయారయ్యాయి. పారిశుద్ధ్యం లోపించింది. నిధులు లేక గ్రామాల్లో సమస్యలే రాజ్యమేలుతున్నాయి. అభివృద్ధి పనులు చేపట్టలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక ఏకగ్రీవ పంచాయతీల సర్పంచ్‌లు తలలుపట్టుకుంటున్నారు. కులమతాలకు, వర్గ విభేదాలకు తావులేకుండా గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్‌లను, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పంచాయతీలకు 2006లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నజరానా ప్రవేశపెట్టారు. మేజరు పంచాయతీకి రూ.15 లక్షలు, మైనర్ పంచాయతీకి రూ.7 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించారు. ఆ నిధులను గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి పనులకు వినియోగించే వారు. ప్రస్తుతం ప్రభుత్వమిచ్చే నజరానాల కోసం ఏకగ్రీవ పంచాయతీలకు ఎదురుచూపులే మిగిలాయి. ఎన్నికలు ముగిసి ఏడాది గడిచినా నిధుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ప్రస్తుత శాసనమండలి సమావేశాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవమైన పంచాయతీలకు త్వరలో ప్రోత్సాహక నిధులు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తుండగా ఇంకా త్వరలో అంటూ ప్రకటనలు చేయడం నిధుల విడుదలపై సందేహాలకు తావిస్తోంది. సమస్యలే నజరానా.. సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో మొత్తం 67 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో 14 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఆయా పంచాయతీల్లో ప్రజలు తాగునీరు, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వంటి మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రోత్సాహక నిధులు వస్తే సమస్యలు పరిష్కరించ వచ్చని ఆశపడ్డ సర్పంచ్ల ఆశలు ఫలించలేదు. నజరానాల కోసం నిరీక్షణ తప్పలేదు. ప్రభుత్వం చొరవ చూపాలి... రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆలస్యంగానైనా ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా వస్తుందని ఎదురు చూస్తున్నాం. పంచాయతీలో సమస్యలు అధికంగా ఉన్నాయి. ఏపని చేయాలన్నా నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రోత్సాహక నగదు అందితేనే సమస్యలు తీరుతాయి. ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి. - చెవులు వకులేశ్వరరావు, సర్పంచ్, కట్టావారిపాలెం నజరానాల ఊసేది? ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామాలకు ఏడాది గడిచినా ప్రోత్సాహక నిధులు విడుదల చేయలేదు. చాలీచాలని నిధులతో గ్రామంలో మెరుగైన వసతులు కల్పించలేకపోతున్నా. నజరానా నిధులు మంజూరైతే గ్రామాల్లో శాశ్వత పనులకు ప్రాధాన్యం కల్పించి అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని నమ్మి ప్రజలంతా సమష్టిగా నన్ను ఎన్నుకున్నారు.త్వరితగతిన ప్రభుత్వ నిధులు విడుదల చేయాలి. -ఎస్కె.మహబూబ్ బీ, సర్పంచ్, మొక్కపాడు -
విద్యా దానంతో మేలు
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి సెప్టెంబర్ 5వ తేదీని ‘విద్య విషయంలో అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం’గా జరుపుకోవాలని, ప్రజా చైతన్యం కలిగించాలని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ తీర్మానించడం ఆహ్వానించదగ్గ అంశమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి సుఖబోధానంద అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరికీ విద్యనందించడానికి దాతలు, పారిశ్రామికవేత్తలు, ఉదార స్వభావులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక కార్పొరేట్ శిక్షణ కార్యక్రమంలో పలువురు శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు హైదరాబాద్ వచ్చిన స్వామి సుఖబోధానంద మాట్లాడుతూ, ‘ఇతరులకు విద్యనందించాలనే మంచి మనసు ఉంటే చాలు... అది చివరకు మన మనసుకు చక్కటి చదువుగా ఉపకరిస్తుంది. హృదయ వికాసానికి తోడ్పడుతుంది. ప్రతి ఒక్కరూ విశాల హృదయంతో, విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలి. దాని వల్ల సమాజంలో ఎంతోమంది మానసికంగా పైకి ఎదుగుతారు. అలా ఒక వ్యక్తిలోని అత్యుత్తమ గుణాలను బయటకు తీసుకురాగలుగుతాం’ అని ఉద్బోధించా రు. సికింద్రాబాద్, బెంగుళూరుతో సహా వివిధ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్య రంగాల్లో అవసరార్థులకు సేవలందిస్తున్న ‘ప్రసన్న ట్రస్ట్’ సంస్థాపక చైర్మన్ అయిన స్వామీజీ, ‘అత్యుత్తమ గుణాలను వెలికి తీసురావడానికి ఉపకరించే ఈ విద్యా దానమనే మంచి ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి’ అని అభ్యర్థించారు.